ఇది నా స్వీయ రచన
పెళ్లి చూపులు
సూర్యకాంతం ఇంట్లో అందరికీ దిగులే, ఆ అమ్మాయికి పెళ్లి అవుతుందో లేదో అని. సూర్యకాంతం అంత సన్నగా ఉంటుంది మరి.
ఓ రెండు మూడు సంబంధాలు చూస్తే అబ్బాయి వైపు వాళ్ళు "మరీ అంత అర్భకంగా ఉంటే పిల్లల్ని ఎలా కంటుందీ ,అబ్బాయి కీ,మాకు ఏం చేస్తుంది,పైపెచ్చు అన్నీ మనమే అమర్చి పెట్టాలేమో" అని దీర్ఘాలు తీసి ఫొటో చూసి పెళ్లి చూపులకి కూడా రావడం మానేసారు.
ఒకరోజు పొద్దున్నే సూర్యకాంతం వాళ్ల నాన్న స్నేహితుడు ఫోన్ చేసి "మా అమ్మాయిని చూసుకోవడానికి ఇవాళ ఓ అబ్బాయి వస్తానన్నాడు. ఇదేమో ఆఖరి నిముషంలో ఎవరినో ప్రేమిస్తున్నా, ఇప్పుడు ఏ పెళ్లిచూపులూ వద్దు అని చెప్పేసింది. ఆ అబ్బాయిని మీ ఇంటికి తీసుకొని వస్తా. సూర్యకాంతాన్ని చూడనీ" అని చెప్పేడు.
అబ్బాయి పేరు సూర్య. ఆ అబ్బాయి పెద్దాయన మాట కాదనలేక వచ్చాడు.
సూర్యకాంతం కి బయటనుంచి తెచ్చిన తినుబండారాలు ఎవరికీ పెట్టడం ఇష్టం ఉండదు. స్వీట్, హాట్ అన్నీ తనే తయారుచేసింది. కాఫీ కూడా తనే కలిపి తెచ్చింది.
అప్పుడు చూసాడు సూర్య."ఈ అమ్మాయి కళ్ళు అంత పెద్దవేమిటి?" అనుకున్నాడు. మెడ శంఖంలా, ముక్కు సంపంగిలా అనిపించేయి.
సూర్యకాంతం సన్నగా కనబడకుండా చక్కగా కాటన్ చీర కట్టుకుని, వాలుజడ వేసుకుంది. దాంతో అమ్మాయి మరింత హుందాగా కనిపించింది.
సూర్య వెంటనే సూర్యకాంతం తండ్రితో "మీ అమ్మాయి నాకు నచ్చింది. మీ అమ్మాయికి నేను నచ్చితే మాట్లాడండి. వాళ్లు ఎవరూ వచ్చి ఇక చూడరు.నాకు నచ్చితే చాలని చెప్పేరు" అన్నాడు.
ఇంతకీ సూర్యకాంతం పువ్వు సూర్యుడి వైపు తిరిగిందో, సూర్యుడే సూర్యకాంతం పువ్వుని ఇష్టపడ్డాడో కవులే చెప్పాలి మరి.
No comments:
Post a Comment