Friday, 1 November 2024

అమృత

 ఇది నా స్వీయ ‌రచన 

అమృత 


  మాధవ్ వాళ్ళ పక్క ఇంట్లోకి తల్లి, కూతురు దిగేరు. మాధవ్ కి పాప  బాగా నచ్చింది. వాళ్ల అమ్మ తో ఆపకుండా మాట్లాడుతోంది. పాప అడిగే ప్రశ్నలకి  వాళ్ల అమ్మ కూడా ఓపిగ్గా సమాధానం చెప్తోంది. 


మాధవ్ తన తల్లితండ్రులతో కలిసి ఉంటున్నాడు. తల్లి, తండ్రి  పెళ్లి చేసుకోమంటున్నా నచ్చిన అమ్మాయి దొరికితే చేసుకుంటానని పెళ్లి వాయిదా వేసాడు. 

పాప తల్లి  మానస. పాప పేరు అమృత. మానస మాధవ్ వాళ్ళ  ఇంటికి వచ్చి మాధవ్ తల్లి తో "పాప తొందరగా బడి నుండి  వచ్చేస్తుంది. నేను ఆఫీసు నుండి  వచ్చేవరకు పాప మీ ఇంట్లో ఉండొచ్చా" అని అడిగింది. ఆవిడ"తప్పకుండా. మా ముగ్గురికీ పిల్లలంటే చాలా ముద్దు "అని చెప్పింది. 

మాధవ్ తో ఒకరోజు  వాళ్ల అమ్మ  "పిల్లలు అమాయకంగా అన్నీ చెప్పేస్తారు. అమృత నాన్న అమృతతో అసలు ఆడడట. దగ్గరకే రావొద్దంటాడట.  వాళ్ల నానమ్మ కూడా పాపతో మాటలాడదట. ఊళ్ళోనే ఉన్న పాప వాళ్ల అత్త కొడుకునే ఎక్కువ ముద్దు చేస్తుందట. పాప అలా చెప్తుంటే నాకు మనసంతా ఏదోలా 

అయిపోయింది"అంది. దానితో మాధవ్ కి పాప మీద ప్రేమ మరింత పెరిగింది. 

ఒక సెలవురోజు పాప మాధవ్ వాళ్ళింట్లో పక్కగదిలో ఆడుకుంటుంటే మానస మాధవ్  తల్లితో తన భర్త, అతని తల్లి, ఆడపడుచు అందరూ తనకి ఆడపిల్ల పుట్టిందని పుట్టినప్పటి నుండి పాపని దగ్గరకి తీసేవారు కాదని, పాపని చూడడానికి తను వేరే మనిషిని పెట్టుకోవలసి వచ్చిందని,భర్త ప్రవర్తన నచ్చకే తను భర్త నుండి విడిపోయానని,కుటుంబ  కోర్టు విడాకులు మంజూరు చేయడమే కాక పాపని తనకే అప్పగించిందని  చెప్పింది. 

పాపకి  మాధవ్ వాళ్ళింట్లో అందరి దగ్గరా  బాగా చేరికయ్యింది. పాపని మాధవ్ బయటకి కూడా తీసుకెళ్ళేవాడు. 

మాధవ్ ఒకరోజు పాప తనింట్లో ఉన్నప్పుడు మానస దగ్గరకి వచ్చి "మీతో కొంచెం మాట్లాడాలి " అన్నాడు. మానస "చెప్పండి" అంది. "మీగురించి, అమృత గురించి నేను అంతా విన్నాను. పాప అంటే మా ఇంట్లో అందరికీ చాలా ఇష్టం. పాపకి  మీరే కాకుండా తండ్రి, నానమ్మ,తాత అందరూ కావాలి కదా. పాపకి తండ్రి స్థానంలో నేనుంటాను. నేను మావాళ్ళతో కూడా మాట్లాడేను. నానమ్మ, తాతల ప్రేమని వాళ్లు తప్పకుండా అందిస్తారు. మీరు, పాప మాతో కలిసి ఉండండి. మీరు నాకు భర్త స్థానం ఇస్తారా లేదా అనేది మీ ఇష్టం. అది మీరు ఆలోచించుకుని  నిర్ణయం తీసుకోండి "అని చెప్పి తన ఇంటికి వచ్చేసాడు.

No comments:

Post a Comment