Saturday, 2 November 2024

పక్క వాటా

 ఇది నా స్వీయ ‌రచన 

 పక్క వాటా


వెంకట్రావుగారిది సిటీ సెంటర్లో మంచి ఇల్లు.ఆయనకి పక్క ఇల్లు కూడా చవగ్గా దొరికింది.ఆ ఇంటి వాళ్ళు ఆర్ధిక ఇబ్బందుల్లో ఉన్నప్పుడు ఆ ఇల్లు వెంకట్రావుకి తక్కువ రేటుకి అమ్మేసి వాళ్లు ఎక్కడికో వెళ్లిపోయారు.ఆ ఇల్లు అద్దెకి ఇచ్చిన నాటినుండి దాని మీద అద్దె కూడా బాగానే వస్తోంది. 

ఆదివారం పొద్దుట టిఫిన్ చేస్తూ కొడుకుతో "పక్క వాటా ఖాళీ అయింది కదా.నా మేనల్లుడు అందులో ఉంటానంటున్నాడు.వాడు అద్దె బాగానే ఇవ్వగలడు. ఇల్లు  వాడికి అద్దెకి ఇమ్మని మా చెల్లి కూడా అడిగింది " అన్నాడు వెంకట్రావు. 

కొడుకు వెంటనే "నాన్నా, నీకు చెప్పడానికే నాకు కుదరలేదు.ఆ వాటా ఖాళీ అయిందని తెలియగానే నా స్నేహితుడు అవినాష్ తనకి అద్దెకి ఇమ్మని అడిగాడు. వాడు అద్దె మరి కొంచెం ఎక్కువ ఇస్తానన్నాడు కూడా "అన్నాడు. 

అప్పుడే అక్కడికి వచ్చిన కోడలు రూప" మా స్నేహితురాలు సరళ కూడా చెప్పిందండీ. వాళ్ల అమ్మాయి స్కూల్ ఇక్కడకి దగ్గరలోనే ఉందట.తను పక్క వాటాలో దిగితే రోజూ‌ తన కారులో కలిసి ఆఫీస్ కి వెళ్లిపోవచ్చు"అంది. 

అంత వరకు నిశ్శబ్దంగా ఉన్న వెంకట్రావు గారి భార్య సుభాషిణి 

"కొన్నాళ్ళు ఆ ఇంట్లో నేను ఒక్కదాన్నే ఉందా మనుకుంటున్నాను.నాకు కొంత విశ్రాంతి, స్వేఛ్చ కావాలి.ఈ ఇంట్లో ఆ రెండూ నాకు లేవు" అని చెప్పి అక్కడినుంచి వెళ్ళిపోయింది.

No comments:

Post a Comment