Friday, 1 November 2024

షరతు

 ఇది నా స్వీయ ‌రచన 

షరతు


తనూజ పురిటికి వాళ్ళ పెద్ద అన్న  ఇంటికి వెళ్లింది. పెద్ద అన్న, వదిన ఉన్న ఊర్లోనే తనూజ ఉద్యోగం చేస్తోంది.తనూజ కి పాప పుట్టింది.తనూజ వదిన దగ్గర  ఓ పనమ్మాయి పని చేసేది.ఆ అమ్మాయి పేరు సీత.సీతకి పెళ్ళయింది కానీ ఇంకా పిల్లలు లేరు. 

సీతకి పిల్లలంటే చాలా ముద్దు. వాళ్ల అక్క పిల్లలని తనే పెంచింది. 

తనూజ మూడో నెలలో తన ఇంటికి వెళ్తూ"సీతా, పాపని చూసుకోవడానికి నువ్వు నాతో  మా ఇంటికి  వచ్చి ఉంటావా?"అని అడిగింది.సీత వెంటనే వస్తానని చెప్పి వాళ్ళతో ప్రయాణమయింది. 

సీత పాపని బాగా చూసుకునేది. పాప పేరు కల్పన.కల్పన తల్లితండ్రులు ఎప్పుడూ బిజీ. సెలవురోజు ఎక్కడకి వెళ్లినా కల్పన కి సీత తనతో ఉండాల్సిందే.

కల్పన కొంచెం పెద్దదయినా తనూజ తనకి ఇంట్లో సాయం అవసరం అని చాలా కాలం సీతని వాళ్లతోనే ఉండిపొమ్మంది.

తనూజ భర్త చైతన్యకి ఇంటి చుట్టూ పూలమొక్కలు, పళ్ళచెట్లు ఉండాలి. అందుకు అవన్నీ ఉన్న ఓ ఇల్లు చూసి కొన్నాడు. సీతతో చైతన్య "మీ ఆయనని కూడా ఇక్కడే వచ్చి ఉండమను.మనకి అవుట్ హౌస్ ఉంది కదా. మీరక్కడ ఉండండి" అని చెప్పాడు. .సీత భర్త గోవిందు కూడా వాళ్ళతోనే ఉండి తోట పని, ఇంటి పనులు చేసేవాడు .

చిన్ననాటి నుండి సీతతో కల్పనకి అనుబంధం ఎక్కువగా ఉండటం వల్ల సీత ఇంట్లో లేకపోతే కల్పన కి తోచేది కాదు.గోవిందు వాళ్ల ఇంటికి వచ్చినప్పటి నుండి కల్పన  గోవిందుని కూడా తమ ఇంటిమనిషిలా ఫీలయ్యేది. 

కల్పన పెళ్లీడుకొచ్చిందని తనూజ, చైతన్య పెళ్లి సంబంధాలు చూడటం మొదలెట్టారు. కల్పన పెట్టిన  షరతు పెళ్ళయ్యాక సీత,గోవిందు తనతో ఉంటారని.పెళ్లి కొడుకు ఈషరతుకి ఒప్పుకున్నాకే సంబంధం ఖాయం చేయమని అమ్మానాన్నలకి తేల్చి చెప్పేసింది కల్పన.

No comments:

Post a Comment