ఇది నా స్వీయ రచన
భీభత్స ప్రధాన ప్రేమ కావ్యం
మా ప్రేమ కథ దాంపత్య జీవితంగా మారింది. మా ప్రేమకథలో ప్రేమ పుష్కలంగా ఉంది. కానీ జీవితంలో అప్పుడప్పుడూ భీభత్సం చోటు చేసుకుంటుంది.
ఉద్యోగరీత్యా మేము చాలా ఏళ్ళు వైజాగ్ లో ఉన్నాం.అప్పటికి మా పిల్లల పెళ్లిళ్లు అయిపోయి ఇంట్లో మేమిద్దరమే ఉండేవాళ్ళం.
ఒకరోజు వైజాగ్ లో తుఫాను హెచ్చరిక వచ్చింది. బలమైన గాలులు,కుండపోతగా వర్షం అన్నీ మొదలయ్యాయి. అదే హుద్ హుద్ తుఫానుగా ప్రభుత్వ యంత్రాంగాన్ని పరుగులు పెట్టించింది. మా బడికి సెలవు ప్రకటించారు. మావారు ఆఫీసుకి సెలవు పెట్టేసారు.
రోగికి ఒకొక్క అవయవం పని చేయడం మానేసినట్టు మాకు నీళ్ళసరఫరా,పాల సరఫరా అన్నీ ఆగిపోయాయి. ఫోన్లు పనిచేయడం మానేసాయి.సెల్ ఫోన్లు చచ్చిపోయాయి. ఉక్కు నగరంలో కరెంటు సరఫరా నిరంతరం ఉండటం వల్ల మేము అప్పుడు ఇంకా ఇన్వర్టర్ కొనుక్కోలేదు. తుఫాను కారణంగా కరెంటు లేదు. చూడటానికి టివి లేదు.
ఇల్లు కదలడానికి లేదు. తలుపు గానీ, కిటికీలు గానీ తీయడానికి లేదు. బలంగా వీస్తున్న గాలికి తలుపులు దభీమని పడిపోయేవి. గాలికి కిటికీ తలుపుల అద్దాలు విరిగి పోతాయేమోనని భయం వేసింది. పరిస్థితి "హమ్ తుమ్ ఏక్ కమరేమే బంద్ హై" అన్నంత రొమాంటిక్ గా ఉంది.
కానీ ఫ్యాన్ తిరగనందుకు తిక్క. కాఫీ తాగుదామంటే పాలు లేవు.కాఫీ లేనందుకు చికాకు.ఇంట్లో ఉన్న నీళ్ళు చాలా పొదుపుగా వాడుకోవాలి.వాతావరణం చల్లగా ఉందని సాయంత్రం బజ్జీలు వేసుకున్నాం.
నాకసలే ఉరుములు, పిడుగులంటే భయం.ఫ్యాన్ లేకపోతే నాకు రాత్రి నిద్రపట్టదు.మావారు
నామీద ప్రేమతోనో,జాలితోనో విసిని కర్ర తో విసరడం మొదలెట్టినా అలాటి సేవలు చేయించుకోవడం నాకిష్టముండదు.రాత్రిపూట గొలుసు కథలు అప్పటికప్పుడు సృజించుకొని,చెప్పుకొని కాలక్షేపం చేసాం.
రెండోరోజు తలుపుతీసి బయటకు వెళ్లగలిగాం.కానీ చుట్టూతా కింద చిందరవందరగా చెట్లు పడిపోయి వున్నాయి. మా ఇళ్ళకి, మా స్కూలుకి మధ్య గోడ సగం పడిపోయి అంతా అల్లకల్లోలంగా ఉంది.
మేమిద్దరం వర్షం పూర్తిగా ఆగేక మా బైక్ మీద సిటీకి వెళ్లి విధ్వంసాన్ని చూసి వచ్చాం.మా అందాల విశాఖ ఇలా అయిపోయిందే అని దిగులువేసింది.ముఖ్యమంత్రి కూడా సిటీలో ఉండి పనులన్నీ శరవేగంగా చేయించడం మొదలెట్టారు.
ఓ నాలుగు రోజులపాటు మా పిల్లలకి మా వివరాలు ఏవీ తెలియక దిక్కు తోచని స్థితిలో ఉన్నారు.మొదట కొన్ని లాండ్ లైను ఫోనులు మాత్రమే పని చేసాయి.మా ఫోను పని చేయలేదు. మా చిన్నమ్మాయి నాతో పని చేస్తున్న టీచర్ ఫోన్ నంబర్ గుర్తు చేసుకుని ఆవిడకి ఫోన్ చేసింది. ఆవిడ మాకు కబురు చేస్తే మేమిద్దరం వాళ్ళింటికి వెళ్లి చిన్నమ్మాయి తో ఫోన్ లో మాట్లాడాం.
కరెంటు, నీళ్ళు, పాలు అన్నీ వచ్చేయి. అన్నిటితోపాటు
నాకు జ్వరం కూడా వచ్చింది. .మావారు నన్ను ఆసుపత్రికి తీసుకొనివెళ్తే,అక్కడ మాకు తెలిసిన డాక్టర్ ఆయనని చూసి "మీరే నీరసంగా ఉండి నడవలేకపోతున్నారు.మీరు కూడా అడ్మిట్ అవాలి" అని చెప్పేరు.ఇద్దరికీ వైరల్ ఫీవర్.
మర్నాటి పొద్దుట ఫ్లయిట్ లో మా చిన్నమ్మాయి హైదరాబాద్ నుండి వచ్చేసింది. అది మా దగ్గరకి వస్తుంటే దాని కళ్ళల్లో నీళ్లు చూసి మా పరిస్థితి చూసి అది బాధపడుతున్నాదనుకున్నాను. అది వాళ్ల నాన్నతో "మన వైజాగ్ ఎలా అయిపోయింది డాడీ " అంది బాధతో.
ఆ వారం రోజులు నేను నవరసాలు అనుభవించేసా.మేమిద్దరం కలిసి గడిపిన ఆ అనుభవం మా వరకు భీభత్స ప్రధాన ప్రేమ కావ్యమే.
No comments:
Post a Comment