ఇది నా స్వీయ రచన
జానకి
ఆ అమ్మాయి, నేను స్నేహితులం. ఇంకా చెప్పాలంటే బాల్య స్నేహితులం. ఇద్దరికీ 18 ఏళ్ళు నిండాయి. నేను చదువు ధ్యాసలో ఉన్నాను.
ఒక రోజు నా స్నేహితురాలు నా దగ్గరకి వచ్చింది. ఆ అమ్మాయి పేరు జానకి. జానకి నాతో " నేను, హరి త్వరలో పెళ్ళి చేసుకోబోతున్నాం"అంది.
"అంత తొందరేం వచ్చింది. ఇంకా మనం చిన్నవాళ్ళమేగా" అన్నా.
"లేదులే. తను తొందర పడుతున్నాడు. మావాళ్ళు కూడా దగ్గర సంబంధాలు చూస్తున్నారు. మావాళ్ళకి ఇష్టం ఉన్నా లేకున్నా మేమిద్దరం పెళ్ళి చేసుకోవడం ఖాయం "అని చెప్పి వెళ్ళిపోయింది.
జానకి చెప్పినట్టే వాళ్ళిద్దరి పెళ్లి అయిపోయింది. జానకి పుట్టింటి వాళ్లు తాము చూసిన సంబంధం కాదని పట్టించుకోవడం మానేసొరు.
అత్తింటివాళ్ళు కూడా అవసరమైనప్పుడు హరిని డబ్బులడిగేవారు కానీ మరే సాయం చేసేవారు కాదు.
జానకి కి వెంట వెంటనే కాన్పులు. ముందు కూతురు, తరవాత కొడుకు . వాళ్ళని పెంచి పెద్ద చేసేవరకు జానకి కి ఊపిరి సలపలేదు. ఎప్పుడూ తీరిక లేకుండానే ఉండేది.
పిల్లల చదువు విషయం లో హరి అసలు పట్టించుకునేవాడు కాదు. కాని పిల్లలకి ఎప్పుడూ మొదటి ర్యాంక్ రావాలని కోరుకునేవాడు. తన పిల్లలు బాగా చదువుకుంటున్నారని అందరూ అనుకోవాలి. వాళ్ళు అన్ని పోటీలలో ప్రధమ స్థానంలో ఉండాలి. జానకి వాళ్ళకి ఆ తర్ఫీదు ఇవ్వాలి. అలా చదువు చెప్పాలి.
జానకి వాళ్ళతో పాటు తనూ చదివేది. వాళ్లు ఎప్పుడు ఏ సందేహం ఉన్నా తల్లినే అడిగేవారు.
పేరెంట్ టీచర్స్ మీటింగ్ కి కూడా జానకి వెళ్ళేది.
జానకి పిల్లలు కాలేజీ కి వెళ్ళడం మొదలు పెట్టినప్పటి నుండి ఆమెకి కొంత తీరిక దొరికింది. కానీ అప్పుడు కూడా చదువులు, ర్యాంక్ లు, పిల్లల మీద వత్తిడి, వీటి వల్ల ఆమె మీద కూడా వత్తిడి ఉండేది.
పిల్లల మీద ఉన్న ఒత్తిడి అర్ధమై ఆమె వాళ్ళని మరింత శ్రద్ధగా, ప్రేమగా చూసుకునేది. హరి ఎప్పుడూ ర్యాంక్ ల గురించే మాట్లాడతాడు.
పిల్లలు కొంతసేపు రిలాక్స్ అయినా హరి " ఇక పుస్తకాలు తీయండి " అనేవాడు.
పిల్లలిద్దరి చదువు పూర్తయి ఇద్దరూ ఉద్యోగాలలో చేరేరు. జానకి జీవితం లో వెనుతిరిగి చూసుకుంటే తనకంటూ ప్రత్యేకించి చేసుకున్నది, సాధించింది ఏమీ లేదు. తన పిల్లల విజయాలు హరి తన విజయాలుగానే అందరికీ చెప్పుకుంటాడు.
ఒకరోజు జానకి నన్ను వాళ్ళింటికి రమ్మని కోరింది. ఇంట్లో హరి లేడు.
జానకి నాకో ఫైల్ తెచ్చి ఇచ్చింది.
"నువ్వు పత్రికా ఆఫీసు లో పనిచేస్తున్నావు కదా. ఇది ఒకసారి చదువు. ఇది నేను రాసినదే" అంది.
ఇంటికి వెళ్ళేక ఆసక్తి తో చదివితే జానకి రాసింది అద్భుతంగా ఉంది.
కొద్దిపాటి మార్పులతో అంతా తన జీవితమే.
జానకి రచన ని మా పత్రికలో ధారావాహికంగా వేయడం మొదలుపెట్టేం. అది పాఠకులకి ఎంతగానో నచ్చింది. ఆ సీరియల్ తో
జానకికి రచయిత్రి గా మంచి పేరు వచ్చింది.
జానకి ఇప్పుడు చేతినిండా పనితో తీరిక లేకుండా ఉంది. కానీ ఆమెకి ఏదో సాధించానన్న ఆనందం, సంతృప్తి కూడా ఉన్నాయి.
No comments:
Post a Comment