ఇది నా స్వీయ రచన
బామ్మ
సుశీల తండ్రి రాఘవేంద్రకి తన తల్లి అంటే చాలా ప్రేమ. అతను తల్లి పేరే తన కూతురికి పెట్టేడు.
సుశీల బామ్మకి పూజలు, ఆచారాలు, సంప్రదాయాలు పాటించడం అన్నీ ఆవిడ దైనందిన జీవితంలో భాగం.తన తల్లిని చూసి నేర్చుకున్నవి, పెళ్ళి అయ్యాక తన అత్తగారు నేర్పినవి అన్నీ బామ్మ పాటిస్తుంటుంది.
బామ్మకి ఇప్పుడు ఒక పెద్ద సమస్య వచ్చి పడింది. అది మనవరాలి పెళ్లి. మనవరాలు ప్రేమ వివాహం చేసుకుంటానంటోంది. అదీ మతాంతర వివాహం. కొడుకు, కోడలు చెయ్యమని చెప్పేస్తే మనవరాలు తన దగ్గరకి వచ్చింది. ఎలాగైనా వాళ్లని ఒప్పించమని బ్రతిమాలింది. బామ్మకి కూడా మనవరాలు అంత ప్రేమించాక, అతనితోనే జీవితం పంచుకోవాలనుకున్నాక, ఆ అబ్బాయి కూడా సుశీలని ఇష్టపడ్డాక వారిద్దరినీ విడదీయడం సరికాదనిపించింది.
రాఘవేంద్రకి ప్రతీరోజూ ఆఫీసు నుండి వచ్చేక కొంతసేపు తల్లితో గడపడం అలవాటు. ఆరోజు అతను తల్లి దగ్గరకి వచ్చినపుడు ఆవిడ తన అభిప్రాయాన్ని తెలియచేసి మొత్తానికి కొడుకుని ఒప్పించింది.
రాఘవేంద్ర తల్లి కొడుకుతో "చూడు రాఘవా, నేను చెప్పింది నీకు సమంజసం అనిపించాక, అది నీ మాటగానే నీ భార్యకి చెప్పు. నా కోడలు విమల నిన్ను ఏరికోరి చేసుకుంది. నీమాట తను ఎప్పుడూ కాదనదు" అంది.
రాఘవేంద్ర మర్నాడు విమలని
ఆమెకిష్టమైన బీచ్ కి తీసుకెళ్ళి ఆమెతో సుశీల మతాంతర వివాహం చేసుకుంటానంటే ముందు తాను వ్యతిరేకించినా,లోతుగా ఆలోచిస్తే
ఆమె కోరుకున్న వాడితో ఆమె పెళ్ళి జరిపించడమే సబబు అని చెప్పాడు.
విమల భర్త చెప్పిన విషయాలు తనూ ఆలోచించి, తన అంగీకారం భర్తకి తెలియచేసింది.
మొత్తానికి బామ్మ కార్యసాధకురాలే. సుశీల పెళ్లి ఆమె కోరుకున్న వాడితోనే జరిపించింది.
No comments:
Post a Comment