ఇది నా స్వీయ రచన
సన్మానం
మనవడు శౌర్య నా దగ్గరికి వచ్చేడు. నేను ఏదో రాస్తూ తల పైకెత్తేను.
"నానమ్మా ఈ పెన్ తీసుకో. నువ్వు ఎప్పుడూ ఏదో రాస్తూ ఉంటావుగా. " అన్నాడు శౌర్య.
ఒక నిముషం సంభ్రమం, ఆనందం, ఉద్వేగం అన్నీ కలగలిసి కన్నీటి బొట్లు టపటపా రాలేయి.
"ఎందుకు ఏడుస్తున్నావు నానమ్మా " అడిగాడు శౌర్య.
"నువ్వు నాకు బహుమానం ఇచ్చేవు కదా.అందుకే ఈ ఆనందం." అంటూ బాబుని గట్టిగా హత్తుకున్నా.
నా కథ ఎక్కడ మొదలెట్టాలి?
నేను డిగ్రీ చదువుతున్నప్పుడే ఏదో పెళ్ళిలో నన్ను చూసి మావారు నన్ను ఇష్టపడ్డారట.ఒద్దికగా ఉన్నానని మా అత్తగారికి కూడా నేను నచ్చేనట.అలా అయిపోయింది నాకు పెళ్లి.
మాది సమిష్టి కుటుంబం.మా మామగారు మా అత్తగారిని పప్పులో ఉప్పు ఎక్కువయితే తిట్టేవారు.కూరలో కారం తగ్గితే చికాకు పడేవారు.ఆఫీసులో ఆయనకి పని ఎక్కువయితే ఇంటిదగ్గర రుసరుసలాడేవారు.
మా అత్తగారు భూదేవిలా అన్నీ భరించేవారు.ఆవిడ మొదటే తిరగబడి ఉంటే ఆయన నోరు మూతపడి ఉండేదేమో.
అవన్నీ చూస్తూ పెరిగారేమో,మా వారి ప్రవర్తన కూడా అలాగే ఉండేది. ఆయన గట్టిగా అరిచినప్పుడు, నేను మెల్లగా సమాధానమిచ్చినా ఆయన అహం దెబ్బతిని మరింత రెచ్చిపోయేవారు.
ఆయన తగువు మొదలెడితే నేను వెంటనే మా అబ్బాయిని తీసుకుని అక్కడినుంచి వెళ్ళిపోయేదాన్ని.
మావాడికి వాళ్ళ నాన్న నోరు, తీరు రాలేదు కాని అన్నిటికీ నా మీద ఆధారపడటం అలవాటయిపోయింది.
చిన్నప్పుడు చదువు, ఆటలు. వాడు ఏ పనీ అలవాటు చేసుకోలేదు.పెద్దయ్యాక ఉద్యోగం.
పెళ్లయ్యాక మా కోడలు కూడా ఉద్యోగం చేసి అలిసిపోయి వస్తుంది.మావాడికి ఏది కనబడకపోయినా, ఏది కావాలన్నా, ఏది తినాలనిపించినా నన్నే అడుగుతాడు.అమ్మని కదా.ఏదీ కాదనలేను.
కొన్ని ఆలోచనలు కథలకి ప్రాణం పోస్తాయి.తీరిక వేళల్లో ఏదో ఒకటి రాయడం నాకు అలవాటయిపోయింది.
శౌర్య కి నేను అప్పుడప్పుడు పుస్తకాలు, ఆట వస్తువులూ తెచ్చి ఇస్తుంటాను.
ఈ పసివాడు చూసి నా అవసరాన్ని అర్ధం చేసుకున్నాడు కాని ఇంట్లో పెద్దవాళ్ళెవరూ అసలు పట్టించుకోలేదు.
వాడు నా చేతిలో పెట్టిన కలం వాగ్దేవి నా చేతికి అందించిన ఆయుధం లా అనిపిస్తోంది నాకు ఇప్పుడు.
No comments:
Post a Comment