ఇది నా స్వీయ రచన
తోడు నీడ
పరిగెత్తుకుని వచ్చి రైలు ఎక్కుతున్న నీరజకి చంద్ర చెయ్యందించాడు. అతని చెయ్యి పట్టుకుని రైలు లోకి అడుగు పెట్టింది నీరజ.
చంద్రశేఖర్, నీరజ ఇద్దరూ ఒకే కాలేజీలో చదువుతున్నారు. క్లాస్మేట్స్ కూడా. నీరజ చదువులో ముందుంటే చంద్రకి అత్తెసరు మార్కులు వచ్చేవి.
నీరజకి తన ప్రపంచమే తనది. పక్కనున్న చిన్న ఊరి నుంచి రోజూ సిటీలో కాలేజీకి రావడం , తిరిగి రైల్లోనే వెనక్కి వెళ్ళడం. ఇంటిదగ్గర పనిలో అమ్మకి సాయం చేయడం, తన చదువు. ఆమె చంద్ర క్లాస్మేట్ అయినా ఎక్కువ పట్టించుకునేది కాదు.
చంద్రకి నీరజంటే చాలా ఇష్టం. నీరజ ఎంత బాగా చదువుతుందో వాళ్ల అమ్మకి కూడా చెప్తుంటాడు. నీరజకి అంత బాగా మార్కులు ఎలా వస్తాయో అని ఆశ్చర్యపోతుంటాడు.
చంద్రకి స్నేహితులతో కబుర్లు, ఆటలు, స్నేహితులకి సాయం చేయడం, ఇంట్లో అమ్మానాన్నకి సాయం చేయడం అన్నీ కావాలి. చదువుకి తక్కువ సమయం కేటాయిస్తాడు కాబట్టి చురుకయిన వాడే అయినా మార్కులు అంతంతమాత్రం.
చంద్ర నీరజకి రైలు జాగ్రత్తగా ఎక్కడానికి సాయం చేసినప్పటినుండి నీరజకి చంద్ర అంటే ఇష్టం ఏర్పడింది. చంద్ర తన చేయి పట్టుకున్నాడు కాబట్టి పెద్ద ప్రమాదమే తప్పింది. ఆ రోజు నీరజ తల్లి అనారోగ్యం తో పడుకుని ఉంటే నీరజ అన్ని పనులు చేసి కాలేజీకి బయలుదేరింది.
నీరజ చంద్రకి తను రాసుకున్న నోట్స్ ఇచ్చేది. చంద్రకి ఏవైనా సందేహాలుంటే ఓపిగ్గా అవన్నీ తీర్చేది. చంద్ర ఆటలలో బహుమతులు తెచ్చుకుంటే బాగా మెచ్చుకునేది.
చంద్ర ఎప్పుడూ వాళ్ల అమ్మ గురించి చెప్పేవాడిని నీరజ ఒకసారి చంద్రతో వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ల అమ్మని కలిసివచ్చింది. చంద్రని వాళ్ల అమ్మ చాలా బాగా పెంచారని నీరజ అనుకునేది. అదే మాట చంద్రతో చాలా సార్లు అనేది.
కాలేజీ చదువు అయిపోయాక నీరజ యూనివర్సిటీ లో చేరతానంది. చంద్ర ఉద్యోగ ప్రయత్నాలు మొదలు పెడ్తానన్నాడు. నీరజ "ఇక మన దారులు వేరయినా, నువ్వు పంచియిచ్చే వెన్నెల నాకు జీవితాంతం కావాలి. నాకు నువ్వు ఎప్పుడూ తోడు నీడగా ఉంటావా?" అంది చంద్రతో.
"అందుకే నువ్వంటే నాకు ఇష్టం. మనసులో ఉన్నది నిర్భయంగా చెప్పేస్తావు" అన్నాడు చంద్ర ఆమె చేతిని తన చేతిలోకి తీసుకుని నవ్వుతూ.
No comments:
Post a Comment