ఇది నా స్వీయ రచన
కార్తీక పున్నమి
ఆరోజు కార్తీక పున్నమి. శ్రీనివాస్,శ్రీదేవి దగ్గరికి వచ్చి "నాతో నువ్వు వచ్చేస్తావా " అని అడిగినరోజు.శ్రీదేవి తన తండ్రితో చెప్పి,అతని అనుమతి తీసుకొని, శ్రీనివాస్ ని పెళ్లి చేసుకొని తనవారిని, తన ఊరిని వదిలి వెళ్ళిన రోజు.
తల్లి మరణానంతరం వచ్చిన సవతితల్లి శ్రీదేవిని వదిలించుకోవాలనే చూసింది. ఇంటెడు చాకిరీ ఆమెతో చేయించేది.శ్రీనివాస్ తనని ప్రేమిస్తున్నాడని తెలిసి శ్రీదేవి అతనితో వెళ్లిపోయింది.
శ్రీనివాస్ శ్రీదేవితో కాపురం పెట్టిన నాటినుండి అతని దృష్టి ధనార్జన మీదే ఉండేది.దానికోసం రాత్రీపగలు కష్టపడేవాడు.ఏడాదిలో ఒకే ఒక రోజు, కార్తీక పున్నమిని బాగా గుర్తుపెట్టుకుని తన భార్యకి ఏదో ఒక కానుక తెచ్చి ఇచ్చేవాడు.
శ్రీనివాస్, శ్రీదేవి దంపతులకు సంతానం కలుగలేదు.రియల్ ఎస్టేట్ రంగంలోకి దిగేక శ్రీనివాస్ సంపాదన మరింత పెరిగింది.శ్రీనివాస్ తన సంపాదనకు, అదృష్టానికి మూలకారణం శ్రీదేవి అని నమ్మేవాడు.
ఒకనాడు శ్రీదేవి శ్రీనివాస్ తో "మీరు పేద పిల్లల కోసం ఒక విద్యాలయం కట్టించాలి " అని కోరింది.కొద్దినెలలలోనే ఆ బడి సంసిద్ధమయింది.
మరి కొన్నాళ్ళకు శ్రీదేవి శ్రీనివాస్ తో "మీరు పేదవాళ్ళకి ఉచిత సేవలందించే ఆసుపత్రి కట్టించండి " అని కోరింది.ఆ కోరికను కూడా శ్రీనివాస్ కాదనలేదు. మరి కొన్ని నెలలకు ఆసుపత్రి ప్రారంభమయింది.
మరి కొన్నాళ్ళకు శ్రీదేవి శ్రీనివాస్ తో "మన ఇంటికి దగ్గరగా ఒక కోవెల కట్టించండి .అక్కడ కూర్చుంటే ప్రశాంతంగా ఉంటుంది"అని అంటుంది.
శ్రీనివాస్ అలాగే అని ఆ పనికి పూనుకున్నాడు.
ఆలయ నిర్మాణం పూర్తి కావడంతో శ్రీదేవి మూడు కోరికలూ తీరాయి.కొన్ని ఏళ్ళుగడిచాయి
కార్తీక పున్నమి నాడే శ్రీదేవి తన భర్తతో " ఇవాళ మీరు కూడా నాతో కోవెలకి రండి"అని శ్రీనివాస్ తో కలిసి కోవెలకి వెళ్లి అక్కడే ప్రాణాలు విడిచింది.
No comments:
Post a Comment