ఇది నా స్వీయ రచన
జ్ఞాపకాల తడి
బొబ్బిలి దగ్గర కుగ్రామం భీమవరం
మా నలుగురి తాతల స్వగ్రామం
మా భీమవరం
ఆ నాలుగిళ్ళ లోగిలిలో
తాతలు బామ్మలు
అన్నలు చిన్నాన్నలు
అక్కలు అత్తలు
బాల్యంలో
వేసవి సెలవుల్లో
ఆ నాలుగిళ్ళ లోగిలిలో
మేమాడిన ఆటలు
తాతగారి కాశీ ప్రయాణ ముచ్చటలు
వూళ్ళో అడుగు పెట్టగానే
బుచ్చి బుగత పిల్లలా అని
గ్రామస్తుల పలకరింపుల
ఆప్యాయతలు
ఆ పంటచేల గట్లమీద
నడవడం సరదా
ప్రతి వేసవికీ
మంచి వేసవి విడిది అది
ప్రతి వేసవి సెలవులూ
గొప్ప అనుభూతి
అనిర్వచనీయ ఆనందం
అంతా మన వాళ్ళన్న
రక్త బంధం
ఎన్నో ఏళ్ళ తర్వాత
ఆ పక్కగా వెళ్తూ
మావూరు మావూరని
సంబర పడుతూ
కార్లోంచి తొంగి తొంగి చూస్తే ఏముంది
పొలంగా మారిన
నాలుగిళ్ళ లోగిలి
తాతగారి నుయ్యని
మేం చెప్పుకునే బావి
చేనుకి నీరందిస్తూ
మిగిలిన చిట్ట చివరి అనుబంధం
పిన్నలనీ పెద్దలనీ
ఎంతగానో అలరించి
బంధుత్వాలు
ఆప్యాయతలు
పెనవేసిన
నాలుగిళ్ళ లోగిలి
తలుచుకుంటే
చెమ్మగిల్లుతాయి
ఇప్పటికీ నాకళ్ళు
11.10.2007
No comments:
Post a Comment