Saturday, 2 November 2024

బంధం

 ఇది నా స్వీయ ‌రచన 

బంధం 

గోపాల్రావు గారికి  నిర్మాణ రంగంలో మంచి పేరు, అనుభవం రెండూ ఉన్నాయి.ఒకరోజు నిర్మాణం పని జరుగుతున్నప్పుడు  ఒకామె  తన పాపని కొంగుతో వెనక్కి కట్టుకుని పని చేస్తుండటం

చూసేరు.కొంతసేపు చూసాక అతను ఆమెని పిలిచి "నువ్వు మా యింటిదగ్గర  పని చెయ్యి.నేను ఇప్పుడే నాభార్య కి ఫోన్ చేసి చెప్తాను.ఈ అబ్బాయి నిన్ను మా ఇంటికి తీసుకొని వెళ్తాడు "అని చెప్పి ఆమెని ఒకతని సాయంతో తన ఇంటికి  పంపిస్తాడు. 

అప్పటి నుండి పార్వతమ్మ తన కూతురు లక్ష్మి తో వాళ్ళింట్లోనే ఉండిపోయింది.లక్ష్మి కంటే గోపాల్రావు గారి అబ్బాయి సుధీర్  రెండేళ్ళు పెద్దవాడు.

గోపాల్రావు గారి భార్య సుజాత పాప కోసం బట్టలు, బొమ్మలు అన్నీ తెప్పించేది.సుధీర్ తో పాటు లక్ష్మి కూడా సుజాతని, గోపాల్రావు గారిని అమ్మ, నాన్న అనే పిలిచేది. ఇంట్లో అందరిలాగే తన తల్లిని పార్వతమ్మ అని పిలిచేది.  

గోపాల్రావు గారు పిల్లలిద్దరినీ ఒకే బడిలో చదివించేరు.అందరూ వాళ్ళిద్దరూ అన్నాచెల్లెళ్ళు అనే అనుకునేవారు. 

సుధీర్ సివిల్ ఇంజనీరింగ్  పూర్తి చేసేడు.కానీ కొన్ని చెడు సావాసాల వల్ల మాదక ద్రవ్యాలకి అలవాటు పడ్డాడు.లక్ష్మి అది గమనించి, అతని స్నేహితులతో కూడా మాటాడి ,సకాలంలో సుధీర్ ని డ్రగ్ డి అడిక్షన్ క్లినిక్ కి తీసుకెళ్ళి మందులు,కౌన్సిలింగ్ ఇప్పించింది.ఇదంతా లక్ష్మి వల్ల సాధ్యమయింది కాని గోపాల్రావు గారు,సుజాత వల్ల అయ్యేది కాదు.ఆ దంపతులిద్దరికీ లక్ష్మి మీద  ప్రేమ,వాత్సల్యం మరింత ఎక్కువయ్యాయి. 

లక్ష్మి  ఇంగ్లీషు లిటరేచర్ లో పిజి చేసింది. ఓ రోజు సుజాత లక్ష్మి తో " నీకో విషయం చెప్పాలమ్మా.పార్వతమ్మ నీ కన్నతల్లి.నీకు, సుధీర్ కి మధ్య పెంపకంలో తారతమ్యాలు ఉండకూడదని, ఇద్దరినీ ఒకేలా పెంచాం.ఎప్పటికయినా నీకిది  తెలియాలిగా "అంది. 

లక్ష్మి " ఇప్పటికయినా చెప్పి చాలా  మంచిపని చేసావమ్మా.నేనిక ఎలాగూ ఉద్యోగ ప్రయత్నాలు మొదలెడతాను.నేను మా అమ్మని  తీసుకొని మా ఊరికి వెళ్ళి అక్కడే ఏదో ఒక ఉద్యోగం చూసుకుంటాను.మీకు ఎప్పుడు ఏ అవసరమొచ్చినా అమ్మతో పాటు ఇక్కడికొస్తా.లేకపోతే మీరే‌ ఆ ఊరు రండి"అని చెప్పింది. 

ఆ తరువాత పార్వతమ్మ, లక్ష్మి వాళ్ళ ఊరికి వెళ్ళిపోయారు.

No comments:

Post a Comment