Wednesday, 6 November 2024

స్ఫూర్తి ప్రదాత

 ఇది నా స్వీయ రచన 

స్ఫూర్తి ప్రదాత 


ఆమె జమిందారిణి. కొడుకు  యువరాజు. కొడుకుకి పెళ్లి చేసిననాటికి జమిందారు కుటుంబ భూములేవీ మిగలలేదు.

తల్లి చేసిన తప్పేంటంటే కొడుకుని అతి  సుకుమారంగా పెంచడం. కొత్త కోడలికి పరిస్థితి అంతా అర్ధమయిపోయింది. తను 

చదివిన చదువుకి వచ్చిన ఉద్యోగం లో వెంటనే చేరిపోయింది. 

ఆ అమ్మాయి పేరు సరోజ. భర్త ఏ ఉద్యోగం ఎక్కువ రోజులు చేయలేడు. తను ఏదో ఒక ఉద్యోగం తప్పనిసరిగా చేయాల్సిందే. 

సరోజ భర్త ప్రభు. మనిషి చాలా మంచివాడే కానీ ఎక్కడా ఇమడలేడు. సరోజకి పెద్ద పెద్ద కలలేవీ లేవు. 

సరోజ గర్భవతి అయినప్పుడు కూడా పురిటికి ఒకరోజు ముందు వరకూ పనికి వెళ్తూనే ఉంది. పురిటికి పుట్టింటికి  వెళ్ళనేలేదు. అప్పటి దాకా అంత కష్టపడిందేమో కాన్పు సునాయాసంగా జరిగిపోయింది. 

సరోజ కొడుకు హరి. జీవన పోరాటం లో ఎప్పటికయినా హరి తనకి చేదోడువాదోడు కాకపోతాడా అన్నది ఆమె ఆశ.

ప్రభు సంపాదన విషయం లో  సరోజకి ఎక్కువ సాయం చేయలేక పోయినా కొడుకు పెంపకం బాధ్యత పూర్తిగా  తీసుకు న్నాడు. తన భార్య  బాగా అలిసి పోయి

వస్తుందని ఇంటి బాధ్యత తనే ఎక్కువగా తీసుకునేవాడు.

హరిని సరోజ మంచి బడిలో చేర్చింది. ప్రభు హరికి చదువే కాకుండా  మిగతా పుస్తకాలు చదివి వినిపించేవాడు. తనకి వచ్చినట్టు బొమ్మలు గీయడం నేర్పేవాడు. 

సరోజ పని ఉన్నప్పుడు సెలవురోజు కూడా  తను పని చేస్తున్న  షోరూమ్ కి వెళ్ళేది. అప్పుడు హరిని కూడా తనతో తీసుకెళ్ళేది. హరి అక్కడ అందరూ తన‌ తల్లిని ఎంత గౌరవిస్తారో,  అక్కా అక్కా అంటూ అభిమానిస్తారో చూసేవాడు.

సరోజ  తనకి తెలిసినవారికి ఎవరికి ఏ కష్ట మొచ్చినా అందరికంటే ముందు తనే ఉండేది. అందరికీ  సాయపడేది. సరోజ  ఇంటికి వచ్చిన వాళ్లు ప్రభు తో, అతని తల్లితో కూడా బాగా మాట్లాడేవారు.

హరికి పెద్దవుతుంటే అర్థమయిందేమిటంటే తన తల్లి తమ జీవితాల కోసం  పోరాటం చేయడమే కాదు మిగతా వాళ్ల జీవితాల కోసం కూడా  నిరంతరం పోరాడుతూనే ఉంటుందని. అమ్మే అతనికి స్ఫూర్తి ప్రదాత.

No comments:

Post a Comment