ఇది నా స్వీయ రచన
మలుపు
రఘుపతికి తన ఊళ్ళోనే కాదు.వాళ్ల జిల్లాలోనే మంచి పేరుంది.వ్యవసాయదారుడే అయినా, తండ్రికి రాజకీయ వారసుడు.నిరంతరం ఎన్నో సేవాకార్యక్రమాలలో తీరిక లేకుండా ఉండేవాడు.
రఘుపతి కుమారై శ్రీవాణి బాగా చదువుకుంది.తండ్రి చేపట్టే కార్యక్రమాలలో అతనికి చేదోడువాదోడుగా ఉంటూ,ఇంటి పనులలో తల్లికి కూడా సాయం చేసేది.ఒక సాహితీ కార్యక్రమం లో
పరిచయమైన రాహుల్ శ్రీవాణిని ఇష్టపడ్డాడు. రాహుల్ తండ్రి రఘుపతితో ఆ విషయం ప్రస్తావిస్తే, రఘుపతి శ్రీవాణితో,తన భార్య శాంతతో మాటాడి వాళ్ళ పెళ్లికి అంగీకరిస్తాడు.
పెళ్లి తేదీ ఖరారు కాకముందు రఘుపతికి తన పార్టీ పెద్దలనుండి కబురు వచ్చింది. రఘుపతితో వాళ్లు ఈసారి ఎన్నికల్లో ఎమ్ఎల్ఏ అభ్యర్థిగా రఘుపతిని ఎంపిక చేసినట్టు, అయితే తన కూతురుకి కులాంతర వివాహం చేస్తే, ఆ నియోజక వర్గం లో రఘుపతి కులంవాళ్ళ సంఖ్య ఎక్కువగా ఉండటం వల్ల ఎన్నికల్లో వాళ్ళు ఓటు వేయకపోతే రఘుపతి ఓడిపోతాడు కాబట్టి ఆ పెళ్లి చేయవద్దని అతనికి సూచించారు. రఘుపతి తాను ఎన్నికల్లో పోటీ చేయనని చెప్పి ముందు అనుకున్నట్టే తన కూతురి పెళ్ళి రాహుల్ తో జరిపించాడు.
ఎన్నికల్లో రఘుపతి పార్టీ ఆ నియోజక వర్గం లో ఓడిపోయింది.
ఎన్నికల తరువాత పార్టీ పెద్దలనుండి మళ్ళీ పిలుపు వచ్చింది. వాళ్ల పార్టీవే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినందువల్ల అతనిని ఓ కీలక పదవికి ఎంపిక చేసినట్టు, రఘుపతి కుమారై శ్రీవాణి మహిళ,చదువుకున్నది,యువతకి ప్రాతినిధ్యం వహిస్తుంది, అన్నిటికీ మించి ఆమె తరువాతి ఎన్నికల్లో పోటీ చేస్తే రఘుపతి కులం ఓట్లు,ఆమె భర్త కులం ఓట్లు కూడా పడతాయని తాము భావిస్తున్నందువల్ల ఆమెని రాజకీయాల్లోకి తీసుకురమ్మని చెప్పారు. దానివల్ల తమ పార్టీ మళ్ళీ పుంజుకుంటుందన్న ఆశాభావాన్ని పార్టీ పెద్దలు వ్యక్తం చేసారు.
ఇంటికి తిరిగి వస్తూ "ఏ మలుపులో ఏ గెలుపుందో" అనుకున్నాడు రఘుపతి.
No comments:
Post a Comment