ఇది నా స్వీయ రచన
కృష్ణ
ఆ పాప నవ్వు కృష్ణమ్మ గలగలల తీరు. నడక, పరుగు, మాటలు అంతా చలాకీవే. నాన్నమ్మ, తాతల దగ్గర అమ్మతో పాటు ఉండేది. తండ్రి దుబాయ్ లో పని చేస్తూ అప్పుడప్పుడూ వస్తుండేవాడు.
కృష్ణవేణి తాత రమణమూర్తి కి, రత్నాకర్ అనే స్నేహితుడు ఉన్నాడు. ఆయన కొడుకు, రమణమూర్తి కొడుకు కూడా మంచి స్నేహితులే.
రత్నాకర్ కొడుకు మధుకర్ పట్నం లో
వ్యాపారం చేసేవాడు.
మధుకర్ తల్లితండ్రులని చూడటానికి తన గ్రామం వచ్చేవాడు కానీ అతని భార్య పిల్లలతో అక్కడికి రావడానికి ఇష్టపడేది కాదు.
మధుకర్ కొడుకు సాగర్, కూతురు శ్వేత, భార్య సునంద. శ్వేత , కృష్ణవేణి ఒకే వయసువారు. వాళ్లిద్దరి కంటే సాగర్ పెద్దవాడు.
కృష్ణ పుట్టినప్పటి నుండి రత్నాకర్ "ఈ పాప మా ఇంటి కోడలే, మా సాగర్ కి చూసుకుంటాం " అంటుండేవాడు. మధుకర్ కూడా దానికి ఎప్పుడూ అభ్యంతరం చెప్పలేదు.
గ్రామానికి వచ్చి ఇప్పుడు మధుకర్ కృష్ణని చూస్తే "ఏవమ్మా కోడలా" అనే పలకరించేవాడు.
కష్ణ చిన్నప్పుడు అప్పుడప్పుడూ మధుకర్ తన కొడుకు సాగర్ ని తన గ్రామానికి తీసుకుని వచ్చేవాడు. సాగర్ మిగతావాళ్ళందరితో ఆడుతూ కృష్ణని కూడా ఆడనిచ్చేవాడు.
కృష్ణ తల్లి సాగర్ కోసం ఏదో ఒకటి చేసి పెట్టేది. ఆవిడ ఏవి చేసి పెట్టినా సాగర్ ఇష్టంగా తినేవాడు.
ఒకసారి రత్నాకర్ తమ్ముడి కూతురు
ఆ ఊరికి వచ్చింది. పెద్ద నాన్నని కలుద్దామని వస్తే రత్నాకర్ కృష్ణ ని చూపించి "మీ అన్న మధుకర్ కి కాబోయే కోడలు. మా సాగర్ కి కాబోయే భార్య " అన్నాడు. మధుకర్ పక్కనే ఉన్నాడు కానీ ఏం అనలేదు. పైగా కృష్ణని వచ్చి తన పక్కన కూర్చోమన్నాడు.
ఆవిడ కొద్దిరోజుల్లోనే పట్నం లో మధుకర్ వాళ్ళింటికి వెళ్ళి సునందని కలిసింది. వెళ్తూనే " అదేమిటి వదినా, అంత నల్లపిల్ల ని కోడలు గా తెచ్చుకుంటావా? మా అమ్మాయి చిత్ర కూడా సాగర్ కి వరసే కదా "అంది.
సునంద " నేనెవర్నీ కోడలుగా చేసుకుంటానని చెప్పలేదు. సాగర్ ఇంకా చిన్నవాడు. ఇప్పటి నుండి వాడి పెళ్లి గురించి మాటలేంటి? మీ అన్నయ్య తో గట్టిగా చెప్తాను "అంది.
కృష్ణ కాలేజీ చదువు కి వచ్చేసరికి మధుకర్ ఆమె ని పట్నం లో హాస్టల్ లో చేర్పించాడు. అప్పుడప్పుడు సాగర్ తో కలిసి వెళ్ళి ఆమె ఎలా ఉందో చూసి వచ్చేవాడు. వెళ్లినప్పుడు ఎంతో కొంత డబ్బులిచ్చి "మీ నాన్న నీకు ఇయ్యమన్నాడమ్మా" అని చెప్పేవాడు.
ఒకసారి కృష్ణకి సెలవులిచ్చినపుడు మధుకర్ కృష్ణవేణి ని తన ఇంటికి తీసుకుని వెళ్లాడు. సునందకి ఇది ఎంత మాత్రం నచ్చలేదు.
కృష్ణని చూస్తూనే సునంద " నీకు మీ అమ్మ పోలికా, నాన్న పలికా" అని అడిగింది. దానికి కృష్ణ "నాకు కృష్ణమ్మ పోలికట. అందుకే మా నాన్నగారు ఎంతో ఇష్టం గా ఆ పేరు పెట్టారుట " అని చెప్పింది.
సాగర్ అక్కడే ఉండటం సునంద కి నచ్చలేదు. కొడుకుతో "నువ్వేమిటి , ఇంత తీరిగ్గా ఇక్కడ కూర్చున్నావు. నాతో ఎప్పుడూ పని పని అని చెప్పి పారిపోతుంటావుగా. వెళ్లి నీ పని చూసుకో " అని చెప్పి అక్కడి నుండి పంపించేసింది.
కృష్ణతో " మా ఇంటికి స్నేహితులు, చుట్టాలు ఎప్పుడూ ఎవరో ఒకరు వస్తూనే ఉంటారు. నువ్వు చీకటి పడకుండా హాస్టల్ కి చేరాలి కదా. త్వరగా బయలుదేరు" అని చెప్పి పంపించేసింది సునంద.
కృష్ణ కి రాను రాను మనుష్యుల ప్రవర్తన రోత కలిగిస్తోంది. శరీరం రంగు నలుపయితే చీదరించుకోవడం, దాని గురించి చర్చలు, తెల్లగా ఉంటే చాలు అందంగా ఉన్నారనడం "ఏమిటో ఈ తెలుపు పిచ్చి " అనుకునేది. తాను నల్లగా ఉందనే సునంద తనని దూరం పెడుతోందని కృష్ణకి బాగా అర్ధమయింది.
కళ్ళతో చూసి ,అందం గురించి మాట్లాడేవారి కంటే అంధులే చాలా నయం అనుకునేది కృష్ణ. తాను బ్రెయిలీ లిపి నేర్చుకుని వారికి నేర్చుకోవడం లో, చదువడంలో సాయం చేసేది.
తన చదువు పూర్తయినా, బ్రెయిలీ లిపి నేర్పడం లో శిక్షణ తీసుకుని కృష్ణ పట్నం లో ఉండిపోయింది. అంధుల పాఠశాలలో పని చేసేది. వాళ్ళతో గడుపడం ఆమెకి హాయిగా ఉండేది.
మధుకర్ సునందతో కృష్ణని కోడలుగా చేసుకుందామని ఒప్పించడానికి చాలా సార్లు ప్రయత్నించాడు. " నా కొడుకు చాలా అందగాడు. ఆ అమ్మాయిని కోడలుగా చేసుకోమంటారేమిటి? అని తిరగబడేది.
ఒకసారి కృష్ణ అమ్మ, నాన్న మధుకర్ ఇంటికి వచ్చేరు. వాళ్ళతో సునంద కృష్ణ ని కోడలు గా చేసుకొనే ఉద్దేశ్యం తనకి అసలు లేదని ,ఆ అమ్మాయికి మరో సంబంధం చూసి పెళ్లి చేయమని చెప్పింది.
ఇది నా స్వీయ రచన
కృష్ణ 5
మధుకర్ ఇంటికి వెళ్ళి వచ్చేక కృష్ణ తండ్రి మనోవ్యధ తో మంచం పట్టేడు.
తాము అపురూపంగా చూసుకొనే తన కూతురి భవిష్యత్తు ఏమవుతుందో అన్న భయం అతనికి పట్టుకుంది.
తండ్రి అనారోగ్యం గురించి తెలియగానే కృష్ణ ఇంటికి వచ్చింది. తండ్రి పరిస్థితి మధుకర్ కి కృష్ణ తెలియచేయడంతో అతను సాగర్ ని వెంటపెట్టుకుని తన స్నేహితుడి దగ్గర కి వచ్చేడు.
స్నేహితుడి పరిస్థితి, మనోవేదన చూసి మధుకర్ కి ఏం చేయాలో అర్ధం కాలేదు. సాగర్ ని "నీకు కృష్ణ అంటే ఇష్టమే కదూ" అని అడిగాడు. సాగర్ "ఇష్టమే " అన్నాడు.
"అయితే వెంటనే కృష్ణ ని పెళ్లి చేసుకొని నా స్నేహితుడిని కాపాడు " అని చెప్పాడు.
తన స్నేహితుడి సమక్షంలో కృష్ణ మెడలో తాళి కట్టించేడు మధుకర్.
"ఇక నా కోడలి బాధ్యత నా కొడుకుది, నాది. వాళ్ళిద్దరూ హాయిగా ఉంటారు. నీకు ఏ దిగులూ వద్దు" అని స్నేహితుడితో చెప్పి కొడుకు, కోడలు తో తన ఇంటికి బయలుదేరేడు మధుకర్.
సాగర్ కి, కృష్ణకి అప్పటికప్పుడు పెళ్లి చేయాల్సివచ్చిందని మధుకర్ చెప్తే సునంద కి వచ్చిన కోపం అంతా ఇంతా కాదు. కృష్ణ తో పెళ్లే వద్దంటే, ఇదంతా ఏంటని మధుకర్ మీద, సాగర్ మీద రంకెలేసింది సునంద.
సునంద" ఈ అమ్మాయికి వెంటనే పంపించేయండి. మీ స్నేహితుడి ఆరోగ్యం గురించి అంతలా ఆలోచించారు ,మీ భార్య ఏమవుతుందో ఆలోచించక్కరలేదా? ఈ అమ్మాయి మనింట్లో ఉంటే నాకు బి.పి పెరిగి నేను మంచం పడతాను" అని చెప్పేసింది.
మధుకర్ కి ఇక గత్యంతరం లేక కృష్ణ ని, సాగర్ ని తాను కొత్త గా కొన్న ఇంటికి తీసుకుని వచ్చేడు. కృష్ణకి అంతా అయోమయంగా ఉంది. ఆమె పరిస్థితి గమనించిన మధుకర్ సాగర్ ని ఆమెతోనే ఉండమని తాను ఇంటికి వెళ్ళేడు.
సునంద ముందు కూతురి పెళ్లి కానిచ్చి సాగర్ కి చిత్ర తో పెళ్లి చేయాలని నిశ్చయించింది. చిత్ర, వాళ్ళ అమ్మ సునంద దగ్గరకి వచ్చి పోతూనే ఉన్నారు.
శ్వేతకి సంబంధం సిద్ధంగానే ఉంది. సునంద కూతురి పెళ్ళి త్వరగా చెయ్యాలని భర్తని తొందర పెట్టింది. దగ్గరలో ముహూర్తం చూసి శ్వేత పెళ్లి జరిపేసారు.
కృష్ణ సాగర్ తో " మీరు మీ ఇంటి సంగతులు చూసుకోండి. నేను అమ్మని, నాన్నని నా దగ్గరకి తెచ్చుకుంటాను. నాన్న ఆరోగ్యం గురించి నాకు భయంగా ఉంది " అంది.
సాగర్ తన ఇంటికి వెళ్ళినా ఆలోచనలు కృష్ణ గురించే. తల్లి ఏదో చెప్తున్నా పరధ్యానంగా ఉండేవాడు.
సునంద తండ్రి బలవంతం మీద పెళ్లి చేసుకున్నాడు కానీ సాగర్ కి కూడా కృష్ణ నచ్చదు, తను చెప్తే ఆమెని వదిలేస్తాడు అనుకునేది
కృష్ణ తన ఊరికి వెళ్ళి తన తల్లితండ్రులని పట్నం తీసుకుని వచ్చింది. సాగర్ తన కారులోనే వాళ్ళని కృష్ణ ఉంటున్న ఇంటికి తీసుకుని వచ్చేడు.
కృష్ణ అంధుల పాఠశాలలో పని చేసేది. ఆ పిల్లల సాంస్కృతిక కార్యక్రమాలు మిగతా పాఠశాలలలో ఏర్పాటు చేసేది. ఎక్కడయినా సాంస్కృతిక కార్యక్రమాలు జరిగినా తన విద్యార్ధులు కూడా పాల్గొనేలా చూసేది. కృష్ణకి ఈ కార్యక్రమాలు అన్నింటిలో సాగర్ సాయపడేవాడు.
సునంద తన కొడుకు కి విడాకులు ఇప్పించి మళ్ళీ పెళ్లి జరపాలనుకుంది. సాగర్ దగ్గర ఆ ప్రస్తావన తీసుకువస్తే సాగర్ " నేను కృష్ణ కి విడాకులు ఇచ్చి మరో పెళ్లి చేసుకుంటానని నువ్వు ఎలా అనుకుంటున్నావు. కృష్ణ అంటే నాకు చాలా ఇష్టం. నా కళ్ళతో చూస్తే నీకూ కృష్ణ అందంగా కనబడుతుంది. నీకు తనని నీ కోడలు గా చెప్పుకోవడం ఇష్టం లేకపోతే మేమిద్దరం వేరే ఉంటాం. ఎలానూ తనతో వాళ్ళ అమ్మ, నాన్న ఉంటున్నారు " అన్నాడు.
సునంద ఒక మహిళామండలి సభ్యురాలు. ఆ మహిళామండలి అధ్యక్షురాలు ఒక పారిశ్రామిక వేత్త భార్య. అయినా ఆమె చాలా నిరాడంబరంగా ఉండేది. ఒకరోజు ఆమె కృష్ణ గురించి అందరి దగ్గర చాలా గొప్పగా మాట్లాడింది.
మహిళామండలి అధ్యక్షురాలు " అంధుల పాఠశాల పిల్లల కార్యక్రమం మనం కూడా ఏర్పాటు చేయాలి. స్వాతంత్ర్య దినోత్సవ సాంస్కృతిక కార్యక్రమాలలో భాగంగా ఆ పిల్లల కార్యక్రమం ఏర్పాటు చేసి, ఆ కార్యక్రమం అయ్యాక కృష్ణవేణి గారిని ముఖ్యమంత్రి సన్మానిస్తారట.
మనం కూడా ఆమెకి మన కార్యక్రమంలో భాగంగా సన్మానం చేద్దాం. ఆమె సేవలని రాష్ట్ర ప్రభుత్వం గుర్తిస్తుంటే మనమూ ఆ అవకాశం విడుచుకోకూడదు" అంది.
సునందకి అప్పటికి గానీ కృష్ణ గొప్పతనం అర్ధం కాలేదు. మీటింగ్ అయ్యాక బయలుదేరుతూ మధుకర్ కి ఫోన్ చేసి "ఇవాళ కృష్ణ ని, వాళ్ళ అమ్మానాన్నలని మన ఇంటికి తీసుకుని వెళ్దాం. త్వరలో వాళ్ళిద్దరికీ కోవెల్లో మళ్ళీ పెళ్లి చేద్దాం "అని చెప్పింది.
మధుకర్ కి భార్య లో ఈ మార్పు ఆశ్చర్యం, ఆనందం రెండూ కలిగాయి.
కోవెలలో సునంద, శ్వేత, ఆమె భర్త దగ్గర బంధువుల సమక్షంలో నిరాడంబరంగా వివాహం జరిగాక కృష్ణ సునందతో " మా అమ్మానాన్నలు నా దగ్గరే ఉంటారు కదా. మేము వేరేగా ఉంటాం అత్తయ్యా. మేము వచ్చిపోతుంటాం" అని చెప్పింది.
ఇప్పుడు సునంద అందరితో కృష్ణ నా కోడలు అని చెప్పుకుంటోంది.
No comments:
Post a Comment