Friday, 15 November 2024

కిషన్ కన్నయ్య

 "# పౌర్ణమి_ కథలు"_కార్తీక _పౌర్ణమి"  


ఇది నా స్వీయ రచన 


            కిషన్ కన్నయ్య 


"....నీ కోసం ప్రాణం పెట్టే నన్ను ఓ పూచికపుల్ల కన్నా హీనంగా, నిర్లక్ష్యంగా చూసావు. నేను నీకు దూరం అయితే, నా తింగరిబుచ్చి ఏమయిపోతుందోనన్న భయంతో  అన్నింటినీ దిగమింగుకుని సహనం వహించి, నీతో ప్రేమగా ఉంటూ వచ్చాను.  ఎంతకాలమని ఓర్పు వహించనూ? నేనూ మనిషినే కదా? నా ప్రేమ...నీ పట్ల నాకున్న ఆపేక్ష... అన్నిటి విలువా నీకు నేను దూరం అయ్యాకే తెలుస్తుంది.  అపుడు నా కోసం వచ్చినా,  నేను ఓ "పిడికెడు బూడిద"గా మిగిలిపోతానేమో... నన్ను ప్రేమగా నీ నుదుట అలంకరించుకుందువు లే. ఇక సెలవు!


వాట్సప్ సందేశాన్ని చదువుతూ కుప్పకూలిపోయింది రాధ.


"వర్క్ బిజీ"లో తన ప్రవర్తనను అర్థం చేసుకుంటాడులే అనుకుంది కానీ, ఆ ప్రవర్తన... తనను ప్రాణంగా చూసుకునే తన కన్నయ్య మనసును అంతగా బాధ పెట్టిందా? అయ్యో... ఇపుడెలా? ఏం చేసేది? దిక్కు తోచక, దిక్కులు పిక్కటిల్లేలా శోకించసాగిందామె.


"కత చాలా బావుందమ్మా " అన్నారు నిర్మాత.

'"మీరు పూర్తిగా  చదవనే లేదు నా కథ" అన్నా నేను. 

"ఓపెనింగ్  సీన్ ఇంత సెంటిమెంటుతో ఇంత బావుంటే కలక్షన్లకి తిరుగుండదు" బాగా  నమ్మకంగా ఉన్నాడు  నిర్మాత.

" మీ కత ముందు  మా డైరెక్టర్ కి చూపిస్తా. ఈ కత ని నవలగా  మార్చి  మనం ప్రచురించుదాం. మీ తదుపరి నవల కోసం రెండు రాష్ట్రాల పాఠకులు వెయిటింగ్  మేడమ్ " అన్నాడు  నిర్మాత. 

నా కధకి విస్తృత ప్రచారం ఇవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే అది కథ కాదు,  జీవితం.

ఈ కథ నా స్నేహితురాలి  కూతురు జననిది. నా స్నేహితురాలి భర్త మరణించేక వాళ్లు చాలా ఆర్ధిక ఇబ్బందుల్లో ఉన్నారని , నేనే మా పెద్దమ్మ కొడుక్కి చెప్పి ఆ ఉద్యోగం వచ్చేలా చేసాను. 

జనని చాలా పట్టుదల,కష్టపడేతత్వం. కొత్తగా ఉద్యోగం లో చేరింది. పని నేర్చుకోవాలి. పనిలో సవాళ్ళనెదుర్కోవాలి.


జనని, కిషన్ ప్రేమ ఈనాటిది కాదు. జనని తండ్రి  అకాలమరణం సమయం లో తనే ఇంటి అల్లుడిలా ఎంతో చేసేడు. తల్లీ కూతుళ్ళని తనే కనిపెట్టుకుని ఉండేవాడు. కిషన్ కి జనని అంటే ఉన్న ప్రేమ ఇట్టే తెలిసిపోతుంది.

జనని కిషన్  నుండి  తనకి మెసేజ్ రాగానే హడలిపోయి  ముందు నాకే ఫోన్ చేసింది.

"పెద్దమ్మా, అమ్మకి నేను ఇలాటివి చెప్పలేను. కిషన్  నన్ను అపార్ధం చేసుకుంటే నేనేమయిపోవాలి? నా పరిస్థితి  నీకు తెలుసుకదా?" అని భోరున ఒకటే ఏడుపు. 

"నువ్వు  ధైర్యంగా ఉండు. ఆ అబ్బాయితో నేను  మాటాడతా. పరిస్థితి  కొంచెం చక్కబడ్డాక  నువ్వు కిషన్ ని కలిసి ,

అన్నీ వివరించి , అతను నిన్ను  సరిగా అర్ధం చేసుకొనేలా  నీవంతు ప్రయత్నం చేయాలి " అన్నా. 


ఏంటో ఈ కాలం పిల్లలు. అపార్ధాలు, ఆవేశాలు, ఆక్రోశాలు. అన్నిటికీ  తొందర పడితే ఎలా? మొన్న ఆశా ఆసుపత్రికి నా స్నేహితురాలితో వెళ్తే మన స్థిమితం లేని ఆ వయసు వాళ్ళు ఎంతమందో. 


నేను కిషన్ కి ఫోన్ చేసి , మా ఇంటికి రమ్మని చెప్పా. కిషన్ కి నేను జనని వాళ్ల అమ్మ స్నేహితురాలిని  అని తెలుసు.


అడగ్గానే కిషన్ మా ఇంటికి వచ్చేడు. మనిషి చాలా నిరుత్సాహం గా, నిర్లిప్తంగా ఉన్నాడు. జనని వాళ్ల  అమ్మ  మాలతిని కూడా  మా ఇంటికి రమ్మన్నాను.

అది" ఏమయిందే" అని ఆదుర్దాగా అడిగింది.

" ఏం లేదు. నేను ఒక నవల రాయాలి. ముందు   సీరియల్ గా ఒక పత్రిక కి పంపుదాం. నువ్వు,  కిషన్ నాకు ఆ పనిలో సాయం  చేయాలి" అని కిషన్ వైపు  చూసా. 

కిషన్ ఏం మాట్లాడలేదు. "నేను  మీకు  ఏ సాయం చేయలేనేమో ఆంటీ " అన్నాడు. 

"నన్ను  అత్తా అని పిలుపు. నాకదే ఇష్టం " అన్నా.

" ఏమే, నీ కూతురు  అంత పెద్దదయి పోయిందా?అంత బిజీవా, కనీసం నాకు  ఫోన్ కూడా  చేయదు "అన్నా మాలతితో, జనని  నాకు ఫోన్ చేసిందని చెప్పకుండా.

"ఏం చెప్పమంటావే. మీ అన్నయ్య వాళ్ళ ఆఫీసు లో  చేరినప్పటి నుండి  దాని సంగతి అలానే ఉంది.  ఇంట్లో  ఉన్నా పనే. ఆఫీసుకి వెళ్తే ఇక చెప్పనక్కర్లేదు. 


అది ఇంటికి  వచ్చిందాకా  ఎదురు చూడటం. " పెద్దమ్మ   వాళ్ళకి చెప్తే ఇంత మంచి ఉద్యోగం దొరికింది. దాన్ని  నిలబెట్టుకోవాలి కదమ్మా "అంటుంది. ఇంకా నేను  మాటాడబోతే , "నేను  నిన్ను బాగా చూసుకోవాలి కదా "అంటుంది. నేనెవరితో చెప్పుకోవాలి " అందించి మాలతి  దిగులుగా. 


నేను  "కిషన్,  మా అన్నయ్య  నేను జననిని సిఫార్సు చేసేనని ఎంత  సంతోషిస్తున్నాడో . ఈమధ్యే ఆఫీసులో పని చేస్తున్న మరో అమ్మాయి పెళ్లి చేసుకొని అమెరికా వెళ్ళిపోయిందట. నువ్వు అక్కడ చేరితే జననికి కొంత హాయిగా ఉంటుంది కదా " అన్నా. 


కిషన్ కి జనని మీద  కోపం, అలక, ఉక్రోషం, ఇదివరకులా తనతో లేదన్న బాధ,  ఇవేవీ ఇంకా తగ్గలేదు. "జనని నాతో అలాగ ఏం చెప్పలేదు. తను నన్ను ఏం అడగలేదు " అన్నాడు కిషన్. 

నేను మాలతిని, కిషన్ ని ఇద్దరినీ కొన్నాళ్ళు మా ఇంట్లో  ఉండమని అడిగా. ఇద్దరూ  నా మాట కాదనలేకపోయారు. కిషన్ ని కొన్నాళ్ళు  ఎవరో ఒకరు  కనిపెట్టుకుని ఉండాలి. తనది మరీ సున్నిత మనస్తత్వం లా ఉంది.


నా సీరియల్  సినిమా  ఫక్కీలోనే మొదలెట్టేను, కథ సెంటిమెంటు సీన్ తో మొదలయ్యింది. 


కిషన్ ని జనని ఆఫీసులో చేరడానికి ఒప్పించా. అతను జననితోనే కలిసి పని చెయ్యాలి. 

జననికి  తన తప్పులు, పొరపాట్లు అన్నీ తెలిసొచ్చాయి. ఐనా కిషన్ తనకి అలా మెసేజ్ చేయడం అసలు నచ్చలేదు. దాని గురించి కిషన్ తో ఖచ్చితంగా మాట్లాడాలనుకుంది. 


ఒక రోజు కిషన్  ఆఫీసు  నుండి  మా ఇంటికి వచ్చినపుడు జనని కూడా ‌మా ఇంటికి ‌వచ్చింది. 


వస్తూనే  కిషన్ ని కూడా మేడమీద ఉన్న  నా గదిలోకి లాక్కొచ్చి  "పెద్దమ్మా , మీ కాబోయే అల్లుడికి నా పేరు చెప్పి  నాలుగు తగిలించండి" అంది కోపం గా.

నేను " అంత ఆవేశం ఏంటి జననీ?" అని అడిగా.

"కాకపోతే మరేంటి పెద్దమ్మా, ఎలా పడితే అలా సందేశాలు పంపి నన్ను  ఏడిపిస్తాడా? నీ వచ్చే నవలలో వీడే  విలన్. ఇది ఖాయం. "


"నన్ను మీ అందరి ముందే టింగరబుచ్చి అంటాడు. తండ్రి లేని అమ్మాయిని. నన్ను ఎంత  ఏడిపించాడు?" అంటూ కిషన్ ని నానామాటలు అనేసింది. 


కిషన్  నా ముందు  జననిని ఏం అనలేకపోయాడు. 


"నేను ఇప్పటికే సినిమా  మొదటి  సీన్ సిద్ధం చేసుకున్నా.‌ జనని అనర్గళంగా డైలాగులు చెప్పేస్తోంది. నిర్మాత సిద్ధంగా ఉన్నారు. కిషన్ కథానాయకుడా,ప్రతి నాయకుడా అనేది  పాఠకులు, ప్రేక్షకులు తేలుస్తారు " అన్నా నా నవ్వు దాచుకుంటూ. 


"పెద్దమ్మ  నిన్ను ఇక్కడ ఉండమంది కాబట్టి సరిపోయింది. లేకపోతే నువ్వేం చేసుకుంటావో అని భయపడి ఛస్తున్నాను. "


"నా పరిస్థితిని‌ అర్థం చేసుకోకుండా ఆ నిందలేంటి , అభాండాలేంటి, హమ్మో చూసావా పెద్దమ్మా. నువ్వు చెప్పు , నేనలాటిదాన్నా " దీనంగా అడిగింది జనని నా వైపు చూస్తూ. 


వాళ్ళది రాధాకృష్ణుల ప్రేమ. కాని అది వివాహ బంధం గా, వాళ్లు అన్యోన్య  దంపతులుగా ,కలతలు లేని కాపురం చేయాలని నా కోర్కె.


మాలతి కోరిక  కూడా వాళ్లకి త్వరలో పెళ్ళి చేసేద్దామనే. జనని తామిద్దరూ  కొంత స్థిరపడ్డాక పెళ్లి  చేసుకోవాలనుకుంటోంది. 


కిషన్ అంత మంచి అబ్బాయిని నేనెక్కడా చూడలేదు. ఇద్దరూ మళ్ళీ ఆఫీసు పనిలో బిజీ అయిపోయారు.


వాళ్ళిద్దరి  ప్రేమ,  తగువులు, గొడవలు అన్నీ చూస్తూ వాటి ఆధారంగానే  నా ధారావాహిక కొనసాగిస్తున్నా. నా ధారావాహికని ప్రేక్షకులు బాగా ఆదరిస్తున్నారు. 

ఇప్పటిదాకా వాళ్ళ  మధ్య జరిగినదే రాసా. కానీ నేను రాస్తున్న ధారావాహికం పూర్తిగా  వారి కధే కానవసరం లేదు.


నా కధలో కన్నయ్య అంటే రాధకి ప్రాణం. రాధ దూరమైపోతుంటే ప్రాణత్యాగానికి కూడా సంసిద్ధమైన కన్నయ్య. 

"కన్నయ్యా,నీ రాధ అంటే నీ కెంత ప్రేమ! ఎంత ఓపిగ్గా ఎదురు చూస్తున్నావు ఆమె కోసం?" అనుకున్నా.


అదే ప్రేమ నాకు కనిపించేది కిషన్ లో. జనని చాలా అదృష్టవంతురాలు అనుకుంటుంటా.

జనని ఓ రోజు తన టూ వీలర్ మీద వెళ్తుంటే ప్రమాదం జరిగి బాగా దెబ్బలు తగిలాయి. ఎవరో ఫోన్  చేసి చెప్తే మాలతి, నేను అక్కడకి వెళ్ళాం. కిషన్ కూడా  గాభరా పడుతూ అక్కడకి వచ్చాడు.  


  జనని   ఓ మూడు రోజులు ఆసుపత్రి లో ఉండాల్సి వచ్చింది. మాలతి, కిషన్ ఆసుపత్రిలో ఉండిపోయారు. మాలతి  జననిని  ఆసుపత్రి నుండి  వాళ్ల ఇంటికే తీసుకుని వెళ్ళింది. 


జనని  మెడికల్ లీవ్ పెట్టక తప్పలేదు. కిషన్ ఇంటి నుంచి పని చేయడానికి అనుమతి తీసుకొని జనని దగ్గరే ఉండేవాడు. 

కిషన్ తల్లి తండ్రులు వచ్చి  జననిని చూసి వెళ్ళారు. 


గాయాలు మానేక నేను జననితో "మీ నాన్న పోయాక, నువ్వు ఆఫీసు పనితో తీరిక లేకుండా అంటే, మీ అమ్మ చాలా ఒంటరితనం అనుభవిస్తోంది. నీకు త్వరగా పెళ్ళి చేస్తే తనకీ చేతినిండా  పని. కిషన్  కూడా  పెళ్లికి తొందర పడుతున్నాడు. నీతో ఆమాట అనడం‌ లేదంతే" అన్నా.


జనని వెంటనే అలాగే అనలేదు కానీ తర్వాత వాళ్ళ  అమ్మకే తన అంగీకారం తెలియచేసింది. 


కిషన్ తల్లితండ్రులు  వాళ్ల సొంత ఊరిలో తామే పెళ్లి  జరిపిస్తామన్నారు.

కన్యాదానం  నేను, మావారు చేసేం. 


పెళ్ళి తరవాత  జనని " పెద్దమ్మా, నువ్వు  నాకు అమ్మవి కూడా అయిపోయావు. నీ కధలో కన్నయ్యకి ఇద్దరు తల్లులు లేరు కానీ నాకు ఇద్దరు అమ్మలు " అంది నవ్వుతూ


"నేను, కిషన్ తగువులాడుకుంటే నేను  నీ దగ్గరకే వచ్చేస్తా" అంది జనని నాతో.


"ఏమక్కరలేదులే. మేము  మా కన్నయ్యనే జాగ్రత్తగా చూసుకోవాలి. మీ మధ్య  తగువు వస్తే  కిషన్నే మా ఇంటి దగ్గర దిగబెట్టి,  నువ్వు  మీ అత్తారింట్లో ఉండు" అని చెప్పా జననితో.

నా నవల, నా నవల ఆధారంగా తీసిన  సినిమా, జననీ కిషన్ ల ప్రేమ కథ అన్నీ సుఖాంతమే. 


డాక్టర్  గుమ్మా భవాని 

15.11.24

No comments:

Post a Comment