ఇది నా స్వీయ రచన
అత్తమ్మ
"నీకో అమ్మాయిని చూసేనురా" అంది
మీనాక్షి తన కొడుకు సుహాస్ తో.
"ఎక్కడ చూసేవేంటి ? " అన్నాడు సుహాస్ నవ్వుతూ.
"మా మహిళా సమితి ఒక గ్రామాన్ని దత్తత తీసుకుంది. ఆ పని మీద నేను ఆ ఊరికి వెళ్తుంటాను. అక్కడ ఒక టీచర్ గారి అమ్మాయి నాకు బాగా నచ్చింది. నువ్వు ఒ.కె. అంటే
నేను వాళ్ళతో మాట్లాడతాను " అంటూ తన సెల్ ఫోన్ లో ఉన్న ఆ అమ్మాయి ఫొటో సుహాస్ కి చూపించింది మీనాక్షి.
కళ్ళకి కాటుకతో, చేతులకి గాజులతో, తలనిండా పూలతో చాలా సంప్రదాయబద్ధంగా ఉంది ఆ అమ్మాయి.
అమ్మ ఎంపిక మీద సుహాస్ కి చాలా గురి. అమ్మకి నచ్చిందంటే తనకి భార్య అయ్యే అర్హత ఆ అమ్మాయికి ఉందా లేదా అని తను ఆలోచించక్కరలేదు.
"ఇంతకీ అమ్మాయి పేరేంటి? " అడిగాడు సుహాస్.
"శారద . పేరడిగావంటే అమ్మాయి నీకు నచ్చింది కదా. ఈసారి నేను
ఆ ఊరికి వెళ్ళినప్పుడు నువ్వూ నాతో రా. వాళ్ళకీ నువ్వు నచ్చాలి కదా " అంది మీనాక్షి.
ఓ వారం తరవాత మీనాక్షి సుహాస్ ని ఆ ఊరికి తీసుకుని వెళ్ళింది. రాధాకృష్ణ మాస్టారు వాళ్ళిద్దరినీ బాగా ఆదరించారు.
మీనాక్షి " నాకు మీ అమ్మాయి బాగా నచ్చింది. వీడే మా అబ్బాయి సుహాస్ . మీకు, మీ అమ్మాయికి మావాడు నచ్చితే వాళ్ళిద్దరికీ పెళ్ళి చేద్దాం " అంది రాధాకృష్ణతో.
మాస్టారు చాలా సంతోషించి "మా శారద సంగీత సాధనకి వాళ్ళ గురువు గారింటికి వెళ్లింది. ఇప్పుడే వచ్చేస్తుంది. మీకు కోడలు కావడం కంటే అదృష్టం ఇంకేముంది? మీ గురించి మా ఊళ్ళో అందరికీ తెలుసుకదా " అంటూ నమస్కరించాడు.
మరి కొద్దిసేపట్లో శారద అక్కడకి వచ్చింది. సుహాస్ కి శారద ఫొటోలో కంటే అందంగా కనిపించింది. మీనాక్షి సంగీతం అంటే ప్రాణం. శారదకి ఇంతకుముందే మీనాక్షి తెలియడం వల్ల ఆమె అడగ్గానే ఒక పాట పాడింది.
సుహాస్ కి కూడా సంగీతం అంటే ఇష్టం. అతను కూడా ఆ పాటని బాగా ఇష్టపడ్డాడు.
శారద వాళ్ళకి కాఫీ పెట్టడానికి లోపలికి వెళ్లినప్పుడు మాస్టారు కూడా లోపలికి వెళ్లి కూతురికి అసలు సంగతి చెప్పారు.
కాఫీ తీసుకొచ్చిన శారద సిగ్గు పడుతూ మీనాక్షికి ,సుహాస్ కి కాఫీ అందించి లోపలికి వెళ్లిపోయింది.
మీనాక్షి "ఇక మేము వెళ్తాం" అని చెప్పి బయలుదేరుతుంటే మాస్టారు వాళ్ళతో నడిచారు. సుహాస్ శారద వైపు చిరునవ్వుతో చూసి ఆమె నుండి సెలవు తీసుకున్నాడు.
మాస్టారు " మా అమ్మాయి నేను అడిగితే నచ్చాడనే తల ఊపిందమ్మా. ఆడపిల్ల, అంతకంటే ఎలా చెప్తుంది? మీరు పెద్ద మనసు చేసుకుని మా ఇంటికి వచ్చేరు. ఇంతకన్నా గొప్ప సంబంధాలు మీ అబ్బాయికి వస్తాయి" అన్నాడు.
"మేము కూడా మా ఇంటికి తెచ్చుకునే అమ్మాయి గురించి చాలా ఆలోచిస్తాం కదా మాస్టారూ" అంటూ మీనాక్షి అతనికి నమస్కారించి సెలవు తీసుకుంది.
మీనాక్షి తన భర్త సుందరేశ్వర్ కి ఈ పెళ్లి సంబంధం గురించి ముందే చెప్పింది. అతనికి మీనాక్షి అంటే చాలా ఇష్టం. ఒక భర్త భార్య ని ఎలా ప్రేమించాలో సుహాస్ తన తండ్రిని చూసి తెలుసుకున్నాడు. భార్య కి ఎంత విలువ ఇవ్వాలో, ఎలా గౌరవించాలో అన్నీ తండ్రిని చూసి సుహాస్ నేర్చుకున్నాడు.
మాస్టారు మంచి ముహూర్తం పెట్టించి సుందరేశ్వర్ కి తెలియచేసారు. పెళ్ళి ఆ ఊరిలో చెయ్యడానికే నిశ్చయించాడు. సుందరేశ్వర్ భోజనాల ఖర్చు తనదే అని ముందే చెప్పాడు.
మాస్టారి మీద గౌరవం తో, మీనాక్షి తమ ఊరికి చేసిన సాయానికి కృతజ్ఞతగా ఊరివారంతా తలో చెయ్యివేసి పెళ్లి ఘనంగా జరిపించేరు. శారద అత్తవారింటికి వచ్చేసింది.
శారదకి ఓ మహానగరాన్ని చూడటం అదే మొదటిసారి. అత్తవారిల్లు కూడా దేదీప్యమానంగా వెలిగిపోతోంది. వాళ్ళ ఇంటికి వచ్చిన బంధువులు, స్నేహితులతో ఆ ఇల్లు కళకళలాడుతోంది.
మీనాక్షి అందరినీ ఆదరించింది. మూడు నిద్రలయ్యేక కొత్త జంట హనీమూన్ కి వెళ్ళారు.
సుహాస్ ఆమెకి ఏవి ఎలా వాడాలో , ఏ జాగ్రత్తలు తీసుకోవాలో అన్నీ నేర్పేవాడు. ఆమెకి సహజంగా ఉన్న సిగ్గు, బిడియం దూరం చేయడానికి ప్రయత్నించేవాడు.
హనీమూన్ నుండి వచ్చాక మీనాక్షి "నువ్వు టీచర్ గారి అమ్మాయివి. నీకు ఎంతకాలం చదవాలని ఉంటే , ఎంత వరకు చదవాలని ఉంటే చదువుకో. మీ పిల్లల చదువు బాధ్యత మీ ఇద్దరిదే కదా " అని ఆమెని కాలేజీలో చేర్చింది
శారద తన అత్తమ్మ సహకారం తో బాగా చదివి తెలుగు లెక్చరర్ అయింది. సంగీత పాఠాలు కూడా ఆసక్తి ఉన్నవారికి నేర్పేది. శారద, సుహాస్ లకి ఒక పాప పుట్టింది. తర్వాత వాళ్ళు మరో బాబుని దత్తత తీసుకుని పెంచేరు.
శారద కి మొక్కలు పెంచడం ఎంతో సరదా. గ్రామం లో పంటపొలాల నడుమ తిరిగిన ఆమెకి పూలమొక్కలు, పళ్ళ చెట్ల మధ్య కొంతసేపు గడపడం సరదా. సుహాస్ కి ఆమె ఇష్టాలేంటో బాగా తెలుసు.
మీనాక్షికి మనవలతో మంచి కాలక్షేపం. ఆమె మనవలని వాళ్ళ తాతగారి ఊరికి అప్పుడప్పుడు తీసుకెళ్ళేది.
శారద తన గ్రామం లో ఒక సంగీత పాఠశాల పెట్టి తన స్నేహితురాలిని ఆ పాఠశాల నడపమని కోరింది. తను కూడా తరచు తన భర్తతో తన గ్రామానికి వచ్చేది.
మాస్టారి శిష్యులు తాము చదువుకున్న బడి కోసం ఏదైనా చేయాలని బడికి అదనపు భవనాన్ని, తరగతి గదులని ఏర్పాటు చేసారు.
.
No comments:
Post a Comment