ఇది నా స్వీయ రచన
చిత్ర
వర్షం వస్తుందేమో అని ఆరబెట్టిన గిన్నెలు తీస్తుంటే అకస్మాత్తుగా చిత్ర గుర్తొచ్చింది.
ముఫ్ఫై ఏళ్ల క్రిందటి మాట.అవి నేను ఉపాధ్యాయినిగ పనిచేస్తున్న రోజులు. చిత్ర, ఆమె భర్త కొత్తగా పెళ్ళయి, మా ఇంటికి ఎదురుగా కంపెనీ వారిచ్చిన ఇంట్లో ఉండేవారు.
చిత్ర ఎప్పుడూ గలగలా మాట్లాడుతూ ఉండేది. వాళ్ళింటి విషయాలు, ప్లాంట్ విషయాలు, టౌన్ షిప్ సంగతులు ఒకటేమిటి అన్నీ చెప్పేది. ఒకరోజు "క్లబ్బులో రాజశేఖర్ సినిమా ఉంది వదినగారూ. మీ పాపని మాతో పాటు సినిమాకి తీసుకెళ్తాం.ఆ పాటలకి పాప బాగా డాన్స్ చేస్తోంది. " అని వాళ్ళిద్దరే సినిమా ఎంజాయ్ చేయకుండా పాపని తీసుకుని వెళ్లి మరీ ఆనందించేరు.చిత్ర భర్త కొన్నాళ్ళు నాకు లెక్కలు నేర్పారు.నేను ఎకనామిక్స్ లో పిజి చేద్దామని సరదా పడితే గణితం పేపరు పాసవడానికి ఆయన చాలా సాయపడ్డారు. ఆయన ఇంజనీర్ కాబట్టి లెక్కలు నేర్పడంలో ఆయనకి సరదా ఉండేది.
"అన్నయ్యగారు బంగాళదుంపల వేపుడు బాగా చేస్తారు. మా ఇద్దరి కోసం నేను కొంచెం తీసుకెళ్తాన్నా" అని చనువుగా తీసుకెళ్ళేది చిత్ర.
ఆ తర్వాత వాళ్ళు ఇల్లు మారి
మరో పెద్ద ఇంటికి వెళ్ళి పోయారు.మళ్ళీ ఏదో పెళ్ళిలో కలిసినపుడు చిత్ర వాళ్ళ అబ్బాయిని చూపించింది.
జీవన గమనం లో ఎందరో కలుస్తారు.చిత్రలాటివాళ్ళు గుర్తుండిపోతారు.
No comments:
Post a Comment