ఇది నా స్వీయ రచన
పెళ్ళి
సవిత స్నేహితురాలు రాధిక. రాధిక పెళ్లి అయి మరో ఊరికి వెళ్ళిపోయినా రోజూ సవితకి ఫోన్ చేస్తూనే ఉంటుంది. సవిత డిగ్రీ అయ్యాక ఉద్యోగంలో చేరిపోయింది.
రాధిక తల్లికి ఆరోగ్యపరమైన సమస్యలు ఉన్నాయి. తన ఆరోగ్యం కొంత బావున్నప్పుడే కూతురి పెళ్ళి జరిగిపోవాలని ఆవిడ పట్టు పట్టింది. పెళ్లి ముందు సవిత రాధికకి చాలా సాయం చేసింది.
రాధిక అన్న సంజయ్ యూనివర్సిటీ లో రీసెర్చ్ చేస్తూ ఎప్పుడూ తన పనిలో తానుంటాడు. వాళ్ళ అమ్మ సంజయ్ కి తన అనారోగ్యం గురించి చెప్పడానికి కూడా ఇష్టపడదు.
రాధిక తన స్నేహితురాలు సవితతో తల్లి అనారోగ్యం గురించి చెప్తూ ఉంటుంది ఉంటుంది. ఏ కొంచెం బాగులేక పోయినా ఒకసారి వెళ్లి చూసి రమ్మని అడుగుతుంది.
రాధిక తల్లిని తెలిసిన డాక్టర్ ఒకరు వచ్చి చూసి వెళ్తుంటారు. ఒకొక్కప్పుడు వైద్య పరీక్షల కోసం సవిత రాధిక వాళ్ళ అమ్మని తీసుకొని వెళ్ళేది. తన భార్యని ఆసుపత్రికి తీసుకుని వెళ్తే రాధిక తండ్రికి ఎక్కువ కంగారుగా ఉండేది. సవిత పక్కన ఉంటే ఆయనకి కొంచెం ధైర్యం గా ఉండేది.
సవిత చెల్లి అపర్ణ డిగ్రీ ఆఖరి సంవత్సరం చదువుతోంది. అపర్ణని ఒక అబ్బాయి ఇష్టపడుతున్నాడు. ఆ అబ్బాయి అపర్ణ వాళ్ళకి బాగా తెలిసిన కుటుంబానికి చెందిన వాడే.
అపర్ణ తల్లి తండ్రులకి ఆ అబ్బాయి తో పెళ్లికి విముఖత లేదు. కానీ సవితకి, అపర్ణ కి ఒకేసారి పెళ్ళి చేసే స్తోమత వాళ్ళ నాన్నకి లేదు.
చెల్లి పెళ్ళి ముందు చేసేయమని సవిత తల్లి తండ్రులని ఒత్తిడి చేసింది. ఆ అబ్బాయి పెళ్లి చేసుకొని అపర్ణని అమెరికా తీసుకుని వెళ్ళిపోయే తొందరలో ఉన్నాడు.
అపర్ణ పరీక్షలు అయిపోయాక ఆమె పెళ్లి జరిగిపోయింది.
సంజయ్ కి తన పరిశోధనే తన లోకం. ఇంట్లో కూడా తన రూమ్ లో తనకి కావలసిన పుస్తకాలు, తను నోట్ చేసుకుంటున్న కాగితాలు అన్నీ ఎటుకటే పరిచేసి ఉంటాయి. సంజయ్ చదువుతూ అలానే నిద్రపోతాడు. చేయాల్సిన పని మీద ధ్యాస ఎక్కువ. తన ప్రొఫెసర్ తో యూనివర్సిటీలో, అతని ఇంట్లో కూడా ఎక్కువ టైమ్ గడుపుతాడు.
తన రీసెర్చ్ పనితో తల వేడెక్కిపోతే సంజయ్ తల్లితో కొంత సేపు గడుపుతాడు. ఆమె అడిగితే కోవెలకు తీసుకుని వెళ్తాడు.
సెలవురోజుల్లో సవిత కూడా వచ్చి సంజయ్ తల్లితో గడిపివెళ్తుంది. రాధిక తల్లి దగ్గర ఉన్నప్పుడు వీడియో కాల్ చేసి వాళ్ళ అమ్మతో
మాటాడిస్తుంది.
సంజయ్ కి సవిత అంటే చాలా మంచి అభిప్రాయం, ఎంతో గౌరవం. సంజయ్ తల్లి సంజయ్ తో ఎన్నో సార్లు " సవిత చాలా మంచి అమ్మాయి. మనకి ఎంతో సాయం చేస్తుంటుంది "అని ఎప్పుడూ చెప్పే ది. అందువల్ల సవిత పట్ల కృతజ్ఞతాభావం కూడా సంజయ్ కి ఉండేది.
సంజయ్ పేపర్ లండన్ యూనివర్సిటీ వాళ్ళు ఆమోదించారు. సంజయ్ ని,అతని ప్రొఫెసర్ ని వారు అక్కడికి రమ్మని ఆహ్వానించారు. సంజయ్, అతని ప్రొఫెసర్ పది రోజులకి లండన్ వెళ్ళేరు. రాధిక వచ్చి తన తల్లితండ్రుల దగ్గర ఉంది.
సవిత ఒక్కోసారి ఆఫీసు నుండి రాధిక దగ్గరకి వచ్చి కొంత సేపు గడిపివెళ్ళేది. అన్న సాధించిన విజయానికి రాధిక ఆనందం అంతా ఇంతా కాదు. రాధిక వాళ్ళ అమ్మ దగ్గర, సవిత దగ్గర " అన్న సాధించినదేం తక్కువ విషయం కాదు " అనేది.
సవితకి తల్లితండ్రులు సంబంధం చూద్దామనుకుంటే సవిత ఇప్పుడు కాదు అంటూ వాయిదా వేసింది
రాధిక కి ఇది తెలిసి సవిత ని"నీ మనసు లో ఎవరైనా ఉన్నారా? " అని అడిగింది.
సవిత "ఎవరూ లేరు " అనేసి " ఏమో, ఎవరైనా ఉన్నారేమో నాకు తెలియదు " అంది నవ్వుతూ.
తన స్నేహితురాలు తనకి ఏదో రహస్య సందేశం వినిపించినట్టు అనిపించింది రాధిక కి.
అన్న ఇంటికి వచ్చేసాక రాధిక తిరిగి వెళ్ళిపోయింది.
సంజయ్ లండన్ నుంచి వచ్చేక సవిత అతనిని ప్రత్యేకించి అభినందించింది.
మరి కొన్నాళ్ళకి సంజయ్ కి డాక్టరేట్ డిగ్రీ కూడా వచ్చింది.
సంజయ్ కి అదే ఊళ్ళో ఓ రీసెర్చ్ సంస్థలో మంచి ఉద్యోగం వచ్చింది.
సవిత చెల్లి అపర్ణ కడుపుతో ఉంది. సవిత తల్లి పురిటికి తాను అమెరికా వెళ్ళలేనని చెప్పేసింది. దానితో సవితకి ఓ రెండు నెలలు సెలవు పెట్టి అమెరికా కి వెళ్ళక తప్పలేదు.
సవిత ఊళ్ళో లేకపోవడం, చాలా రోజులు అసలు కనబడకపోవడం సంజయ్ కి ఏదోలా ఉంది. రెండు మూడు సార్లు వాళ్ళ అమ్మని " సవిత ఎప్పుడొస్తుంది" అని అడిగేసాడు కూడా.
సంజయ్ తల్లి ఒకరోజు కొడుకుతో "నువ్వు సెటిల్ అయిపోయావు కదా.
మేము ఇక నీకు పెళ్లి చేసేయాలి" అనగానే " సవిత రానీ అమ్మా" అన్నాడు పరధ్యానంగా.
"సవిత వచ్చేకేనులే" అన్నారు ఆవిడ నవ్వుతూ.
"అదేం కాదులే అమ్మా. నేను ముందు సవితతో మాట్లాడాలి" అనేసి అక్కడినుంచి వెళ్ళిపోయాడు.
సవిత అమెరికా నుండి రాగానే రాధిక వాళ్ళ అమ్మకి ఫోన్ చేసి ఆవిడ ఆరోగ్యం గురించి కనుక్కుంది. ఆవిడ ఆదివారం తప్పకుండా రమ్మని సవితతో చెప్పింది.
సవిత వచ్చేసరికి సంజయ్ ఇంట్లోనే ఉన్నాడు. సవిత కొంతసేపు తనతో మాట్లాడాక సంజయ్ తల్లి సవిత తో "మా వాడు నీతో ఏదో మాట్లాడాలట. వాడి రూమ్ లో ఉన్నాడు. ఓసారి కలిసి రా" అని చెప్పింది.
తనతో ఆ పెద్ద మనిషికున్న మాటలేవిటా అనుకుంటూ సంజయ్ రూమ్ లో అడుగుపెట్టింది సవిత.
" సవితా, నిన్ను కలిసినప్పుడు నీకీ విషయం చెప్పాలనుకున్నాను. కాదు కాదు, అడగాలనుకున్నా."
"ఏంటి "
"నేనయితే పూర్తిగా ప్రేమలో పడిపోయా"
"ఎవరితో " అంది సవిత కొంచెం గాభరాగా.
"ఎవరితోనో అయితే నీకెందుకు చెప్తాను? నీతోనే. మరి నువ్వు? "
"నేనూ పడ్డానేమో " అంది సవిత సిగ్గు పడుతూ.
"మా అమ్మ నాతో నా పెళ్లి ప్రసక్తి తేకపోతే ఇప్పుడే ఈ మాట చెప్పేవాడిని కానేమో . ప్రేమించడం చాలా సులువు కానీ ఆ మాట నీతో చెప్పాలంటే నువ్వేమనుకుంటున్నావో అన్న సంశయం."
"సవితా, నువ్వు అంగీకరిస్తే నేను మా అమ్మానాన్నలతో మాట్లాడతా. వాళ్ళే మీ ఇంటికి వచ్చి మీ వాళ్ళతో చెప్తారు " అన్నాడు.
సవిత అలాగే అన్నట్టు తలాడించి సంజయ్ రూమ్ లోంచి బయటకు వచ్చేసింది. సవిత సంజయ్ వాళ్ళ అమ్మతో సంజయ్ తనతో ఏం మాట్లాడాడో చెప్పకుండానే, మరికొద్ది సేపు వాళ్ళింట్లో ఉండి తన ఇంటికి వచ్చేసింది.
సవిత తన తల్లితో " రాధిక అమ్మానాన్న మనింటికి వస్తారు. వాళ్ళు వచ్చి మీతో ఏదైనా మాటాడతారేమో" అని సూచన ప్రాయంగా చెప్పింది.
వారం తిరగకమునుపే సంజయ్ తల్లితండ్రులు సవిత ఇంటికి వచ్చి ఆమె తల్లితండ్రులను కలిసేరు.
సంజయ్ తల్లి " సవిత మా కోడలు అయితే బావున్నని నేను ఎప్పటి నుండో అనుకుంటున్నా. మా అబ్బాయి ఉద్దేశ్యం కూడా అదే అని తెలిసాక మీ దగ్గరకి వచ్చేం" అంది.
సవిత తల్లితండ్రుల ఆనందం అంతా ఇంతా కాదు. బాగా చదువుకున్న వాడు, మంచి ఉద్యోగం చేస్తున్నవాడు
తమకి అల్లుడిగా, సవిత కి భర్తగా లభిస్తున్నందుకు వాళ్ళకి చాలా ఆనందంగా ఉంది.
సంజయ్ , సవిత పెళ్లి నిరాడంబరంగా జరగాలని కోరుకున్నారు. ముహూర్తం దగ్గరలోనే కుదిరింది.
సంజయ్ సవితని ఇష్టపడ్డాడంటే రాధిక కి ఎంతో ఆనందం కలిగింది. త్వరలోనే పెళ్ళి అంటే ఆమెకి ఇంకా ఆనందం. పెళ్లికి రెండు వారాల ముందే రాధిక పుట్టింటికి వచ్చింది.
అపర్ణ కూడా సవిత పెళ్ళి కోసం వెంటనే అమెరికా నుండి బాబుతో వచ్చింది. " అక్క అమాయకురాలు, ఎలా బతుకుతుందో" అనుకునేది అపర్ణ. ఇప్పుడు అక్కకి పెళ్లి నిశ్చయమై అమ్మానాన్నలకి దగ్గరగానే ఉంటుందంటే ఆమెకి ధైర్యం గా ఉంది.
పెళ్ళి షాపింగ్ కోసం సంజయ్ సవితని ,మిగతావాళ్ళని తీసుకుని వెళ్లేవాడు. తరచూ ఆఫీసు నుండి ఇంటికి వెళ్ళేటప్పుడు ఒకసారి సవిత దగ్గరకి వచ్చి వెళ్ళేవాడు. అప్పుడప్పుడు సవిత తో "అలా బయటికి వెళ్లివద్దాం " అని ఆమెని బయటికి తీసుకుని వెళ్ళేవాడు. ఆమెతో గడిపే సమయం సంజయ్ కి ఇట్టే గడిచిపోయేది.
సంజయ్ కి సవిత తల్లి తండ్రులతో మొదట ఎక్కువ పరిచయం లేక పెళ్లి కుదిరినప్పటి నుండి అత్తమ్మ, మామయ్య అని పిలవడం అలవాటయిపోయింది.
సవితకి ఆంటీ పిలుపు నుండి అత్తయ్య పిలుపు కి మారడం, ఆ పిలుపుని అలవాటు చేసుకోవడానికి కొంత టైమ్ పట్టింది.
పెళ్ళికి ముందే రాధిక అన్న తో "మీరిద్దరూ పెళ్ళి తరవాత కొన్నాళ్ళు తిరిగిరండి. నేను అమ్మని చూసుకుంటాను " అనిచెప్పి పెళ్లి తరవాత వాళ్ళిద్దరినీ హనీమూన్ కి పంపించింది.
No comments:
Post a Comment