Sunday, 3 November 2024

వివాహ బంధం

 ఆయనో కఠిన వ్యాపారస్తుడు.  లాభనష్టాల బేరీజులే ఆయన జీవితం.



ఆ అమ్మాయిది చాలా సున్నిత మనసు. ఎవరినీ నొప్పించని స్వభావం. ఎవరైనా ఒక మాటంటే తట్టుకోలేని  మనస్తత్వం.



కుటుంబం మంచిదని , అబ్బాయి  తల్లితండ్రులు వచ్చి మరీ అడిగారని తండ్రి  ఆ పెళ్లి చేసాడు. పెళ్ళి  ఐన గంట తర్వాత పెళ్లి కొడుకు ఇంట్లో  లేడు.  ఏవో వ్యాపార సమస్యలు. మూడు రోజుల తర్వాతే పెళ్ళి కొడుకుని చూసింది ఆ అమ్మాయి.



అత్తారింట్లో కూడా  అతని కోసం ఎవరూ ఎదురు చూసేవారు కాదు.



ఆ ఇద్దరి జంట మధు, లహరి. మధు కోసం  రోజూ వండాల్సిందే. ఇంటికి   భోజనానికి  వస్తాడో, రాడో ఆఖరి  వరకు  తెలియదు.



లహరికి ఈ పద్ధతి చాలా  వింతగా, బాధ గా కూడా  ఉండేది. తను అంటూ ఒక మనిషి ఉందనే విషయం కూడా అతను  పట్టించుకునేవాడు కాదు. ఎంతసేపూ  తన  వ్యాపారం, తన పనులు.


లహరి తననే అతని జీవం ‌విధానానికి  అనుగుణంగా మార్చుకోవాలనుకుంది. వంట చేయడానికి అన్నపూర్ణమ్మ ఉన్నా ఫలహారాలు,  వంటకాలు అన్నీ పూర్తయ్యేవరకూ తనే దగ్గరుండి అన్నీ చూసుకునేది. అత్తమామల ఆరోగ్యం  గురించి తనే శ్రద్ధ తీసుకొనేది. ఇంటికి  చుట్టాలు,  స్నేహితులు వస్తే  అత్తగారితో కలిసి అతిథి సత్కారాలు చేసేది.



తమ గదిని, ఇంటిని అలంకరించడం,


తోట పని మామగారితో కలిసి చేయించడం, మరిది ముకుంద్ తో కలిసి ఆటలాడటం ఆమె సరదాలు. ఇంట్లో  అందరితో కలిసి సమయం గడిపేది.



మధు మనస్తత్వాన్ని అర్ధం చేసుకోవడానికి లహరి ప్రయత్నించేది. అతను బిజీగా  ఉంటే  


సాయం చేయడానికి  యత్నించేది. కానీ మధు ఎవరి మీద కేకలేసినా తననే అన్నంతగా బాధపడి ఏమీ మాట్లాడేది కాదు.


వ్యాపారంలో  క్రమశిక్షణ,  కరుకుదనం ఇంటి సభ్యుల పట్ల, తన పట్ల  చూపితే లహరికి నచ్చేది కాదు. ఒకొక్కప్పుడు వ్యాపార తలనొప్పులతో ఎన్ని బాధలు పడుతున్నాడో అని లోలోపలే మధనపడేది.



క్రమంగా మధులో మార్పు రావడం మొదలయ్యింది. ఇంట్లో   కొంచెం ఎక్కువ సేపు గడపడం అలవాటు  చేసుకున్నాడు. తల్లితండ్రులతో, తమ్ముడితో కొంతసేపు గడపడం, కొంతసేపు  తోటలో గడపడం, వండినవి నచ్చితే బావున్నాయని చెప్పడం మధుకి అలవాటయింది. లహరి దారిలోకే తనూ వస్తున్నాడని మధుకి అర్ధమైంది.



మధు ఆఫీసులో అందరూ  గుసగుసలాడుకుంటున్నారు. వాళ్ళందరికీ అది ఎనిమిదో వింతగా ఉంది. బాస్ ఓ  పదిరోజులు  సెలవు పెడుతున్నారట.



మధు సెలవు పెట్టడం చాలా అరుదుగా జరిగే విషయం. పెళ్ళి  తరవాత తనకి హనీమూన్ లాటి సరదాలు లేకపోయినా  మొదటి సారి లహరి గురించి ఆలోచించి ఆమెని ఎక్కడికైనా తీసుకుని వెళ్ళాలని నిశ్చయించాడు మధు.



ఆమెతో కలిసి గడిపినప్పుడు ఎన్నో విషయాలు నేర్చుకునేవాడు మధు. కొన్నాళ్ళ తర్వాత లహరితో కలిసి  మధు అత్తవారింటికి కూడా వెళ్లివచ్చాడు.


లహరి మధుకి వ్యాపారం విషయంలో  సాయపడటానికి తాను కూడా  బిజినెస్ కోర్స్ చేసింది.


లహరి తనకి బిజినెస్ లో సాయపడగలదు కానీ తను లహరికి అన్ని విషయాలలో సాయపడలేడని అర్ధమయిపోయింది మధుకి





No comments:

Post a Comment