Sunday, 3 November 2024

అలవాటు

 ఇది నా ‌స్వీయ రచన

అలవాటు 


రాఘవయ్య కి ఏమీ  తోచడం లేదు ఇంటిదగ్గర. 

నిన్నటి  వరకు  ఆఫీసు, ఫైళ్ళు. ...అదే  ఆయన ప్రపంచం. పొద్దున్నే  పేపర్  పట్టుకుంటే రాజకీయ కుమ్ములాటలు,హత్యలు, మానభంగాలు. పావుగంట  అటూఇటూ ‌తిప్పి పక్కన  పడేసాడు. 

పోనీ, వంటలో శ్రీమతికి  సాయపడదామనుకుంటే,ఇంకా వంటింట్లో అడుగు పెట్టకముందే ఆయన తల్లి అనసూయమ్మ గారు ‌కోడలితో"నాకు  నువ్వే వండిపెట్టమ్మా.వాడు వండినది తిని  నాకు  జీర్ణం కాకపోతే కష్టం సుమీ "అనేసింది. 

పోనీ, అత్తగారు కోడలు అత్యుత్సాహంతో  చూసే ధారావాహికాలు చూద్దామనుకున్నా ,అలవాటు  లేక అల్లాడి పోయాడు

రాఘవయ్య సాయంత్రం తన భార్య  సుశీలతో"అలా  కాలనీలో  తిరిగి వద్దాం"అన్నాడు. ఆవిడ సరే  అని  బయలుదేరింది.

కాలనీలో  తారసపడ్డ వాళ్ళు సుశీలని పలకరించేవాళ్ళే.రాఘవయ్య కి ఎవరూ  తెలియదు. వాళ్ళు  మొక్కుబడిగా  ఆయనకి అభివాదం  చేసేవారు. 

అలా  ఐదురోజులు  గడిచాయి. శనివారం  సాయంత్రం  రాఘవయ్య  సుశీలతో "నేనలా బయటకి వెళ్ళొస్తా" అని చెప్పి గబగబా  రోడ్డెక్కాడు. 

మరికొంత సేపయ్యాక  రాఘవయ్య  పళ్ళు, స్వీట్ పాకెట్ తో  ఇంట్లో అడుగుపెట్టాడు. అనసూయమ్మ గారి కి,సుశీలకి ఏమీ  అర్థం  కాలేదు. 

రాఘవయ్య "సుశీలా మనిద్దరం రేపు  పొద్దున్న ఇక్కడకి దగ్గరలో వున్న అనాధ శరణాలయంకి వెళ్ళి కొంతసేపు  ఆ పిల్లలతో గడిపి వద్దాం.ఇది  మంచి అలవాటే గా" అన్నాడు నవ్వుతూ.

No comments:

Post a Comment