ఇది నా స్వీయ రచన
ప్రేమ పెళ్ళి
తన కొడుకు పెళ్ళికి వెంకట్రావు పెట్టిన మొదటి షరతు కట్నం. కొడుకు తో " అమ్మాయిని నువ్వు, మీఅమ్మ ఎంచుకోండి. అమ్మాయి మీకు నచ్చితే పెద్దవాళ్ళతో నేను మాట్లాడతా" అన్నాడు .
"నాన్నా, కట్నం తీసుకోవడం నేరం కదా " మెల్లగా అన్నాడు అభిరామ్.
"అందరూ కొడుకు పెళ్ళికి కట్నం తీసుకుంటారు. మాకు కట్నం వద్దని చెప్తే నీలో ఏదో లోపం ఉంది అని కూడా అనుకుంటారు" అన్నాడు వెంకట్రావు కొడుకుని భయపెడుతూ.
వెంకట్రావు భార్య సుగుణకి అసలే నోట్లో నాలుక లేదు. భర్త కి ఎదురు చెప్పే అలవాటు అసలు లేదు.
అభిరామ్ సురేఖని ఇష్టపడుతున్నాడు. సురేఖకి మరో చెల్లి, తమ్ముడు ఉన్నారు. వాళ్ళకి సొంత ఇల్లు కూడా లేదు.
సురేఖ డిగ్రీ పూర్తి చేసి ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నాది.
ఒకరోజు సురేఖ ఇంటర్వ్యూ కి బయలుదేరింది. అదే సమయానికి తల్లి ఆరోగ్యం బావోలేక బయలుదేరడం ఆలస్యమైంది. రోడ్డు మీదకి వచ్చేసరికి ఓ కారు కనిపించేసరికి సురేఖ కారు ఆపమని సౌంజ్ఞ చేసింది. కారు నడుపుతున్న అభిరామ్ కారు ఆపేడు.
సురేఖ " నాకు లిఫ్ట్ ఇవ్వగలరా? నేను ఒక ఇంటర్వ్యూ కి వెళ్ళాలి. "అని అడిగింది. అభిరామ్ " తప్పకుండా " అని ఆమె చెప్పిన ఆఫీసు కి తీసుకుని వెళ్లాడు.
సురేఖ ఇంటర్వ్యూ పూర్తిచేసి బయటికి వచ్చేసరికి అభిరామ్ ఆఫీసులోనే కూర్చుని ఉన్నాడు.
"ఈ కంపెనీ మా స్నేహితుడిదే. మీరు మీ ఇంటికి వెళ్ళిపోగలరు కదా" అన్నాడు అభిరామ్.
సురేఖ ఆ ఇంటర్వ్యూ లో ఎంపికయి ఆ ఆఫీసుకి వెళ్ళడం మొదలెట్టింది.
అభిరామ్ కూడా తన స్నేహితుడు కోరికపై తను చేస్తున్న ఉద్యోగం వదిలేసి, అదే ఆఫీసు లో చేరేడు.
అప్పటినుంచీ అభిరామ్ సురేఖని రోజూ చూస్తున్నాడు. ఆఫీసు లో అందరూ తనడానికి రోజూ ఓ ఐటెమ్ చేసి తెచ్చేది. ఎవరు పని పూర్తి చేయలేక ఇబ్బంది పడినా తను ఎంతోకొంత సాయం చేసేది. వారికి ధైర్యం చెప్పేది.
సురేఖ సెలవురోజున కోవెలకు వెళ్లింది. అదే కోవెలకు అభిరామ్ తల్లి, ఆమె చెల్లి వచ్చేరు. ఆవిడ దేవుడికి దండం పెట్టుకొని వచ్చి కూర్చుంటే ఆమెకి కళ్ళు తిరిగేయి. అక్కడే ఉన్న సురేఖ ఆవిడని వాళ్ళ ఇంటికి తీసుకుని వెళ్లడానికి సాయం చేసింది. వాళ్ళింటి పక్కనే ఉన్న డాక్టర్ వచ్చి చూసి ఫరవాలేదని చెప్పి పళ్ళరసం ఇమ్మన్నాడు.
వెంకట్రావుకి భార్య అంటే ప్రేమ. ఆమెకి ఏమయినా అవుతుందేమో అని ఆందోళన. తన భార్యని ఇంటికి తీసుకుని వచ్చిన సురేఖ అతనికి బాగా నచ్చింది. అభిరామ్ తల్లికి మరీ నచ్చింది.
అభిరామ్ స్నేహితుడు అశోక్. అతను సురేఖ బాస్ కూడా. అశోక్ లీలని ప్రేమిస్తున్నాడు. లీల అమెరికా వెళ్ళే ప్రయత్నంలో ఉంది.అశోక్ తో పెళ్ళయ్యాక అమెరికాలో సెటిల్ అవుదామని చెప్పింది.
అశోక్ ని,లీలని అభిరామ్ తన ఇంటికి రమ్మన్నాడు. సురేఖ ని కూడా వాళ్ళకి కంపెనీ ఇవ్వడానికి రమ్మన్నాడు. ముగ్గురూ అభిరామ్ వాళ్ళ ఇంటికి వచ్చేరు.
లీల అభిరామ్ వాళ్ళ ఇంట్లో ఉన్నంత సేపు ఫోన్ లో మాట్లాడుతూనే ఉంది. అందరికీ తన అమెరికా ప్రయాణం గురించి చెప్తూనే ఉంది.
సురేఖ ఒక స్వీట్, ఒక హాట్ తనే చేసి తెచ్చింది. అభిరామ్ వాళ్ళ అమ్మకి పనిలో సాయం చేస్తూనే ఉంది.
అశోక్ తాము త్వరలోనే పెళ్ళి చేసుకుని అమెరికా వెళ్ళి పోతామని చెప్పాడు. పెళ్ళి రిసెప్షన్ తన తండ్రి ఏర్పాటు చేస్తున్నాడు కాబట్టి ఆరోజు తప్పకుండా రమ్మని అభిరామ్ తల్లి తండ్రులకి చెప్పేడు.
లీల తండ్రి ఘనంగా పెళ్ళి చేయలేడని లీల ముందునుంచి రిజిష్టర్ పెళ్ళి అనిచెప్పి అశోక్ ని దానికే ఒప్పించింది.
వెంకట్రావు తన భార్యతో అశోక్ పెళ్ళికి వెళ్ళినప్పుడు సురేఖ అక్కడే ఉంది. అశోక్ తండ్రి వెంకట్రావుకి సురేఖని చూపిస్తూ "ఈ అమ్మాయినయితే ఎవరైనా ఎదురు కట్నం ఇచ్చి కోడలుగా తెచ్చుకోవచ్చు. మాకా ఛాన్స్ లేదు. ఉన్న ఒక్క కొడుక్కీ పెళ్ళయిపోయింది " అన్నాడు.
వెంకట్రావుకి సురేఖ ఎంత నచ్చినా ఆ అమ్మాయి కోడలుగా రావాలంటే కట్నం తేవాల్సిందే అనుకుంటున్నాడు.
సురేఖ తండ్రి సొంత ఇల్లు కూడా కనుక్కోలేక పోయాడు. ఆమె తల్లితండ్రులు ఒక్క సంతానం చాలనుకున్నారు. సురేఖ తల్లి మందుల మీదే బతుకుతోంది.
సురేఖ చిన్నాన్న డాక్టర్. అదే ఊరిలో ఉంటాడు. తరచూ వచ్చి తన వదినని తనిఖీ చేసి వెళుతుంటాడు.
సురేఖని వివాహం చేసుకుని ఉద్దేశ్యం తనకుందని అభిరామ్ సురేఖ తండ్రికి తెలియచేశాడు. సురేఖ తండ్రి తన తమ్ముడిని తీసుకొని అభిరామ్ వాళ్ళ ఇంటికి వెళ్ళేడు. వెంకట్రావు తన కొడుక్కి పది లక్షలైనా కట్నం ఇవ్వందే సురేఖని కోడలుగా అంగీకరించనని, కట్నం ఇవ్వని పక్షంలో మరో సంబంధం చూసుకోమని చెప్పేసాడు.
సురేఖ ఇంటికి వచ్చేక పెళ్ళి విషయమై వెంకట్రావు ఏమన్నాడో తన భార్యతో చెప్తుంటే సురేఖ వింది.
"నాన్నా, నువ్వు కట్నం ఇవ్వడం నేరం. కట్నం ఇచ్చి నాకు పెళ్లి చేయాలనుకోకు. అమ్మ ఆరోగ్యం మనకి ముఖ్యం. అమ్మని మనం జాగ్రత్తగా చూసుకోవాలి. మళ్ళీ ఈ ప్రస్తావన మనింట్లో తేకు" అంది సురేఖ.
వెంకట్రావుకి కొద్దిపాటి అనారోగ్యానికి కూడా భయం, కంగారు. ఒకరోజు అభిరామ్ ని ఆసుపత్రికి తీసుకుని వెళ్ళమన్నాడు.అభిరామ్ వెంకట్రావుని తీసుకువచ్చిన ఆసుపత్రిలో సురేఖ చిన్నాన్న పని చేస్తాడు. చాలా మంది రోగులు ఉండటం వల్ల వెంకట్రావు కొంతసేపు ఎదురు చూసేడు.
ఈలోగా సురేఖ పళ్ళబుట్టతో అక్కడికి వచ్చి అందరికీ పళ్ళు పంచిపెడుతోంది. తరచూ అలావచ్చి రోగులకి పళ్ళు ఇచ్చి వాళ్ళని పలకరించి వెళ్తుందట.
సురేఖ వాళ్ళ బాబాయిని కలిసి వాళ్ళ అమ్మ గురించి మాట్లాడి వెళ్ళిపోయింది.
సురేఖ వెళ్ళిపోయాక అక్కడ పనిచేసేవాళ్ళు "ఆ అమ్మాయి డాక్టర్ గారి బంధువు. వాళ్ళ అమ్మకి బాగుండాలని అందరికీ ఇలా పంచిపెడుతుంది. డాక్టర్ గారికి ఆ అమ్మాయి అంటే ఎంత ప్రేమో. తన కూతురిలాగే చూసుకుంటాడు" అనుకోవడం వెంకట్రావు విన్నాడు.
డాక్టర్ మందులు రాసి వాడమని చెప్పి పంపేసాడు.
వెంకట్రావుని రమ్మని ఓ రోజు అశోక్ తండ్రి కబురుచేశాడు. వెంకట్రావు అభిరామ్ తో కలిసి వాళ్ళ ఇంటికి వెళ్ళేడు.
ఆయన కుశలప్రశ్నలు అడిగి తరవాత "అభిరామ్ కి సురేఖని పెళ్లి చేసుకోవాలని ఉందని అశోక్ నాతో అన్నాడు. వాళ్లిద్దరి పెళ్లి మీరు ఎప్పుడు చేస్తారు? " అని అడిగాడు.
వెంకట్రావు "మీ దగ్గర దాచేదేముంది?వాళ్ళ నాన్న పెళ్లి మాటలకి నా దగ్గరకి వస్తే ముందు నేనడిగినంత కట్నం ఇస్తారా అని అడిగాను. వాళ్లేమీ మాట్లాడకుండా వెళ్ళిపోయారు" అన్నాడు.
అశోక్ తండ్రి "మీకింకా మీ అబ్బాయి మనసు, ఆ అమ్మాయి మనసు అర్ధం కాలేదా? వాళ్ళు పెళ్లయినా చేసుకోరేమో కానీ కట్నం ఇచ్చి పెళ్లి చేసుకోవాలని సురేఖ అనుకోదు. మీ అబ్బాయి కూడా అందుకు అంగీకరించడు. అభిరామ్ మరెవరినీ చేసుకోవడానికి కూడా ఒప్పుకోడు" అన్నాడు.
వెంకట్రావుకి అంతా అర్ధమయిపోయింది. ఇక సురేఖని "రావమ్మా మహలక్ష్మీ " అని తన ఇంటికి పిలవడమే మిగిలింది అనుకున్నాడు.
No comments:
Post a Comment