Friday, 1 November 2024

పోలిక

 ఇది నా స్వీయ ‌రచన 

పోలిక


  సమీర,ప్రభ మంచి స్నేహితులు. కాలేజీకి కలిసి వెళ్ళేవాళ్ళు.సమీర తల్లికి తన బంధువులలో మంచి సంబంధం చూసి కూతురుకి పెళ్లి చేయాలని ఉంటుంది. 

కానీ  ఆవిడకి సమీర కంటే సమీర అన్న దీపక్ అంటే  ఎక్కువ ప్రేమ. ఆవిడ దీపక్ ని ఎక్కువ గారం చేసి కొంత పాడు చేసింది. 

ప్రభ అన్న వికాస్ మెరైన్ ఇంజనీర్ గా పని చేస్తూ సెలవుల్లో ఇంటికి వచ్చేవాడు. 

సమీరకి పెళ్లి సంబంధాలు చూస్తున్నారని తెలిసినప్పటినుంచీ ప్రభకి సమీర తన వదిన అయితే బాగున్నన్న కోరిక ఎక్కువయింది.ప్రభ తనకి వీలయినప్పుడల్లా వారిద్దరినీ దగ్గర చేయడానికే ప్రయత్నించేది.

ఈలోగానే ప్రభకి పెళ్లి కుదిరి అత్తవారింటికి వెళ్ళిపోయింది.కానీ వెళ్ళేముందు  వాళ్ళిద్దరికీ తన మనసులో మాట తెలియచేసి వాళ్లిద్దరినీ మానసికంగా మరింత దగ్గరచేసింది.

ప్రభ తన తల్లితండ్రులతో కూడా సమీరని కోడలుని చేసుకోమని చెప్పింది.కానీ సమీర తల్లికి కులాంతర వివాహం ఇష్టం లేదు.

సమీర తన తండ్రికి వికాస్ గురించి తెలియచేసి తమ పెళ్లికి అంగీకరించమని కోరింది . సమీర తండ్రి పెళ్లికి ఒప్పుకున్నాడు .సమీర తల్లికి ఎంత మాత్రం ఇష్టం లేకపోయినా 

సమీర, వికాస్ ల పెళ్లి రిజిస్టర్ ఆఫీసులో అయిపోయి ఆమె అత్తమామలు  సమీరని తమ ఇంటికి తీసుకొని వెళ్ళిపోయారు.

వికాస్ తన పనిమీద వెళ్ళిపోయాక సమీర ఉద్యోగం లో చేరుతుంది. 

సమీర తనని తాతని చేయబోతోందని తెలిసి సమీర తండ్రి ఆనందం అంతా ఇంతా కాదు.సమీర తల్లికి కూతురి మీద కోపం ఇంకా తగ్గలేదు. 

సమీర గర్భిణీ గా ఉన్నప్పుడు అత్తగారే కన్నతల్లి లా ఆమెని  చూసుకుంది. సమీరకి  సుఖప్రసవమై పాప పుట్టింది. పాప పుట్టాక ప్రభ కూడా వచ్చి

మేనకోడల్ని చూసి వెళ్ళింది. 

 ఓ సంవత్సరం గడిచి పోయింది.సమీర మేనమామ కూతురు పెళ్లికి మేనమామ స్వయంగా వచ్చి మేనకోడలిని పెళ్లికి పిలుపు చేసి వెళ్ళాడు. ఆ సమయంలో  వికాస్ కూడా సెలవుమీద ఇంట్లో  ఉన్నాడు. 

పెళ్లికి  సమీర, వికాస్ పాప అమూల్యని తీసుకుని వెళ్ళారు.పెళ్లికి  సమీర తల్లితండ్రులు  వచ్చేరు.పెళ్లిలో సమీర  తల్లి వైపు వారందరూ అమూల్య  ముమ్మూర్తులా వాళ్ల అమ్మమ్మ పోలిక అనడమే.సమీర తల్లి ఇది విని చాలా  సంబరపడి పోయింది తన పోలిక,తన‌ అందం మనవరాలికొచ్చిందని.కూతురు  చూడకుండా  మనవరాలితో కొంత సేపు  ఆడేసుకుంది కూడా. దూరం నుంచి అదంతా చూస్తున్న వికాస్ అత్తగారికి తెలియకుండా తన కెమెరాలో ఆ దృశ్యం బంధించేడు.

ఇంటి కొచ్చాక సమీర తల్లి తన భర్త తో  "చేసినదంతా మీ కూతురు చేసింది. మన మనవరాలేం చేసింది ? అది మహా చురుగ్గా ఉంది. దానికి అన్నీ నా  పోలికలే. రేపే మీరు  వాళ్ళింటికి వెళ్లి  పాపనొకసారి మనింటికి తీసుకురండి "అని భర్తకి ఆర్డర్ వేసింది.

No comments:

Post a Comment