ఇది నా స్వీయ రచన
మాతృత్వం
అవినాష్ కి వివాహ వ్యవస్థ మీద నమ్మకం లేదు. ఏ స్త్రీని తన జీవితంలోకి ఆహ్వానించే ఉద్దేశ్యం లేదు. కానీ అతనికి తండ్రి కావాలని ఉంది. అతని తండ్రికి వంశోధ్ధారకుడు మనవడిగా తన ఆస్తికి వారసుడిగా కావాలని ఉంది.
అనితది కుటుంబాన్ని పోషించవలసిన పరిస్థితి. తల్లితండ్రుల ఆరోగ్యం, చెల్లికి ఉన్న క్రీడాసక్తి వల్ల ఆమెకి మంచి కోచింగ్ ఇప్పించడం ఆమె ప్రాధాన్యతలు.
అనితకి ఒక స్నేహితురాలి ద్వారా అవినాష్ తన బిడ్డకి సరోగసీ తల్లి అయ్యే అమ్మాయి కోసం వెతుకుతున్నాడని తెలిసి, ఆమె అలా తల్లి కావడానికి సంసిద్ధురాలయింది
అనిత అవినాష్ తో ఫోన్ లో మాట్లాడి తన అంగీకారాన్ని తెలిపింది. అవినాష్ ఆమెని ఓ ఆసుపత్రికి తీసుకొని వెళ్ళాడు.
ఆ డాక్టర్ ని అవినాష్ అక్కా అని పిలుస్తున్నాడు.
డాక్టరు ప్రభ ఆమెకి అన్ని పరీక్షలు జరిపి ఆసుపత్రిలోనే వారం రోజులు ఉంది. తర్వాత ఆమెని అవినాష్ బంగళాలోనే ఒక గదిలో ఉంచారు. డెలివరీ అయిందాక ఆమె అక్కడే ఉండాలని చెప్పారు.
అవినాష్, అవినాష్ తండ్రి సుగుణాకర రావు రోజూ ఏదో ఒక టైం లో వచ్చి అనితని చూసి వెళ్ళేవారు. డాక్టరు ప్రభ కూడా వచ్చి చూసి వెళ్తుండేది.
అనిత తన చెల్లికి, తల్లి తండ్రులకి తనకో ఉద్యోగం దొరికిందని ఒక ఏడాది వాళ్లకి దూరంగా ఉండాలని చెప్పింది. డబ్బులు మాత్రం క్రమం తప్పకుండా పంపేది.
అనిత పండంటి ఆడపిల్లకి తల్లి అయింది. అవినాష్ తాను తండ్రి అయినందుకు, సుగుణాకరరావు మనవరాలు పుట్టినందుకు చాలా సంతోషించారు. అనిత ఆనందం ఇక చెప్పనక్కర్లేదు. పాప ఆరోగ్యంగా ఉందేమో ఇంకా ముద్దుగా ఉంది.
పాపని అందరూ చూడటానికి వస్తే పాప ఆరోగ్యం పాడవుతుందని వాళ్లు ఎవరినీ పాప గదిలో అడుగు పెట్టనివ్వలేదు.
పాపకి శృతి అవి పేరు పెట్టేడు అవినాష్. పాపకి తల్లి పాలే మంచివి కాబట్టి అనిత మరికొన్ని రోజులు పాప దగ్గర ఉండాలన్నాడు సుగుణాకర రావు .
అనిత పాప దగ్గర మరి కొన్నాళ్ళు ఉండటానికి అవినాష్ అంగీకరించేడు. శృతితో తాను మరికొన్నాళ్ళు ఉండొచ్చని అనిత చాలా సంతోషించింది. శృతిని అనిత చాలా అపురూపంగా, జాగ్రత్తగా చూసుకునేది.
అవినాష్ శృతిని తోటలోకి , బయటకి తీసుకుని వెళ్ళేవాడు. అనిత కూడా తోటలో తిరిగేది. సుగుణాకర రావు ఒక గది లో గ్రంధాలయం ఏర్పాటు చేసుకున్నాడు. అనిత అక్కడ నుండి పుస్తకాలు తెచ్చి చదివేది.
శృతి ఏడాది పుట్టిన రోజు తరవాత అనిత తల్లి తండ్రుల దగ్గరకి వెళ్ళిపోయింది.
శృతికి మూడు సంవత్సరాలు నిండేయి.
అవినాష్ తన కంపెనీ పనిలో బిజీగా ఉంటే, సుగుణాకర రావు ఆయా సాయం తో మనవరాలిని తనే చూసుకునేవాడు.
శృతి సుగుణాకర రావు దగ్గర కూర్చుని ఆల్బం చూస్తోంది. ఆల్బం లో తనని ఎత్తు కున్న ఆవిడ శృతికి బాగా నచ్చింది.
"ఎవరిది " అని తాతని అడిగింది.
"మీ అమ్మ" అన్నాడు సుగుణాకర రావు.
"మరి ఇక్కడ ఎందుకు లేదు "
"వాళ్ళ అమ్మానాన్నల దగ్గరకి వెళ్ళింది
"మరి ఎప్పుడు వస్తుంది? "
"రమ్మందాం లే" అన్నాడు శృతి వాళ్ళ తాత.
శృతి వాళ్ళ నాన్నతో కూడా "అమ్మని రమ్మను" అని చెప్పింది.
ఒకరోజు సుగుణాకర రావు అనితకి ఫోన్ చేసి "శృతి నిన్ను రమ్మంటోంది " అని
చెప్పాడు.
"నేను రేపే వస్తాను " అని చెప్పి ఫోను పెట్టేసింది అనిత.
అనిత రెండేళ్ళ తర్వాత శృతిని చూసింది. పాప బాగా తెలిసిన వాళ్ల దగ్గరకి వెళ్ళినట్టు శృతి అనిత దగ్గరకి వచ్చేసింది.
ఆరోజంతా అనిత శృతితో గడిపింది. కానీ
మర్నాడు శృతి తో "నేను అక్కడ చిన్న పిల్లలని చూసుకోవాలి. వాళ్లు నేను లేకపోతే ఏడుస్తారు " అని చెప్పి వెళ్ళిపోయింది.
శృతి తరచుగా వాళ్ల నాన్నని, తాత గురించి అడుగడం మొదలెట్టింది.
సుగుణాకర రావు అవినాష్ కి ఓ సహా
ఇచ్చాడు.
"అనిత కి మన కంపెనీలో ఉద్యోగం ఇవ్వు. మన తోటలో ఉన్న గెస్ట్ హౌస్ లో ఆమె ఉండనీ. అలా అయితే శృతి అప్పుడప్పుడూ చూడొచ్చు "
అవినాష్ దానికి ఒప్పుకున్నాడు.
అనిత అవినాష్ కంపెనీలో చేరింది.
అనిత సాయంత్రం కాలేజీలో పి.జి. చేస్తోంది.
అవినాష్ కి శృతి ఒంటరిగా ఫీలవుతోందేమో,మరో చెల్లో తమ్ముడో ఉంటే అమ్మ ధ్యాస ఉండేదేమో అనిపించింది.
ఒకరోజు అనిత తో" శృతికి మరో చెల్లి గానీ తమ్ముడు గానీ ఉంటే బాగుంటుంది కదా " అన్నాడు.
"బాగానే ఉంటుంది "
"మరోసారి నాకో పాప కావాలంటే నువ్వు అంగీకరిస్తావా"
"ఒప్పుకుంటాను. కానీ రెండు షరతులు."
"ఏంటవి"
"నా రెండో బిడ్డ ని నా భర్త కోసమే కనాలనుకుంటున్నా. నా రెండో ప్రసవ సమయానికైనా మా అమ్మ నా పక్కన ఉండాలనుకుంటున్నా."
"నీ రెండో బిడ్డ నాకు కావాలంటే మన పెళ్ళి ముందు జరగాలన్నమాట. నా నియమాన్ని పక్కన పెట్టి మన పెళ్ళి విషయం నాన్న తో మాట్లాడుతా" అన్నాడు అవినాష్.
No comments:
Post a Comment