Friday, 1 November 2024

రాఖీ

 ఇది నా స్వీయ రచన 

రాఖీ  


శ్రావణపున్నమి రాఖీ పండగ.అక్క  చెల్లెళ్ళు అన్నదమ్ములకు రాఖీ కడతారు.  ఆరోజు 

సోనీ,ఆనంది రాగిణికి  రాఖీ కడుతుంటారు.రాగిణివే తమని ఎల్లవేళలా రక్షించగలదని వాళ్ళు ఇద్దరూ   నమ్మేవాళ్ళు . 

రాగిణి, సోనీ,ఆనంది ముగ్గురూ చిన్నప్పటి నుండి కలిసిమెలిసి తిరిగేరు.చిన్నప్పుడు ఆనంది ఒకసారి  సైకిల్ తొక్కుతూ కింద పడిపోయి రక్తమోడుతుంటే రాగిణి ఆనందిని తన సైకిల్  మీద  ముందుకు కూర్చోబెట్టుకుని వెంటనే ఆసుపత్రికి తీసుకొని వెళ్ళి చికిత్స చేయించింది. 

ఒకసారి  సోనీ స్విమ్మింగ్ పూల్ లో ఈత కొట్టలేక మునిగిపోతుంటే 

రాగిణి  చూసి వెంటనే దూకి ఆమెని ఒడ్డుకి తీసుకువచ్చి కాపాడింది. 

రాగిణిని చిన్నప్పుడే వాళ్ళ చిన్నాన్న వాళ్ల ఊరు నుండి తను పని చేస్తున్న ఊరికి తీసుకెళ్ళి ఆమెకి చదువుతో పాటు, శారీరకంగా దృఢంగా, మానసికంగా బలంగా ఉండటానికి కావలసిన శిక్షణ అంతా ఇప్పించాడు.ఆడపిల్లలకు స్వీయ రక్షణ చాలా అవసరం అని అతను భావించేవాడు.

చదువుకునే రోజుల్లో సోనీ నృత్యం, అభినయం మీద ధ్యాస పెడితే, ఆనంది సామాజిక స్పృహ తో కూడిన  వ్యాసాలు రాయడం మీద మక్కువ చూపించేది. రాగిణి తన చిన్నాన్నని తన గురువుగనే తలచేది. తన స్నేహితురాళ్ళకి కూడా తీరిక వేళల్లో స్వీయ రక్షణ లో  శిక్షణ ఇచ్చేది.


సోనీకి తను గొప్ప నటి కావాలని కోరిక.ఆనందికి పాత్రికేయురాలిగ మునుముందుకు దూసుకుపోవాలని ఆకాంక్ష. రాగిణికి అమ్మాయిలని శారీరకంగా దృఢంగా,బలోపేతులని చేయాలన్న తపన.

రాగిణి తన స్నేహితురాళ్ళని ఎన్నోసార్లు అల్లరిమూకలనుండి కాపాడింది. కాలేజీ రోజుల్లో ఆకతాయి కుర్రాళ్ళు ఎవరి వెంటపడి అల్లరి చేసినా వాళ్ల ఒళ్ళు హూనం చేసేది  రాగిణి.కాలేజీలో  కుర్రాళ్ళు  

 సోనీ వెంటబడి సతాయిస్తే రాగిణి  వాళ్లకి గట్టిగా వార్నింగ్ ఇచ్చి మళ్ళీ తిరిగి చూడటానికి భయపడేలా చేసేది.

తన స్నేహితురాళ్ళనే కాదు,ఆపదలో ఎవరున్నారని తెలిసినా తన శిష్య బృందంతో రంగంలోకి దిగిపోయేది. ఆ దుర్మార్గులని పోలీసులకి అప్పగించేవరకు పూర్తి బాధ్యత  తనే తీసుకునేది . 

రాగిణికున్న ధైర్య సాహసాలకి అబ్బురపడి పోలీసులు ఆమె అడగ్గానే ఆమెకి సాయపడేవారు..

సోనీకి  తండ్రికి ఒక దర్శకుడు స్నేహితుడు  కావడం వల్ల అతని ద్వారా  సోనీకి  ఒక సినిమాలో 

అవకాశం దొరికింది.ఆ తరువాత వెంటవెంటనే అవకాశాలు లభించాయి కాని తనను  తాను మానవ మృగాల నుండి  రక్షించుకోవడమే ఒక పెద్ద  సమస్యగా మారింది. సోనీ ఒకొక్కప్పుడు షూటింగ్ కి వెళ్ళినపుడు  రాగిణిని కూడా  తనతోనే ఉండమనేది.


ఆనంది చాలా ధైర్యవంతురాలు. కానీ,నిజాన్ని అందరికీ తెలియచేసేవారికి చాలా మంది శత్రువులు ఉంటారు. ఆనందికి శత్రువులు ఎక్కువే.అందుకు రాగిణి ఆనంది రక్షణ కోసం ఎన్నో ఏర్పాట్లు చేస్తూ ఉండేది. 

ముగ్గురు స్నేహితురాళ్ళు కలిసి ఒక చోటే ఉండేవారు. రాగిణికి ఎవరూ లేరు.రాగిణి వాళ్ల చిన్నాన్న వాళ్ల సొంత ఊరికి వెళ్ళిపోయాడు.   సోనీ,ఆనంది వాళ్ళ తల్లితండ్రులకి ముగ్గురూ ఒక చోట ఉండటం బాగా నచ్చింది. ఒకరికొకరు తోడుగా ఉండటమే మంచిదని వాళ్ళు భావించేవారు  

 ‌చేసుకుంటూ హాయిగా   గడిపేవారు  .  శ్రావణపున్నమి నాడు సోనీ, ఆనంది, రాగిణికి రాఖీ కట్టేవారు .రాగిణి"ఇది మన స్నేహ బంధానికి ప్రతీకగా కూడా నేను  భావిస్తాను "అని  వాళ్ళతో అనేది.  

.

సోనీకి చాలా మంది అభిమానులు ఉన్నారు.ఒక అభిమాన సంఘం కూడా ఉంది. ఆమె నవరసాలు బాగా పోషిస్తుందని మంచి పేరు కూడా తెచ్చుకుంది.ఒక సినిమాలో  ఆమె నటనకి జాతీయ పురస్కారం కూడా ఆమెని వరించింది. 

సోనీకి తమ రక్తంతో ఉత్తరాలు రాసే వీరాభిమానులు కూడా ఉన్నారు.రాగిణి సోనీ తరఫున వాళ్ళకి " ఇంత పిచ్చిప్రేమ చూపించకండి.మీ జీవితాన్ని  నాశనం చేసుకోకండి "అని  సమాధానం రాసేది 

ఆనంది ఎక్కువగా పరిశోధనాత్మక  ఆర్టికల్స్  రాసేది. రాజకీయ కుంభకోణాలు, ప్రభుత్వ కార్యాలయాల్లో అవినీతి,బాలికలు, అమ్మాయిలపట్ల అత్యాచారాలు 

ఇలా ఎన్నో ప్రజల దృష్టికి ఆనంది తీసుకువచ్చేది. నిజాన్ని నిక్కచ్చిగా, నిర్భయంగా ప్రజలముందుకి తీసుకొచ్చి ఆనంది మంచి పేరు తెచ్చుకుంది.


సోనీ  తనతో కలిసి  మూడు సినిమాల్లో నటించిన తుషార్ ని

తన పట్ల అతనికున్న ప్రేమని,తన స్నేహితులంటే ఉన్న అభిమానాన్ని  చూసాక, పెళ్ళి చేసుకుందామన్న అతని ప్రతిపాదనని ఆమోదించింది.వాళ్ల  పెళ్లి దగ్గర బంధువులు  ,స్నేహితుల సమక్షంలో నిరాడంబరంగా జరిగింది.  పెళ్ళయ్యాక   సోనీ, తుషార్  వాళ్ళు కొనుక్కున్న ఇంటికి వెళ్లిపోయారు. 


మరి కొన్నాళ్ళకే  సోనీ అన్నయ్య, వదిన ,వాళ్ళ పిల్లలతో సహా సోనీ

ఇంటికి వచ్చి అక్కడే ఉండిపోయారు. సోనీ అన్న ఆమె  ఆర్ధిక వ్యవహారాలలో జోక్యం చేసుకోవడం మొదలుపెట్టాడు . సోనీకి  ఇది  ఎంతమాత్రం నచ్చక ఆనందితో బాగా చదువుకున్న అమ్మాయిని ఎవరినైనా తన వద్దకు పంపమంది.ఆమె  వచ్చాక సోనీ వాళ్ళ అన్నయ్య ఆటలు సాగక తన కుటుంబంతో సహా తిరిగి వాళ్ల ఊరికి  వెళ్ళిపోయాడు . 

  

ఆనంది  ఆకాశ్ ఇద్దరూ చాలా కాలం కలిసి పని చేసేరు. ఆకాశ్ ఎప్పుడూ ఆనంది పనిని మెచ్చుకునేవాడు.

ఆనందితో తన జీవితాన్ని పంచుకోవాలనుకుంటున్నానని ఆకాశ్ రాగిణికే ముందు చెప్పేడు. రాగిణి ఈ విషయం ఆనందికి చెప్పి ఆకాశ్ ని పెళ్లి చేసుకోమని సలహా ఇచ్చింది. 

మరి కొన్నాళ్ళకు ఆనంది,ఆకాశ్ ల పెళ్లి జరిగిపోయింది .పెళ్ళికి సోనీ, తుషార్ కూడా హాజరయ్యారు . 

కొద్ది కాలానికే సోనీ తల్లి కాబోతోందని తెలిసి రాగిణి,ఆనంది  ఎంతో సంతోషించారు .తుషార్ తను చేస్తున్న సినిమాలతో  బిజీగా ఉండటం వల్ల  రాగిణి సోనీ దగ్గరే ఉండిపోయి ఆమెని జాగ్రత్తగా చూసుకునేది.

సోనీకి బాబు పుట్టాక రాగిణికి తీరిక లేకుండా  పోయింది. బాబు రాగిణికి ఎక్కువ చేరికయ్యాడు.

ఈలోగా ఆనంది కూడా శుభవార్త చెప్పింది , తానూ తల్లిని కాబోతున్నానని.ఆనంది కొన్నాళ్ళు పూర్తి విశ్రాంతి  తీసుకో వలసి వచ్చింది.ఆనంది సగంలో ఆపిన పనులను ఆకాశ్ కొనసాగించవలసివచ్చి ఆనంది తో  ఎక్కువ సమయం గడపలేకపోయేవాడు. రాగిణి  ఆనంది  దగ్గరకి వచ్చి అక్కడే  ఉండిపోయింది . ఆనందిని రాగిణివే చెకప్ కి   తీసుకొని వెళ్ళేది. ఆనంది పాపని ప్రసవించాక తల్లీపిల్లల ఆరోగ్యం గురించి రాగిణి అన్ని జాగ్రత్తలూ

తీసుకుంది . 

కొన్నాళ్ళయ్యాక   రాగిణి  తన‌ ఇంటికి వచ్చేసినా  బాబుని, పాపని చూడడానికి సోనీ, ఆనంది   వాళ్ల ఇళ్ళకి వెళ్ళి పిల్లలతో  కొంతసేపు ఆడుకుని వచ్చేది. 

 ఒక రోజు రాగిణి ఒక అబ్బాయి ‌ఓ అమ్మాయి వెంటపడి వేధిస్తుండటం చూసి ఆ అబ్బాయి కి గట్టిగా బుద్ధి చెప్పింది . ఆ  తరువాత కూడా ఆ ఆమ్మాయి చాలా భయపడుతుండటం చూసి  తనే దగ్గరుండి వాళ్ళింటికి  తీసుకొని వెళ్ళింది. ఆ అమ్మాయి పేరు సరళ. జరిగింది తెలుసుకుని  సరళ అన్నయ్య  స్వరూప్,వాళ్ల  అమ్మ రాగిణికి ధన్యవాదాలు చెప్పి ఎంతో మర్యాదగా మాట్లాడారు. వాళ్ళందరికీ రాగిణి  బాగా నచ్చడం తో,రాగిణికి ఆ ఇంటితో బంధం ఏర్పడింది . 

రానురాను స్వరూప్ రాగిణిని చాలా  ఇష్టపడసాగాడు . ఆమె వ్యక్తిత్వం, నిరాడంబరత, ఆత్మీయత అన్నీ స్వరూప్ ని ఆకట్టుకున్నాయి. స్వరూప్  రాగిణిని  పెళ్లి చేసుకుంటానంటే రాగిణి  ఒప్పుకుంది .

రాగిణి పెళ్లికి అంగీకరించిందంటే సోనీ, ఆనందిల ఆనందం అంతా ఇంతా కాదు. 

రాగిణి  సోనీని, ఆనందిని  స్వరూప్ కి పెళ్లికి ముందు  పరిచయం చేసి తమ మధ్య  స్నేహం గురించి చెప్పింది . పెళ్ళయ్యాక   రాగిణి అత్తవారింట్లోనే ఉండేది .ఆమె  అమ్మాయిలకి స్వీయరక్షణ శిక్షణ ఇవ్వడం పెళ్ళి తరువాత కూడా  కొనసాగించింది.  

సోనీ తన కొడుకు రాజా కొంచెం  పెద్దయ్యాక, మళ్ళీ సినిమాల్లో నటించడం కొనసాగించింది. ఈసారి నాయిక పాత్రలే కాకుండా తనకి నచ్చిన పాత్రలన్నీ చేయడం మొదలెట్టింది.

ఆనంది మళ్ళీ తన కలానికి పదును పెట్టింది . ఆనంది కూతురు అమూల్య.రాజా, అమూల్య రాగిణిని ఎక్కువ ఇష్టపడేవారు. వాళ్ల తల్లితండ్రులు  

బిజీగా ఉండటం వల్ల తరుచు రాగిణి దగ్గరకు వచ్చేసేవారు. 

ఓరోజు  అమూల్య రాగిణి దగ్గర ఉన్నప్పుడు ఆనంది,ఆకాశ్ ల మీద ఎవరో దాడిచేసి, ఇంట్లో ఉన్న విలువైన వస్తువుల్ని కూడా ధ్వంసం చేసారు.ఆనంది అనుమానమున్న వారిపై పోలీసులకి  ఫిర్యాదు కూడా  చేసింది. 

రాగిణి కూడా తనకి తెలిసిన పోలీసులతో మాట్లాడింది.తన శిష్య బృందంతో వాళ్ళిద్దరికీ ఓ రక్షణ కవచాన్ని ఏర్పరచి ,అమూల్య రక్షణ కోసం ఆ పాపని తన ఇంటికి తీసుకొని వెళ్ళిపోయింది. 


రాగిణి దగ్గరకి వచ్చే అమ్మాయిలు, ఆమెని ఆక్కా అని పిలవడంతో వాళ్లు కూడా ఆమెని అలాగే పిలిచేవారు . రాగిణి  సోనీతో,ఆనందితో "నాకు పిల్లలు ఇక అవసరం లేదు. వీళ్ళిద్దరే నాకు పిల్లలు .వీళ్ళిద్దరూ పుట్టినప్పుడు నేనే వాళ్లని చూసుకున్నా . నేనే వాళ్ళని పెంచా. వాళ్ళకి కూడా నేనంటే ప్రేమ" అనేది.

రాజా, అమూల్య వాళ్ళ అమ్మలతో " అక్కకి మీరు రాఖీ ,కడుతుంటారు కదా. మేము కూడా అక్కకి రాఖీ కడతాం.మమ్మల్ని కూడా అక్క బాగా చూసుకుంటుంది"అని వాళ్ళు కూడ రాఖీ కట్టడం మొదలెట్టారు .

No comments:

Post a Comment