Tuesday, 5 November 2024

చిన్నారి పెళ్లికూతురు

 

చిన్నారి పెళ్లికూతురు

ఆ రోజుల్లో  అది తప్పు కాదు.  నేరమూ కాదు. ఏడేళ్ళ  తన కూతురిని తన స్నేహితుడి కొడుకుకి  ఇచ్చి  పెళ్లి  చేసాడు  రామమూర్తి.
అమ్మాయి గౌరి. అబ్బాయి శివప్రసాద్.
శివప్రసాద్ కి అప్పటికి  పది ఏళ్ళు. 
రామమూర్తి  ఉపాధ్యాయుడు. కవి పండితుడు  కూడా.
గౌరి అత్తవారిల్లు పుట్టింటికి దగ్గరలోనే ఉండేది. పదమూడేళ్ళ వరకు  పూజలకు, పండగలకి అత్తవారింటికి వెళ్ళేది తప్ప  ఎప్పుడూ పుట్టింట్లోనే ఉండి వాళ్ల నాన్నతో కలిసి బడికి  వెళ్ళేది.
శివప్రసాద్ కి చదువు మీద కంటే తాత చేయించే వ్యవసాయం మీద దృష్టి  ఎక్కువ ఉండేది. సెలవులిస్తే చాలు తాత దగ్గరకి వెళ్ళిపోయేవాడు.
గౌరి బాగా చదువుకుంటుందని శివప్రసాద్  నాయనమ్మ కి చాలా ముచ్చటగా ఉండేది. ఆ అమ్మాయిని ఎలాగైనా పెద్ద చదువులు చదివించాలని ఆవిడ  కోరిక.
వాళ్ళింట్లో  ఆవిడ  మాటే వేదవాక్కు.
శివప్రసాద్ నాయనమ్మ  పేరు లక్ష్మీ దేవి. ఆవిడ మాటకి ఇంట్లోనే కాదు  ఊళ్ళో కూడా అందరూ విలువిస్తారు.
ఆ ఊర్లో  చదువు అయిపోయాక పెద్ద చదువులకి గౌరి  పట్నం  వెళ్ళాలి. లక్ష్మీదేవి తను పట్నం లో ఉండి  గౌరిని చదివిస్తానని చెప్పింది. మనవడు వ్యవసాయం చేస్తునన్నా గౌరి పెద్ద చదువులు చదువుతానన్నా ఆవిడకి తప్పేమీ కనిపించలేదు. పెద్దవాళ్ళు దగ్గరుండి పిల్లలని సరైన తోవలో నడపాలి అనుకునేది.
పట్నం లో గౌరితో పాటు ఉండడానికి వెళ్ళేటప్పుడు లక్ష్మీ దేవి  రాముడు అనే కుర్రాడిని, వాడి భార్య నీలిని కూడా తన తో తీసుకెళ్ళింది.
గౌరి డాక్టరు చదువులో చేరింది. శివప్రసాద్ అప్పుడప్పుడు పట్నం వచ్చేవాడు. తన భార్య ప్రాణం పోసే చదువు చదువుతోందని శివప్రసాద్ చాలా  ఆనందించేవాడు.
లక్ష్మీదేవి గౌరి చదువు కోసం అవసరమైతే  కొంత పొలం అమ్మమని, తన బంగారం కూడా అమ్మమని భర్తకి, కొడుకుకి చెప్పింది.

లక్ష్మీ దేవిని  గౌరి అమ్మమ్మా అని పిలిచేది. లక్ష్మీ దేవి  గౌరికి ఏ పనీ  చెప్పేవారు కాదు.

గౌరి మంచి మార్కులు తెచ్చుకుని  తన చదువు పూర్తి చేసింది. లక్ష్మీ దేవి వాళ్ల ఊరిలోనే ఆసుపత్రి ఏర్పాటు చేయాలని  తన భర్తతో చెప్పింది. శివప్రసాద్ ఆ ఊరిలోనే వ్యవసాయం  చేస్తున్నాడు.

ఆసుపత్రి నిర్మాణం అయ్యాక  గౌరి ,ఆమెతో పాటు చదివిన శ్రీనాధ్  రోగులని చూసేవారు. ఇంతలో గౌరి  గర్భవతి  అయింది. ఇంట్లో  అందరి సంతోషం  అంతా ఇంతా కాదు. ఆమె పురిటికి పుట్టింటికి వెళ్ళినపుడు ఆమె ‌స్నేహితురాలు  సీత  ఆసుపత్రి లో పని  చేయడానికి వచ్చింది.
గౌరికి సుఖ ప్రసవమై పాప పుట్టింది.
గౌరికి లక్ష్మీ దేవి అంటే ఉన్న  గౌరవం, ప్రేమ తో తన కూతురికి లక్ష్మి ‌అని పేరు  పెడుతుంది.

గౌరి లక్ష్మి ని తీసుకొని పుట్టింటి నుండి  మూడో నెల లో  శివప్రసాద్ వాళ్ల ఊరికి వచ్చింది. లక్ష్మీ దేవి పాపని పనివాళ్ళ సాయం తో చూసుకునేది. గౌరి  అత్తగారు, మామగారు కూడా ఆయన ఉద్యోగ పదవీ విరమణ అయిపోయాక అక్కడికే వచ్చేసారు. దూరపు బంధువు ఒకామె వీళ్ళతోనే ఉండి వంటచేసి పెట్టేది.
గౌరి మళ్ళీ  ఆసుపత్రికి వెళ్ళడం మొదలెట్టింది. శ్రీనాధ్, సీత  వివాహం చేసుకుని అదే ఆసుపత్రి లోనే  పనిచేస్తూ అక్కడే ఉండిపోయారు.
ఒకసారి  లక్ష్మీ దేవి భర్తకి తీవ్రంగా గుండెనొప్పి వచ్చింది. గౌరి వాళ్ల ఆసుపత్రి లో ముందు వైద్యం చేసి తరవాత పట్నం తీసుకెళ్ళి పూర్తిగా నయం అయినంత వరకూ తను కూడా అక్కడే ఉంది.
గౌరి ఇంటికి  వచ్చాక లక్ష్మీ దేవి గౌరితో " నేను నువ్వు  చదువుకోవడానికి సాయం మాత్రమే చేసేను. నువ్వు నాకు  భర్తని బతికించి తెచ్చి ఇచ్చేవు" అంది ఆనందంతో కన్నీళ్లు పెట్టుకుంటూ.

గౌరి శివప్రసాద్ తాతని బతికించగలిగింది కానీ లక్ష్మీదేవి గుండెని ఆ విషయం ఎంత గాయపరచిందో తెలియదు కానీ ఆరునెలలు తిరగకుండా ఆమె కనుమూసింది.  ఆ బెంగతో శివప్రసాద్ తాత కూడా  కొద్ది కాలానికే  పోయారు.
శివప్రసాద్ కి రాజకీయాలంటే  ఆసక్తి.  ఆ జిల్లాలో  అతనికి  మంచి పేరు ఉంది.

గౌరి లక్ష్మీ దేవి పేరు మీద  ఒక బాలికా విద్యాలయం కట్టించమని శివప్రసాద్ కి చెప్పింది. శివప్రసాద్  తన రాజకీయ పలుకుబడి ఉపయోగించి గ్రాంట్లు తెప్పించి ఆ విద్యాలయం పని పూర్తి చేసేడు.
లక్ష్మి  ఆ బడిలోనే చేరింది. తల్లిలా లక్ష్మి  కూడా  బాగా   చదివేది. బడిలో అందరూ వాళ్ల అమ్మ గురించి మాట్లాడేవారు.

గౌరి  తమ్ముడు, మరదలు ఆ బడిలో ఉపాధ్యాయులుగా చేరేరు.

గౌరి  తమ్ముడు, మరదలు లక్ష్మి చదువు గురించి ఎక్కువ శ్రద్ధ తీసుకొనేవారు. వాళ్ళు గౌరి ఇంటి పక్కనే ఉండేవారు.
లక్ష్మిని బడి అయ్యాక  వాళ్ల ఇంటికే తీసుకెళ్ళి లక్ష్మిని కొంతసేపు ఆడించి,
ఇద్దరూ చదివించేవారు.

శివప్రసాద్  అంచెలంచెలుగా ఎదిగి జిల్లా  రాజకీయాలు, రాష్ట్ర  ,కేంద్ర రాజకీయాలలో పాల్గొని గొప్ప నాయకుడిగా పేరు సంపాదించుకున్నాడు. తరచు ఢిల్లీ వెళ్తుండేవాడు.
శివప్రసాద్ రాష్ట్ర మంత్రివర్గం  ,తర్వాత కేంద్ర మంత్రివర్గం లో కీలక పదవులలో పని చేసాడు.
గౌరి నిరంతరం ఆసుపత్రి పనులలో తలమునకలయి ఉండేది.  చుట్టుపక్కల గ్రామాల్లో వైద్య క్యాంపులు ఏర్పాటు చేసి  తన స్నేహితుల సాయం తో ప్రజలకి వైద్య
పరీక్షలు చేయించేది. కంటి వైద్యులతో ‌కంటి పరీక్షలు చేయించేది.
చుట్టుపక్కల గ్రామాల ప్రజలంతా ఆమె  గురించి, లక్ష్మీ దేవి గురించి  చెప్పుకొనేవారు.

లక్ష్మి కాలేజీ చదువు కోసం పట్నం లో  మేనత్త  ఇంటికి  వచ్చింది. ఆమె మేనత్త  రాధకి అన్న  శివప్రసాద్ అంటే  వల్లమాలిన ప్రేమ.  లక్ష్మి ని తన కూతురిలా చూసుకునేది.
ఇది నా స్వీయ రచన

చిన్నారి పెళ్లి కూతురు (ఆఖరి భాగం)

కాలేజీ చదువు అయిపోయాక లక్ష్మి మేనత్త దగ్గరే ఉండి సివిల్స్  పరీక్షలకి కోచింగ్ తీసుకుంది. ఆ పరీక్షలలో ఆమెకి
మంచి ర్యాంక్ రావడంతో  ఐ.ఎ.ఎస్ కి ఎంపికయింది.

గౌరి ని, ఆమె సేవలు  గుర్తిస్తూ భారత అధ్యక్షుడు రాజ్యసభ సభ్యురాలిగా ఎంపిక చేసారు

గౌరి  రాజ్యసభ లో ప్రసంగిస్తూ "ఓ చిన్నారి పెళ్లి కూతురుని వాళ్ల అత్తింటివారు చదివించి వైద్యురాలిగా చేసారు. నా భర్త  శివప్రసాద్ గారి నాయనమ్మ  లక్ష్మీ దేవి గారి వల్లే ఇదంతా సాధ్యమయింది.  ఆవిడకి నేను  జీవితాంతం ఋణపడి ఉంటాను " అని ఉద్వేగంగా తెలిపింది.

No comments:

Post a Comment