Friday, 1 November 2024

నిర్ణయం

 ఇది నా స్వీయ రచన 


నిర్ణయం 


"ఇన్నాళ్ళూ  నిన్ను  చదివించాను. తల్లి  లేని లోటు నీకు తెలియకుండా పెంచాననే అనుకుంటున్నా . ఇక నీకు  పెళ్లి చేసి ఏ అయ్య చేతిలోనో పెడితే నా బాధ్యత తీరుతుంది. నీ గురించి చింత ఉండదు " అన్నారు నాన్న. 

నాన్న నాకు  నాన్నే కాక  తల్లి ,గురువు,  దైవం అన్నీ. నాన్నే నన్ను  పెంచేరు. కష్టం అనేది మనసుకి తెలీకుండా కంటిరెప్పలా కాపాడుతూ వచ్చారు.


ఈ మధ్యంతా నాన్న నా పెళ్లి గురించే మాట్లాడుతున్నారు. ఆయన స్నేహితులు మా ఇంటికెవరు వచ్చినా, మేము  మా బంధువుల ఇళ్ళకి వెళ్ళినా నా పెళ్లి ప్రస్తావనే తీసుకువస్తున్నారు. నాకు అహర్నిశలూ నాన్న గురించే ఆలోచన. పెళ్లంటే  అంత డబ్బు ఎక్కడ నుండి తెస్తారు? మొత్తం ఖర్చంతా లక్షల్లో అవుతుంది. ఇంత తలకు మించిన భారాన్ని నాన్న మోయాలా ?


ఆ ఆలోచనతోనే నాన్న నా పెళ్లి ప్రస్తావన తీసుకు వచ్చినప్పుడల్లా "నా కాళ్ళమీద నన్ను ముందు నిలబడనీయండి నాన్నా. పెళ్ళికి ఇప్పుడేం తొందర "  అంటూ వచ్చాను.


ఒకరోజు నాన్న " నా శక్తి కి మించి నీకేం చేయలేనమ్మా. నా స్నేహితుడు ఒక సంబంధం  గురించి చెప్పాడు. అబ్బాయికి 

కలెక్టర్ ఆఫీస్ లో పనిట. ఇవాళ సాయంత్రం నిన్ను  చూడటానికి వస్తున్నారు.  నా ప్రయత్నం నన్ను చేయనీ" అన్నారు. 


నాన్న నెత్తిమీద పడే బరువు గురించే నా భయమంతా. మధ్యవర్తి నాన్న స్నేహితుడు. ఇంటికి వస్తానంటున్న వాళ్ళని రావద్దనడం బాగోదనుకున్నా. కానీ ఈ పెళ్లిచూపుల కార్యక్రమం చాలా సింపుల్  గా జరగాలని , అనవసరమైన ఆర్భాటాలు వద్దని నాన్నకి మరీమరీ చెప్పాను.


నాకు  పెళ్లిచూపుల అనుభవం అదే ప్రధమం. పెళ్ళికొడుకు  తన అమ్మ, నాన్నతో పాటు  వచ్చేడు. తల్లి, కొడుకు నేను  సమాధానం చెప్పగలిగే ప్రశ్నలే అడిగారు  కాబట్టి అంతవరకు ఫరవాలేదు. తరవాత  నేను లోపలికి వెళ్లిపోయాను. నాన్న స్నేహితుడు పెళ్లి కొడుకుతో, వాళ్ల అమ్మా నాన్నతో ఏవో గుసగుసలు.


" అబ్బాయికి మీ అమ్మాయి  నచ్చిందటండీ. మనం మిగతావి కూడా  మాటాడేసుకుంటే సరి. నేను కొంచెం ముక్కుసూటిగా పోయేరకం. మావాడిది కలెక్టర్ ఆఫీస్ లో ఉద్యోగం కదా. మాకూ ఏం గొంతెమ్మ కోర్కెలు లేవు. ఎంతో కొంత కట్నం ఇచ్చి సంప్రదాయబద్ధంగా మీరు పెళ్లి చేస్తే చాలు" పెళ్లి కొడుకు తండ్రి  మాటలు వినిపిస్తున్నాయి. 


నాన్న నేనున్న గదిలోకి  వచ్చేరు. "అమ్మా, అబ్బాయి నీకు  వచ్చేడు? నచ్చితే మిగతావి వాళ్లతో  మాట్లాడొచ్చు " అన్నారు. 

" నాన్నా, వాళ్లకి నేను నచ్చానని చెప్పడం వినిపించింది. ఆయన కట్నం  ప్రస్తావన తీసుకురావడమూ వినిపించింది. నా పెళ్లి కోసం, కట్నం  కోసం లక్షల్లో అప్పుచేసి మీరు అప్పుల్లో కూరుకుపోవడం నాకు ఎంతమాత్రం ఇష్టం లేదు .నాకు ఈ పెళ్లి 

ఇష్టం లేదని చెప్పేయండి "అని ఖచ్చితంగా  చెప్పేను.

నాన్న  నా మనసు మార్చడానికి ఎంతో  ప్రయత్నించారు కానీ లాభం లేకపోయింది. 

నాన్న  బయటకు వెళ్ళి వాళ్లతో " ఆలోచించుకుని కబురు చేస్తానండీ "అని చెప్పి వాళ్లని పంపించేసారు.


వాళ్ళు వెళ్ళిపోయాక నేను నాన్నతో " నాన్నా, అమ్మ పోయాక మీరు మీకో తోడు కావాలి అని ఆలోచించకుండా, మీ జీవితం అంతా  నా బాగోగులు చూస్తూ గడిపేసారు. నాకు  ఇప్పటిలో పెళ్లి  చేసుకోవాలని లేదు. ఈ ముసలి వయసులో మిమ్మల్ని కనిపెట్టుకుని ఉండాల్సిన బాధ్యత నాకుంది. నేను  పెళ్లి చేసుకొని వెళ్ళిపోతే అది సరిగా చేయలేకపోవచ్చు. "

"నా పెళ్లి గురించి మీరు  తలకు మించిన భారాన్ని నెత్తినేసుకోవడం కూడా  నాకు ఇష్టం లేదు. మరే సంబంధాలు చూసి నా మనసు కష్టపెట్టకండి" అన్నా.

ఆ రోజే నేను నిర్ణయించుకున్నా. ఇక నాకు  ఒకే లక్ష్యం. నేను బాగా చదువుకోవాలి. ఉన్నత స్థాయికి చేరుకోవాలి. నాకోసం,  నా చదువు కోసం  ఎంతో శ్రమించిన నాన్నని ముసలితనంలోనైనా సుఖపెట్టాలి. ఆయన గర్వించేలా మంచి స్థానంలో ఉండాలి. 


దాని కోసం రాత్రీపగలూ శ్రమ పడ్డా. కొన్ని విజయాలు,  ఎన్నో అపజయాలు. అయినా నేను  ప్రయత్నాలు కొనసాగిస్తూనే వచ్చా.

నాకు కలెక్టర్ గా మా ఊళ్ళో  పోస్టింగ్ వచ్చినప్పుడు నాన్న కళ్ళల్లో చెప్పలేని ఆనందం. నాన్న చూసిన పెళ్లి సంబంధం అబ్బాయి కనబడినప్పుడు నేను అప్పుడు  తీసుకున్న నిర్ణయానికి, సాధించిన విజయానికి గర్వపడుతుంటాను.

ఇప్పుడు మా నాన్న మా అమ్మాయికి ఇంట్లో టీచర్. మనవరాలితో కబుర్లు చెప్తూ, ఆటలాడుతూ, అప్పుడప్పుడూ పాఠాలు బోధిస్తూ  కాలక్షేపం చేస్తుంటారు. 


నా పెళ్లి  నేను సివిల్  సర్వీస్ కి ఎంపిక అయ్యాకే నిరాడంబరంగా జరిగింది.

 ఆనంద్, నేను సివిల్ సర్వీస్ కోసం కోచింగ్ తీసుకుంటున్నప్పుడు  పరిచయం అయి స్నేహితుడు అయ్యాడు. సివిల్ సర్వీస్ కి ఎంపిక అవకపోయినా, ఎం.బి. ఎ. చేసి ఒక కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. అతనికి నాన్న పట్ల ఉన్న ఆదరణ, నా పట్ల  ఉన్న అభిమానం,  ప్రేమ నేనే మా పెళ్లి  ప్రస్తావన  తన దగ్గర తీసుకురావడానికి  కారణమయింది. 


ఇప్పటికీ  ఆనంద్ అంటుంటాడు నాతో  "నేను  కలెక్టర్నవుదామనుకున్నా. నువ్వు తారసపడి నా తపస్సుని భగ్నం చేస్తేనే

 ఇంకేం కలెక్టర్ గిరీ? పోనీలేవోయ్, నా  కలని నిజం చేసిన అర్ధాంగివి నువ్వు. కలెక్టర్ కావాలన్నది నీ లక్ష్యం అయితే  నిన్ను నాదాన్ని  చేసుకోవడమే నా అంతరాంతరాల్లో లక్ష్యం అయివుంటుంది. అందుకే నీ లక్ష్యం  నువ్వు  సాధించావు. నేను కోరుకున్నది నాకు సిధ్ధించింది."


(2.10.04)

No comments:

Post a Comment