Friday, 1 November 2024

ఆగిన‌ ఆ పిలుపు

 # పౌర్ణమి _కథలు _భాద్రపద పౌర్ణమి


ఇది నా స్వీయ రచన 


ఆగిన ఆ పిలుపు 


"సుజ్జీ... ఆకలి దంచేస్తోంది. తొందరగా భోజనం వడ్డించు..." అంటూ గుమ్మంలో అడుగుపెడుతున్న వేంకటేశ్వర రావుని చూసి ఫక్కున నవ్వింది సుజాత.


"బాగానే ఉంది సంబడం. వీధిలోనే వడ్డించమంటారా ఏమిటి. ముందు ఫ్రెష్ అయి రండి. ఈలోగా గుమ్మడి వడియాలు వేయిస్తాను." అంటూ వంటింట్లో దూరిందామె.


భర్త భోజనప్రియత్వం తనకు తెలియనిదేమీ కాదు. ఆకలైతే చాలు.. చిన్నపిల్లాడి కంటే అధ్వాన్నం... అని అనుకుంటూ ముసిముసిగా నవ్వుకుంది సుజాత.


***


"అబ్బ... నీ చేతి వంట... ఘుమఘుమలతో నాలో ఆకలిని  మరింత ప్రజ్వలింపజేస్తోంది సుజ్జీ..." అంటూ భర్త అన్నంలో బీరకాయ పప్పు వేసి కలుపుతుండగా అందులో నెయ్యి వేసింది సుజాత.


పెద్ద అన్నం ముద్దను తీసుకుని వేంకటేశ్వర రావు తన కళ్ళకు అద్దుకుని, నోట్లో పెట్టుకోబోతుండగా ఫోన్ రింగ్ అయింది.


"ఎవరో చూడు సుజ్జీ..." అని భర్త అంటూ ఉండగనే 

"ప్రవీణ్ అండీ...." అంటూ ఫోన్ ను వేంకటేశ్వరరావుకిచ్చింది

ఫోన్ తీసుకుని, '...హలో..." అన్నాడతను.


"............." 


"హా...! అవునా...అయ్యో ప్రవీణా.." అంటూ కండ్లు పెద్దగా తెరిచి డైనింగ్ టేబుల్ ముందు కుర్చీలో అలాగే తల వాల్చేసాడు వెంకటేశ్వరరావు.


"ఏమండీ....ఏమయిందండీ" అంటూ  పెద్దగా అరుస్తూ, ఒక్క అంగలో భర్తని సమీపించి అతనిని తన  ఒడిలోకి తీసుకుంది  సుజాత. 

వాళ్ళ  చిన్నమ్మాయి సింధు   వెంటనే ఊళ్ళోనే ఉన్న మేనమామకి ఫోన్ చేసింది.

"మామయ్యా, మీరు వెంటనే మా ఇంటికి రావాలి. మనం అర్జంటుగా  నాన్నని ఆసుపత్రికి తీసుకెళ్ళాలి" అని మేనమామకి  ఫోన్ చేసి చెప్పింది సింధు. 


*        *     *     *     *   *   *   *

సుజాత తమ్ముడు అర్జున్ కి బావ

అంటే  వల్లమాలిన  ప్రేమ. సుజాత తమ్ముడితో  "నీకు  నాకంటే మీ బావే ఎక్కువయ్యారు రా" అంటుంది. 

ఆమెకి  వండివార్చడం, ఇల్లు తీర్చిదిద్దుకోవడం తప్ప మరేమీ తెలియదు. అన్నీ వేంకటేశ్వరరావు చేసుకుంటాడు. అతను ఇప్పుడు ఇలా. ..సుజాత వెర్రిగా చూస్తూ అలాగే ఉండిపోయింది. 

డాక్టర్ అర్జున్ తో "మీ బావగారు షాకింగ్ న్యూస్ విన్నారని చెప్తున్నారుగా. అతను ఆ షాక్ లో ఉన్నారు. ఆయనకి  ఇచ్చిన ఇంజక్షన్ ప్రభావం వల్ల కొంతసేపు నిద్రపోతారు. లేచాక కూడా  మీరెవరూ ఆ సంగతి ఆయనతో మాట్లాడకండి " అన్నాడు. 


తెలివొచ్చాక వెంకటేశ్వరరావు అర్జున్ ని చూసి "నాకేమయింది? నువ్వెందుకు వచ్చావ్? మనం ఎక్కడ ఉన్నాం?" అన్నాడు. 

"ఏంలేదు బావా. నీక్కొంచెం కళ్ళు తిరిగేయి. అక్క సంగతి నీకు తెలిసినదే కదా. అయినా డాక్టర్  ఒకసారి చూడటం మంచిదేగా. అందుకే తీసుకొచ్చాం " అన్నాడు 

  అర్జున్. 

ఇంటికి తీసుకెళ్ళాక వేంకటేశ్వరరావు సుజాతతో  "ప్రవీణ్ నాకు ఫోన్ చేసేడు కదా. ఏం మాట్లాడాడో గుర్తురావడం లేదెందుకో" అన్నాడు. 

"ఫోను  కట్ అయిందండీ. ఈ లోగానే మీకు కళ్ళు తిరిగేయి."అంది సుజాత. 


"నాకెందుకో  మా వివేక్ ఎక్కువ గుర్తొస్తున్నాడు"అన్నాడు వేంకటేశ్వరావు.


"మీ స్నేహితుడు మీద అలిగి ఆరునెలలై ఫోను కూడా చేయలేదు కదా. అందుకే " అంది  సుజాత. 


"నేను  మాట్లాడకపోతే పోయేను. సింధు ప్రవీణ్ తో మాట్లాడొచ్చు కదా. వివేక్  ఆ మధ్య ఊళ్ళోకి వచ్చాడట. మా కృష్ణ మోహన్ చెప్పాడు. అప్పుడయినా వచ్చి నన్ను కలవలేదు"‌‌ అన్నాడు వేంకటేశ్వరరావు. 

సుజాతకి దుఃఖం తన్నుకొచ్చేస్తోంది. గబుక్కున వంటింట్లోకి  పరుగెత్తింది. 

సింధు ప్రవీణ్ తో మాట్లాడింది. ప్రవీణ్ తన తండ్రి  వివేక్ అకస్మాత్తుగా  వింతరోగం సోకి, రెండు వారాల్లో అది ముదిరి  అతని ప్రాణం పోయిందని చెప్పాడు. 

పోయే ముందు  వివేక్ ఎప్పుడూ వెంకట్, వెంకట్ అనే పిలుస్తుండేవాడట.

నిద్రలో కూడా వెంకట్ అనే ఏదేదో  కలవరించేవాడట.

సింధు వివేక్ మరణవార్త తెలియగానే  వెంటనే బయలుదేరి

ముంబాయి వెళ్ళింది. సుజాత వెంకటేశ్వరరావుని విడిచి వెళ్లలేని పరిస్థితి. కానీ సింధు వివేక్  భార్య మహితని, కొడుకుని కలిసి రాకుండా ఉండలేకపోయింది. 

వివేక్ కి తన ఆప్తమిత్రుడు కూతురు సింధు అంటే ఎనలేని ప్రేమ. సెలవుల్లో తనే వచ్చి ముంబాయి తీసుకుని వెళ్ళేవాడు. 

అతను సింధుతో " ఈ అబ్బాయిలు తండ్రికి కొరివి పెట్టడానికే పనికొస్తారు. నువ్వు చూడు, నాతో  ఎంత ప్రేమగా మాటాడతావో. నేను  నీకే కొడుకుగా పుడతా" అనేవాడు.


 సింధు ముంబాయి వెళ్ళినపుడు 

వెంకటేశ్వరరావు సుజాతని "సింధు ఏది? కనబడటం లేదు " అని అడిగితే "అనుకోకుండా ఆఫీసు పని మీద బెంగళూరు వెళ్ళిందండీ. అది వచ్చేవరకు  మా తమ్ముడు మనతో ఉంటాడు. 

సింధు వెళ్ళక తప్పదంటే నేనే వెళ్ళమన్నా" నంది.


సుజాతకి వెంకటేశ్వరరావు పెళ్లయిన నాటి నుండి  ఎప్పుడూ వివేక్ గురించే చెప్తుండేవాడు.

వివేక్  వేంకటేశ్వరరావు వాళ్ల ప్రొఫెసర్ గారి అబ్బాయి. వేంకటేశ్వరరావు  ఆయన దగ్గరే డాక్టరేట్ చేసాడు. యూనివర్సిటీలో ఇద్దరూ ఎప్పుడూ కలిసే తిరిగేవారు. సినిమాలు, షికార్లు అంటూ తిరిగి రాత్రిపూట మరో స్నేహితుడి రూమ్ కి వెళ్లి అక్కడే పడుక్కునేవారు. వివేక్ తండ్రికి ఇవన్నీ నచ్చకపోయినా తల్లి గారాబం వల్ల వాళ్ల సరదాలకేం లోటు రాలేదు. 

వేంకటేశ్వరరావు ని వివేక్ తండ్రి వివేక్ లాగే వెంకట్ అని పిలిచేవారు. ఆయనకి వేంకటేశ్వరరావు సాయపడుతూ

ఎన్నో విషయాలు తెలుసుకునేవాడు.

"మావాడికి అమోఘమైన తెలివి తేటలు కానీ ఎక్కువ సేపు ధ్యాస పెట్టడు. నీతో పాటు  అయితే కలిసి చదువుతాడు. వాడికెప్పుడూ తోడుగా ఉండు" అనేవారు వివేక్ తండ్రి. 


వివేక్ మేధావి. అర్థశాస్త్రం లో తను కూడా  మరో ప్రొఫెసర్ దగ్గర డాక్టరేట్ చేసి మంచి ఉద్యోగం వస్తే బొంబాయి వెళ్ళి అక్కడే సెటిలయ్యాడు. అతని భార్య మహిత. కొడుకు ప్రవీణ్ కూడా ఈమధ్యే ఉద్యోగం లో చేరేడు.

వివేక్, వెంకటేశ్వరరావు చదువు పూర్తయ్యాక కూడా మంచి స్నేహితులుగానే ఉన్నారు. ఇద్దరూ కొంచెం ఖాళీ దొరికితే చాలు, ఎక్కడో అక్కడ కలిసేవారు.వివేక్  చాలా పెద్ద ఉద్యోగం చేసి, బాగా  డబ్బు సంపాదించినా అతని  మాటల్లో, ప్రవర్తనలో పదవి,డబ్బు గురించి ఊసే ఉండేది కాదు. సరికదా కాలేజీ రోజుల సరదా, చెదరని  చిరునవ్వే ఉండేది. 

వెంకటేశ్వరరావు భోజన ప్రియుడని వివేక్ అతనితో "ఏరా, ఎప్పుడూ సుజాతే నీకు వండిపెట్టాలా? నేను చూడు, తీరిక దొరికితే మా మహితకి వండి పెడతా. అది కమ్మగా ఉంటుందా లేదా అనేది వేరే విషయమనుకో. నీకు రకరకాల వంటకాల విందు భోజనాలు ఇష్టమని నాకు  తెలుసు కదా. ఈసారి నుండి నువ్వేం వంటలు చేస్తున్నావో సుజాతని, సింధుని అడుగుతా" అనేవాడు  తన  స్నేహితుడు వంటింట్లో అడుగు పెట్టడని తెలిసినా

వివేక్ మూడు  నెలల పాటు జాంబియా  ఆఫీసు పని మీద  వెళ్ళాడు. వివేక్ తల్లి తండ్రుల మంచీచెడూ చూసే బాధ్యత  వెంకటేశ్వరరావు  మీద పడింది. వంట మనిషి రాకపోతే, ఎన్నడూ అలవాటు లేకపోయినా  వాళ్ళకి వంటచేసి  పెట్టేవాడు వేంకటేశ్వరరావు.  తనని ఎంతో  ప్రేమగా చూసే ఆవిడకి, విద్యాదానం చేసిన గురువు కి ఎంతచేసినా తక్కువే అనుకునేవాడు  వెంకటేశ్వరరావు. 


వివేక్ తల్లితండ్రుల చివరి రోజుల్లో 

తను రాలేని పరిస్థితిలో  ఉంటే వేంకటేశ్వర రావు ని వెళ్లి వాళ్లని చూసి రమ్మనేవాడు. ఇంకా తన స్నేహితుడితో  "మీ గురువు గారికి నువ్వు కనబడితే ప్రాణం లేచివస్తుంది. అమ్మకి నీకేవి ఇష్టమో తెలుసుకదా. వంటావిడ కి చెప్పి చేయిస్తుంది. దానికి మాత్రం అమ్మ కి ఎక్కడ లేని ఓపికా వస్తుంది"  అని అన్నాడు వివేక్. 

 తల్లి  పోయినప్పుడు, అంతకు ముందే సెలవు మీద వచ్చాడేమో  వివేక్ అక్కడే ఉన్నాడు. తల్లి పోయేక తండ్రిని తనతో  ముంబాయి తీసుకెళ్ళాడు కానీ ఆయన ఎక్కువ కాలం బతకలేదు. తన గురువుగారు ఇక లేరని వేంకటేశ్వరరావు చాలా బాధ పడ్డాడు. 


వివేక్  దగ్గర ఒక స్నేహితుడు ఎక్కువ మొత్తంలో డబ్బు తీసుకుని, అతని పేరు వాడుకుని మరి కొందరి దగ్గర కూడా  డబ్బు తీసుకుని మాయమయ్యాడు. ఆ స్నేహితుడు వేంకటేశ్వరరావుకి కూడా తెలుసు. వివేక్ ఆ కధంతా వేంకటేశ్వరరావుకి చెప్పి  అతనిని దూరం పెట్టమని చెప్పాడు. వెంకటేశ్వరరావు ఆ స్నేహితుడిని చాలా రోజులు  దూరం పెట్టేడు కానీ ఒకసారి  తన బావమరిది అర్జున్  కోరితే  ఆ స్నేహితుడికి సాయం చేయక తప్పలేదు. వివేక్ కి అది తెలిసి కోపంతో వేంకటేశ్వరరావుతో మాట్లాడటం తగ్గించేడు. ఈ పంతం ఎన్నాళ్ళో చూద్దామని వేంకటేశ్వరరావు కూడా ఫోను చేయడం మానేసాడు.

*       *       *       *       *       *


వెంకటేశ్వరరావుకి ధ్యాస అంతా తన మిత్రుడి మీదే ఉంది. కానీ వివేక్ కి ఫోన్ చేయాలనుకోవడం లేదు. సింధుని రెండు సార్లు ప్రవీణ్ కి ఫోన్ చేసేవా అని అడిగితే ఒకసారి ఫోన్  కలవలేదని, మరోసారి  ఫోను  స్విచ్ ఆఫ్ అయి ఉన్నాదని చెప్పింది. వివేక్ మరణవార్త  అతనిని బాగా ప్రిపేర్ చేసి చెప్పాలనుకున్నారు. 


ఒకరోజు సుజాత "వివేక్ కి కొంచెం ఒంట్లో బాగాలేదుట.ఏవో వైద్య పరీక్షలు చేయిస్తున్నారుట. ప్రవీణ్  సింధు మిస్స్డ్ కాల్ చూసి ఫోను చేసి చెప్పాడు అంది.

మరో రెండు రోజుల తరువాత సింధు "నాన్నా, అది ఏదో  మ్యాడ్  కౌ రోగం. వివేక్  అంకుల్ విదేశాలకి, మన‌ దేశంలో అన్ని రాష్ట్రాలకీ వెళ్తుంటారు కదా ఎక్కడో,ఎప్పుడో అతనికి ఈ వ్యాధి సోకింది. అంకుల్ ఆసుపత్రి లోనే ఉన్నారు. ఎవరూ వెళ్ళి చూడటానికి లేదని ప్రవీణ్ చెప్పాడు " అంది.

సుజాత "మీ స్నేహితుడు అలా బాధ పడుతున్నారంటే ఆయనకి త్వరగా రిలీఫ్ దొరికితేనే మంచిది. అలా అనుకుంటే మనకి కష్టం అనిపించినా అదే నిజం కదూ" అంది తన భర్తతో. 

వేంకటేశ్వరరావుకి కూడా అదే  అనిపించింది. ఏ నిముషంలోనైనా

తను ఆ దుర్వార్త వింటాడేమో ‌అని కూడా  అనిపించింది. అసలు ఆరోజు ప్రవీణ్  ఫోను చేసినది ఈ వార్త చెప్పడానికేమోనన్న  సందేహం వెంకటేశ్వరరావుకి అప్పుడు కలిగింది.

సుజాతతో "నేను వెంటనే బొంబాయి వెళ్ళాలి. వివేక్ ని చివరి చూపు చూడలేక పోయానేమో అనిపిస్తోంది." అన్నాడు. ఆమాట

ఇంకా పూర్తి  చేయకుండానే సుజాత "మీరు అనుమానించినది

నిజమేనండీ. డాక్టరు మీకు ఈ విషయం మీరు పూర్తిగా కోరుకున్నాకే చెప్పమన్నారు. అయినా మీ స్నేహానికి  చావులేదు " అంది భర్తని అనునయిస్తూ. 


"వాడిని ఇక చూడలేక పోయినా  

మహితని,ప్రవీణ్ ని కలిసిరావాలి. 

వాడు నాకు  జీవితంలో భాగం. కానీ  వాళ్లకి వాడే జీవితం కదా" అన్నాడు సుజాత తో కన్నీళ్ల పర్యంతమౌతూ 


వేంకటేశ్వర రావు కి‌ వెంకట్...వెంకట్...అని ప్రేమ గా

పిలిచిన ఆ పిలుపు ఆగిపోయింది. కానీ అది ఇంకా వేంకటేశ్వరరావు  చెవిలో మార్మోగుతూనే ఉంది, తాము కలిసి గడిపిన మధుర క్షణాలను  గుర్తు చేస్తూ

No comments:

Post a Comment