ఇది నా స్వీయ రచన
చిన్నాసుపత్రి
ఆ భవంతి ఓ బడా నిర్మాతది.ఆయన చిన్న సినిమాలు తీసి, అవి విజయవంతమవడంతో బాగా పేరు, డబ్బు సంపాదించి పెద్ద
నిర్మాత అయ్యాడు.
తండ్రి అడుగుజాడల్లో నడిచి కొడుకు కూడా మంచి పేరు ,డబ్బు సంపాదించేడు. సిటీకి కొంచెం దూరంగా ఇంద్ర భవనం లాటి ఇల్లు కట్టించేరు.
భవనం పక్కనే దిష్టిబొమ్మలా ఓ పూరిల్లు. ఆ ఇంట్లో ఓ ముసల్ది, కొడుకు, కోడలు, వాళ్ల పాప ఉంటారు. కొడుకు, కోడలు పనికి వెళ్తే ముసల్ది మనవరాలిని చూసుకుంటూ ఉంటుంది.
బంగళాలో అత్తాకోడళ్ళదే రాజ్యం. ఇంట్లో మగాళ్ళు డబ్బులెంత సంపాదించినా కాఫీ తాగాలంటే కోడలు ఇవ్వాలి. తోటలో ఏ మొక్కలు నాటాలో ,వాళ్లు ఆ రోజు ఏ బట్టలు వేసుకోవాలో అన్నీ వాళ్ళే నిర్ణయిస్తారు.
బంగళా యువరాణి పై చదువులకి విదేశాలకి వెళ్ళింది. వైద్యం లో డిగ్రీలు సంపాదించి, అక్కడ కొన్నాళ్ళు పనిచేసి ఇండియా వచ్చేసింది.
బంగళా యువరాణి శ్రీవల్లి. సంవత్సరం లోగానే ఇంటికి దగ్గరగా ఓ ఆసుపత్రి కట్టించుకుంది.
గుడిసె లో పాప పేరు ముత్యాలు.
గుడిసెలో దంపతులు బంగళాలో పనిచేసేవారు. ఇప్పుడు కొత్త ఆసుపత్రి లో పని చేస్తున్నారు.
ముసల్దానికి జబ్బు చేస్తే శ్రీవల్లి తన ఆసుపత్రి లో చేర్పించింది. రోగం నయమయి ఇక ఇంటికి వెళ్ళి పోవచ్చని శ్రీవల్లి చెప్పింది
ముసల్ది శ్రీవల్లికి దండం పెడుతూ "అమ్మా, ఆ గుడిసె నాదే.
నువ్వు నా కొడుకుకి, కోడలుకి పని ఇప్పించి ,తిండి పెడుతున్నావు. నా మనవరాలిని బడికి పంపిస్తున్నావు. నన్ను బతికించేవు. ఆ గుడిసె జాగాలో
మరో ఆసుపత్రి కట్టించు. మాబోటి వాళ్లకి చిన్నాసుపత్రయినా చాలు కదా. నీ పేరు చెప్పుకుంటాం" అంది.
No comments:
Post a Comment