కూర్మావతారం
తలుపుల దారుల్లో
తాపీగా నడుస్తూ
అంతర్ముఖినై
మౌనాన్ని కప్పేసుకుని
కూర్మావతార మెత్తి
కులాసాగా. ....
కూర్మావతారం
తలుపుల దారుల్లో
తాపీగా నడుస్తూ
అంతర్ముఖినై
మౌనాన్ని కప్పేసుకుని
కూర్మావతార మెత్తి
కులాసాగా. ....
మనసు తడి
మనసు పొడిబారకుండా
చూసుకో
ఎన్నో
తలుపులు
ఊహలు
భావాలు
అర్ధం ఒకటే అయినా
నిన్ను భావకవిని
చేస్తాయి
తలపుల్లో ఎవరెవర్నో
కలుస్తావు
ఊహల నుండి
కథ
కవిత
పుట్టుకొస్తుంది
మనసు తడిని
అలాగే
ఉండనీ
అమాస నాడు సైతం
నవ్వే జాబిలి నేను
బాధలో సైతం
చిరునవ్వు చిందిస్తా
మీకు తెలిసిన
మహిళనే
మరొక్కసారి
పరిచయం చేస్తున్నా
శిల్పం నేనే
అమ్మ ప్రాణం పోసిన
శిలను నేను
విద్య సంస్కారం
శిల్పంగా మార్చాయి నన్ను
నన్ను నేనే
తీర్చి దిద్దుకుంటూ
ఉలి దెబ్బలు
తట్టుకుంటూ
క్రమశిక్షణ పాఠాలు నేర్చి
జనం మెచ్చిన శిలగా
నన్ను నేను మలుచుకుంటూ
సభ్యత
సంస్కృతి
అలవరచుకుంటూ
కాలం చేసే గాయాలు
మౌనంగా భరిస్తూ
నలుగురికి సాయపడుతూ
ప్రతి రోజూ
నన్ను నేను
తీర్చి దిద్దుకుంటూ
ముందుకు సాగిపోయే
శిలనూ నేనే
శిల్పమూ నేనే
ఇది నా స్వీయ కవిత
ఇంటిపేరు
ఎవరి ఇంటి పేరు
వారికి గొప్ప
ఇంటి పేరు లో
మన మూలాలు ప్రస్ఫుటం
మన తాత ముత్తాతలు
వారసత్వపు ఆస్తిగా
వదిలి వెళ్లినది
ఇంటి పేరు
మహానుభావులు
ఇంటికి
ఇంటిపేరుకే
వన్నె తెస్తారు
మేమిద్దరం సమాంతర రేఖలం. కానీ శాంతియుత సహజీవనం చేస్తుంటాం.
తను రాత్రి పదకొండుకైనా హుషారుగా ఉంటాడు. నేను పన్నెండు కల్లా లేచి కూర్చొని ఇంకా హుషారుగా ఉంటాను.
తను వంట బాగా చెయ్యాలంటాడు. నేను ఏదో ఒకటి తింటే చాల్లే అనుకుంటాను.
నేను అనుకోగానే ఆ పని అయిపోవాలను కుంటాను. తను మాటకైనా, పనికైనా తాపీ, తరుణం ఉండాలంటాడు.
ఏమాటకామాటే చెప్పుకోవాలి, లక్షల్లోనో, కోట్లలోనో ఒకరుంటారు మా కథానాయకుడు లాటి వాళ్ళు.
"# పౌర్ణమి_ కథలు"_కార్తీక _పౌర్ణమి"
ఇది నా స్వీయ రచన
కిషన్ కన్నయ్య
"....నీ కోసం ప్రాణం పెట్టే నన్ను ఓ పూచికపుల్ల కన్నా హీనంగా, నిర్లక్ష్యంగా చూసావు. నేను నీకు దూరం అయితే, నా తింగరిబుచ్చి ఏమయిపోతుందోనన్న భయంతో అన్నింటినీ దిగమింగుకుని సహనం వహించి, నీతో ప్రేమగా ఉంటూ వచ్చాను. ఎంతకాలమని ఓర్పు వహించనూ? నేనూ మనిషినే కదా? నా ప్రేమ...నీ పట్ల నాకున్న ఆపేక్ష... అన్నిటి విలువా నీకు నేను దూరం అయ్యాకే తెలుస్తుంది. అపుడు నా కోసం వచ్చినా, నేను ఓ "పిడికెడు బూడిద"గా మిగిలిపోతానేమో... నన్ను ప్రేమగా నీ నుదుట అలంకరించుకుందువు లే. ఇక సెలవు!
వాట్సప్ సందేశాన్ని చదువుతూ కుప్పకూలిపోయింది రాధ.
"వర్క్ బిజీ"లో తన ప్రవర్తనను అర్థం చేసుకుంటాడులే అనుకుంది కానీ, ఆ ప్రవర్తన... తనను ప్రాణంగా చూసుకునే తన కన్నయ్య మనసును అంతగా బాధ పెట్టిందా? అయ్యో... ఇపుడెలా? ఏం చేసేది? దిక్కు తోచక, దిక్కులు పిక్కటిల్లేలా శోకించసాగిందామె.
"కత చాలా బావుందమ్మా " అన్నారు నిర్మాత.
'"మీరు పూర్తిగా చదవనే లేదు నా కథ" అన్నా నేను.
"ఓపెనింగ్ సీన్ ఇంత సెంటిమెంటుతో ఇంత బావుంటే కలక్షన్లకి తిరుగుండదు" బాగా నమ్మకంగా ఉన్నాడు నిర్మాత.
" మీ కత ముందు మా డైరెక్టర్ కి చూపిస్తా. ఈ కత ని నవలగా మార్చి మనం ప్రచురించుదాం. మీ తదుపరి నవల కోసం రెండు రాష్ట్రాల పాఠకులు వెయిటింగ్ మేడమ్ " అన్నాడు నిర్మాత.
నా కధకి విస్తృత ప్రచారం ఇవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే అది కథ కాదు, జీవితం.
ఈ కథ నా స్నేహితురాలి కూతురు జననిది. నా స్నేహితురాలి భర్త మరణించేక వాళ్లు చాలా ఆర్ధిక ఇబ్బందుల్లో ఉన్నారని , నేనే మా పెద్దమ్మ కొడుక్కి చెప్పి ఆ ఉద్యోగం వచ్చేలా చేసాను.
జనని చాలా పట్టుదల,కష్టపడేతత్వం. కొత్తగా ఉద్యోగం లో చేరింది. పని నేర్చుకోవాలి. పనిలో సవాళ్ళనెదుర్కోవాలి.
జనని, కిషన్ ప్రేమ ఈనాటిది కాదు. జనని తండ్రి అకాలమరణం సమయం లో తనే ఇంటి అల్లుడిలా ఎంతో చేసేడు. తల్లీ కూతుళ్ళని తనే కనిపెట్టుకుని ఉండేవాడు. కిషన్ కి జనని అంటే ఉన్న ప్రేమ ఇట్టే తెలిసిపోతుంది.
జనని కిషన్ నుండి తనకి మెసేజ్ రాగానే హడలిపోయి ముందు నాకే ఫోన్ చేసింది.
"పెద్దమ్మా, అమ్మకి నేను ఇలాటివి చెప్పలేను. కిషన్ నన్ను అపార్ధం చేసుకుంటే నేనేమయిపోవాలి? నా పరిస్థితి నీకు తెలుసుకదా?" అని భోరున ఒకటే ఏడుపు.
"నువ్వు ధైర్యంగా ఉండు. ఆ అబ్బాయితో నేను మాటాడతా. పరిస్థితి కొంచెం చక్కబడ్డాక నువ్వు కిషన్ ని కలిసి ,
అన్నీ వివరించి , అతను నిన్ను సరిగా అర్ధం చేసుకొనేలా నీవంతు ప్రయత్నం చేయాలి " అన్నా.
ఏంటో ఈ కాలం పిల్లలు. అపార్ధాలు, ఆవేశాలు, ఆక్రోశాలు. అన్నిటికీ తొందర పడితే ఎలా? మొన్న ఆశా ఆసుపత్రికి నా స్నేహితురాలితో వెళ్తే మన స్థిమితం లేని ఆ వయసు వాళ్ళు ఎంతమందో.
నేను కిషన్ కి ఫోన్ చేసి , మా ఇంటికి రమ్మని చెప్పా. కిషన్ కి నేను జనని వాళ్ల అమ్మ స్నేహితురాలిని అని తెలుసు.
అడగ్గానే కిషన్ మా ఇంటికి వచ్చేడు. మనిషి చాలా నిరుత్సాహం గా, నిర్లిప్తంగా ఉన్నాడు. జనని వాళ్ల అమ్మ మాలతిని కూడా మా ఇంటికి రమ్మన్నాను.
అది" ఏమయిందే" అని ఆదుర్దాగా అడిగింది.
" ఏం లేదు. నేను ఒక నవల రాయాలి. ముందు సీరియల్ గా ఒక పత్రిక కి పంపుదాం. నువ్వు, కిషన్ నాకు ఆ పనిలో సాయం చేయాలి" అని కిషన్ వైపు చూసా.
కిషన్ ఏం మాట్లాడలేదు. "నేను మీకు ఏ సాయం చేయలేనేమో ఆంటీ " అన్నాడు.
"నన్ను అత్తా అని పిలుపు. నాకదే ఇష్టం " అన్నా.
" ఏమే, నీ కూతురు అంత పెద్దదయి పోయిందా?అంత బిజీవా, కనీసం నాకు ఫోన్ కూడా చేయదు "అన్నా మాలతితో, జనని నాకు ఫోన్ చేసిందని చెప్పకుండా.
"ఏం చెప్పమంటావే. మీ అన్నయ్య వాళ్ళ ఆఫీసు లో చేరినప్పటి నుండి దాని సంగతి అలానే ఉంది. ఇంట్లో ఉన్నా పనే. ఆఫీసుకి వెళ్తే ఇక చెప్పనక్కర్లేదు.
అది ఇంటికి వచ్చిందాకా ఎదురు చూడటం. " పెద్దమ్మ వాళ్ళకి చెప్తే ఇంత మంచి ఉద్యోగం దొరికింది. దాన్ని నిలబెట్టుకోవాలి కదమ్మా "అంటుంది. ఇంకా నేను మాటాడబోతే , "నేను నిన్ను బాగా చూసుకోవాలి కదా "అంటుంది. నేనెవరితో చెప్పుకోవాలి " అందించి మాలతి దిగులుగా.
నేను "కిషన్, మా అన్నయ్య నేను జననిని సిఫార్సు చేసేనని ఎంత సంతోషిస్తున్నాడో . ఈమధ్యే ఆఫీసులో పని చేస్తున్న మరో అమ్మాయి పెళ్లి చేసుకొని అమెరికా వెళ్ళిపోయిందట. నువ్వు అక్కడ చేరితే జననికి కొంత హాయిగా ఉంటుంది కదా " అన్నా.
కిషన్ కి జనని మీద కోపం, అలక, ఉక్రోషం, ఇదివరకులా తనతో లేదన్న బాధ, ఇవేవీ ఇంకా తగ్గలేదు. "జనని నాతో అలాగ ఏం చెప్పలేదు. తను నన్ను ఏం అడగలేదు " అన్నాడు కిషన్.
నేను మాలతిని, కిషన్ ని ఇద్దరినీ కొన్నాళ్ళు మా ఇంట్లో ఉండమని అడిగా. ఇద్దరూ నా మాట కాదనలేకపోయారు. కిషన్ ని కొన్నాళ్ళు ఎవరో ఒకరు కనిపెట్టుకుని ఉండాలి. తనది మరీ సున్నిత మనస్తత్వం లా ఉంది.
నా సీరియల్ సినిమా ఫక్కీలోనే మొదలెట్టేను, కథ సెంటిమెంటు సీన్ తో మొదలయ్యింది.
కిషన్ ని జనని ఆఫీసులో చేరడానికి ఒప్పించా. అతను జననితోనే కలిసి పని చెయ్యాలి.
జననికి తన తప్పులు, పొరపాట్లు అన్నీ తెలిసొచ్చాయి. ఐనా కిషన్ తనకి అలా మెసేజ్ చేయడం అసలు నచ్చలేదు. దాని గురించి కిషన్ తో ఖచ్చితంగా మాట్లాడాలనుకుంది.
ఒక రోజు కిషన్ ఆఫీసు నుండి మా ఇంటికి వచ్చినపుడు జనని కూడా మా ఇంటికి వచ్చింది.
వస్తూనే కిషన్ ని కూడా మేడమీద ఉన్న నా గదిలోకి లాక్కొచ్చి "పెద్దమ్మా , మీ కాబోయే అల్లుడికి నా పేరు చెప్పి నాలుగు తగిలించండి" అంది కోపం గా.
నేను " అంత ఆవేశం ఏంటి జననీ?" అని అడిగా.
"కాకపోతే మరేంటి పెద్దమ్మా, ఎలా పడితే అలా సందేశాలు పంపి నన్ను ఏడిపిస్తాడా? నీ వచ్చే నవలలో వీడే విలన్. ఇది ఖాయం. "
"నన్ను మీ అందరి ముందే టింగరబుచ్చి అంటాడు. తండ్రి లేని అమ్మాయిని. నన్ను ఎంత ఏడిపించాడు?" అంటూ కిషన్ ని నానామాటలు అనేసింది.
కిషన్ నా ముందు జననిని ఏం అనలేకపోయాడు.
"నేను ఇప్పటికే సినిమా మొదటి సీన్ సిద్ధం చేసుకున్నా. జనని అనర్గళంగా డైలాగులు చెప్పేస్తోంది. నిర్మాత సిద్ధంగా ఉన్నారు. కిషన్ కథానాయకుడా,ప్రతి నాయకుడా అనేది పాఠకులు, ప్రేక్షకులు తేలుస్తారు " అన్నా నా నవ్వు దాచుకుంటూ.
"పెద్దమ్మ నిన్ను ఇక్కడ ఉండమంది కాబట్టి సరిపోయింది. లేకపోతే నువ్వేం చేసుకుంటావో అని భయపడి ఛస్తున్నాను. "
"నా పరిస్థితిని అర్థం చేసుకోకుండా ఆ నిందలేంటి , అభాండాలేంటి, హమ్మో చూసావా పెద్దమ్మా. నువ్వు చెప్పు , నేనలాటిదాన్నా " దీనంగా అడిగింది జనని నా వైపు చూస్తూ.
వాళ్ళది రాధాకృష్ణుల ప్రేమ. కాని అది వివాహ బంధం గా, వాళ్లు అన్యోన్య దంపతులుగా ,కలతలు లేని కాపురం చేయాలని నా కోర్కె.
మాలతి కోరిక కూడా వాళ్లకి త్వరలో పెళ్ళి చేసేద్దామనే. జనని తామిద్దరూ కొంత స్థిరపడ్డాక పెళ్లి చేసుకోవాలనుకుంటోంది.
కిషన్ అంత మంచి అబ్బాయిని నేనెక్కడా చూడలేదు. ఇద్దరూ మళ్ళీ ఆఫీసు పనిలో బిజీ అయిపోయారు.
వాళ్ళిద్దరి ప్రేమ, తగువులు, గొడవలు అన్నీ చూస్తూ వాటి ఆధారంగానే నా ధారావాహిక కొనసాగిస్తున్నా. నా ధారావాహికని ప్రేక్షకులు బాగా ఆదరిస్తున్నారు.
ఇప్పటిదాకా వాళ్ళ మధ్య జరిగినదే రాసా. కానీ నేను రాస్తున్న ధారావాహికం పూర్తిగా వారి కధే కానవసరం లేదు.
నా కధలో కన్నయ్య అంటే రాధకి ప్రాణం. రాధ దూరమైపోతుంటే ప్రాణత్యాగానికి కూడా సంసిద్ధమైన కన్నయ్య.
"కన్నయ్యా,నీ రాధ అంటే నీ కెంత ప్రేమ! ఎంత ఓపిగ్గా ఎదురు చూస్తున్నావు ఆమె కోసం?" అనుకున్నా.
అదే ప్రేమ నాకు కనిపించేది కిషన్ లో. జనని చాలా అదృష్టవంతురాలు అనుకుంటుంటా.
జనని ఓ రోజు తన టూ వీలర్ మీద వెళ్తుంటే ప్రమాదం జరిగి బాగా దెబ్బలు తగిలాయి. ఎవరో ఫోన్ చేసి చెప్తే మాలతి, నేను అక్కడకి వెళ్ళాం. కిషన్ కూడా గాభరా పడుతూ అక్కడకి వచ్చాడు.
జనని ఓ మూడు రోజులు ఆసుపత్రి లో ఉండాల్సి వచ్చింది. మాలతి, కిషన్ ఆసుపత్రిలో ఉండిపోయారు. మాలతి జననిని ఆసుపత్రి నుండి వాళ్ల ఇంటికే తీసుకుని వెళ్ళింది.
జనని మెడికల్ లీవ్ పెట్టక తప్పలేదు. కిషన్ ఇంటి నుంచి పని చేయడానికి అనుమతి తీసుకొని జనని దగ్గరే ఉండేవాడు.
కిషన్ తల్లి తండ్రులు వచ్చి జననిని చూసి వెళ్ళారు.
గాయాలు మానేక నేను జననితో "మీ నాన్న పోయాక, నువ్వు ఆఫీసు పనితో తీరిక లేకుండా అంటే, మీ అమ్మ చాలా ఒంటరితనం అనుభవిస్తోంది. నీకు త్వరగా పెళ్ళి చేస్తే తనకీ చేతినిండా పని. కిషన్ కూడా పెళ్లికి తొందర పడుతున్నాడు. నీతో ఆమాట అనడం లేదంతే" అన్నా.
జనని వెంటనే అలాగే అనలేదు కానీ తర్వాత వాళ్ళ అమ్మకే తన అంగీకారం తెలియచేసింది.
కిషన్ తల్లితండ్రులు వాళ్ల సొంత ఊరిలో తామే పెళ్లి జరిపిస్తామన్నారు.
కన్యాదానం నేను, మావారు చేసేం.
పెళ్ళి తరవాత జనని " పెద్దమ్మా, నువ్వు నాకు అమ్మవి కూడా అయిపోయావు. నీ కధలో కన్నయ్యకి ఇద్దరు తల్లులు లేరు కానీ నాకు ఇద్దరు అమ్మలు " అంది నవ్వుతూ
"నేను, కిషన్ తగువులాడుకుంటే నేను నీ దగ్గరకే వచ్చేస్తా" అంది జనని నాతో.
"ఏమక్కరలేదులే. మేము మా కన్నయ్యనే జాగ్రత్తగా చూసుకోవాలి. మీ మధ్య తగువు వస్తే కిషన్నే మా ఇంటి దగ్గర దిగబెట్టి, నువ్వు మీ అత్తారింట్లో ఉండు" అని చెప్పా జననితో.
నా నవల, నా నవల ఆధారంగా తీసిన సినిమా, జననీ కిషన్ ల ప్రేమ కథ అన్నీ సుఖాంతమే.
డాక్టర్ గుమ్మా భవాని
15.11.24
శాంతి అనివార్యం. .....
హమ్మో
ఎన్నెన్ని ఎత్తులో
కత్తులు
కత్తిపీటలు
రొట్టెల కర్ర
అన్నీ మారణాయుధాలే
అట్లకాడ
కోపమొస్తే
కాల్చి వాతలు
స్వీయ రక్షణ కోసం
సుశిక్షితులుగ
ఆడపిల్లలు అత్తవారింట్లో
అడుగుపెడతారు
బుధ్ధుడు
మహావీరుడు
బాపూ......
అహింస బాట
చూపేరు వారికి
ఎందుకైనా
తస్మాత్ జాగర్త
భార్యామణితో
శాంతియుత జీవనం
అనివార్యం
మనసొక
నెమలీక
దాచుకుందాం
భద్రంగా
నెమలికన్ను
పుస్తకంలో
పదిలపరిచేదాన్ని
ఎంత సున్నితం
నెమలికన్ను
కన్నయ్యనే
అలంకరించేదే
ఎంత సున్నితం
మన మనసు
అపాత్రదానం
దేనికి
మనసు కవి
మనసు గతి అంతే
అన్నాడు
మతి గతి తప్పకుండా
జాగ్రత్త పడదాం
మనసు
చంచలం కాకుంటే
మనసు నెమలీక
భద్రమే
ఇది నా స్వీయ రచన
ఉదయ రాగాలు
"ఒక కంట గంగ, ఒక కంట యమున....." అంత సీన్ లేదు కానీ కళ్ళు చెమరుస్తాయి.
దైవ స్నాన కాలం. బయట ఏవో శబ్దాలు.
ఒకప్పుడు సినిమా పాటల సాహిత్యం బాగా ఆకట్టుకునేది. ఇప్పుడు నేను అప్డేట్ అవలేక పోతున్నానేమో.
బాలచందర్ ఆత్రేయ, బాపూ ఆరుద్ర , విశ్వనాధ్ సిరివెన్నెల అలా గుర్తు పెట్టుకునేదాన్ని. సినిమా పాటలు అలా గుర్తుండిపోయేవి. నేను సగం తెలుగు సినిమా పాటలనుండి , సగం హిందీ అమితాబ్ డైలాగుల నుండి, స్టైలు ని ఆస్వాదించడం రజనీ ,చిరు నుండి నేర్చుకున్నా.
ఆమె ఇంకా
పసిపాప
విశ్రాంతి తీసుకోవాలి మరి
అరి చేతులు
దూది పింజలే
కాలితో
బొమ్మలు సేవ
చేతులు మారాం చేసినా
నేస్తానికి ప్రేమలేఖ రాసేది
లలిత సంగీత
సరస్వతి
సుతి మెత్తని
హృదయం తనది
గాన కోకిల
సాహిత్య అభిమాని
సంగీత సాహిత్యాలను
అభిమానించే
కళాకారిణి ఆమె
ఇది నా స్వీయ రచన
అంజి
శ్రీను నాకు ఓ ఇరవై ఏళ్ళు గా తెలుసు. "నాకు ఈ సాయం కావాలి అంటే మొహం చాటేసిన సందర్భాలు లేవు.
మా పాప చిన్నప్పుడు పాపని చూడడానికి ఒక అమ్మాయి ఉండేది. సాయంత్రం పూట ఆ అమ్మాయి పాపని బయటకి తీసుకుని వెళ్ళేది.
ఒకరోజు శ్రీను పాపని అరగంటలో వెనక్కి తీసుకుని వచ్చేసాడు.వస్తూనే " ఆ అమ్మాయిని వాళ్ళ ఊరు పంపించేయండి మేడమ్. ఆ అమ్మాయి తను ఆడుకుంటూ పాపని పట్టించుకోవడం లేదు. పాప అటూ ఇటూ వెళ్లిపోకుండా, దెయ్యం ఎత్తుకు పోతుందని భయపెడుతోంది "అని చెప్పాడు.
దాంతో నేను మర్నాడే వాళ్ళ ఊరికి పంపించేసాను.
నేను టూ వీలర్ నడపడం అలవాటు చేసుకున్నప్పుడు, మా అమ్మాయి కారు నడపడం నేర్చుకున్నప్పుడు శ్రీను చాలా ధైర్యం చెప్పేవాడు.
మా ఇంటి పెళ్లిళ్లలో తనదే హడావుడి. హనుమంతుడిలా సాయపడే వ్యక్తులు మన జీవితం లో ఉంటే ఒడిదుడుకుల సమయంలో కూడా ధైర్యం గా ఉండగలం.
వాళ్ళకి మనం చేతనైన సాయం చేయగలిగితే చాలు.
పెద్దలు తలిస్తే. ......
అబ్బాయి, అమ్మాయి సహ ప్రయాణీకులు. ఎవరి ప్రపంచంలో వారు.
అమ్మాయి రవళికి అక్క ఎందుకు రమ్మందో తెలియదు.
మురళికి అన్నావదినలు ఎందుకు రమ్మన్నారో తెలియదు.
రవళి అక్క వాళ్ళ ఇంటికి చేరేక వాళ్ళ అక్క రవళిని తలంటుకోమని , తొందరగా భోంచేసి పడుక్కోమని , హడావుడి చేసింది.
మురళితో వాళ్ళ అన్న సాయంత్రం వదిన వాళ్ళ స్నేహితురాలిని కలియడానికి వెళ్ళాలని చెప్పేడు.
సాయంత్రం రవళి అక్క కొత్త డ్రస్సు ఇచ్చి వేసుకుని తనతో రమ్మంది.
మురళి, రవళిల పెళ్లి చూపులు అలా ఓ హొటల్ లో జరిగేయి.
పెద్దలు తలుచుకోబట్టి, పెళ్లి చూపులలో వాళ్ళిద్దరూ ఒకరినొకరు ఇష్టపడ్డాక పెళ్ళి కూడా జరిగిపోయింది.
ఇది నా స్వీయ రచన
ప్రజా సేవ
రాజగోపాల్ ఒక రాజకీయ పార్టీ నాయకుడు. అతని కొడుకు సుభాష్ తండ్రి పార్టీ లో కొన్నా కొన్నాళ్ళుండి, ఆ పార్టీ తీరుతెన్నులు నచ్చక వేరే పార్టీ పెట్టాడు. ఆ పార్టీ సిద్ధాంతాలు, పని తీరు జనాలకి నచ్చింది.
సుభాష్ చెల్లెలు విద్య తన చదువు పూర్తి చేసుకుని ఇంటికి వచ్చింది. అన్న కొత్తగా పెట్టిన పార్టీ పట్ల ఆమెకి ఆసక్తి కలిగింది. తాను కూడా అన్నతో సమంగా పార్టీ అభివృద్ధికి కష్టపడింది.
ఎన్నికల సమయంలో రాష్ట్రానికీ, కేంద్రానికీ ఒకేసారి ఎన్నికలు వచ్చేయి. సుభాష్ తన చెల్లెలు విద్యని లోక్ సభ ఎన్నికల బరిలో దింపి తాను శాసన సభకి పోటీ చేసేడు. ఇద్దరూ ఎన్నికల్లో గెలిచారు. విద్య అత్యధిక మెజారిటీతో గెలిచింది.
ఇది నా స్వీయ రచన
ప్రజా సేవ -2వ భాగం
విద్య లోక్ సభకి ఎన్నికయింది కానీ అన్న ఏది చెప్పితే అదే. కేంద్రంలో అధికారం చేపట్టవలసిన పార్టీ కి పూర్తి మెజారిటీ లేక సుభాష్ పార్టీ మద్దతు తీసుకోవలసి వచ్చింది. ప్రధాని విద్యకి మానవ వనరుల శాఖ కేటాయిస్తామంటే ఆర్ధిక మంత్రిత్వ శాఖ కేటాయించాల్సిందే అని సుభాష్ పట్టు పట్టేడు. అతని డిమాండ్ కి కేంద్రం తల ఒగ్గింది.
సుభాష్ శాసన సభ ఎన్నికల తరువాత మెజారిటీ పార్టీ నాయకుడుగా రాష్ట్ర ముఖ్యమంత్రి అయ్యాడు.
విద్య ఆర్ధిక మంత్రి అయ్యాక సుభాష్ నుండి ఒత్తిడులు ఎక్కువయ్యాయి. రాష్ట్రానికి అధిక వనరులు అడుగుతాడు. ఇంకా ఏవో అదనపు గ్రాంట్స్ డిమాండ్ చేస్తాడు.
ఇదంతా రాష్ట్ర ప్రజల మెప్పు పొందడానికే సుభాష్ చేస్తున్నాడు.
కానీ ఒక రాష్ట్రానికి అధిక నిధులు ఇస్తే మిగతా రాష్ట్రాలూ అడుగుతాయి. అన్నీ తెలిసి విద్య ప్రధాని దగ్గరకి ఆ డిమాండ్లతో వెళ్ళలేదు.
ఇది నా స్వీయ రచన
ప్రజా సేవ -3వ భాగం
రాజగోపాల్ కి విద్య మీద ఎంత ఒత్తిడి ఉందో అర్ధమైంది. అతను స్వయంగా విద్యని కలిసి "నువ్వు, నీ అనుచరులతో కలిసి నా పార్టీలోకి వచ్చేయ్.ఇప్పటికే ఎక్కువ మంది నా పార్టీ నుండి మీ అన్న పార్టీకి వెళ్ళిపోయారు" అన్నాడు.
విద్య బాగా ఆలోచించింది. ప్రధానికి తన సమర్ధత మీద చాలా నమ్మకం ఉంది. తను అన్న పార్టీకి రాజీనామా చేసినా కేంద్రం ఆర్ధిక మంత్రిగానే కొనసాగించి, రాజ్యసభ కి ఎంపిక చేస్తుంది.
విద్య తన అనుచరులతో, శ్రేయోభిలాషులతో చర్చించి 'అభ్యుదయ' పార్టీ స్థాపించింది.
కొత్త పార్టీలో కొందరు అన్న అనుచరులు, మరి కొందరు తండ్రి పార్టీ నుండి చేరేరు. దాంతో అన్న ప్రభుత్వం మైనారిటీ లో పడిపోతే విద్య అన్న పార్టీకి మద్దతు ఇచ్చి ప్రభుత్వం పడిపోకుండా కాపాడింది.
తరువాతి ఎన్నికల్లో అభ్యుదయ పార్టీ రాష్ట్రంలో అత్యధిక సీట్లు సంపాదించి, విద్య ముఖ్యమంత్రి అయింది. కేంద్రంలో కూడా గణనీయంగా సీట్లు రావడంలో నూతన మంత్రివర్గం లో భాగస్వాములు అయ్యారు.విద్య తమ పార్టీకి చెందిన ఓ సమర్ధుడైన నాయకుడు ఆర్ధిక మంత్రిగా ఎన్నికయ్యేలా చూసింది.
ఇది నా స్వీయ రచన
దిద్దుబాటు
ఓ స్వతంత్ర భారతమా
జనాభాలో తొలి స్థానం మనదైనా
ఒలింపిక్స్ లో మన స్థానం అట్టడుగునేలమ్మా
మహిళల క్రికెట్ హాకీలను
భారతావనిలో ఆదరించేదెపుడమ్మా
మహిళా దినోత్సవ ఆర్భాటాలేగాని
చట్టసభలలో మహిళా రిజర్వేషన్
చర్చలేమాయె
ఆకాశాన్నంటే అత్యవసర వస్తువుల ధరలు
నిరాశ నిండిన నిరుపేదల బతుకులు
డిగ్రీలు చేపట్టిన యువత
భద్రత లేని వారి భవిత
విదేశాలలో భారతీయులు నేర్పుతారు
తమ పిల్లలకు మన భాషా సంస్కృతులు
కానీ మరలిరాలేరు మాతృదేశానికి
దిద్దుకోవమ్మ నిన్ను నువ్వు
భారత ప్రజాస్వామ్యమా
ఇది నా స్వీయ రచన
అమ్మతనం
ఆరుద్ర.....సినీ కవి అనుకున్నారేమో....నా కథానాయిక ఆమె. ఆ పేరంటేనే బలే ఇష్టం నాకు.
ఆరడుగుల ఎత్తు, చక్కటి నవ్వు, నొక్కుల జుత్తు. ఆరుద్ర భర్త అమాయకత్వం, అత్తగారి అతి మంచితనం ఆమెకి కష్టాలే తెచ్చిపెట్టాయి. పెళ్ళయినప్పటి నుండి ఆమె కష్టజీవే.
ఆరుద్ర కి తొలి కాన్పు కవలలు. ఇద్దరూ అబ్బాయిలు. ఇద్దరూ అర్భకంగానే పుట్టారట. వాళ్లు బతుకుతారో లేదో అనే అందరూ అనుకున్నారట. మరో రెండేళ్ళకే మళ్ళీ కవలలు. మళ్ళీ మగపిల్లలే.ఆరుద్ర ఆ పిల్లల అల్లరి భరించలేక పోయేది.
ఆరుద్ర అత్తమ్మ, భర్త సింహాచలం ఆరుద్ర పిల్లల మీద కోపమొచ్చి రంకెలేస్తే పిల్లలని దూరంగా తీసుకుని వెళ్ళిపోయేవారు.
ఆరుద్ర పిల్లలని పెంచింది. ఎంతో కొంత చదువు చెప్పించింది. అవసరమైనప్పుడు తనతో పనికి తీసుకెళ్ళింది. తన చెల్లి ఒక ఆడపిల్లని ప్రసవించి చనిపోతే ఆ పాపకి తానే తల్లి అయి పెంచింది ఆరుద్ర.
పిల్లలందరికీ తల్లంటే భయం, భక్తి. ఏది కావాలన్నా బామ్మ కో, అయ్యకో చెప్పేవారు. చెల్లెలు దుర్గకి ధైర్యమెక్కువే.
దుర్గకి ముందు పెళ్లి చేసి తన బాధ్యత తీర్చుకుంది. పిల్లలంతా పెళ్లిళ్లు అయ్యాక వేరేగానే ఉంటారు. దుర్గ ఆరుద్ర దగ్గరకి వచ్చి పోతుంటుంది.
దుర్గ దగ్గరకి వెళ్తే అన్నీ చేసి తీసుకెళ్ళేది ఆరుద్ర. "నా చెల్లి పేరే దాని కూతురికి దుర్గ అని పెట్టా. ఎంత చూసినా, ఎంత చేసినా నేను సొంత తల్లి ని కాలేను కదమ్మా " అంటుంది ఆరుద్ర.
ఇది నా స్వీయ రచన
స్ఫూర్తి ప్రదాత
ఆమె జమిందారిణి. కొడుకు యువరాజు. కొడుకుకి పెళ్లి చేసిననాటికి జమిందారు కుటుంబ భూములేవీ మిగలలేదు.
తల్లి చేసిన తప్పేంటంటే కొడుకుని అతి సుకుమారంగా పెంచడం. కొత్త కోడలికి పరిస్థితి అంతా అర్ధమయిపోయింది. తను
చదివిన చదువుకి వచ్చిన ఉద్యోగం లో వెంటనే చేరిపోయింది.
ఆ అమ్మాయి పేరు సరోజ. భర్త ఏ ఉద్యోగం ఎక్కువ రోజులు చేయలేడు. తను ఏదో ఒక ఉద్యోగం తప్పనిసరిగా చేయాల్సిందే.
సరోజ భర్త ప్రభు. మనిషి చాలా మంచివాడే కానీ ఎక్కడా ఇమడలేడు. సరోజకి పెద్ద పెద్ద కలలేవీ లేవు.
సరోజ గర్భవతి అయినప్పుడు కూడా పురిటికి ఒకరోజు ముందు వరకూ పనికి వెళ్తూనే ఉంది. పురిటికి పుట్టింటికి వెళ్ళనేలేదు. అప్పటి దాకా అంత కష్టపడిందేమో కాన్పు సునాయాసంగా జరిగిపోయింది.
సరోజ కొడుకు హరి. జీవన పోరాటం లో ఎప్పటికయినా హరి తనకి చేదోడువాదోడు కాకపోతాడా అన్నది ఆమె ఆశ.
ప్రభు సంపాదన విషయం లో సరోజకి ఎక్కువ సాయం చేయలేక పోయినా కొడుకు పెంపకం బాధ్యత పూర్తిగా తీసుకు న్నాడు. తన భార్య బాగా అలిసి పోయి
వస్తుందని ఇంటి బాధ్యత తనే ఎక్కువగా తీసుకునేవాడు.
హరిని సరోజ మంచి బడిలో చేర్చింది. ప్రభు హరికి చదువే కాకుండా మిగతా పుస్తకాలు చదివి వినిపించేవాడు. తనకి వచ్చినట్టు బొమ్మలు గీయడం నేర్పేవాడు.
సరోజ పని ఉన్నప్పుడు సెలవురోజు కూడా తను పని చేస్తున్న షోరూమ్ కి వెళ్ళేది. అప్పుడు హరిని కూడా తనతో తీసుకెళ్ళేది. హరి అక్కడ అందరూ తన తల్లిని ఎంత గౌరవిస్తారో, అక్కా అక్కా అంటూ అభిమానిస్తారో చూసేవాడు.
సరోజ తనకి తెలిసినవారికి ఎవరికి ఏ కష్ట మొచ్చినా అందరికంటే ముందు తనే ఉండేది. అందరికీ సాయపడేది. సరోజ ఇంటికి వచ్చిన వాళ్లు ప్రభు తో, అతని తల్లితో కూడా బాగా మాట్లాడేవారు.
హరికి పెద్దవుతుంటే అర్థమయిందేమిటంటే తన తల్లి తమ జీవితాల కోసం పోరాటం చేయడమే కాదు మిగతా వాళ్ల జీవితాల కోసం కూడా నిరంతరం పోరాడుతూనే ఉంటుందని. అమ్మే అతనికి స్ఫూర్తి ప్రదాత.
ఇది నా స్వీయ రచన
మాతృత్వం
అవినాష్ కి వివాహ వ్యవస్థ మీద నమ్మకం లేదు. ఏ స్త్రీని తన జీవితంలోకి ఆహ్వానించే ఉద్దేశ్యం లేదు. కానీ అతనికి తండ్రి కావాలని ఉంది. అతని తండ్రికి వంశోధ్ధారకుడు మనవడిగా తన ఆస్తికి వారసుడిగా కావాలని ఉంది.
అనితది కుటుంబాన్ని పోషించవలసిన పరిస్థితి. తల్లితండ్రుల ఆరోగ్యం, చెల్లికి ఉన్న క్రీడాసక్తి వల్ల ఆమెకి మంచి కోచింగ్ ఇప్పించడం ఆమె ప్రాధాన్యతలు.
అనితకి ఒక స్నేహితురాలి ద్వారా అవినాష్ తన బిడ్డకి సరోగసీ తల్లి అయ్యే అమ్మాయి కోసం వెతుకుతున్నాడని తెలిసి, ఆమె అలా తల్లి కావడానికి సంసిద్ధురాలయింది
అనిత అవినాష్ తో ఫోన్ లో మాట్లాడి తన అంగీకారాన్ని తెలిపింది. అవినాష్ ఆమెని ఓ ఆసుపత్రికి తీసుకొని వెళ్ళాడు.
ఆ డాక్టర్ ని అవినాష్ అక్కా అని పిలుస్తున్నాడు.
డాక్టరు ప్రభ ఆమెకి అన్ని పరీక్షలు జరిపి ఆసుపత్రిలోనే వారం రోజులు ఉంది. తర్వాత ఆమెని అవినాష్ బంగళాలోనే ఒక గదిలో ఉంచారు. డెలివరీ అయిందాక ఆమె అక్కడే ఉండాలని చెప్పారు.
అవినాష్, అవినాష్ తండ్రి సుగుణాకర రావు రోజూ ఏదో ఒక టైం లో వచ్చి అనితని చూసి వెళ్ళేవారు. డాక్టరు ప్రభ కూడా వచ్చి చూసి వెళ్తుండేది.
అనిత తన చెల్లికి, తల్లి తండ్రులకి తనకో ఉద్యోగం దొరికిందని ఒక ఏడాది వాళ్లకి దూరంగా ఉండాలని చెప్పింది. డబ్బులు మాత్రం క్రమం తప్పకుండా పంపేది.
అనిత పండంటి ఆడపిల్లకి తల్లి అయింది. అవినాష్ తాను తండ్రి అయినందుకు, సుగుణాకరరావు మనవరాలు పుట్టినందుకు చాలా సంతోషించారు. అనిత ఆనందం ఇక చెప్పనక్కర్లేదు. పాప ఆరోగ్యంగా ఉందేమో ఇంకా ముద్దుగా ఉంది.
పాపని అందరూ చూడటానికి వస్తే పాప ఆరోగ్యం పాడవుతుందని వాళ్లు ఎవరినీ పాప గదిలో అడుగు పెట్టనివ్వలేదు.
పాపకి శృతి అవి పేరు పెట్టేడు అవినాష్. పాపకి తల్లి పాలే మంచివి కాబట్టి అనిత మరికొన్ని రోజులు పాప దగ్గర ఉండాలన్నాడు సుగుణాకర రావు .
అనిత పాప దగ్గర మరి కొన్నాళ్ళు ఉండటానికి అవినాష్ అంగీకరించేడు. శృతితో తాను మరికొన్నాళ్ళు ఉండొచ్చని అనిత చాలా సంతోషించింది. శృతిని అనిత చాలా అపురూపంగా, జాగ్రత్తగా చూసుకునేది.
అవినాష్ శృతిని తోటలోకి , బయటకి తీసుకుని వెళ్ళేవాడు. అనిత కూడా తోటలో తిరిగేది. సుగుణాకర రావు ఒక గది లో గ్రంధాలయం ఏర్పాటు చేసుకున్నాడు. అనిత అక్కడ నుండి పుస్తకాలు తెచ్చి చదివేది.
శృతి ఏడాది పుట్టిన రోజు తరవాత అనిత తల్లి తండ్రుల దగ్గరకి వెళ్ళిపోయింది.
శృతికి మూడు సంవత్సరాలు నిండేయి.
అవినాష్ తన కంపెనీ పనిలో బిజీగా ఉంటే, సుగుణాకర రావు ఆయా సాయం తో మనవరాలిని తనే చూసుకునేవాడు.
శృతి సుగుణాకర రావు దగ్గర కూర్చుని ఆల్బం చూస్తోంది. ఆల్బం లో తనని ఎత్తు కున్న ఆవిడ శృతికి బాగా నచ్చింది.
"ఎవరిది " అని తాతని అడిగింది.
"మీ అమ్మ" అన్నాడు సుగుణాకర రావు.
"మరి ఇక్కడ ఎందుకు లేదు "
"వాళ్ళ అమ్మానాన్నల దగ్గరకి వెళ్ళింది
"మరి ఎప్పుడు వస్తుంది? "
"రమ్మందాం లే" అన్నాడు శృతి వాళ్ళ తాత.
శృతి వాళ్ళ నాన్నతో కూడా "అమ్మని రమ్మను" అని చెప్పింది.
ఒకరోజు సుగుణాకర రావు అనితకి ఫోన్ చేసి "శృతి నిన్ను రమ్మంటోంది " అని
చెప్పాడు.
"నేను రేపే వస్తాను " అని చెప్పి ఫోను పెట్టేసింది అనిత.
అనిత రెండేళ్ళ తర్వాత శృతిని చూసింది. పాప బాగా తెలిసిన వాళ్ల దగ్గరకి వెళ్ళినట్టు శృతి అనిత దగ్గరకి వచ్చేసింది.
ఆరోజంతా అనిత శృతితో గడిపింది. కానీ
మర్నాడు శృతి తో "నేను అక్కడ చిన్న పిల్లలని చూసుకోవాలి. వాళ్లు నేను లేకపోతే ఏడుస్తారు " అని చెప్పి వెళ్ళిపోయింది.
శృతి తరచుగా వాళ్ల నాన్నని, తాత గురించి అడుగడం మొదలెట్టింది.
సుగుణాకర రావు అవినాష్ కి ఓ సహా
ఇచ్చాడు.
"అనిత కి మన కంపెనీలో ఉద్యోగం ఇవ్వు. మన తోటలో ఉన్న గెస్ట్ హౌస్ లో ఆమె ఉండనీ. అలా అయితే శృతి అప్పుడప్పుడూ చూడొచ్చు "
అవినాష్ దానికి ఒప్పుకున్నాడు.
అనిత అవినాష్ కంపెనీలో చేరింది.
అనిత సాయంత్రం కాలేజీలో పి.జి. చేస్తోంది.
అవినాష్ కి శృతి ఒంటరిగా ఫీలవుతోందేమో,మరో చెల్లో తమ్ముడో ఉంటే అమ్మ ధ్యాస ఉండేదేమో అనిపించింది.
ఒకరోజు అనిత తో" శృతికి మరో చెల్లి గానీ తమ్ముడు గానీ ఉంటే బాగుంటుంది కదా " అన్నాడు.
"బాగానే ఉంటుంది "
"మరోసారి నాకో పాప కావాలంటే నువ్వు అంగీకరిస్తావా"
"ఒప్పుకుంటాను. కానీ రెండు షరతులు."
"ఏంటవి"
"నా రెండో బిడ్డ ని నా భర్త కోసమే కనాలనుకుంటున్నా. నా రెండో ప్రసవ సమయానికైనా మా అమ్మ నా పక్కన ఉండాలనుకుంటున్నా."
"నీ రెండో బిడ్డ నాకు కావాలంటే మన పెళ్ళి ముందు జరగాలన్నమాట. నా నియమాన్ని పక్కన పెట్టి మన పెళ్ళి విషయం నాన్న తో మాట్లాడుతా" అన్నాడు అవినాష్.
చిన్నారి పెళ్లికూతురు
ఆ రోజుల్లో అది తప్పు కాదు. నేరమూ కాదు. ఏడేళ్ళ తన కూతురిని తన స్నేహితుడి కొడుకుకి ఇచ్చి పెళ్లి చేసాడు రామమూర్తి.
అమ్మాయి గౌరి. అబ్బాయి శివప్రసాద్.
శివప్రసాద్ కి అప్పటికి పది ఏళ్ళు.
రామమూర్తి ఉపాధ్యాయుడు. కవి పండితుడు కూడా.
గౌరి అత్తవారిల్లు పుట్టింటికి దగ్గరలోనే ఉండేది. పదమూడేళ్ళ వరకు పూజలకు, పండగలకి అత్తవారింటికి వెళ్ళేది తప్ప ఎప్పుడూ పుట్టింట్లోనే ఉండి వాళ్ల నాన్నతో కలిసి బడికి వెళ్ళేది.
శివప్రసాద్ కి చదువు మీద కంటే తాత చేయించే వ్యవసాయం మీద దృష్టి ఎక్కువ ఉండేది. సెలవులిస్తే చాలు తాత దగ్గరకి వెళ్ళిపోయేవాడు.
గౌరి బాగా చదువుకుంటుందని శివప్రసాద్ నాయనమ్మ కి చాలా ముచ్చటగా ఉండేది. ఆ అమ్మాయిని ఎలాగైనా పెద్ద చదువులు చదివించాలని ఆవిడ కోరిక.
వాళ్ళింట్లో ఆవిడ మాటే వేదవాక్కు.
శివప్రసాద్ నాయనమ్మ పేరు లక్ష్మీ దేవి. ఆవిడ మాటకి ఇంట్లోనే కాదు ఊళ్ళో కూడా అందరూ విలువిస్తారు.
ఆ ఊర్లో చదువు అయిపోయాక పెద్ద చదువులకి గౌరి పట్నం వెళ్ళాలి. లక్ష్మీదేవి తను పట్నం లో ఉండి గౌరిని చదివిస్తానని చెప్పింది. మనవడు వ్యవసాయం చేస్తునన్నా గౌరి పెద్ద చదువులు చదువుతానన్నా ఆవిడకి తప్పేమీ కనిపించలేదు. పెద్దవాళ్ళు దగ్గరుండి పిల్లలని సరైన తోవలో నడపాలి అనుకునేది.
పట్నం లో గౌరితో పాటు ఉండడానికి వెళ్ళేటప్పుడు లక్ష్మీ దేవి రాముడు అనే కుర్రాడిని, వాడి భార్య నీలిని కూడా తన తో తీసుకెళ్ళింది.
గౌరి డాక్టరు చదువులో చేరింది. శివప్రసాద్ అప్పుడప్పుడు పట్నం వచ్చేవాడు. తన భార్య ప్రాణం పోసే చదువు చదువుతోందని శివప్రసాద్ చాలా ఆనందించేవాడు.
లక్ష్మీదేవి గౌరి చదువు కోసం అవసరమైతే కొంత పొలం అమ్మమని, తన బంగారం కూడా అమ్మమని భర్తకి, కొడుకుకి చెప్పింది.
లక్ష్మీ దేవిని గౌరి అమ్మమ్మా అని పిలిచేది. లక్ష్మీ దేవి గౌరికి ఏ పనీ చెప్పేవారు కాదు.
గౌరి మంచి మార్కులు తెచ్చుకుని తన చదువు పూర్తి చేసింది. లక్ష్మీ దేవి వాళ్ల ఊరిలోనే ఆసుపత్రి ఏర్పాటు చేయాలని తన భర్తతో చెప్పింది. శివప్రసాద్ ఆ ఊరిలోనే వ్యవసాయం చేస్తున్నాడు.
ఆసుపత్రి నిర్మాణం అయ్యాక గౌరి ,ఆమెతో పాటు చదివిన శ్రీనాధ్ రోగులని చూసేవారు. ఇంతలో గౌరి గర్భవతి అయింది. ఇంట్లో అందరి సంతోషం అంతా ఇంతా కాదు. ఆమె పురిటికి పుట్టింటికి వెళ్ళినపుడు ఆమె స్నేహితురాలు సీత ఆసుపత్రి లో పని చేయడానికి వచ్చింది.
గౌరికి సుఖ ప్రసవమై పాప పుట్టింది.
గౌరికి లక్ష్మీ దేవి అంటే ఉన్న గౌరవం, ప్రేమ తో తన కూతురికి లక్ష్మి అని పేరు పెడుతుంది.
గౌరి లక్ష్మి ని తీసుకొని పుట్టింటి నుండి మూడో నెల లో శివప్రసాద్ వాళ్ల ఊరికి వచ్చింది. లక్ష్మీ దేవి పాపని పనివాళ్ళ సాయం తో చూసుకునేది. గౌరి అత్తగారు, మామగారు కూడా ఆయన ఉద్యోగ పదవీ విరమణ అయిపోయాక అక్కడికే వచ్చేసారు. దూరపు బంధువు ఒకామె వీళ్ళతోనే ఉండి వంటచేసి పెట్టేది.
గౌరి మళ్ళీ ఆసుపత్రికి వెళ్ళడం మొదలెట్టింది. శ్రీనాధ్, సీత వివాహం చేసుకుని అదే ఆసుపత్రి లోనే పనిచేస్తూ అక్కడే ఉండిపోయారు.
ఒకసారి లక్ష్మీ దేవి భర్తకి తీవ్రంగా గుండెనొప్పి వచ్చింది. గౌరి వాళ్ల ఆసుపత్రి లో ముందు వైద్యం చేసి తరవాత పట్నం తీసుకెళ్ళి పూర్తిగా నయం అయినంత వరకూ తను కూడా అక్కడే ఉంది.
గౌరి ఇంటికి వచ్చాక లక్ష్మీ దేవి గౌరితో " నేను నువ్వు చదువుకోవడానికి సాయం మాత్రమే చేసేను. నువ్వు నాకు భర్తని బతికించి తెచ్చి ఇచ్చేవు" అంది ఆనందంతో కన్నీళ్లు పెట్టుకుంటూ.
గౌరి శివప్రసాద్ తాతని బతికించగలిగింది కానీ లక్ష్మీదేవి గుండెని ఆ విషయం ఎంత గాయపరచిందో తెలియదు కానీ ఆరునెలలు తిరగకుండా ఆమె కనుమూసింది. ఆ బెంగతో శివప్రసాద్ తాత కూడా కొద్ది కాలానికే పోయారు.
శివప్రసాద్ కి రాజకీయాలంటే ఆసక్తి. ఆ జిల్లాలో అతనికి మంచి పేరు ఉంది.
గౌరి లక్ష్మీ దేవి పేరు మీద ఒక బాలికా విద్యాలయం కట్టించమని శివప్రసాద్ కి చెప్పింది. శివప్రసాద్ తన రాజకీయ పలుకుబడి ఉపయోగించి గ్రాంట్లు తెప్పించి ఆ విద్యాలయం పని పూర్తి చేసేడు.
లక్ష్మి ఆ బడిలోనే చేరింది. తల్లిలా లక్ష్మి కూడా బాగా చదివేది. బడిలో అందరూ వాళ్ల అమ్మ గురించి మాట్లాడేవారు.
గౌరి తమ్ముడు, మరదలు ఆ బడిలో ఉపాధ్యాయులుగా చేరేరు.
గౌరి తమ్ముడు, మరదలు లక్ష్మి చదువు గురించి ఎక్కువ శ్రద్ధ తీసుకొనేవారు. వాళ్ళు గౌరి ఇంటి పక్కనే ఉండేవారు.
లక్ష్మిని బడి అయ్యాక వాళ్ల ఇంటికే తీసుకెళ్ళి లక్ష్మిని కొంతసేపు ఆడించి,
ఇద్దరూ చదివించేవారు.
శివప్రసాద్ అంచెలంచెలుగా ఎదిగి జిల్లా రాజకీయాలు, రాష్ట్ర ,కేంద్ర రాజకీయాలలో పాల్గొని గొప్ప నాయకుడిగా పేరు సంపాదించుకున్నాడు. తరచు ఢిల్లీ వెళ్తుండేవాడు.
శివప్రసాద్ రాష్ట్ర మంత్రివర్గం ,తర్వాత కేంద్ర మంత్రివర్గం లో కీలక పదవులలో పని చేసాడు.
గౌరి నిరంతరం ఆసుపత్రి పనులలో తలమునకలయి ఉండేది. చుట్టుపక్కల గ్రామాల్లో వైద్య క్యాంపులు ఏర్పాటు చేసి తన స్నేహితుల సాయం తో ప్రజలకి వైద్య
పరీక్షలు చేయించేది. కంటి వైద్యులతో కంటి పరీక్షలు చేయించేది.
చుట్టుపక్కల గ్రామాల ప్రజలంతా ఆమె గురించి, లక్ష్మీ దేవి గురించి చెప్పుకొనేవారు.
లక్ష్మి కాలేజీ చదువు కోసం పట్నం లో మేనత్త ఇంటికి వచ్చింది. ఆమె మేనత్త రాధకి అన్న శివప్రసాద్ అంటే వల్లమాలిన ప్రేమ. లక్ష్మి ని తన కూతురిలా చూసుకునేది.
ఇది నా స్వీయ రచన
చిన్నారి పెళ్లి కూతురు (ఆఖరి భాగం)
కాలేజీ చదువు అయిపోయాక లక్ష్మి మేనత్త దగ్గరే ఉండి సివిల్స్ పరీక్షలకి కోచింగ్ తీసుకుంది. ఆ పరీక్షలలో ఆమెకి
మంచి ర్యాంక్ రావడంతో ఐ.ఎ.ఎస్ కి ఎంపికయింది.
గౌరి ని, ఆమె సేవలు గుర్తిస్తూ భారత అధ్యక్షుడు రాజ్యసభ సభ్యురాలిగా ఎంపిక చేసారు
గౌరి రాజ్యసభ లో ప్రసంగిస్తూ "ఓ చిన్నారి పెళ్లి కూతురుని వాళ్ల అత్తింటివారు చదివించి వైద్యురాలిగా చేసారు. నా భర్త శివప్రసాద్ గారి నాయనమ్మ లక్ష్మీ దేవి గారి వల్లే ఇదంతా సాధ్యమయింది. ఆవిడకి నేను జీవితాంతం ఋణపడి ఉంటాను " అని ఉద్వేగంగా తెలిపింది.
విరిబాల
మనమీద
ఎంత ప్రేమ
ఆ పూలకి
పరిమళాలు
వెదజల్లుతాయి
పెళ్ళి మంటపాన్ని
అలంకరిస్తాయి
పుష్పగుచ్చమై
కానుకగా
నిలుస్తాయి
అమ్మాయి
తలలో
మాలగా
పరవశిస్తాయి
అమరుడి
కాళ్ళదగ్గర
వినమ్రంగా
ఒదిగిపోతాయి
ఇది నా స్వీయ కవిత
చేనుని మేసిన కంచె
భయంకర దృశ్యాలు
మృత్యువుకు చేరువౌతూ
బచావ్ బచావ్ అంటూ చేసే
అస్పష్ట ఆర్తనాదాలు
నిన్న నింగిని చుంబించిన
ఆకాశ హర్మ్యాలు
నేడవి కుప్పకూలిన పేకమేడలు
చిన్నాభిన్న మృత దేహాలు
చెదిరిన కుటుంబాలు
ఆప్తుల ఆక్రందనలు
ఆర్భాట గృహప్రవేశాలు
వ్యర్ధమైన వేదమంత్రాలు
గుమ్మంలో వేలాడేసిన గుమ్మడికాయ
ధ్వంసమైన హ్యుమన్ బాంబ్ లా
ఆత్మాహుతి చేసుకుంది
స్వజనాన్నే పొట్టనపెట్టుకున్న ఇల్లు
నిరపరాధినంటూ క్షమాభిక్ష కోరింది
9 .2 .2001
వార్త
ఇది నా స్వీయ రచన
ప్రేమ పెళ్ళి
తన కొడుకు పెళ్ళికి వెంకట్రావు పెట్టిన మొదటి షరతు కట్నం. కొడుకు తో " అమ్మాయిని నువ్వు, మీఅమ్మ ఎంచుకోండి. అమ్మాయి మీకు నచ్చితే పెద్దవాళ్ళతో నేను మాట్లాడతా" అన్నాడు .
"నాన్నా, కట్నం తీసుకోవడం నేరం కదా " మెల్లగా అన్నాడు అభిరామ్.
"అందరూ కొడుకు పెళ్ళికి కట్నం తీసుకుంటారు. మాకు కట్నం వద్దని చెప్తే నీలో ఏదో లోపం ఉంది అని కూడా అనుకుంటారు" అన్నాడు వెంకట్రావు కొడుకుని భయపెడుతూ.
వెంకట్రావు భార్య సుగుణకి అసలే నోట్లో నాలుక లేదు. భర్త కి ఎదురు చెప్పే అలవాటు అసలు లేదు.
అభిరామ్ సురేఖని ఇష్టపడుతున్నాడు. సురేఖకి మరో చెల్లి, తమ్ముడు ఉన్నారు. వాళ్ళకి సొంత ఇల్లు కూడా లేదు.
సురేఖ డిగ్రీ పూర్తి చేసి ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నాది.
ఒకరోజు సురేఖ ఇంటర్వ్యూ కి బయలుదేరింది. అదే సమయానికి తల్లి ఆరోగ్యం బావోలేక బయలుదేరడం ఆలస్యమైంది. రోడ్డు మీదకి వచ్చేసరికి ఓ కారు కనిపించేసరికి సురేఖ కారు ఆపమని సౌంజ్ఞ చేసింది. కారు నడుపుతున్న అభిరామ్ కారు ఆపేడు.
సురేఖ " నాకు లిఫ్ట్ ఇవ్వగలరా? నేను ఒక ఇంటర్వ్యూ కి వెళ్ళాలి. "అని అడిగింది. అభిరామ్ " తప్పకుండా " అని ఆమె చెప్పిన ఆఫీసు కి తీసుకుని వెళ్లాడు.
సురేఖ ఇంటర్వ్యూ పూర్తిచేసి బయటికి వచ్చేసరికి అభిరామ్ ఆఫీసులోనే కూర్చుని ఉన్నాడు.
"ఈ కంపెనీ మా స్నేహితుడిదే. మీరు మీ ఇంటికి వెళ్ళిపోగలరు కదా" అన్నాడు అభిరామ్.
సురేఖ ఆ ఇంటర్వ్యూ లో ఎంపికయి ఆ ఆఫీసుకి వెళ్ళడం మొదలెట్టింది.
అభిరామ్ కూడా తన స్నేహితుడు కోరికపై తను చేస్తున్న ఉద్యోగం వదిలేసి, అదే ఆఫీసు లో చేరేడు.
అప్పటినుంచీ అభిరామ్ సురేఖని రోజూ చూస్తున్నాడు. ఆఫీసు లో అందరూ తనడానికి రోజూ ఓ ఐటెమ్ చేసి తెచ్చేది. ఎవరు పని పూర్తి చేయలేక ఇబ్బంది పడినా తను ఎంతోకొంత సాయం చేసేది. వారికి ధైర్యం చెప్పేది.
సురేఖ సెలవురోజున కోవెలకు వెళ్లింది. అదే కోవెలకు అభిరామ్ తల్లి, ఆమె చెల్లి వచ్చేరు. ఆవిడ దేవుడికి దండం పెట్టుకొని వచ్చి కూర్చుంటే ఆమెకి కళ్ళు తిరిగేయి. అక్కడే ఉన్న సురేఖ ఆవిడని వాళ్ళ ఇంటికి తీసుకుని వెళ్లడానికి సాయం చేసింది. వాళ్ళింటి పక్కనే ఉన్న డాక్టర్ వచ్చి చూసి ఫరవాలేదని చెప్పి పళ్ళరసం ఇమ్మన్నాడు.
వెంకట్రావుకి భార్య అంటే ప్రేమ. ఆమెకి ఏమయినా అవుతుందేమో అని ఆందోళన. తన భార్యని ఇంటికి తీసుకుని వచ్చిన సురేఖ అతనికి బాగా నచ్చింది. అభిరామ్ తల్లికి మరీ నచ్చింది.
అభిరామ్ స్నేహితుడు అశోక్. అతను సురేఖ బాస్ కూడా. అశోక్ లీలని ప్రేమిస్తున్నాడు. లీల అమెరికా వెళ్ళే ప్రయత్నంలో ఉంది.అశోక్ తో పెళ్ళయ్యాక అమెరికాలో సెటిల్ అవుదామని చెప్పింది.
అశోక్ ని,లీలని అభిరామ్ తన ఇంటికి రమ్మన్నాడు. సురేఖ ని కూడా వాళ్ళకి కంపెనీ ఇవ్వడానికి రమ్మన్నాడు. ముగ్గురూ అభిరామ్ వాళ్ళ ఇంటికి వచ్చేరు.
లీల అభిరామ్ వాళ్ళ ఇంట్లో ఉన్నంత సేపు ఫోన్ లో మాట్లాడుతూనే ఉంది. అందరికీ తన అమెరికా ప్రయాణం గురించి చెప్తూనే ఉంది.
సురేఖ ఒక స్వీట్, ఒక హాట్ తనే చేసి తెచ్చింది. అభిరామ్ వాళ్ళ అమ్మకి పనిలో సాయం చేస్తూనే ఉంది.
అశోక్ తాము త్వరలోనే పెళ్ళి చేసుకుని అమెరికా వెళ్ళి పోతామని చెప్పాడు. పెళ్ళి రిసెప్షన్ తన తండ్రి ఏర్పాటు చేస్తున్నాడు కాబట్టి ఆరోజు తప్పకుండా రమ్మని అభిరామ్ తల్లి తండ్రులకి చెప్పేడు.
లీల తండ్రి ఘనంగా పెళ్ళి చేయలేడని లీల ముందునుంచి రిజిష్టర్ పెళ్ళి అనిచెప్పి అశోక్ ని దానికే ఒప్పించింది.
వెంకట్రావు తన భార్యతో అశోక్ పెళ్ళికి వెళ్ళినప్పుడు సురేఖ అక్కడే ఉంది. అశోక్ తండ్రి వెంకట్రావుకి సురేఖని చూపిస్తూ "ఈ అమ్మాయినయితే ఎవరైనా ఎదురు కట్నం ఇచ్చి కోడలుగా తెచ్చుకోవచ్చు. మాకా ఛాన్స్ లేదు. ఉన్న ఒక్క కొడుక్కీ పెళ్ళయిపోయింది " అన్నాడు.
వెంకట్రావుకి సురేఖ ఎంత నచ్చినా ఆ అమ్మాయి కోడలుగా రావాలంటే కట్నం తేవాల్సిందే అనుకుంటున్నాడు.
సురేఖ తండ్రి సొంత ఇల్లు కూడా కనుక్కోలేక పోయాడు. ఆమె తల్లితండ్రులు ఒక్క సంతానం చాలనుకున్నారు. సురేఖ తల్లి మందుల మీదే బతుకుతోంది.
సురేఖ చిన్నాన్న డాక్టర్. అదే ఊరిలో ఉంటాడు. తరచూ వచ్చి తన వదినని తనిఖీ చేసి వెళుతుంటాడు.
సురేఖని వివాహం చేసుకుని ఉద్దేశ్యం తనకుందని అభిరామ్ సురేఖ తండ్రికి తెలియచేశాడు. సురేఖ తండ్రి తన తమ్ముడిని తీసుకొని అభిరామ్ వాళ్ళ ఇంటికి వెళ్ళేడు. వెంకట్రావు తన కొడుక్కి పది లక్షలైనా కట్నం ఇవ్వందే సురేఖని కోడలుగా అంగీకరించనని, కట్నం ఇవ్వని పక్షంలో మరో సంబంధం చూసుకోమని చెప్పేసాడు.
సురేఖ ఇంటికి వచ్చేక పెళ్ళి విషయమై వెంకట్రావు ఏమన్నాడో తన భార్యతో చెప్తుంటే సురేఖ వింది.
"నాన్నా, నువ్వు కట్నం ఇవ్వడం నేరం. కట్నం ఇచ్చి నాకు పెళ్లి చేయాలనుకోకు. అమ్మ ఆరోగ్యం మనకి ముఖ్యం. అమ్మని మనం జాగ్రత్తగా చూసుకోవాలి. మళ్ళీ ఈ ప్రస్తావన మనింట్లో తేకు" అంది సురేఖ.
వెంకట్రావుకి కొద్దిపాటి అనారోగ్యానికి కూడా భయం, కంగారు. ఒకరోజు అభిరామ్ ని ఆసుపత్రికి తీసుకుని వెళ్ళమన్నాడు.అభిరామ్ వెంకట్రావుని తీసుకువచ్చిన ఆసుపత్రిలో సురేఖ చిన్నాన్న పని చేస్తాడు. చాలా మంది రోగులు ఉండటం వల్ల వెంకట్రావు కొంతసేపు ఎదురు చూసేడు.
ఈలోగా సురేఖ పళ్ళబుట్టతో అక్కడికి వచ్చి అందరికీ పళ్ళు పంచిపెడుతోంది. తరచూ అలావచ్చి రోగులకి పళ్ళు ఇచ్చి వాళ్ళని పలకరించి వెళ్తుందట.
సురేఖ వాళ్ళ బాబాయిని కలిసి వాళ్ళ అమ్మ గురించి మాట్లాడి వెళ్ళిపోయింది.
సురేఖ వెళ్ళిపోయాక అక్కడ పనిచేసేవాళ్ళు "ఆ అమ్మాయి డాక్టర్ గారి బంధువు. వాళ్ళ అమ్మకి బాగుండాలని అందరికీ ఇలా పంచిపెడుతుంది. డాక్టర్ గారికి ఆ అమ్మాయి అంటే ఎంత ప్రేమో. తన కూతురిలాగే చూసుకుంటాడు" అనుకోవడం వెంకట్రావు విన్నాడు.
డాక్టర్ మందులు రాసి వాడమని చెప్పి పంపేసాడు.
వెంకట్రావుని రమ్మని ఓ రోజు అశోక్ తండ్రి కబురుచేశాడు. వెంకట్రావు అభిరామ్ తో కలిసి వాళ్ళ ఇంటికి వెళ్ళేడు.
ఆయన కుశలప్రశ్నలు అడిగి తరవాత "అభిరామ్ కి సురేఖని పెళ్లి చేసుకోవాలని ఉందని అశోక్ నాతో అన్నాడు. వాళ్లిద్దరి పెళ్లి మీరు ఎప్పుడు చేస్తారు? " అని అడిగాడు.
వెంకట్రావు "మీ దగ్గర దాచేదేముంది?వాళ్ళ నాన్న పెళ్లి మాటలకి నా దగ్గరకి వస్తే ముందు నేనడిగినంత కట్నం ఇస్తారా అని అడిగాను. వాళ్లేమీ మాట్లాడకుండా వెళ్ళిపోయారు" అన్నాడు.
అశోక్ తండ్రి "మీకింకా మీ అబ్బాయి మనసు, ఆ అమ్మాయి మనసు అర్ధం కాలేదా? వాళ్ళు పెళ్లయినా చేసుకోరేమో కానీ కట్నం ఇచ్చి పెళ్లి చేసుకోవాలని సురేఖ అనుకోదు. మీ అబ్బాయి కూడా అందుకు అంగీకరించడు. అభిరామ్ మరెవరినీ చేసుకోవడానికి కూడా ఒప్పుకోడు" అన్నాడు.
వెంకట్రావుకి అంతా అర్ధమయిపోయింది. ఇక సురేఖని "రావమ్మా మహలక్ష్మీ " అని తన ఇంటికి పిలవడమే మిగిలింది అనుకున్నాడు.
ఇది నా స్వీయ రచన
ప్రత్యర్ధులు
మా కారు ఇంటర్నేషనల్ స్కూల్ దగ్గరకి వచ్చింది. అక్కడ చాలా మంది జనం ఉన్నారు. అప్పటికి ఇంకా ఉదయం ఐదు కాలేదు.
నేను ముందు కీడు శంకించాను. కానీ వెంటనే అర్ధమయింది, పిల్లలు పిక్నిక్ కి వెళ్తున్నారవి
చాలా ఏళ్ళ క్రితం జరిగిన సంఘటన గుర్తొచ్చింది నాకు. ఆరోజు మా తరగతి లో చాలా మంది పిక్నిక్ కి వెళ్ళేరు . నేను వాళ్ళతో వెళ్ళలేకపోయాను
పదో తరగతి అన్ని సెక్షన్లు కలిపి ఓ ముప్పై మంది పిక్నిక్ కి వెళ్ళలేదు. నేను ప్రిన్సిపాల్ తో వాళ్ళందరినీ పక్కనే ఉన్న పార్క్ కి తీసుకుని వెళ్తానన్నాను. ఆవిడ దానికి అంగీకరించారు.
పార్క్ లో పిల్లలు ఆడుకోవడం మొదలెట్టారు. దిలీప్ ఆటలు బాగా అడితే , వినీత్ బాగా చదివేవాడు. తరగతికి లో కొంతమంది దిలీప్ తో ఎక్కువ స్నేహం చేస్తే, మరికొంతమంది వినీత్ తో స్నేహంగా ఉంటారు.
ఆట మొదలయ్యాక దిలీప్ వినీత్ ని ఆడటానికి రమ్మన్నాడు. "నాకు అట బాగా రాదు. మీరు ఆడండి, నేను చూస్తా" అన్నాడు వినీత్. "అలా కాదు, నువ్వు మా జట్టు లో ఉఃడు.మేము నీకు ఆట నేర్పిస్తాం' అన్నాడు దిలీప్.
వాళ్ళ ఆట నేను చూస్తూనే ఉన్నా. వాళ్ళిద్దరినీ గమనిస్తూనే ఉన్నా. ఆటపూర్తయ్యేసరికి వాళ్ళిద్దరూ మంచి స్నేహితులయిపోయారు.
పదో తరగతి అయ్యేసరికి వాళ్ళిద్దరూ ఇంకా మంచి స్నేహితులయ్యారు.
ఇది నా స్వీయ రచన
పెళ్ళి
సవిత స్నేహితురాలు రాధిక. రాధిక పెళ్లి అయి మరో ఊరికి వెళ్ళిపోయినా రోజూ సవితకి ఫోన్ చేస్తూనే ఉంటుంది. సవిత డిగ్రీ అయ్యాక ఉద్యోగంలో చేరిపోయింది.
రాధిక తల్లికి ఆరోగ్యపరమైన సమస్యలు ఉన్నాయి. తన ఆరోగ్యం కొంత బావున్నప్పుడే కూతురి పెళ్ళి జరిగిపోవాలని ఆవిడ పట్టు పట్టింది. పెళ్లి ముందు సవిత రాధికకి చాలా సాయం చేసింది.
రాధిక అన్న సంజయ్ యూనివర్సిటీ లో రీసెర్చ్ చేస్తూ ఎప్పుడూ తన పనిలో తానుంటాడు. వాళ్ళ అమ్మ సంజయ్ కి తన అనారోగ్యం గురించి చెప్పడానికి కూడా ఇష్టపడదు.
రాధిక తన స్నేహితురాలు సవితతో తల్లి అనారోగ్యం గురించి చెప్తూ ఉంటుంది ఉంటుంది. ఏ కొంచెం బాగులేక పోయినా ఒకసారి వెళ్లి చూసి రమ్మని అడుగుతుంది.
రాధిక తల్లిని తెలిసిన డాక్టర్ ఒకరు వచ్చి చూసి వెళ్తుంటారు. ఒకొక్కప్పుడు వైద్య పరీక్షల కోసం సవిత రాధిక వాళ్ళ అమ్మని తీసుకొని వెళ్ళేది. తన భార్యని ఆసుపత్రికి తీసుకుని వెళ్తే రాధిక తండ్రికి ఎక్కువ కంగారుగా ఉండేది. సవిత పక్కన ఉంటే ఆయనకి కొంచెం ధైర్యం గా ఉండేది.
సవిత చెల్లి అపర్ణ డిగ్రీ ఆఖరి సంవత్సరం చదువుతోంది. అపర్ణని ఒక అబ్బాయి ఇష్టపడుతున్నాడు. ఆ అబ్బాయి అపర్ణ వాళ్ళకి బాగా తెలిసిన కుటుంబానికి చెందిన వాడే.
అపర్ణ తల్లి తండ్రులకి ఆ అబ్బాయి తో పెళ్లికి విముఖత లేదు. కానీ సవితకి, అపర్ణ కి ఒకేసారి పెళ్ళి చేసే స్తోమత వాళ్ళ నాన్నకి లేదు.
చెల్లి పెళ్ళి ముందు చేసేయమని సవిత తల్లి తండ్రులని ఒత్తిడి చేసింది. ఆ అబ్బాయి పెళ్లి చేసుకొని అపర్ణని అమెరికా తీసుకుని వెళ్ళిపోయే తొందరలో ఉన్నాడు.
అపర్ణ పరీక్షలు అయిపోయాక ఆమె పెళ్లి జరిగిపోయింది.
సంజయ్ కి తన పరిశోధనే తన లోకం. ఇంట్లో కూడా తన రూమ్ లో తనకి కావలసిన పుస్తకాలు, తను నోట్ చేసుకుంటున్న కాగితాలు అన్నీ ఎటుకటే పరిచేసి ఉంటాయి. సంజయ్ చదువుతూ అలానే నిద్రపోతాడు. చేయాల్సిన పని మీద ధ్యాస ఎక్కువ. తన ప్రొఫెసర్ తో యూనివర్సిటీలో, అతని ఇంట్లో కూడా ఎక్కువ టైమ్ గడుపుతాడు.
తన రీసెర్చ్ పనితో తల వేడెక్కిపోతే సంజయ్ తల్లితో కొంత సేపు గడుపుతాడు. ఆమె అడిగితే కోవెలకు తీసుకుని వెళ్తాడు.
సెలవురోజుల్లో సవిత కూడా వచ్చి సంజయ్ తల్లితో గడిపివెళ్తుంది. రాధిక తల్లి దగ్గర ఉన్నప్పుడు వీడియో కాల్ చేసి వాళ్ళ అమ్మతో
మాటాడిస్తుంది.
సంజయ్ కి సవిత అంటే చాలా మంచి అభిప్రాయం, ఎంతో గౌరవం. సంజయ్ తల్లి సంజయ్ తో ఎన్నో సార్లు " సవిత చాలా మంచి అమ్మాయి. మనకి ఎంతో సాయం చేస్తుంటుంది "అని ఎప్పుడూ చెప్పే ది. అందువల్ల సవిత పట్ల కృతజ్ఞతాభావం కూడా సంజయ్ కి ఉండేది.
సంజయ్ పేపర్ లండన్ యూనివర్సిటీ వాళ్ళు ఆమోదించారు. సంజయ్ ని,అతని ప్రొఫెసర్ ని వారు అక్కడికి రమ్మని ఆహ్వానించారు. సంజయ్, అతని ప్రొఫెసర్ పది రోజులకి లండన్ వెళ్ళేరు. రాధిక వచ్చి తన తల్లితండ్రుల దగ్గర ఉంది.
సవిత ఒక్కోసారి ఆఫీసు నుండి రాధిక దగ్గరకి వచ్చి కొంత సేపు గడిపివెళ్ళేది. అన్న సాధించిన విజయానికి రాధిక ఆనందం అంతా ఇంతా కాదు. రాధిక వాళ్ళ అమ్మ దగ్గర, సవిత దగ్గర " అన్న సాధించినదేం తక్కువ విషయం కాదు " అనేది.
సవితకి తల్లితండ్రులు సంబంధం చూద్దామనుకుంటే సవిత ఇప్పుడు కాదు అంటూ వాయిదా వేసింది
రాధిక కి ఇది తెలిసి సవిత ని"నీ మనసు లో ఎవరైనా ఉన్నారా? " అని అడిగింది.
సవిత "ఎవరూ లేరు " అనేసి " ఏమో, ఎవరైనా ఉన్నారేమో నాకు తెలియదు " అంది నవ్వుతూ.
తన స్నేహితురాలు తనకి ఏదో రహస్య సందేశం వినిపించినట్టు అనిపించింది రాధిక కి.
అన్న ఇంటికి వచ్చేసాక రాధిక తిరిగి వెళ్ళిపోయింది.
సంజయ్ లండన్ నుంచి వచ్చేక సవిత అతనిని ప్రత్యేకించి అభినందించింది.
మరి కొన్నాళ్ళకి సంజయ్ కి డాక్టరేట్ డిగ్రీ కూడా వచ్చింది.
సంజయ్ కి అదే ఊళ్ళో ఓ రీసెర్చ్ సంస్థలో మంచి ఉద్యోగం వచ్చింది.
సవిత చెల్లి అపర్ణ కడుపుతో ఉంది. సవిత తల్లి పురిటికి తాను అమెరికా వెళ్ళలేనని చెప్పేసింది. దానితో సవితకి ఓ రెండు నెలలు సెలవు పెట్టి అమెరికా కి వెళ్ళక తప్పలేదు.
సవిత ఊళ్ళో లేకపోవడం, చాలా రోజులు అసలు కనబడకపోవడం సంజయ్ కి ఏదోలా ఉంది. రెండు మూడు సార్లు వాళ్ళ అమ్మని " సవిత ఎప్పుడొస్తుంది" అని అడిగేసాడు కూడా.
సంజయ్ తల్లి ఒకరోజు కొడుకుతో "నువ్వు సెటిల్ అయిపోయావు కదా.
మేము ఇక నీకు పెళ్లి చేసేయాలి" అనగానే " సవిత రానీ అమ్మా" అన్నాడు పరధ్యానంగా.
"సవిత వచ్చేకేనులే" అన్నారు ఆవిడ నవ్వుతూ.
"అదేం కాదులే అమ్మా. నేను ముందు సవితతో మాట్లాడాలి" అనేసి అక్కడినుంచి వెళ్ళిపోయాడు.
సవిత అమెరికా నుండి రాగానే రాధిక వాళ్ళ అమ్మకి ఫోన్ చేసి ఆవిడ ఆరోగ్యం గురించి కనుక్కుంది. ఆవిడ ఆదివారం తప్పకుండా రమ్మని సవితతో చెప్పింది.
సవిత వచ్చేసరికి సంజయ్ ఇంట్లోనే ఉన్నాడు. సవిత కొంతసేపు తనతో మాట్లాడాక సంజయ్ తల్లి సవిత తో "మా వాడు నీతో ఏదో మాట్లాడాలట. వాడి రూమ్ లో ఉన్నాడు. ఓసారి కలిసి రా" అని చెప్పింది.
తనతో ఆ పెద్ద మనిషికున్న మాటలేవిటా అనుకుంటూ సంజయ్ రూమ్ లో అడుగుపెట్టింది సవిత.
" సవితా, నిన్ను కలిసినప్పుడు నీకీ విషయం చెప్పాలనుకున్నాను. కాదు కాదు, అడగాలనుకున్నా."
"ఏంటి "
"నేనయితే పూర్తిగా ప్రేమలో పడిపోయా"
"ఎవరితో " అంది సవిత కొంచెం గాభరాగా.
"ఎవరితోనో అయితే నీకెందుకు చెప్తాను? నీతోనే. మరి నువ్వు? "
"నేనూ పడ్డానేమో " అంది సవిత సిగ్గు పడుతూ.
"మా అమ్మ నాతో నా పెళ్లి ప్రసక్తి తేకపోతే ఇప్పుడే ఈ మాట చెప్పేవాడిని కానేమో . ప్రేమించడం చాలా సులువు కానీ ఆ మాట నీతో చెప్పాలంటే నువ్వేమనుకుంటున్నావో అన్న సంశయం."
"సవితా, నువ్వు అంగీకరిస్తే నేను మా అమ్మానాన్నలతో మాట్లాడతా. వాళ్ళే మీ ఇంటికి వచ్చి మీ వాళ్ళతో చెప్తారు " అన్నాడు.
సవిత అలాగే అన్నట్టు తలాడించి సంజయ్ రూమ్ లోంచి బయటకు వచ్చేసింది. సవిత సంజయ్ వాళ్ళ అమ్మతో సంజయ్ తనతో ఏం మాట్లాడాడో చెప్పకుండానే, మరికొద్ది సేపు వాళ్ళింట్లో ఉండి తన ఇంటికి వచ్చేసింది.
సవిత తన తల్లితో " రాధిక అమ్మానాన్న మనింటికి వస్తారు. వాళ్ళు వచ్చి మీతో ఏదైనా మాటాడతారేమో" అని సూచన ప్రాయంగా చెప్పింది.
వారం తిరగకమునుపే సంజయ్ తల్లితండ్రులు సవిత ఇంటికి వచ్చి ఆమె తల్లితండ్రులను కలిసేరు.
సంజయ్ తల్లి " సవిత మా కోడలు అయితే బావున్నని నేను ఎప్పటి నుండో అనుకుంటున్నా. మా అబ్బాయి ఉద్దేశ్యం కూడా అదే అని తెలిసాక మీ దగ్గరకి వచ్చేం" అంది.
సవిత తల్లితండ్రుల ఆనందం అంతా ఇంతా కాదు. బాగా చదువుకున్న వాడు, మంచి ఉద్యోగం చేస్తున్నవాడు
తమకి అల్లుడిగా, సవిత కి భర్తగా లభిస్తున్నందుకు వాళ్ళకి చాలా ఆనందంగా ఉంది.
సంజయ్ , సవిత పెళ్లి నిరాడంబరంగా జరగాలని కోరుకున్నారు. ముహూర్తం దగ్గరలోనే కుదిరింది.
సంజయ్ సవితని ఇష్టపడ్డాడంటే రాధిక కి ఎంతో ఆనందం కలిగింది. త్వరలోనే పెళ్ళి అంటే ఆమెకి ఇంకా ఆనందం. పెళ్లికి రెండు వారాల ముందే రాధిక పుట్టింటికి వచ్చింది.
అపర్ణ కూడా సవిత పెళ్ళి కోసం వెంటనే అమెరికా నుండి బాబుతో వచ్చింది. " అక్క అమాయకురాలు, ఎలా బతుకుతుందో" అనుకునేది అపర్ణ. ఇప్పుడు అక్కకి పెళ్లి నిశ్చయమై అమ్మానాన్నలకి దగ్గరగానే ఉంటుందంటే ఆమెకి ధైర్యం గా ఉంది.
పెళ్ళి షాపింగ్ కోసం సంజయ్ సవితని ,మిగతావాళ్ళని తీసుకుని వెళ్లేవాడు. తరచూ ఆఫీసు నుండి ఇంటికి వెళ్ళేటప్పుడు ఒకసారి సవిత దగ్గరకి వచ్చి వెళ్ళేవాడు. అప్పుడప్పుడు సవిత తో "అలా బయటికి వెళ్లివద్దాం " అని ఆమెని బయటికి తీసుకుని వెళ్ళేవాడు. ఆమెతో గడిపే సమయం సంజయ్ కి ఇట్టే గడిచిపోయేది.
సంజయ్ కి సవిత తల్లి తండ్రులతో మొదట ఎక్కువ పరిచయం లేక పెళ్లి కుదిరినప్పటి నుండి అత్తమ్మ, మామయ్య అని పిలవడం అలవాటయిపోయింది.
సవితకి ఆంటీ పిలుపు నుండి అత్తయ్య పిలుపు కి మారడం, ఆ పిలుపుని అలవాటు చేసుకోవడానికి కొంత టైమ్ పట్టింది.
పెళ్ళికి ముందే రాధిక అన్న తో "మీరిద్దరూ పెళ్ళి తరవాత కొన్నాళ్ళు తిరిగిరండి. నేను అమ్మని చూసుకుంటాను " అనిచెప్పి పెళ్లి తరవాత వాళ్ళిద్దరినీ హనీమూన్ కి పంపించింది.
ఇది నా స్వీయ రచన
కృష్ణ
ఆ పాప నవ్వు కృష్ణమ్మ గలగలల తీరు. నడక, పరుగు, మాటలు అంతా చలాకీవే. నాన్నమ్మ, తాతల దగ్గర అమ్మతో పాటు ఉండేది. తండ్రి దుబాయ్ లో పని చేస్తూ అప్పుడప్పుడూ వస్తుండేవాడు.
కృష్ణవేణి తాత రమణమూర్తి కి, రత్నాకర్ అనే స్నేహితుడు ఉన్నాడు. ఆయన కొడుకు, రమణమూర్తి కొడుకు కూడా మంచి స్నేహితులే.
రత్నాకర్ కొడుకు మధుకర్ పట్నం లో
వ్యాపారం చేసేవాడు.
మధుకర్ తల్లితండ్రులని చూడటానికి తన గ్రామం వచ్చేవాడు కానీ అతని భార్య పిల్లలతో అక్కడికి రావడానికి ఇష్టపడేది కాదు.
మధుకర్ కొడుకు సాగర్, కూతురు శ్వేత, భార్య సునంద. శ్వేత , కృష్ణవేణి ఒకే వయసువారు. వాళ్లిద్దరి కంటే సాగర్ పెద్దవాడు.
కృష్ణ పుట్టినప్పటి నుండి రత్నాకర్ "ఈ పాప మా ఇంటి కోడలే, మా సాగర్ కి చూసుకుంటాం " అంటుండేవాడు. మధుకర్ కూడా దానికి ఎప్పుడూ అభ్యంతరం చెప్పలేదు.
గ్రామానికి వచ్చి ఇప్పుడు మధుకర్ కృష్ణని చూస్తే "ఏవమ్మా కోడలా" అనే పలకరించేవాడు.
కష్ణ చిన్నప్పుడు అప్పుడప్పుడూ మధుకర్ తన కొడుకు సాగర్ ని తన గ్రామానికి తీసుకుని వచ్చేవాడు. సాగర్ మిగతావాళ్ళందరితో ఆడుతూ కృష్ణని కూడా ఆడనిచ్చేవాడు.
కృష్ణ తల్లి సాగర్ కోసం ఏదో ఒకటి చేసి పెట్టేది. ఆవిడ ఏవి చేసి పెట్టినా సాగర్ ఇష్టంగా తినేవాడు.
ఒకసారి రత్నాకర్ తమ్ముడి కూతురు
ఆ ఊరికి వచ్చింది. పెద్ద నాన్నని కలుద్దామని వస్తే రత్నాకర్ కృష్ణ ని చూపించి "మీ అన్న మధుకర్ కి కాబోయే కోడలు. మా సాగర్ కి కాబోయే భార్య " అన్నాడు. మధుకర్ పక్కనే ఉన్నాడు కానీ ఏం అనలేదు. పైగా కృష్ణని వచ్చి తన పక్కన కూర్చోమన్నాడు.
ఆవిడ కొద్దిరోజుల్లోనే పట్నం లో మధుకర్ వాళ్ళింటికి వెళ్ళి సునందని కలిసింది. వెళ్తూనే " అదేమిటి వదినా, అంత నల్లపిల్ల ని కోడలు గా తెచ్చుకుంటావా? మా అమ్మాయి చిత్ర కూడా సాగర్ కి వరసే కదా "అంది.
సునంద " నేనెవర్నీ కోడలుగా చేసుకుంటానని చెప్పలేదు. సాగర్ ఇంకా చిన్నవాడు. ఇప్పటి నుండి వాడి పెళ్లి గురించి మాటలేంటి? మీ అన్నయ్య తో గట్టిగా చెప్తాను "అంది.
కృష్ణ కాలేజీ చదువు కి వచ్చేసరికి మధుకర్ ఆమె ని పట్నం లో హాస్టల్ లో చేర్పించాడు. అప్పుడప్పుడు సాగర్ తో కలిసి వెళ్ళి ఆమె ఎలా ఉందో చూసి వచ్చేవాడు. వెళ్లినప్పుడు ఎంతో కొంత డబ్బులిచ్చి "మీ నాన్న నీకు ఇయ్యమన్నాడమ్మా" అని చెప్పేవాడు.
ఒకసారి కృష్ణకి సెలవులిచ్చినపుడు మధుకర్ కృష్ణవేణి ని తన ఇంటికి తీసుకుని వెళ్లాడు. సునందకి ఇది ఎంత మాత్రం నచ్చలేదు.
కృష్ణని చూస్తూనే సునంద " నీకు మీ అమ్మ పోలికా, నాన్న పలికా" అని అడిగింది. దానికి కృష్ణ "నాకు కృష్ణమ్మ పోలికట. అందుకే మా నాన్నగారు ఎంతో ఇష్టం గా ఆ పేరు పెట్టారుట " అని చెప్పింది.
సాగర్ అక్కడే ఉండటం సునంద కి నచ్చలేదు. కొడుకుతో "నువ్వేమిటి , ఇంత తీరిగ్గా ఇక్కడ కూర్చున్నావు. నాతో ఎప్పుడూ పని పని అని చెప్పి పారిపోతుంటావుగా. వెళ్లి నీ పని చూసుకో " అని చెప్పి అక్కడి నుండి పంపించేసింది.
కృష్ణతో " మా ఇంటికి స్నేహితులు, చుట్టాలు ఎప్పుడూ ఎవరో ఒకరు వస్తూనే ఉంటారు. నువ్వు చీకటి పడకుండా హాస్టల్ కి చేరాలి కదా. త్వరగా బయలుదేరు" అని చెప్పి పంపించేసింది సునంద.
కృష్ణ కి రాను రాను మనుష్యుల ప్రవర్తన రోత కలిగిస్తోంది. శరీరం రంగు నలుపయితే చీదరించుకోవడం, దాని గురించి చర్చలు, తెల్లగా ఉంటే చాలు అందంగా ఉన్నారనడం "ఏమిటో ఈ తెలుపు పిచ్చి " అనుకునేది. తాను నల్లగా ఉందనే సునంద తనని దూరం పెడుతోందని కృష్ణకి బాగా అర్ధమయింది.
కళ్ళతో చూసి ,అందం గురించి మాట్లాడేవారి కంటే అంధులే చాలా నయం అనుకునేది కృష్ణ. తాను బ్రెయిలీ లిపి నేర్చుకుని వారికి నేర్చుకోవడం లో, చదువడంలో సాయం చేసేది.
తన చదువు పూర్తయినా, బ్రెయిలీ లిపి నేర్పడం లో శిక్షణ తీసుకుని కృష్ణ పట్నం లో ఉండిపోయింది. అంధుల పాఠశాలలో పని చేసేది. వాళ్ళతో గడుపడం ఆమెకి హాయిగా ఉండేది.
మధుకర్ సునందతో కృష్ణని కోడలుగా చేసుకుందామని ఒప్పించడానికి చాలా సార్లు ప్రయత్నించాడు. " నా కొడుకు చాలా అందగాడు. ఆ అమ్మాయిని కోడలుగా చేసుకోమంటారేమిటి? అని తిరగబడేది.
ఒకసారి కృష్ణ అమ్మ, నాన్న మధుకర్ ఇంటికి వచ్చేరు. వాళ్ళతో సునంద కృష్ణ ని కోడలు గా చేసుకొనే ఉద్దేశ్యం తనకి అసలు లేదని ,ఆ అమ్మాయికి మరో సంబంధం చూసి పెళ్లి చేయమని చెప్పింది.
ఇది నా స్వీయ రచన
కృష్ణ 5
మధుకర్ ఇంటికి వెళ్ళి వచ్చేక కృష్ణ తండ్రి మనోవ్యధ తో మంచం పట్టేడు.
తాము అపురూపంగా చూసుకొనే తన కూతురి భవిష్యత్తు ఏమవుతుందో అన్న భయం అతనికి పట్టుకుంది.
తండ్రి అనారోగ్యం గురించి తెలియగానే కృష్ణ ఇంటికి వచ్చింది. తండ్రి పరిస్థితి మధుకర్ కి కృష్ణ తెలియచేయడంతో అతను సాగర్ ని వెంటపెట్టుకుని తన స్నేహితుడి దగ్గర కి వచ్చేడు.
స్నేహితుడి పరిస్థితి, మనోవేదన చూసి మధుకర్ కి ఏం చేయాలో అర్ధం కాలేదు. సాగర్ ని "నీకు కృష్ణ అంటే ఇష్టమే కదూ" అని అడిగాడు. సాగర్ "ఇష్టమే " అన్నాడు.
"అయితే వెంటనే కృష్ణ ని పెళ్లి చేసుకొని నా స్నేహితుడిని కాపాడు " అని చెప్పాడు.
తన స్నేహితుడి సమక్షంలో కృష్ణ మెడలో తాళి కట్టించేడు మధుకర్.
"ఇక నా కోడలి బాధ్యత నా కొడుకుది, నాది. వాళ్ళిద్దరూ హాయిగా ఉంటారు. నీకు ఏ దిగులూ వద్దు" అని స్నేహితుడితో చెప్పి కొడుకు, కోడలు తో తన ఇంటికి బయలుదేరేడు మధుకర్.
సాగర్ కి, కృష్ణకి అప్పటికప్పుడు పెళ్లి చేయాల్సివచ్చిందని మధుకర్ చెప్తే సునంద కి వచ్చిన కోపం అంతా ఇంతా కాదు. కృష్ణ తో పెళ్లే వద్దంటే, ఇదంతా ఏంటని మధుకర్ మీద, సాగర్ మీద రంకెలేసింది సునంద.
సునంద" ఈ అమ్మాయికి వెంటనే పంపించేయండి. మీ స్నేహితుడి ఆరోగ్యం గురించి అంతలా ఆలోచించారు ,మీ భార్య ఏమవుతుందో ఆలోచించక్కరలేదా? ఈ అమ్మాయి మనింట్లో ఉంటే నాకు బి.పి పెరిగి నేను మంచం పడతాను" అని చెప్పేసింది.
మధుకర్ కి ఇక గత్యంతరం లేక కృష్ణ ని, సాగర్ ని తాను కొత్త గా కొన్న ఇంటికి తీసుకుని వచ్చేడు. కృష్ణకి అంతా అయోమయంగా ఉంది. ఆమె పరిస్థితి గమనించిన మధుకర్ సాగర్ ని ఆమెతోనే ఉండమని తాను ఇంటికి వెళ్ళేడు.
సునంద ముందు కూతురి పెళ్లి కానిచ్చి సాగర్ కి చిత్ర తో పెళ్లి చేయాలని నిశ్చయించింది. చిత్ర, వాళ్ళ అమ్మ సునంద దగ్గరకి వచ్చి పోతూనే ఉన్నారు.
శ్వేతకి సంబంధం సిద్ధంగానే ఉంది. సునంద కూతురి పెళ్ళి త్వరగా చెయ్యాలని భర్తని తొందర పెట్టింది. దగ్గరలో ముహూర్తం చూసి శ్వేత పెళ్లి జరిపేసారు.
కృష్ణ సాగర్ తో " మీరు మీ ఇంటి సంగతులు చూసుకోండి. నేను అమ్మని, నాన్నని నా దగ్గరకి తెచ్చుకుంటాను. నాన్న ఆరోగ్యం గురించి నాకు భయంగా ఉంది " అంది.
సాగర్ తన ఇంటికి వెళ్ళినా ఆలోచనలు కృష్ణ గురించే. తల్లి ఏదో చెప్తున్నా పరధ్యానంగా ఉండేవాడు.
సునంద తండ్రి బలవంతం మీద పెళ్లి చేసుకున్నాడు కానీ సాగర్ కి కూడా కృష్ణ నచ్చదు, తను చెప్తే ఆమెని వదిలేస్తాడు అనుకునేది
కృష్ణ తన ఊరికి వెళ్ళి తన తల్లితండ్రులని పట్నం తీసుకుని వచ్చింది. సాగర్ తన కారులోనే వాళ్ళని కృష్ణ ఉంటున్న ఇంటికి తీసుకుని వచ్చేడు.
కృష్ణ అంధుల పాఠశాలలో పని చేసేది. ఆ పిల్లల సాంస్కృతిక కార్యక్రమాలు మిగతా పాఠశాలలలో ఏర్పాటు చేసేది. ఎక్కడయినా సాంస్కృతిక కార్యక్రమాలు జరిగినా తన విద్యార్ధులు కూడా పాల్గొనేలా చూసేది. కృష్ణకి ఈ కార్యక్రమాలు అన్నింటిలో సాగర్ సాయపడేవాడు.
సునంద తన కొడుకు కి విడాకులు ఇప్పించి మళ్ళీ పెళ్లి జరపాలనుకుంది. సాగర్ దగ్గర ఆ ప్రస్తావన తీసుకువస్తే సాగర్ " నేను కృష్ణ కి విడాకులు ఇచ్చి మరో పెళ్లి చేసుకుంటానని నువ్వు ఎలా అనుకుంటున్నావు. కృష్ణ అంటే నాకు చాలా ఇష్టం. నా కళ్ళతో చూస్తే నీకూ కృష్ణ అందంగా కనబడుతుంది. నీకు తనని నీ కోడలు గా చెప్పుకోవడం ఇష్టం లేకపోతే మేమిద్దరం వేరే ఉంటాం. ఎలానూ తనతో వాళ్ళ అమ్మ, నాన్న ఉంటున్నారు " అన్నాడు.
సునంద ఒక మహిళామండలి సభ్యురాలు. ఆ మహిళామండలి అధ్యక్షురాలు ఒక పారిశ్రామిక వేత్త భార్య. అయినా ఆమె చాలా నిరాడంబరంగా ఉండేది. ఒకరోజు ఆమె కృష్ణ గురించి అందరి దగ్గర చాలా గొప్పగా మాట్లాడింది.
మహిళామండలి అధ్యక్షురాలు " అంధుల పాఠశాల పిల్లల కార్యక్రమం మనం కూడా ఏర్పాటు చేయాలి. స్వాతంత్ర్య దినోత్సవ సాంస్కృతిక కార్యక్రమాలలో భాగంగా ఆ పిల్లల కార్యక్రమం ఏర్పాటు చేసి, ఆ కార్యక్రమం అయ్యాక కృష్ణవేణి గారిని ముఖ్యమంత్రి సన్మానిస్తారట.
మనం కూడా ఆమెకి మన కార్యక్రమంలో భాగంగా సన్మానం చేద్దాం. ఆమె సేవలని రాష్ట్ర ప్రభుత్వం గుర్తిస్తుంటే మనమూ ఆ అవకాశం విడుచుకోకూడదు" అంది.
సునందకి అప్పటికి గానీ కృష్ణ గొప్పతనం అర్ధం కాలేదు. మీటింగ్ అయ్యాక బయలుదేరుతూ మధుకర్ కి ఫోన్ చేసి "ఇవాళ కృష్ణ ని, వాళ్ళ అమ్మానాన్నలని మన ఇంటికి తీసుకుని వెళ్దాం. త్వరలో వాళ్ళిద్దరికీ కోవెల్లో మళ్ళీ పెళ్లి చేద్దాం "అని చెప్పింది.
మధుకర్ కి భార్య లో ఈ మార్పు ఆశ్చర్యం, ఆనందం రెండూ కలిగాయి.
కోవెలలో సునంద, శ్వేత, ఆమె భర్త దగ్గర బంధువుల సమక్షంలో నిరాడంబరంగా వివాహం జరిగాక కృష్ణ సునందతో " మా అమ్మానాన్నలు నా దగ్గరే ఉంటారు కదా. మేము వేరేగా ఉంటాం అత్తయ్యా. మేము వచ్చిపోతుంటాం" అని చెప్పింది.
ఇప్పుడు సునంద అందరితో కృష్ణ నా కోడలు అని చెప్పుకుంటోంది.
ఇది నా స్వీయ రచన
అత్తమ్మ
"నీకో అమ్మాయిని చూసేనురా" అంది
మీనాక్షి తన కొడుకు సుహాస్ తో.
"ఎక్కడ చూసేవేంటి ? " అన్నాడు సుహాస్ నవ్వుతూ.
"మా మహిళా సమితి ఒక గ్రామాన్ని దత్తత తీసుకుంది. ఆ పని మీద నేను ఆ ఊరికి వెళ్తుంటాను. అక్కడ ఒక టీచర్ గారి అమ్మాయి నాకు బాగా నచ్చింది. నువ్వు ఒ.కె. అంటే
నేను వాళ్ళతో మాట్లాడతాను " అంటూ తన సెల్ ఫోన్ లో ఉన్న ఆ అమ్మాయి ఫొటో సుహాస్ కి చూపించింది మీనాక్షి.
కళ్ళకి కాటుకతో, చేతులకి గాజులతో, తలనిండా పూలతో చాలా సంప్రదాయబద్ధంగా ఉంది ఆ అమ్మాయి.
అమ్మ ఎంపిక మీద సుహాస్ కి చాలా గురి. అమ్మకి నచ్చిందంటే తనకి భార్య అయ్యే అర్హత ఆ అమ్మాయికి ఉందా లేదా అని తను ఆలోచించక్కరలేదు.
"ఇంతకీ అమ్మాయి పేరేంటి? " అడిగాడు సుహాస్.
"శారద . పేరడిగావంటే అమ్మాయి నీకు నచ్చింది కదా. ఈసారి నేను
ఆ ఊరికి వెళ్ళినప్పుడు నువ్వూ నాతో రా. వాళ్ళకీ నువ్వు నచ్చాలి కదా " అంది మీనాక్షి.
ఓ వారం తరవాత మీనాక్షి సుహాస్ ని ఆ ఊరికి తీసుకుని వెళ్ళింది. రాధాకృష్ణ మాస్టారు వాళ్ళిద్దరినీ బాగా ఆదరించారు.
మీనాక్షి " నాకు మీ అమ్మాయి బాగా నచ్చింది. వీడే మా అబ్బాయి సుహాస్ . మీకు, మీ అమ్మాయికి మావాడు నచ్చితే వాళ్ళిద్దరికీ పెళ్ళి చేద్దాం " అంది రాధాకృష్ణతో.
మాస్టారు చాలా సంతోషించి "మా శారద సంగీత సాధనకి వాళ్ళ గురువు గారింటికి వెళ్లింది. ఇప్పుడే వచ్చేస్తుంది. మీకు కోడలు కావడం కంటే అదృష్టం ఇంకేముంది? మీ గురించి మా ఊళ్ళో అందరికీ తెలుసుకదా " అంటూ నమస్కరించాడు.
మరి కొద్దిసేపట్లో శారద అక్కడకి వచ్చింది. సుహాస్ కి శారద ఫొటోలో కంటే అందంగా కనిపించింది. మీనాక్షి సంగీతం అంటే ప్రాణం. శారదకి ఇంతకుముందే మీనాక్షి తెలియడం వల్ల ఆమె అడగ్గానే ఒక పాట పాడింది.
సుహాస్ కి కూడా సంగీతం అంటే ఇష్టం. అతను కూడా ఆ పాటని బాగా ఇష్టపడ్డాడు.
శారద వాళ్ళకి కాఫీ పెట్టడానికి లోపలికి వెళ్లినప్పుడు మాస్టారు కూడా లోపలికి వెళ్లి కూతురికి అసలు సంగతి చెప్పారు.
కాఫీ తీసుకొచ్చిన శారద సిగ్గు పడుతూ మీనాక్షికి ,సుహాస్ కి కాఫీ అందించి లోపలికి వెళ్లిపోయింది.
మీనాక్షి "ఇక మేము వెళ్తాం" అని చెప్పి బయలుదేరుతుంటే మాస్టారు వాళ్ళతో నడిచారు. సుహాస్ శారద వైపు చిరునవ్వుతో చూసి ఆమె నుండి సెలవు తీసుకున్నాడు.
మాస్టారు " మా అమ్మాయి నేను అడిగితే నచ్చాడనే తల ఊపిందమ్మా. ఆడపిల్ల, అంతకంటే ఎలా చెప్తుంది? మీరు పెద్ద మనసు చేసుకుని మా ఇంటికి వచ్చేరు. ఇంతకన్నా గొప్ప సంబంధాలు మీ అబ్బాయికి వస్తాయి" అన్నాడు.
"మేము కూడా మా ఇంటికి తెచ్చుకునే అమ్మాయి గురించి చాలా ఆలోచిస్తాం కదా మాస్టారూ" అంటూ మీనాక్షి అతనికి నమస్కారించి సెలవు తీసుకుంది.
మీనాక్షి తన భర్త సుందరేశ్వర్ కి ఈ పెళ్లి సంబంధం గురించి ముందే చెప్పింది. అతనికి మీనాక్షి అంటే చాలా ఇష్టం. ఒక భర్త భార్య ని ఎలా ప్రేమించాలో సుహాస్ తన తండ్రిని చూసి తెలుసుకున్నాడు. భార్య కి ఎంత విలువ ఇవ్వాలో, ఎలా గౌరవించాలో అన్నీ తండ్రిని చూసి సుహాస్ నేర్చుకున్నాడు.
మాస్టారు మంచి ముహూర్తం పెట్టించి సుందరేశ్వర్ కి తెలియచేసారు. పెళ్ళి ఆ ఊరిలో చెయ్యడానికే నిశ్చయించాడు. సుందరేశ్వర్ భోజనాల ఖర్చు తనదే అని ముందే చెప్పాడు.
మాస్టారి మీద గౌరవం తో, మీనాక్షి తమ ఊరికి చేసిన సాయానికి కృతజ్ఞతగా ఊరివారంతా తలో చెయ్యివేసి పెళ్లి ఘనంగా జరిపించేరు. శారద అత్తవారింటికి వచ్చేసింది.
శారదకి ఓ మహానగరాన్ని చూడటం అదే మొదటిసారి. అత్తవారిల్లు కూడా దేదీప్యమానంగా వెలిగిపోతోంది. వాళ్ళ ఇంటికి వచ్చిన బంధువులు, స్నేహితులతో ఆ ఇల్లు కళకళలాడుతోంది.
మీనాక్షి అందరినీ ఆదరించింది. మూడు నిద్రలయ్యేక కొత్త జంట హనీమూన్ కి వెళ్ళారు.
సుహాస్ ఆమెకి ఏవి ఎలా వాడాలో , ఏ జాగ్రత్తలు తీసుకోవాలో అన్నీ నేర్పేవాడు. ఆమెకి సహజంగా ఉన్న సిగ్గు, బిడియం దూరం చేయడానికి ప్రయత్నించేవాడు.
హనీమూన్ నుండి వచ్చాక మీనాక్షి "నువ్వు టీచర్ గారి అమ్మాయివి. నీకు ఎంతకాలం చదవాలని ఉంటే , ఎంత వరకు చదవాలని ఉంటే చదువుకో. మీ పిల్లల చదువు బాధ్యత మీ ఇద్దరిదే కదా " అని ఆమెని కాలేజీలో చేర్చింది
శారద తన అత్తమ్మ సహకారం తో బాగా చదివి తెలుగు లెక్చరర్ అయింది. సంగీత పాఠాలు కూడా ఆసక్తి ఉన్నవారికి నేర్పేది. శారద, సుహాస్ లకి ఒక పాప పుట్టింది. తర్వాత వాళ్ళు మరో బాబుని దత్తత తీసుకుని పెంచేరు.
శారద కి మొక్కలు పెంచడం ఎంతో సరదా. గ్రామం లో పంటపొలాల నడుమ తిరిగిన ఆమెకి పూలమొక్కలు, పళ్ళ చెట్ల మధ్య కొంతసేపు గడపడం సరదా. సుహాస్ కి ఆమె ఇష్టాలేంటో బాగా తెలుసు.
మీనాక్షికి మనవలతో మంచి కాలక్షేపం. ఆమె మనవలని వాళ్ళ తాతగారి ఊరికి అప్పుడప్పుడు తీసుకెళ్ళేది.
శారద తన గ్రామం లో ఒక సంగీత పాఠశాల పెట్టి తన స్నేహితురాలిని ఆ పాఠశాల నడపమని కోరింది. తను కూడా తరచు తన భర్తతో తన గ్రామానికి వచ్చేది.
మాస్టారి శిష్యులు తాము చదువుకున్న బడి కోసం ఏదైనా చేయాలని బడికి అదనపు భవనాన్ని, తరగతి గదులని ఏర్పాటు చేసారు.
.
ఇది నా స్వీయ రచన
జానకి
ఆ అమ్మాయి, నేను స్నేహితులం. ఇంకా చెప్పాలంటే బాల్య స్నేహితులం. ఇద్దరికీ 18 ఏళ్ళు నిండాయి. నేను చదువు ధ్యాసలో ఉన్నాను.
ఒక రోజు నా స్నేహితురాలు నా దగ్గరకి వచ్చింది. ఆ అమ్మాయి పేరు జానకి. జానకి నాతో " నేను, హరి త్వరలో పెళ్ళి చేసుకోబోతున్నాం"అంది.
"అంత తొందరేం వచ్చింది. ఇంకా మనం చిన్నవాళ్ళమేగా" అన్నా.
"లేదులే. తను తొందర పడుతున్నాడు. మావాళ్ళు కూడా దగ్గర సంబంధాలు చూస్తున్నారు. మావాళ్ళకి ఇష్టం ఉన్నా లేకున్నా మేమిద్దరం పెళ్ళి చేసుకోవడం ఖాయం "అని చెప్పి వెళ్ళిపోయింది.
జానకి చెప్పినట్టే వాళ్ళిద్దరి పెళ్లి అయిపోయింది. జానకి పుట్టింటి వాళ్లు తాము చూసిన సంబంధం కాదని పట్టించుకోవడం మానేసొరు.
అత్తింటివాళ్ళు కూడా అవసరమైనప్పుడు హరిని డబ్బులడిగేవారు కానీ మరే సాయం చేసేవారు కాదు.
జానకి కి వెంట వెంటనే కాన్పులు. ముందు కూతురు, తరవాత కొడుకు . వాళ్ళని పెంచి పెద్ద చేసేవరకు జానకి కి ఊపిరి సలపలేదు. ఎప్పుడూ తీరిక లేకుండానే ఉండేది.
పిల్లల చదువు విషయం లో హరి అసలు పట్టించుకునేవాడు కాదు. కాని పిల్లలకి ఎప్పుడూ మొదటి ర్యాంక్ రావాలని కోరుకునేవాడు. తన పిల్లలు బాగా చదువుకుంటున్నారని అందరూ అనుకోవాలి. వాళ్ళు అన్ని పోటీలలో ప్రధమ స్థానంలో ఉండాలి. జానకి వాళ్ళకి ఆ తర్ఫీదు ఇవ్వాలి. అలా చదువు చెప్పాలి.
జానకి వాళ్ళతో పాటు తనూ చదివేది. వాళ్లు ఎప్పుడు ఏ సందేహం ఉన్నా తల్లినే అడిగేవారు.
పేరెంట్ టీచర్స్ మీటింగ్ కి కూడా జానకి వెళ్ళేది.
జానకి పిల్లలు కాలేజీ కి వెళ్ళడం మొదలు పెట్టినప్పటి నుండి ఆమెకి కొంత తీరిక దొరికింది. కానీ అప్పుడు కూడా చదువులు, ర్యాంక్ లు, పిల్లల మీద వత్తిడి, వీటి వల్ల ఆమె మీద కూడా వత్తిడి ఉండేది.
పిల్లల మీద ఉన్న ఒత్తిడి అర్ధమై ఆమె వాళ్ళని మరింత శ్రద్ధగా, ప్రేమగా చూసుకునేది. హరి ఎప్పుడూ ర్యాంక్ ల గురించే మాట్లాడతాడు.
పిల్లలు కొంతసేపు రిలాక్స్ అయినా హరి " ఇక పుస్తకాలు తీయండి " అనేవాడు.
పిల్లలిద్దరి చదువు పూర్తయి ఇద్దరూ ఉద్యోగాలలో చేరేరు. జానకి జీవితం లో వెనుతిరిగి చూసుకుంటే తనకంటూ ప్రత్యేకించి చేసుకున్నది, సాధించింది ఏమీ లేదు. తన పిల్లల విజయాలు హరి తన విజయాలుగానే అందరికీ చెప్పుకుంటాడు.
ఒకరోజు జానకి నన్ను వాళ్ళింటికి రమ్మని కోరింది. ఇంట్లో హరి లేడు.
జానకి నాకో ఫైల్ తెచ్చి ఇచ్చింది.
"నువ్వు పత్రికా ఆఫీసు లో పనిచేస్తున్నావు కదా. ఇది ఒకసారి చదువు. ఇది నేను రాసినదే" అంది.
ఇంటికి వెళ్ళేక ఆసక్తి తో చదివితే జానకి రాసింది అద్భుతంగా ఉంది.
కొద్దిపాటి మార్పులతో అంతా తన జీవితమే.
జానకి రచన ని మా పత్రికలో ధారావాహికంగా వేయడం మొదలుపెట్టేం. అది పాఠకులకి ఎంతగానో నచ్చింది. ఆ సీరియల్ తో
జానకికి రచయిత్రి గా మంచి పేరు వచ్చింది.
జానకి ఇప్పుడు చేతినిండా పనితో తీరిక లేకుండా ఉంది. కానీ ఆమెకి ఏదో సాధించానన్న ఆనందం, సంతృప్తి కూడా ఉన్నాయి.
ఇది నా స్వీయ రచన
అపోహ
దీప దిలీప్ ని ఇష్టపడేది . కానీ దిలీప్ తన స్నేహితురాలు పల్లవిని మోసం చేసాడు. పల్లవి ఎప్పుడూ దిలీప్ గురించి చెప్తుండేది. దిలీప్ తో తన జీవితం గురించి పల్లవి చాలా కలలు కనేది.
దిలీప్ పల్లవిని పెళ్లి చేసుకోనని చెప్పేసాడు. పల్లవి ఇది తట్టుకోలేకపోయింది. ఇప్పుడు పల్లవి తన ప్రపంచంలో తాను ఉంటుంది. ఎవరితో మాట్లాడదు.
దీప, పల్లవి మంచి స్నేహితులు. పల్లవి అలా అయిపోవడం దీప తట్టుకోలేకపోయింది. దిలీప్ మీద కోపం రోజురోజుకీ ఎక్కువయింది.
దీప, దిలీప్ పని చేస్తున్న ఆఫీసులోనే చేరింది. అతని టీమ్ లోనే అతనితో కలిసి పనిచేస్తుంది. ఆమెకి తెలివితేటలు, కష్టపడేతతత్వం అన్నీ ఉన్నాయి. కొద్దికాలంలోనే దీపకి మంచిపేరు వచ్చింది.
దిలీప్ కి దీప తెలివితేటలు, కష్టపడేతత్వం, ఆమె కలుపుగోరుతనం అన్నీ బాగా నచ్చాయి. దీపకి మాత్రం పల్లవి దీపక్ వల్లే అలా తయారైందన్న బాధ, కోపం ఎక్కువగా ఉంది.
ఇది నా స్వీయ రచన
అపార్ధం 2
కాలం గడుస్తున్న కొద్దీ దిలీప్ కి దీప మీద ప్రేమ ఎక్కువయింది. దీపకీ దిలీప్ అంటే ఇష్టమే. కానీ పల్లవిని చూసి వచ్చినప్పుడల్లా ఆమెకి దిలీప్ మీద కోపం పెరిగిపోయేది.
ఆఫీసులో అందరికీ దిలీప్ దీపని ప్రేమిస్తున్నాడని తెలిసు. కానీ దీప అతనిని ఎందుకు దూరం పెడుతోందో ఎవరికీ తెలియదు.
ఒకరోజు దిలీప్ తన మనసులో మాటని దీపతో చెప్పాడు. దీప అతనికి కొంత దగ్గరయినట్టు ప్రవర్తించింది కానీ పల్లవి బాధని ఆమె ఇంకా మరిచిపోలేదు.
ఒకరోజు దిలీప్ ని దీప పల్లవి వాళ్ళింటికి తీసుకెళ్ళింది. పల్లవిని ఆమె అన్నకి తెలిసిన డాక్టర్ ఒకతను ఇంటిదగ్గరే ఆమెని చూస్తున్నాడు. పల్లవి పరిస్థితి ఇప్పుడు కొంచెం మెరుగయింది.
పల్లవిని చూసి దిలీప్ చాలా బాధపడ్డాడు. వాళ్ళింటినుండి వచ్చేటప్పుడు దిలీప్ పల్లవి తనని ప్రేమించిందని కానీ తను ఎప్పుడూ ఆ అమ్మాయిని ప్రేమించలేదని, తను పల్లవితో అదే మాట చెప్పానని దీపతో చెప్పాడు.
ఇది నా స్వీయ రచన
అపార్ధం 3 (ఆఖరి భాగం)
పల్లవి ఆరోగ్యం ఇప్పుడు బాగా మెరుగయింది. పల్లవి అన్న స్నేహితుడు డాక్టర్ ప్రశాంత్ ఆమె కోలుకోవడానికి ఎంతో శ్రద్ధ తీసుకున్నాడు. ప్రశాంత్ ఆమెని ఇష్టపడ్డాడు కూడా. కొన్నాళ్ళకి పల్లవి కూడా అతనిని ఇష్టపడి వారిద్దరి పెళ్ళి జరిగిపోయింది.
దీపకి జరిగిన దాంట్లో దిలీప్ తప్పేమీ లేదని అర్ధమయింది. పల్లవి ఆరోగ్యం ఇంకా నయం కాకపోతే, దీప దిలీప్ ని అర్ధం చేసుకోవడానికి ప్రయత్నించేది కాదు.
దీప, తను కూడా దిలీప్ ని ప్రేమించడం మొదలుపెట్టాక పల్లవితోనే మొదట తనని దిలీప్ ప్రేమిస్తున్న విషయం తెలియచేసింది.
పల్లవి " నువ్వు నాకు ఈ విషయం చెప్తున్నావంటే నువ్వూ దిలీప్ ని ప్రేమిస్తున్నావు. మీ ఇద్దరూ ఒకరినొకరు ఇష్టపడితే ఇంకేం కావాలి. నాకు చాలా సంతోషంగా ఉంది " అని ఆమెని కౌగలించుకుని అభినందించింది.
దిలీప్ ని అనవసరంగా అపార్ధం చేసుకున్నానని దీప ఎన్నోసార్లు అనుకుంది. అదే మాట దిలీప్ తో అంటే " పల్లవి పట్ల నీకున్న స్నేహం వల్లే నువ్వు నన్ను అపార్ధం చేసుకున్నావు. ఇలా జరగడం సహజమే" అని తేలిగ్గా తీసుకున్నాడు.
ఆయనో కఠిన వ్యాపారస్తుడు. లాభనష్టాల బేరీజులే ఆయన జీవితం.
ఆ అమ్మాయిది చాలా సున్నిత మనసు. ఎవరినీ నొప్పించని స్వభావం. ఎవరైనా ఒక మాటంటే తట్టుకోలేని మనస్తత్వం.
కుటుంబం మంచిదని , అబ్బాయి తల్లితండ్రులు వచ్చి మరీ అడిగారని తండ్రి ఆ పెళ్లి చేసాడు. పెళ్ళి ఐన గంట తర్వాత పెళ్లి కొడుకు ఇంట్లో లేడు. ఏవో వ్యాపార సమస్యలు. మూడు రోజుల తర్వాతే పెళ్ళి కొడుకుని చూసింది ఆ అమ్మాయి.
అత్తారింట్లో కూడా అతని కోసం ఎవరూ ఎదురు చూసేవారు కాదు.
ఆ ఇద్దరి జంట మధు, లహరి. మధు కోసం రోజూ వండాల్సిందే. ఇంటికి భోజనానికి వస్తాడో, రాడో ఆఖరి వరకు తెలియదు.
లహరికి ఈ పద్ధతి చాలా వింతగా, బాధ గా కూడా ఉండేది. తను అంటూ ఒక మనిషి ఉందనే విషయం కూడా అతను పట్టించుకునేవాడు కాదు. ఎంతసేపూ తన వ్యాపారం, తన పనులు.
లహరి తననే అతని జీవం విధానానికి అనుగుణంగా మార్చుకోవాలనుకుంది. వంట చేయడానికి అన్నపూర్ణమ్మ ఉన్నా ఫలహారాలు, వంటకాలు అన్నీ పూర్తయ్యేవరకూ తనే దగ్గరుండి అన్నీ చూసుకునేది. అత్తమామల ఆరోగ్యం గురించి తనే శ్రద్ధ తీసుకొనేది. ఇంటికి చుట్టాలు, స్నేహితులు వస్తే అత్తగారితో కలిసి అతిథి సత్కారాలు చేసేది.
తమ గదిని, ఇంటిని అలంకరించడం,
తోట పని మామగారితో కలిసి చేయించడం, మరిది ముకుంద్ తో కలిసి ఆటలాడటం ఆమె సరదాలు. ఇంట్లో అందరితో కలిసి సమయం గడిపేది.
మధు మనస్తత్వాన్ని అర్ధం చేసుకోవడానికి లహరి ప్రయత్నించేది. అతను బిజీగా ఉంటే
సాయం చేయడానికి యత్నించేది. కానీ మధు ఎవరి మీద కేకలేసినా తననే అన్నంతగా బాధపడి ఏమీ మాట్లాడేది కాదు.
వ్యాపారంలో క్రమశిక్షణ, కరుకుదనం ఇంటి సభ్యుల పట్ల, తన పట్ల చూపితే లహరికి నచ్చేది కాదు. ఒకొక్కప్పుడు వ్యాపార తలనొప్పులతో ఎన్ని బాధలు పడుతున్నాడో అని లోలోపలే మధనపడేది.
క్రమంగా మధులో మార్పు రావడం మొదలయ్యింది. ఇంట్లో కొంచెం ఎక్కువ సేపు గడపడం అలవాటు చేసుకున్నాడు. తల్లితండ్రులతో, తమ్ముడితో కొంతసేపు గడపడం, కొంతసేపు తోటలో గడపడం, వండినవి నచ్చితే బావున్నాయని చెప్పడం మధుకి అలవాటయింది. లహరి దారిలోకే తనూ వస్తున్నాడని మధుకి అర్ధమైంది.
మధు ఆఫీసులో అందరూ గుసగుసలాడుకుంటున్నారు. వాళ్ళందరికీ అది ఎనిమిదో వింతగా ఉంది. బాస్ ఓ పదిరోజులు సెలవు పెడుతున్నారట.
మధు సెలవు పెట్టడం చాలా అరుదుగా జరిగే విషయం. పెళ్ళి తరవాత తనకి హనీమూన్ లాటి సరదాలు లేకపోయినా మొదటి సారి లహరి గురించి ఆలోచించి ఆమెని ఎక్కడికైనా తీసుకుని వెళ్ళాలని నిశ్చయించాడు మధు.
ఆమెతో కలిసి గడిపినప్పుడు ఎన్నో విషయాలు నేర్చుకునేవాడు మధు. కొన్నాళ్ళ తర్వాత లహరితో కలిసి మధు అత్తవారింటికి కూడా వెళ్లివచ్చాడు.
లహరి మధుకి వ్యాపారం విషయంలో సాయపడటానికి తాను కూడా బిజినెస్ కోర్స్ చేసింది.
లహరి తనకి బిజినెస్ లో సాయపడగలదు కానీ తను లహరికి అన్ని విషయాలలో సాయపడలేడని అర్ధమయిపోయింది మధుకి
ఇది నా స్వీయ రచన
సరస్వతీ పుత్రిక
రమేష్ పార్కులో వాకింగ్ చేస్తున్నాడు. ఒక పెద్దాయన ఊపిరి తీసుకోవడానికి అవస్త పడుతూ సిమెంటు బెంచీమీద కూర్చున్నాడు. రమేష్ ఆయన దగ్గరకి వచ్చి ఆయనతో "మీ ఇంటికి తీసుకొని వెళ్తాను. మీరు ఆక్సిజన్ మాస్క్ పెట్టుకోవాలేమో. లేకపోతే దగ్గరలో ఉన్న ఆసుపత్రికి వెళ్దాం" అన్నాడు .
ఈలోగానే ఆయన ఫోన్ చేయడం, ఐదు నిముషాల్లో ఆయన కూతురు రాయడం జరిగింది. ఆ అమ్మాయి, రమేష్ అతనిని వాళ్ళ కారులో కూర్చోపెట్టారు.
ఆ అమ్మాయి కారు డ్రైవ్ చేస్తోంది. రమేష్ అతని పక్కనే ఉన్నాడు. ఇంటికి వెళ్ళేసరికి ఒక డాక్టర్ అక్కడ ఉన్నారు.
ఆ అమ్మాయి పేరు మహేశ్వరి.
తండ్రి పరబ్రహ్మం. ఆయన పరిస్థితి చక్కబడ్డాక రమేష్ వెళ్ళిపోదామనుకుంటే పరబ్రహ్మం కూర్చోమని సైగ చేసాడు.
పరబ్రహ్మం ఒక పత్రికా యజమాని. కూతురు మహేశ్వరి జర్నలిజం చేసి ఆ పత్రికా నిర్వాహణ బాధ్యత తనే చేపట్టింది.
పరబ్రహ్మం రమేష్ తో కొంతసేపు మాట్లాడి పంపించేసాడు. కానీ వీలయినప్పుడు మరోసారి రమ్మన్నాడు.అతను రమేష్ ఫోన్ నంబర్ కూడా తీసుకున్నాడు.
మరి కొన్నాళ్ళు అయ్యాక రమేష్ వచ్చి పరబ్రహ్మం ని కలిసాడు. రమేష్ డిగ్రీ పూర్తవగానే చిన్న ఉద్యోగంలో చేరి అక్కడే పని చేస్తున్నాడు.
రమేష్ పరబ్రహ్మం దగ్గరకి వెళ్తే ఒక పట్టాన వదిలేవాడు కాదు. ఏవో ఒకటి చెప్తుండేవాడు. ఏదో ఒకటి అడుగుతుండేవాడు. ఒకసారి వాళ్ళ పత్రికా ఆఫీసుకి తీసుకెళ్ళాడు. రమేష్ తో "నువ్వు మా ఆఫీసు లోనే పని చెయ్యి" అని ఆఫర్ ఇచ్చేడు. రమేష్ మంచి జీతంతో పత్రికా ఆఫీసు లో పనిలో చేరేడు.
రమేష్ ఆఫీసుకి వెళ్ళడం మొదలెట్టినప్పటి నుండి పరబ్రహ్మం కూడా ఏదో ఒక టైం లో పత్రికా కార్యాలయానికి వచ్చేవాడు. రమేష్ కి అన్నీ వివరంగా చెప్పేవాడు. కూతురు అన్ని పనులూ సమర్ధవంతంగా చేస్తుందని ఆయనకి గొప్ప నమ్మకం.
రమేష్ కి ఆఫీసు లో చేరేక తెలిసిన విషయమేంటంటే
మహేశ్వరి సంగీత విద్వాంసురాలు. ఆ కళ ఆమెకి తన తల్లి నుండి వారసత్వంగా వచ్చింది. ఆమె ఇంకా తన గురువుగారి దగ్గర శిష్యరికం చేస్తోంది. ఆయనతో కలిసి కచేరీలలో పాల్గొంటుంది. ఆమె విదేశాలలో కూడా సంగీత కచేరీలో పాల్గొంటుంది.
్ఆమె లేనప్పుడు పరబ్రహ్మం , మిగతా వాళ్లు పత్రిక పని చూస్తారు. పరబ్రహ్మం కూడా సంగీతమే ప్రధానమనుకుంటాడు.
ఒకరోజు పరబ్రహ్మం రమేష్ ని తాము మొదటి సారి కలుసుకున్న పార్కు కి తీసుకెళ్ళి తన కూతురి గురించి చెప్పడం మొదలెట్టాడు.
ఇది నా స్వీయ రచన
సరస్వతీ పుత్రిక -3
"నా కూతురు బంగారం. అప్పుడప్పుడూ వజ్రమంత కఠినం కూడా. అన్నిటికీ మించి అది సరస్వతీ పుత్రిక. చిన్నప్పుడు వాళ్ళ అమ్మ సంగీత పాఠాలు నేర్పితే ఇట్టే నేర్చేసుకునేది. వాళ్ళ అమ్మ మహేశ్వరి కి ఎన్నో పుస్తకాలు కొని ఇచ్చేది. మహేశ్వరి ఎన్ని పుస్తకాలయినా చదివేసేది. "
"వాళ్ళ అమ్మ కూతురి విషయం లో తన బాధ్యత తీర్చుకుంది. మహేశ్వరిని నాకు అప్పచెప్పేసి నిశ్చింతగా తను వెళ్ళిపోయింది. " ఆయన గొంతు గద్గదమైంది.
"నా భార్య కూతురి కి సంబంధం
చూడమని చెవిన ఇల్లు కట్టుకుని చెప్పేది . ఇప్పుడు ఆ బాధ్యత నాదే కదా "
"సంగీతం, పత్రిక మహేశ్వరి కి రెండు కళ్ళు. నా అనారోగ్యం ఇప్పుడు తనకి పెద్ద సమస్య గా మారింది. నా ఆరోగ్యం బాధ ఉన్నప్పుడే మహేశ్వరికి తగిన వాడిని చూసి పెళ్లి చేద్దామని నా తాపత్రయం."
"నాకు డబ్బు సమస్య లేదు. నా కూతురికి సరైన వరుణ్ణి తేవడమే నాకు ప్రధానం.
" పార్కులో నేను ఇబ్బంది పడటం చూసి నువ్వు నా దగ్గరికి వచ్చి సాయం చేసినప్పటి నుండి నేను నిన్ను గమనిస్తున్నాను. నువ్వు నాకు బాగా నచ్చేవు. మా అమ్మాయిని పెళ్లి చేసుకోమంటే నువ్వు ఏమంటావ్ " అని అడిగేడు పరబ్రహ్మం.
రమేశ్ కి ఏం చెప్పాలో తెలియలేదు. తనలో ఏం చూసి అతను తనని అల్లుడిగా చేసుకోవాలని అనుకుంటున్నాడో తెలియదు.
"మీరు ముందు మీ ఆమ్మాయి తో మాట్లాడండి.ఆమె యిష్టాయిష్టాలు మీరు తెలుసుకోవాలి కదా" అన్నాడు.
"ముందు నీ సమాధానం నాకు తెలియాలి " అన్నాడు పరబ్రహ్మం.
"సరస్వతీ పుత్రికని మీరు మా ఇంటికి పంపిస్తామంటే మేమంతా బ్రహ్మరధం పడతాం" అన్నాడు నవ్వుతూ.
పరబ్రహ్మం కి మహేశ్వరి దగ్గర పెళ్లి ప్రస్తావన తేవడానికి మరో మూడు రోజులు పట్టింది .
మహేశ్వరి తో" నీతో ముఖ్య
విషయం మాట్లాడాలి" అని చెప్పి అప్పుడు తన మనసు లో మాట చెప్పేడు.
మహేశ్వరి "నన్ను ఆలోచించుకోనీ నాన్నా" అని అప్పటికి దాటవేసింది.
పరబ్రహ్మం ఓ వారం రోజులు చూసేడు. మహేశ్వరి ఇంకా ఏం మాట్లాడలేదు.
పరబ్రహ్మం మహేశ్వరితో " రమేశ్ కి ఓ వారం రోజులు సెలవు ఇవ్వు. అతనితో నాకు పని ఉంది" అన్నాడు. మహేశ్వరి సరేనంది.
ఆ వారం రోజులూ సుదర్శన్ పరబ్రహ్మం తోనే ఉన్నాడు. రమేశ్ బొమ్మలు బాగా గీసేవాడు. పరబ్రహ్మం కోరిక మీద పెయింటింగ్ లు వేసేవాడు. పరబ్రహ్మం అంతకు ముందు గోడ మీద ఉన్న పెయింటింగ్స్ మార్చి ఈ కొత్త పెయింటింగ్స్ పెట్టించేడు. రమేశ్ కార్టూనులు బాగా వేస్తాడు. అది తెలుసుకున్న పరబ్రహ్మం అతనితో కార్టూనులు వేయించి తన పత్రికా ఆఫీసుకి పంపించి పత్రిక లో వచ్చేలా చూసేవాడు.
ఆ వారం లో పరబ్రహ్మం రెండు మూడు సార్లు అయినా రమేశ్ తో పాటు వాళ్ల తల్లితండ్రులను కలిసాడు. కానీ ఇద్దరూ వాళ్ళ దగ్గర మహేశ్వరి ప్రస్తావన తేలేదు.
పరబ్రహ్మం రమేష్ ని తన స్నేహితుల ఇళ్లకు తీసుకొని వెళ్ళి తన పత్రిక ఆఫీసులో పనిచేస్తున్న వ్యక్తి గానే వారికి పరిచయం చేసాడు కానీ తనకి కావలసిన వ్యక్తి అని కూడా వాళ్లతో చెప్పేడు.
పరబ్రహ్మం స్నేహితుడు ఒకతను మహేశ్వరికి ఫోను చేసి "మావాడు రమేశ్ తనకి కావలసిన వ్యక్తి అని అంటున్నాడు. ఏంటి కథ "అని అడిగేసాడు.
మహేశ్వరి " అతను నాన్నకి ఆరోగ్యం బాగు లేనప్పుడు సాయం చేసేడు. అందుకే నాన్న అందరితో అలా చెప్తుంటాడు" అంది .
పరబ్రహ్మం కూతురితో "ఒకసారి రమేశ్ వాళ్ల తల్లితండ్రులను మన ఇంటికి రమ్మందామనుకుంటున్నా. నేను వాళ్ల ఇంటికి వెళ్ళేను కదా" అన్నా డు. మహేశ్వరి సరేనంది.
వాళ్లు వచ్చినపుడు పరబ్రహ్మం తనకి ఇష్టమయిన పాట పాడమని మహేశ్వరిని అడిగేడు
ఆమె కాదనలేక ఒక పాట పాడింది. అందరూ ఆమె పాటని బాగా మెచ్చుకున్నారు.
మహేశ్వరికి తండ్రి తను పెళ్లికి అంగీకరించడానికే ఇదంతా చేస్తున్నాడనిపించింది. రమేశ్ ని తను కూడా బాగానే గమనించింది. తండ్రికి రమేశ్ అంత నచ్చినపుడు, తన మనసులో వేరెవరూ లేనప్పుడు తన అంగీకారం తండ్రికి చెప్పడమే మంచిదనిపించింది.
మహేశ్వరి పెళ్లికి అంగీకరించాక పరబ్రహ్మం ఆనందానికి అవధులు లేవు. అతనికి తన కూతురిని ఒక మంచి అబ్బాయి చేతిలో పెడుతున్నానన్న నమ్మకం ఉంది.
మహేశ్వరి రమేశ్ తో కూడా మాట్లాడి తన ఆమోదం అతనికి తెలియచేసింది.
ఇది నా స్వీయ రచన
ఇలా క్కూడా.....
తయారై కూర్చున్నా. పోలీస్ కోసం వెయిటింగ్. పాస్పోర్ట్ ఇచ్చే ముందు వెరిఫికేషన్ .అన్నీ చకచకా జరిగిపోయాయి.పక్కింటి పిన్ని గారి దగ్గర సంతకం తీసుకుని, వాళ్ళ అడ్రస్ రాసి ఇవ్వమన్నాడు
పిన్ని గారు వెళ్ళిపోయాక, "సార్ ఫోటో సాఫ్ట్ కాపీ నా నంబరు కి పంపించమనండి" అంటూ లేవబోయాడు.
"ఒక్క నిమిషం" అంటూ నేను సిద్ధంగా ఉంచిన ఐదు వందలనోటు అతను చేతిలో పెడుతూ "ఏదో మా సంతోషం" అన్నా.
"ఏ కాలంలో ఆగిపోయారు మీరు ?నేను ఠాగూర్ ని దాటి వచ్చానండి .అలా ఎప్పుడైనా మా స్టేషన్ వైపు వస్తే ఓసారి ఈ తమ్ముడిని కలియండి, కలిసి టీ తాగుదాం "అని నమస్కారం చేసి వెళ్ళిపోయాడు.
దిక్సూచి
అప్పుడే లంచ్ బాక్స్ తెరిచిన గీత దగ్గరికి మహిత పరిగెత్తుకుంటూ వచ్చింది.
""టీచర్, జగదీష్ నా డబ్బులు తీసుకుని ఎక్కడికో వెళ్ళిపోయాడు." ఏడుస్తూ అంది మహిత.
"ఎంతమ్మా, అయినా నీ దగ్గర ఎందుకు ఉంచుకున్నావు.నాకివ్వాల్సింది" అంది గీత.
"వంద రూపాయలు " ఏడుస్తూ చెప్పింది మహిత.
ఈ లోగానే అక్కడకి జగదీష్ వచ్చేడు. తన చేతిలోని చిల్లర కాగితాలు మహిత ముందుపెట్టి అక్కడినుంచి కదలబోయాడు.
"జగదీష్, మహిత దగ్గరనుంచి నువ్వెందుకు డబ్బులు లాక్కున్నావు.అలా చేయొచ్చా?" అంది గీత.
ఏమీ మాటాడకుండా చేతులు వెనక్కి కట్టుకుని నిలబడ్డాడు జగదీష్.
"నేను ఇంగ్లీషు టెక్స్ట్ ఋక్ కొనుక్కోవాలి టీచర్ " వెక్కుతూ అంది మహిత.
"నేను నీకు కొని ఇస్తాలే.ఏడవకు. కళ్ళు తుడుచుకో" అని గీత మహిత ని అక్కడ నుంచి పంపించేసింది.
"జగదీష్ ,రేపటి నుండి నువ్వు నాతోనే లంచ్ చేయాలి " అంది గీత. ఏమీ మాటాడకుండా జగదీష్ అక్కడ నుంచి వెళ్ళి పోయాడు.
వీడిని సరైన దారి లో పెట్టాలి అనుకుంటూ క్లాస్ రూమ్ వైపు నడిచింది గీత.
ఇది నా స్వీయ రచన
మార్పు
వర్ధనమ్మ పిల్లల ఆట చూస్తోంది
ఆ పిల్లల జట్టులో నుండి ఒక అబ్బాయి వచ్చి ఆవిడ పక్కని కూర్చున్నాడు.
"ఏమ్మా ఆట మానేసావు" అడిగింది వర్ధనమ్మ.
"వాళ్ళు నన్ను లడ్డూ అని పిలుస్తున్నారు " ఉక్రోషంగా అన్నాడు ఆదిత్య.
ఆటలో ఔట్ అయిన మరో అబ్బాయి ఆదిత్య దగ్గరికి వచ్చి రమ్మని పిలుస్తున్నాడు.
వర్ధనమ్మ "మీరు ఆదిత్యని అలా ఎందుకు పిలుస్తున్నారు "అని అడిగింది.
" మా జట్టు నాయకుడు వసంత్. వాడు అలానే పిలుస్తాడు. అందుకే మేమూ అలాగే పిలుస్తాం."అన్నాడు వాడు.
ఆదిత్య కొంచెం మెత్తబడి మళ్ళీ ఆటలో చేరేడు. వర్ధనమ్మ వాడి గురించే ఆలోచిస్తోంది.
ఇంతలోనే అక్కడ కలకలం.
ఆట ఆగిపోయింది. ఒక వికెట్ విరిగిపోయింది .ఎలా ఆట కొనసాగించాలా అని నానా తంటాలు పడుతున్నారు.
"ఆదిత్యా, ఇలారా.వసంత్ ని కూడా పిలువు" అంది వర్ధనమ్మ.
వసంత్ వచ్చేడు.
వర్ధనమ్మ వసంత్ తో "మా ఇల్లు ఇక్కడే. మా ఇంట్లో కొత్త వికెట్లు మా మనవల కోసం కొన్నవి ఉన్నాయి.వస్తే నీకిస్తాను. కానీ,ఇక మీదట ఆదిత్యని మీరెవరూ లడ్డూ అని పిలవకూడదు " అంది.
వసంత్ "నేను మీ ఇంటికి వస్తా " అంటూ ఆవిడ తో నడిచాడు
ఇది నా స్వీయ రచన
అలవాటు
రాఘవయ్య కి ఏమీ తోచడం లేదు ఇంటిదగ్గర.
నిన్నటి వరకు ఆఫీసు, ఫైళ్ళు. ...అదే ఆయన ప్రపంచం. పొద్దున్నే పేపర్ పట్టుకుంటే రాజకీయ కుమ్ములాటలు,హత్యలు, మానభంగాలు. పావుగంట అటూఇటూ తిప్పి పక్కన పడేసాడు.
పోనీ, వంటలో శ్రీమతికి సాయపడదామనుకుంటే,ఇంకా వంటింట్లో అడుగు పెట్టకముందే ఆయన తల్లి అనసూయమ్మ గారు కోడలితో"నాకు నువ్వే వండిపెట్టమ్మా.వాడు వండినది తిని నాకు జీర్ణం కాకపోతే కష్టం సుమీ "అనేసింది.
పోనీ, అత్తగారు కోడలు అత్యుత్సాహంతో చూసే ధారావాహికాలు చూద్దామనుకున్నా ,అలవాటు లేక అల్లాడి పోయాడు
రాఘవయ్య సాయంత్రం తన భార్య సుశీలతో"అలా కాలనీలో తిరిగి వద్దాం"అన్నాడు. ఆవిడ సరే అని బయలుదేరింది.
కాలనీలో తారసపడ్డ వాళ్ళు సుశీలని పలకరించేవాళ్ళే.రాఘవయ్య కి ఎవరూ తెలియదు. వాళ్ళు మొక్కుబడిగా ఆయనకి అభివాదం చేసేవారు.
అలా ఐదురోజులు గడిచాయి. శనివారం సాయంత్రం రాఘవయ్య సుశీలతో "నేనలా బయటకి వెళ్ళొస్తా" అని చెప్పి గబగబా రోడ్డెక్కాడు.
మరికొంత సేపయ్యాక రాఘవయ్య పళ్ళు, స్వీట్ పాకెట్ తో ఇంట్లో అడుగుపెట్టాడు. అనసూయమ్మ గారి కి,సుశీలకి ఏమీ అర్థం కాలేదు.
రాఘవయ్య "సుశీలా మనిద్దరం రేపు పొద్దున్న ఇక్కడకి దగ్గరలో వున్న అనాధ శరణాలయంకి వెళ్ళి కొంతసేపు ఆ పిల్లలతో గడిపి వద్దాం.ఇది మంచి అలవాటే గా" అన్నాడు నవ్వుతూ.
ఇది నా స్వీయ రచన
స్వప్నం
స్వప్న తన పేరుకి తగ్గట్లు తన జీవితం లో ఒకే ఒక్క కల కంది. తను కలక్టరవ్వాలని. అందుకోసం ఎంతో ప్రయత్నించింది కూడా.మూడు సార్లు తను చేసిన ప్రయత్నం సఫలమవలేదు.
మొదటి సారి యూపీయస్ మెయిన్ పరీక్షల ముందు వాళ్ళ అమ్మ కి బాగా సుస్తీ చేసి కనుమూసింది.
తల్లి అనారోగ్యం, అకాల మరణం స్వప్నని బాగా కృంగదీసాయి.
రెండోసారి పరీక్షల ముందు, తమ్ముడు సుధాకర్ కి రోడ్డు ప్రమాదం వల్ల ఓ కాలు తీసేయాల్సివచ్చింది.
ఈ సమస్యలతో స్వప్న ఆరోగ్యం క్షీణించింది. అయినా స్వప్న, తన ప్రయత్నం కొనసాగించింది.
స్వప్న తను అనుకుంది సాధించలేకపోయింది.కానీ,ఓ కాలు పోగొట్టుకున్న తమ్ముడు సుధాకర్ ని బాగా ప్రోత్సహించి చదరంగంలో ఛాంపియన్ గా నిలబెట్టింది. చెల్లెలు దీప్తి మంచి ర్యాంక్ సాధించి,వైద్య కళాశాలలో చేరింది.
స్వప్న ఎమ్ బి ఎ చేసి, ఉద్యోగంలో అంచెలంచెలుగా పైకి ఎదిగింది.
స్వప్న పని చేస్తున్న కంపెనీలో నే ,ఆమె స్నేహితురాలి అన్నయ్య ప్రమోద్ పని చేస్తున్నాడు. అతనికి స్వప్న చేసిన ప్రయత్నాలు అన్నీ తెలుసు. అక్కడ పనిచేసే తన స్నేహితులతో కలక్టరమ్మ అంటూ ఆమె గురించి వ్యంగ్యం గా మాటాడే వాడు ప్రమోద్ .
ఆఫీసులో తన పేరు కలక్టరమ్మగా మార్చేసారని స్వప్నకి తెలుసు. పోనీలే,ఈ రకంగానైనా నా కల నెరవేరింది అని నవ్వుకుంటుంటుంది స్వప్న.
ఇది నా స్వీయ రచన
పునాది
మురళి సాదాసీదా జీవితం ఒక మహా నగరంలో మొదలయింది. కాలేజీ చదువుకొచ్చేసరికి ఇంజనీరింగ్ కాక ఆర్ట్ గ్రూప్ లో చేరేసరికి అది అందరికీ చర్చనీయాంశం అయింది. ఎవరేమనుకున్నా మురళి, అతని తల్లితండ్రులు పట్టించుకోలేదు.
డిగ్రీ అవగానే మురళి ఉద్యోగ ప్రయత్నాలు మొదలెట్టాడు.
తన మీద తనకున్న నమ్మకం,కష్టపడే తత్త్వం తో కొద్దికాలంలోనే మురళి ఓ ప్రభుత్వ ఉద్యోగాన్ని సంపాదించుకున్నాడు.
కానీ పోస్టింగ్ ఓ పల్లెటూరులో.
స్నేహితులు అక్కడెలా బతుకు తావురా అన్నా అక్కడ కూడా మనుషులే ఉంటున్నారు కదా,గ్రామీణ భారతానికి అలవాటు పడతానంటాడు మురళి నవ్వుతూ.
కొన్నాళ్ళయ్యేసరికి ఆఊరి ప్రజల అభిమానం, ఆప్యాయత, వారి జీవన విధానం అన్నీ మురళికి అర్ధమయ్యాయి. ఊరికి తగిన వైద్య సదుపాయాలు లేవని,తన స్నేహితుడితో మాటాడి ఒక ఆసుపత్రి ఏర్పాటు చేస్తాడు.
మురళి చెల్లెలు పెళ్ళి అయ్యాక అతని తల్లితండ్రులు మురళి తో"నువ్వు ఉన్న ఊరే మాకు హాయి.మేమూ అక్కడే ఉంటాం"అని అక్కడకే వచ్చేసారు.
మరి కొన్నాళ్ళకు మురళి అదే ఊరిలో ఉంటున్న రాధని ఏ ఆర్భాటం లేకుండా పెళ్లి చేసుకున్నాడు."మురళీగానం రాధని వెతుక్కుంటూ మా ఊరు వచ్చింది "అని రాధ మురళితో అంటూ ఉంటుంది.
ఇక మురళి కి ఆ ఊరి నుంచి ఏ ఊరికి బదిలీ అయినా అతని మూలాలు అతనిని ధ్రుఢం గా నిలబెడతాయి.
ఇది నా స్వీయ రచన
అడవి బిడ్డ
మణి ఏజన్సీ ప్రాంతం నుండి వచ్చి పట్నం లో మహిళా కళాశాల లో చేరింది.
భిన్న వాతావరణం,విభిన్న వ్యక్తులు,విభిన్న వ్యక్తిత్వాల మధ్య మసలవలసి రావడం వల్ల మొదట్లో చాలా బిడియంగా ఉండేది
"మీ ఏజన్సీ ప్రాంతంలో చాలా నాగుపాములు వుంటాయేమో కదా,అందుకే నీకు నాగమణి అని పేరు పెట్టారా " అని క్లాస్మేట్ అడిగితే, "మణిలా దేదీప్యమానంగా వెలిగి పోతుందని " అని తనతో స్నేహం చేసిన స్వర్ణ నవ్వుతూ చెప్పింది.
మణి డిగ్రీ పూర్తి చేసి మరి కొన్నాళ్ళు అక్కడే ఉంది.తను ఉద్యోగం సంపాదించుకుంటే గాని ఇంటికి తిరిగి వెళ్ళలేదు. తమ వారికి జరిగే అన్యాయాలని,దౌర్జన్యాన్ని ,దోపిడీని ఎదుర్కోవాలంటే తను పోలీస్ కావాలి.
మరి కొన్నాళ్ళకు అడవి బిడ్డ పోలీస్ గానే వాళ్ల ఊరిలో అడుగు పెట్టింది.
ఇది నా స్వీయ రచన
నాటకాలరాయుడు
ఏ కళ ఎవరి నుండి ఎవరికి అబ్బుతుందో మనకి తెలీదు. రావుగారు నటులు ఎలా అయ్యారో ఆయనకే తెలీదు.
నటనంటే రావుగారికి ప్రాణం.
చదువుకునే రోజుల్లో, ఉద్యోగం లో చేరేక కొన్నాళ్ళు రావుగారు ఎన్నో నాటకాలు వేసేరు. నటనలో బాగా రాణించేరు.ఎన్నో పురస్కారాలు,ఎందరినుండో తన నటనా పాటవానికి అభినందనలు అందుకున్నారు రావుగారు.
సంసార సాగరం ఈదడం మొదలెట్టాక,ఆఫీసులో పని ఎక్కువయ్యాక ఆయన నాటకాలు వేయడం మానేసారు.
ఉద్యోగ విరమణ అయిపోయాక,రావుగారు తీరిగ్గా బుల్లితెర చూడటం మొదలెట్టారు. ఆ నటుల నటన,సంభాషణలు ఏవీ ఆయనని రంజింప చేయలేక పోయాయి.
ఒకరోజు పొద్దున్నే రావుగారి పాత మిత్రుడు అతన్ని వెతుక్కుంటూ వచ్చేడు.
"ఒరేయ్, నేనిప్పుడో సినిమాకి దర్శకుడిని.ఒక పాత్ర కి నువ్వే న్యాయంచేకూర్చగలవు.మారుమాట్లాడకుండా నాతో బయలుదేరు" అని తనతో కారులో ఎక్కించుకుని వెళ్ళిపోయాడు.
అలా మొదలయిన ఆయన సినీ జీవితం లో ఎన్నో పాత్రలు, ఎందరో దర్శకులు. కళామతల్లి రావుగారిని మరో సారి అక్కున చేర్చుకుంది
ఇది నా స్వీయ రచన
మల్లీశ్వరి
మల్లీశ్వరి కి చాలా మంది అభిమానులు. అందరూ అభిమానం గా అక్కా అంటారు.
ఆడపిల్లలు ఎవరు ఏ సమస్య లో ఉన్నా అక్క దగ్గరకే పరిగెత్తుకొస్తారు.వాళ్ళని పై చదువులకి పంపించటం లేదని, చదువు మానిపించి ఇంట్లో కూర్చో పెడుతున్నారని,ఆటల పోటీలకి పంపడం లేదని ఇలా తల్లితండ్రుల మీదే రకరకాల ఫిర్యాదులు చేస్తుంటారు.
మల్లీశ్వరి అన్ని ఫిర్యాదులు ఓపిక గా వింటుంది. వాళ్ళ తల్లితండ్రుల దగ్గరికి వెళ్లి నయానభయాన అన్ని రకాలు గా చెప్పి వాళ్ళని ఒప్పిస్తుంది.అత్తమామలు ఏ కోడలితో దురుసుగా ప్రవర్తించినా ,ఏ భర్త భార్య ని హీనంగా చూసినా వాళ్ళ దగ్గరికి మీడియా ని తీసుకు వెళ్ళడానికి కూడా వెనుకాడదు మల్లీశ్వరి.
ఒక రోజు అక్క దగ్గరకి ఓ అబ్బాయి వచ్చేడు. తను సైన్యం లో చేరాలని అనుకుంటున్నాడని,తన తల్లితండ్రులు దానికి అంగీకరించడం లేదని ఫిర్యాదు.మల్లీశ్వరికి వాళ్ళని ఒప్పించగలనన్న నమ్మకం ఉంది.అదే మాట చెప్పి,ఆ అబ్బాయి తో కలిసి వాళ్ళ ఇంటికి బయలుదేరింది.
ఇది నా స్వీయ రచన
లేఖ
చాలా మందికి ఉత్తరం అంటే తెలీదు. కాని మాధవి ఇంకా కొన్ని ఉత్తరాలు జాగ్రత్త చేసే ఉంచింది.
ఇంకా తనకి పెళ్లి కాక ముందు
ఏర్పడిన కలం స్నేహం అది.
మాధవి కి ఓరోజు ఎక్కడ నుండో ఓ ఉత్తరం వచ్చింది. ఆ అబ్బాయి పేరు వెంకట్.
మాధవిని ఏదో పెళ్ళి లో చూసేడట.వాళ్ళ చిరునామా ఎలాగో తెలుసుకున్నాడట.కలం స్నేహం చేయాలనుకున్నాడట.
అలా మొదలయిన కలం స్నేహం కొన్నాళ్ళు నడిచింది.
మాధవి కి అనుకోకుండా పెళ్ళి కుదిరింది.మాధవి వెంటనే తన పెళ్ళి పత్రిక వెంకట్ కి పంపింది.
మరి కొన్నాళ్ళకు వెంకట్ నుండి వచ్చిన ఆఖరి ఉత్తరం
"చెల్లెమ్మా, నన్ను క్షమించు, పెళ్ళి కి రాలేకపోతున్నా"
ఇది నా స్వీయ రచన
ప్రతిఘటన
అది బాలికల విద్యాలయం. ఆరోజు లెక్కలమాస్టర్ సెలవు పెట్టారు.
ఉన్నట్టుండి సత్య సీతతో "మన లెక్కలమాస్టారి పధ్ధతి ఏం బాగాలేదు" అంది.
ఏదో అర్ధమయినట్లుగా సీత"నాకూ అలానే అనిపించింది "అంది.
అది వారికి ఖాళీ పిరియడ్ కావడంతో క్లాస్ లో గుసగుస లెక్కువయ్యేయి.
లంచ్ టైం లో అమ్మాయిలందరూ ఈ విషయమే మాటాడుకున్నారు.ఇంటికి వెళ్ళాక ఈ విషయం తమ తల్లితండ్రులతో చెప్పాలనుకున్నారు.
మర్నాటి ఉదయం చాలా మంది తల్లితండ్రులు వచ్చి ప్రిన్సిపాల్ ని కలిసి,ఆ మాస్టర్ అనైతిక ప్రవర్తన, అమ్మాయిలు ఎంత ఇబ్బంది పడుతున్నారో వివరించి వెంటనే తగిన చర్యలు తీసుకోవాలని కోరేరు.
విచారణ జరిగాక సదరు మాస్టర్ ని జైలు కి పంపడం జరిగింది.