Sunday, 13 November 2011

samaikyamayyam

అత్యాచారాలూ బలవన్మరణాలూ
అంతిమ గడియ వరకూ
పెనుగులాట -పోరాటం
అతివ చరిత సమస్తం
పరపీడన పరాయణత్వం
రక్తసిక్తం

ఎందరో స్వప్నికలు-ఆయేషాలు
మైనరు బాలికలపై అత్యాచారాలు
సాముహిక అత్యాచారాలు
ప్రేమ పేరుతో తెగనరికే
ప్రేమోన్మాదులు -ఏసిడ్ దాడులు
గడప దాటితే చాలు
వేధింపులు వేటకుక్కలు

అన్ని చానళ్ళకు ఇరవైనాలుగ్గంటలపాటు
సంచలన వార్తవౌతావు
కన్నవారి గుండె బద్దలు చేసే
బ్రేకింగ్ న్యూస్ వౌతావు
ఏబీచ్ లోనో శవంగా కొట్టుకొస్తావు
ఒంటిమీద కత్తిపోట్లతో
ఇంట్లోనే ఎదురౌతావు

కధానాయికవైనా
బుల్లితెర మెరుపువైనా -మైమరుపువైనా
అర్ధరాత్రి కాల్ సెంటర్లో డ్యూటీ దిగినా
పట్టపగలు ప్రేమికుని కలిసేందుకు ఆటో ఎక్కినా
భయంకర మరణం నీ గమ్యస్థానం
కాకుంటే అమానుష అత్యచారపర్వం

బతికున్న దెయ్యాలూ పిశాచాలూ
మృత్యువు వరకూ నిన్ను తరుముతాయి
మృత్యువు కోరల్లో నువ్వొంటరి వయినా
కోటి గొంతులతో ఈఅన్యాయన్నీ
దౌర్ర్జన్యానీ ప్రశ్నించడానికి
మేం సమైక్యమయ్యాం

మరో స్వప్నిక-అయేషా
దుర్మరణం పాలుకాని
సమాజాన్ని మేం స్వప్నిస్తున్నాం

మే2009,భూమిక
    

No comments:

Post a Comment