హరితానికి కొరత వచ్చిన
కరువు కాలంలో
కోకిల కుజితాలూ లేవు
ఆమని సోయగాలూ లేవు
జాతీయమృగం చర్మం ఒలిచి
గజరాజు దంతసిరులకై భీభత్సంగా తెగనరికి
సొమ్ముచేసుకునే వేటగాళ్ళ-మంత్రివర్యుల విందులకి
కరుసయిపోయి కనుమరుగైన
మయూరాల నాట్యాలూ లేవు
ప్రకంపాల చేదుఅనుభవాలు
చవిచూసిన జాతికి వేప్పువ్వు వగరు విసుగెత్తింది
వృషనామ వత్సర ఆంధ్రభారతంలో
ప్రపంచ బ్యాంకు షరతులతో కూడిన అప్పులు
పప్పుకూడయితే
ఉప్పుధరకూడా ఊపందుకుంటుంది
హై టెక్ మహా మంత్రం చీకట్లో జపించడమే
మనకిక మిగిలింది
గణతంత్ర దినోత్సవాలలో మిరుమిట్లు గొలిపిన
రక్షణ రవితేజానికి భక్షణ లాలూచీగ్రహణం
తెహెల్కా వెలుగులో
అధికార యంత్రాంగ అవినీతి కుంభకోణం
నేటి పంచాంగశ్రవణం
ముందేలీకైన ప్రశ్నపత్రం
ఉక్కుసాహితి ఉగాది కవి సమ్మేళనం
No comments:
Post a Comment