Friday, 31 October 2025

శ్రీ సూర్య నారాయణా

 

శ్రీ సూర్య నారాయణా...

ఇది నా‌స్వీయ రచన

తులసమ్మ గారికి రోజూ పొద్దున్నే   తలార స్నానం చేసి సూర్యుడికి అర్ఘ్యం ఇవ్వడం,సూర్య నమస్కారాలు చేసుకోవడం అన్నీ అయితే కాని పచ్చి మంచినీళ్ళు కూడా  ముట్టరు.

ఆరోజు  స్నానం అయిపోయింది గానీ మబ్బు కమ్మి ఉండి సూర్యుడు కనబడలేదు.
అంతే,మడిగా పీట మీద  కూర్చున్నారు కానీ ఏమీ తాగలేదు. కూతురు,అల్లుడు,మనవలు అందరూ చెప్పి చూసారు కానీ ఫలితం లేదు. ఆవిడ ఒక్క డాక్టర్ మనవరాలికే భయపడుతుంది. ఏవన్నా అయితే ఎక్కడ ఆసుపత్రిలో చేరుస్తుందో అని. ఓ రెండు గంటలు పోయాక మనవరాలు  డాక్టర్ సరిత ఓ గ్లాసుడు పాలు ఇస్తే ఎలాగో తాగింది.

మరో రెండు  గంటలు దాటిన దగ్గరనుంచి  కూతురు  పళ్ళయినా తినమని, లేకపోతే సరి తడి ఫోన్ చేసి చెప్తానని బెదిరించింది.
ఇక పళ్ళముక్కలు తినక తప్పలేదు.

సూర్యుడు కనబడలేదన్న దిగులుతో తులసమ్మకి  మధ్యాన్నం నిద్ర కూడా  పట్టలేదు. ఆ రోజంతా పాలు, పళ్ళతోనే కాలక్షేపం చేసింది.
మర్నాడు కూడా మేఘాలు ,వర్షం. ఆరోజు కూడా ఆవిడకి అన్నం తినాలనిపించలేదు.
ఇదంతా ఆ సూర్య భగవానుడు తనకి పెడుతున్న పరీక్ష అనుకుంది.
రెండో రోజు రాత్రి  సరిత తులసమ్మ  దగ్గరకి వచ్చి  " అమ్మమ్మా , సూర్యుడు నీకు కనిపించక పోయినా ఆకాశంలోనే ఉంటాడు కదా. నీ పూజలు  నువ్వు  చేసుకో. ఇలా అన్నం మానేసి, సరిగ్గా   ఏం తినకపోతే రేపు పొద్దున్నే  నిన్ను ఆసుపత్రికి తీసుకెళ్తాను " అని చెప్పి వెళ్ళిపోయింది.
తులసమ్మ ఇక సూర్యుడి కోసం ఎదురుచూడకుండా, మర్నాడు సూర్యనమస్కారాలు మొదలెట్టేయాలని నిశ్చయించుకుంది. మనవరాలిముందే ఇడ్లీలు తినేస్తే  మరి ఇక తనతో ఆసుపత్రికి తీసుకెళ్ళదు అనుకుంటూ పడుకుంది.

పొద్దుట స్నానం చేసి వచ్చేసరికి సూర్యభగవానుడు తనే నవ్వుతూ తులసమ్మని పలకరించేడు.

30.10.25

No comments:

Post a Comment