ఓబిన్ బాబు, గోబిన్ బాబులతగాదాలో పంట కోతకి సంబంధించి మకర్ ఎవరి పక్షాన చేరలేదు.అఖన్, బోతా,మహదేవ్ బేరాలాడి,రేటు పెంచి పనికి వెళ్ళేరు కాని ఈ మధ్యలో అన్నదమ్ములిద్దరూ కుమ్మక్కై సబూయీజోర్ సవరలు చట్టాన్ని అతిక్రమించేవారనీ,వాళ్ళు దొంగలు తప్పమరేమీ కారని,అధికారులు ఆ విషయం గుర్తించాలని,పంచాయితి
వాళ్ళని ఊరు నుంచి ఖాళీ చేయించాలని నానా హంగామా చేసారు. దానితో మకర్ తో సహా సబూయీజోర్ లో ఉన్న సవర మగాళ్ళందర్నీ అరెస్ట్ చేసారు. ఈసారి మూడు నెలల జైలు శిక్ష పడింది.
మకర్ ఏడుస్తూ కిష్టోబాబుకి చెప్పాడు. "నేనెప్పుడూ దేవుళ్ళని నిర్లక్ష్యం చేయలేదు బాబూ!నేను అడవికి వెళ్ళినపుడు'బేరో'దేవుణ్ణి కాపాడమని ప్రార్ధిస్తాను.నాకు సెంటు భూమి లేదు. అయినా కరువు కాలంలో వర్షాల కోసం పహార్ దేవుణ్ణి పూజిస్తాను. ఆయనకి బియ్యం, పువ్వులు, ఒక కోడి పెట్టని అర్పించుకుంటాను.అయినా దేవుళ్ళకి మకర్ మీద దయ లేదెందుకు బాబూ? జైలు గదిలో నాకు ఊపిరి సలపదు.
ఉక్కిరిబిక్కిరవుతాను.ఆ గదంతా చీదరచీదరగా అనిపిస్తుంది. భూతిని చూస్తూ ఉండు బాబూ. ఈ సవరకి నువ్వు తప్ప మరెవరూ లేరు"
మకర్ ని దురదృష్టం వెంటాడింది.తాను అపురూపంగా చూసుకున్నవన్నీ వాడు కోల్పోయాడు.భూతి వాడి కోసం వేచి ఉండటానికి నిరాకరించింది. తన ముంజేతికి ఉన్న కడియాన్ని విరిచేసి, బట్టలు కట్టుకొని వెళ్ళిపోయింది.వెళ్ళిపోతూ ఆమె అఖన్ తల్లితో,"అతన్ని వదిలి పోవాలంటే నా గుండె బద్దలవుతోంది.కాని ఏం చెయ్యను? అతను శాపగ్రస్తుడు.అతనికి ఎప్పటికీ ఒక బిడ్డ కూడా కలగడు.నేను వెళ్లిపోయానని అతనికి చెప్పు "అంటూ ఏడుస్తూ వెళ్ళిపోయింది.నిజంగానే మకర్ కి ఏదో శాపంలాఉంది.
" నా చెల్లి కూతురికి పళ్ళు వస్తున్నాయి.నేనిలా గొడ్రాలిలా బతకలేను. "
"మేకలనీ, కోడిపిల్లలనీ ఏం చేస్తావు?"
"అన్నీ కిష్టోబాబు దగ్గర వదిలివెళ్తాను.ఆయనకి అన్యాయం చేయను."
"అతనంటే నీకు అభిమానమేను."
"అందుకే నేనతన్ని ఇంతవరకు విడిచిపెట్టలేదు. "
No comments:
Post a Comment