సంతలో మేకల్ని, కోడిపెట్టల్నీ అమ్మేసి మకర్ కుమారికి ఓ చీర ,గాజులు కొని తెచ్చాడు.
వాడు ఆమెను ఎప్పుడూ సంతోషపెట్టడానికి ప్రయత్నించేవాడు. కాని అది కూడా కుమారిని కలవరపెట్టింది.
"నా కెందుకిన్ని కానుకలిస్తావు?"
"నాకొకటి కావాలి కాబట్టి "
"ఏమిటది? "
"నాకో బిడ్డనివ్వు కూమారీ-ఓ కొడుకునో,కూతురినో"
"నాకక్కర లేదనుకుంటావా?"
"ఒకే ఒక పాపాయి"
"అది నా చేతుల్లో ఉందా?"
"అయితే మరెవరు బాధ్యులు?"
"నువ్వే కారణమై ఉంటావు "
"మగాడుఎప్పుడూ కారణమవడు."
"బహశా నువ్వు తిరుగుబోతువయి ఉంటావు.
" కుమారీ!"
"కాకపోతే రేవతి నిన్ను వదిలి వెళ్ళక
ఎలా మగపిల్లల్ని కన్నాది?భూతి కూతుర్ని చంకన వేసుకుని ఎలాతిరుగుతోంది?"
మకర్ కుమారిని జుత్తు పట్టుకొని బయటకీడ్చి తన్నేడు.
"ఎవడే నీకు దొరికాడు? లేకపోతే నాతో
ఇలా మాట్లాడ్డానికి నీకెన్ని గుండెలే?"
కుమారి అక్కడ పడివున్న ఒక కొమ్మ తీసి,మకర్ ని కొట్టి వాడిని నానా తిట్లూ తిట్టింది. జనం పరిగెత్తుకొచ్చారు. మకర్, కుమారి ఒకళ్ళనొకళ్ళు తిట్టుకున్నారు.అప్పుడు మంగళ్ అన్నాడు "ఇక చాల్లెండి . ఒకళ్ళనొకళ్ళు తిట్టుకున్నారుగా!మకర్,కుమారి తల్లి
కాలేక పోవడానికిఆమే కారణమంటున్నాడు.కుమారి మకర్ కే పిల్లల్ని కనే మగతనం లేదనుకుంటోంది. పదండి! అసలు విషయం తెలిసిన వాడి దగ్గరకి పోయి అడుగుదాం"
అఖన్ తల్లి అంది."మాన్ బజారులో తెలూమూడిఅనే గొప్ప మాంత్రికుడున్నాడు.ఆయన దగ్గిరకెళ్ళండి.అతను ఏది నిజమో చెప్తాడు.
మకర్ అన్నాడు, "అవును మనం వెళ్దాం పద"
"తప్పకుండా వెళ్దాం " అంది కుమారి.
మంగళ్ సవర కాదు.అతను పదో తరగతి వరకు చదువుకున్నాడు. తపాలా బంట్రోతుగా పని చేస్తున్నాడు. ఎవరైనా రాసిపెట్టమంటే రాసి డబ్బు
వసూలు చేస్తాడు.రోగులను ఆసుపత్రికి తీసుకొని వెళ్ళి అందుకు డబ్బు తీసుకుంటాడు. వాడి వివేకాన్నీ,విద్య నీ,తీర్పులనీ అందరూ గౌరవిస్తారు.
"వాళ్ళు పెద్దాసుపత్రికి వెళ్తే మంచిది.డాక్టర్లకి బాగా తెలుస్తుంది " అన్నాడు మంగళ్.
మకర్,"ఎవరైనా డాక్టరమ్మ ఉందా అక్కడ?" అని అడిగేడు.
"ఉన్నది ఫూల్ " అని జవాబిచ్చాడు.
కాని కుమారి మొండికేసింది."ముందు ఆయనని వెళ్ళనీయండి. ఆయనలో ఏలోపమూ లేకపోతే నేనే గొడ్రాలినని తెలుస్తుంది .నేను వెళ్ళిపోతాను.మీరంతా మా ఆడవాళ్ళనే నిందిస్తారు.కాని ఇక్కడ సబూయీజోర్ లో గొడ్రాళ్ళుగా ఉన్న ఇద్దరు ఆడవాళ్ళు మరోచోట పెళ్లి చేసుకొని ఎలా తల్లులయ్యారు?న్యాయం చెప్పండి!"అంది.
అక్కడ కూడిన జనం అంతా నిశ్శబ్దమై పోయారు.మకర్ వాళ్ల కళ్ళలోకి గుచ్చి గుచ్చి చూసేడు.'వాళ్ళేం చెప్దామనుకుంటున్నారు? ఎందుకు కలవర పడుతున్నారు?వాళ్ళు కూడా తను భార్యని గర్భవతిని చేయలేని
అసమర్ధుడ్ని కుంటున్నారా?'చివరికి తనే పట్టుబడ్డట్టు భావం కలిగింది.
వాడు" నేనే వెళ్తాను.కిష్టోబాబుతోకలిసివెళ్తాను.అక్కడ ఆయన మేనల్లుడు ఒక డాక్టర్ "అన్నాడు.
కిష్టోబాబు అన్నాడు " అలాగే,నిన్ను నామోటర్ సైకిల్ మీద తీసుకొని వెళ్తాను. చాలా తీవ్రమైన సమస్యే.పిల్లలు లేని ఇల్లు ఏం ఇల్లు ? మకర్, విచారించకు .చూడు,భజన్ మహాపాత్రాకి అరవై ఏళ్ళు. అతని కూతురుకి పదిహేను.పదిహేనేళ్ళ తరవాత పుట్టింది.అంతా భగవంతుడి దయ."
"అవును బాబూ, కాని దేవుళ్ళు నాపట్ల చాలా నిర్దయగా ఉన్నారు "
"అంతా చక్కబడుతుందిలే"
మకర్ పురలియా జైలుకైతే వెళ్ళేడు కాని హాస్పిటల్ కి ఎప్పుడూ వెళ్ళలేదు.
అస్తవ్యస్తంగా విస్తరించి ఉన్న పెద్ద ఆసుపత్రి. ఓ.పి.కి వచ్చిన జనం రద్దీ చూసి మకర్ కి వణుకు పుట్టికొచ్చింది.
కాని తనని పరీక్షించే డాక్టర్ ప్రవర్తన వాడికి ధైర్యాన్నిచ్చింది. కిష్టోబాబు ఇంట్లో తను ఆయన్ని ఇంతకు ముందు చూసేడు.
డాక్టర్ వాడిని వేరే గదికి తీసుకెళ్ళాడు. "ఆశ్చర్యం,!ఇతనికి పిల్లల్లేరా?ఎందువల్ల?మగాడు పరీక్ష చేయించుకోవడానికి వచ్చాడంటే,ఇది చాలా చాలా మెచ్చుకోదగ్గ విషయమే.మా బాబూలలో మగాళ్ళు ఇలాంటి పరీక్షలకి ఆడవాళ్ళనే పంపుతారు" అన్నాడు డాక్టర్ .
అరగంట తరవాత డాక్టర్ కిష్టోబాబు ని పిలిచాడు.
"నువ్వు ఎవరిని తీసుకొచ్చావంకుల్?"
"అదేం ప్రశ్న?"
"చాలా చిన్న వయసులో వేసెక్టమీ జరిగింది . ఇతనికి పిల్లలెరా పుడతారు?"
No comments:
Post a Comment