Sunday, 27 April 2025

మకర్ సవర 8

 

మకర్ మూడేళ్ళ వరకూ సంతోషంగా,సంతృప్తి  గానే ఉన్నాడు.భూతి టేకు ఆకులు ఏరి తెచ్చేది.వాటితో మకర్  గుడిసె  వేసాడు.ఆ విధంగా ఆమె అంటే అతనికి గౌరవం కలిగింది. ఆమె తన కూలి డబ్బుల నుంచి కొంత డబ్బు వెనకేసి రెండు మేకలు కొంది.గుడిసెని తుడిచి శుభ్రం చేసేది.కిష్టోబాబు అది చూసి"ఎంత అందంగా ఉంది!మిగతా సవర ఆడవాళ్ళు‌  కూడా నీలాగే  ఉంటే ఎంత బావుణ్ను"
"ఉండలేరు లెండి.ఎందుకంటే వాళ్ళ మగాళ్ళు బాగా  తాగుతారు. "
"మరి మకర్  తాగడా?"
"మితంగా తాగుతాడు."
మకర్, అఖండ సవర తల్లి దగ్గరకి భూతి తో కలిసి వెళ్ళేడు. ఆమెకి మూలికల  వైద్యం ,పసరులు తయారు చెయ్యడం,క్క్షుద్ర శక్తులను జయించే మంత్రతంత్రాలు తెలుసు. ఆమె అడవి తీగెలతో  ఓ కడియం అల్లి,భూతి  ముంజేతికి కట్టింది.
"నీకు ఏడుగురు కొడుకులూ, ఏడుగురు  కూతుళ్ళూ పుట్టకపోతే నేను నా వృత్తిని వదులుకుంటాను " అంది  ముసలామె.అయినా భూతికి పిల్లలు కలగనేలేదు.
మకర్  చాలా  నిరాశ చెందేడు.అఖండ సవర వచ్చి "ఓబిన్ బాబు మంచి బేరం  పెట్టేడు. మనం ఆయన అన్నదమ్ముడు గోబిన్ బాబు పంట కోసేసి,తెచ్చి  ఓబిన్ బాబు కళ్ళానికి మోసుకుపోవాలి.మనిషికి తలా ఓ ఇరవై రూపాయలు ఇస్తారు." అని
చెప్పేడు.
"నేను అలాటి దొంగతనం  చేయను. కిష్టోబాబు చేయొద్దన్నాడు."

"ఈ బాబూలు  మనల్నిలా ఉండనిస్తారనుకుంటున్నావా? మనం దొంగతనం చేయకపోతే ఓబిన్ బాబు మనల్ని  వదిలిపెట్టడు.మన మీద తప్పుడు  కేసుపెట్టించి అరెస్ట్  చేయిస్తాడు. లేదూ-మనం దొంగతనం చేశామూ,ఈ గోబిన్ బాబు మనమీద విరుచుకు పడతాడు. సవరగా  పుట్టి మనం ఈ బాబూలనీ,పోలీస్ లనీ ఇద్దరినీ ఎలా ఎదుర్కోగలం?అందువల్ల ఓబిన్ బాబు చెప్పినట్టు చేసి,అతనిచ్చే డబ్బులు తీసుకొని ఎక్కడో దాక్కుంటే మంచిది.
" వద్దు అఖన్,నేను  చేయను. "
మకర్  నిట్టూర్చి  అన్నాడు "మీ అమ్మ  భూతికి ఏదో మందు ఇచ్చింది. భూతి బిడ్డని కనేవరకూ నేను విశ్రాంతిగా ఉండలేను. అఖన్!నేను  సంతోషంగానే ఉన్నాను. మేము అడవికి  వెళ్తాం.కట్టెలు తెచ్చి  బజారులో అమ్ముతాం.మొక్కలకి నీళ్ళు పోస్తాం. ఇప్పుడు నేను  సంతృప్తిగా ఉన్నా. "

"మేమూ అలాగే ఉండాలనుకుంటాం.కానీ వాళ్ళు మనల్ని  వెంటపడి వేటాడటం మానుతారా? సవరలు చట్టప్రకారం నడుచుకుంటే,మేము మరి దేనికీ ఉండటం అని కానిస్టేబుల్ కూడా అంటాడు. "


No comments:

Post a Comment