"ఈ సర్క్యులర్ లో ఏం రాసుందో మీకు తెలుసా? తెలీదు. మీకు ఇంగ్లీషు రాదు కాబట్టి మీకు తెలీదు. సవరలని కొట్టి మీరు పోలీస్ స్టేషన్ కి లాక్కొస్తుంటే మేము చూస్తూ ఊరుకోము.
" ఈ మకర్ ప్రమాదకరమైన సవర బాబూ! "
"ఎవరు ప్రమాదకారో ఎవరు కారో నేను తేలుస్తాను. మీరు కాదు .వాడు చచ్చిన చెట్టు మొద్దు నరుకుతున్నాడా, అడవిని పాడు చేస్తున్నాడా? మీ మేనల్లుడు చెట్లు నరికి ఆ కలపమ్మి రెండంతస్తుల భవనం కట్టేడని మీకు తెలీదా? "
"నా మాట వినండి సార్. ...."
"ఒక రాత్రికి లాకప్పులో పెట్టేస్తాను .అదెలా ఉంటుందో చూడండి. వాడికా గొడ్డలి తిరిగి ఇచ్చేయండి. "
"మీరు మాకలా చేయలేరు. "
"ఏం, బెదిరిస్తున్నారా? నేనేం చేయగలనో లేదో చూడండి. ఒరేయ్! వీళ్ళందరినీ లాకప్ లో పడేసి తాళం వేసేయ్. మీ ఒకొక్కళ్ళ మీద పదికంటే ఎక్కువ కంప్లయింట్లు ఉన్నాయి."
అతను కానిస్టేబుల్ ని పక్కకి తీసుకెళ్ళి మెల్లిగా చెవిలో ఊదేడు" వాళ్లని రాత్రి పదయ్యేక వదిలేసెయ్ "అని .
" పేదవాళ్ళకి న్యాయం లేదు"అని గోకుల్ బాబు సణిగేడు.
"వెళ్లి కొత్తగా వచ్చిన పోలీసు సూపరింటెండెంట్ కి ఆ సంగతి చెప్పండి. "
మళ్ళీ యస్. ఐ. కానిస్టేబుల్ తో గుసగుసలాడేడు. "రాత్రి పదవగానే వాళ్ళని వదిలి పెట్టేయడం మరిచిపోకు. ధిల్లాన్ లారీ సరిగ్గా రాత్రి పన్నెండింటికి వస్తుంది. "
ధిల్లాన్ లారీలు దొంగతనంగా కలపని రాత్రివేళ జమ్ షెడ్ పూర్‌కి తీసుకెళ్తాయి. ఆ తరవాత అన్ని పోలీసు స్టేషన్లకీ ఒక్కో కవరు 'అందుతుంది. అలాటి వ్యవహారాలు జరిగినపుడు పోలీసు లాకప్పులో ఒక్క సాక్షీ ఉండటం ఇష్టం లేదు ఎస్. ఐ.కి. యస్. ఐ.బయటకొచ్చి మకర్ తో"ఒరేయ్, నీ గొడ్డలి తీసుకొని ఫో. నువ్వెప్పుడు చిక్కుల్లో పడినా నా దగ్గరకి రా. నీతో నేను దయగా ప్రవర్తించేనని కిష్టోబాబుకి చెప్పడం మరిచిపోకేం" అన్నాడు. మకర్ తన గొడ్డలి అందుకొని దాన్ని నేలమీద ఉంచి, చేతులు జోడించి నమస్కరిస్తూ, "బాబూ! " అన్నాడు యస్. ఐ.తో
"ఇంకేమిటి?"
"నా ఇంట్లో ఎవరూ లేరు. బాబూ , నేను ఒంటరి వాణ్ణి.అందువల్ల రాత్రికి నేనిక్కడే ఉండిపోతాను. ఈ చలిరాత్రి ఇక్కడ వెచ్చగా ఉంటుంది. ఇంటిదగ్గర తినడానికి తిండి కూడా లేదు.బాబూ, కానీ ఆ బాబులున్నారే. ఇళ్ళ దగ్గిర వాళ్ళకి పెళ్ళాలున్నారు. పిల్లలున్నారు. వండి ఉంచిన అన్నముంటుంది. మంచి ఇళ్ళున్నాయి. వాళ్ల నెందుకు కష్ట పెడతారు బాబూ ఇక్కడ? వాళ్లని వదిలి పెట్టేయండి. "
"వాళ్లు నిన్ను కొట్టేరు కదా. ఇక్కడి కీడ్చుకు రాలేదా? "
"ఒక సవరకి ఇవన్నీ అలవాటే బాబూ. ఈ తిట్లు, తన్నులు, ఆకలి -అన్నీ.కాని వాళ్లకి అలవాటు లేదు.వాళ్లకి ఇళ్ళున్నాయి బాబూ. నాకు ఏ ఇల్లూ లేదు.
సబ్ ఇన్ స్పెక్టర్ మకర్ ని నమ్మశక్యం కాని చూపులతో రెప్పవేయకుండా చూసేడు. మకర్ సవర బాందీ గ్రామం వైపు నడిచేడు. వాడు ఆ రాత్రి గుడ్డి వెలుగులో ఆ చెట్టు మొద్దుని ముక్కలుగా నరుకుతాడు. చుక్కలు చాలా ప్రకాశవంతంగా మెరుస్తున్నాయి