Saturday, 29 November 2025

శ్రీవారి‌ ముచ్చట్లు

 

అంశం: శ్రీవారి ముచ్చట్లు
తేదీ:14.11.25

శ్రీవారి ముచ్చట్లతో
కవితామయమైంది జీవితం.....
కవిత్వం పొంగి పొరలి
స్వర్గం  ఆవిష్కరించబడింది....
తల్లితండ్రులను  ,అక్కాచెల్లెళ్ళను
అన్నదమ్ములను, స్నేహితులను
మరిపించగలిగితే ఇక
శ్రీవారి ముచ్చట్లకి కొదవేముంది

ఇంటిపనిలో , వంటపనిలో
సాయం చేస్తూ
మనకి కావలసిన స్వేచ్ఛనిస్తే
అంతకంటే కావలసినదేముంది

నేను ఎక్కడకి వెళ్ళాలన్నా
తను తోడుంటే
వెన్నంటివున్న ఆ నీడ
ఒక ఆనందం

వృద్ధాప్యంలో  కూడా
నువ్వు అందంగా ఉంటావు
సుమీ అంటే నవ్వు  వస్తుంది కాని
ప్రేమ తెలుస్తుంది

శ్రీవారి ముచ్చట్లు
మనసులో ఉంటాయి
లేకుంటే అమ్మో
దిష్టి తగలదూ

ఇది నా స్వీయ  కవిత
డాక్టర్ గుమ్మా భవాని

ప్రత్యేక ప్రశంస

చల్లని నీడ

 

చెట్లిస్తాయి
చల్లని నీడ

మేఘాలు సూర్యుని కప్పేస్తే
చల్లని నీడ

అమ్మ ఒడి
నాన్న  ప్రేమ
చల్లని  నీడ

మిత్రుల తోడు
చల్లని  నీడ

విద్యాలయం
చల్లని నీడ

వివాహ బంధం 
చల్లని నీడ
ఎదిగిన పిల్లలు
చల్లని నీడ

చల్లని నీడలో
జనులందరి జీవితాలు
సాగిపోవాలని
కోరుకుంటా


చల్లని నీడ

 

చెట్లిస్తాయి
చల్లని నీడ

మేఘాలు సూర్యుని కప్పేస్తే
చల్లని నీడ

అమ్మ ఒడి
నాన్న  ప్రేమ
చల్లని  నీడ

మిత్రుల తోడు
చల్లని  నీడ

విద్యాలయం
చల్లని నీడ

వివాహ బంధం 
చల్లని నీడ
ఎదిగిన పిల్లలు
చల్లని నీడ

చల్లని నీడలో
జనులందరి జీవితాలు
సాగిపోవాలని
కోరుకుంటా


తలపులు

 తలపుల గుసగుసలు

నిశ్శబ్దాన్ని భగ్నం చేస్తాయి

మొదలు నరికిన చెట్టు

 విరిగిన చెట్టు చూస్తే 

మనసు విలవిలాడుతుంది


మనసు విరిగినా

అది విరిగిన చెట్టే


తల్లితండ్రులలో

ఏ ఒక్కరు  మరణించినా

కుటుంబం  విరిగిన చెట్టే 


ప్రేమికుల నడుమ

ప్రేమలోపిస్తే

ఆ ప్రేమ  విరిగిన చెట్టే 


ప్రభుత్వంలో సమర్ధత లోపిస్తే 

ఆ దేశం మొదలు నరికిన చెట్టే


29.11.25

శూన్యగాలి

 

గాలిలో
పసిపిల్లల కేరింతలు లేవు

యువతీ యువకులు
ప్రేమ సల్లాపాలు లేవు

మధ్యతరగతి
మందహాసాలు లేవు

వృద్ధుల
అచ్చట్లు ముచ్చట్లు  లేవు

పూవుల పరిమళాలు
లేవు
కోకీల కుహుకుహు
గానాలు లేవు

గాలి అంతా శూన్యం
జగతిని వణికించిన
కరోనా చాప కింద
నీరులా గాలిలో
చేరుతుందేమో

28.11.25

నిరీక్షణ

 

నాతో పాటు
గాలి సైతం
ఎదురుచూస్తోంది
నీకోసం

నువ్వు మోసుకొచ్చే
పరిమళాల కోసం
ఎదురు చూస్తోంది
ఈ గాలి

నీ చిరునవ్వుల
గలగల కోసం
ఎదురుచూస్తోంది ఈ గాలి

నీ సిరిమువ్వల సందడి కోసం
ఎదురుచూస్తోంది  ఈ గాలి

నాతో పాటే గాలి కూడా
నిరీక్షిస్తోంది  ప్రతిక్షణం
నీకోసం

27.11.25

అగ్ని చెలరేగుడు

 

అగ్ని రేగితే
కార్చిచ్చు

అగ్ని  రేగితే
బడబానలం

ఆకలి మంటల
అగ్ని

కులాల మధ్య
మతాల మధ్య
ద్వేషాగ్ని

మానవుడు కనిపెట్టిన అగ్ని
అణుబాంబై
దేశాన్నే ధ్వంసం  చేసింది
ఆత్మాహుతి బాంబై
రాజకీయ  నాయకుడి
ప్రాణాల్నే హరించింది

పుణ్య కార్యాల
హోమాగ్ని
కడుపు నింపే
వంటింటి అగ్ని
దీపావళి  మతాబుల
అగ్గి రవ్వలు
కార్తీక  దీపాల వెలుగు
కావాలి మనందరికీ

కానీ మానవజాతి
విధ్వంసానికి
దారితీసే
మారణాయుధాల అగ్నిని
అరికట్టాలి తక్షణం

26.11.25

కర్తవ్యం

 సుదూర ప్రయాణాలు

దారిలో  నీడ

ఎంత సుఖం


జీవితం 

అలసటతో నిండిన 

ప్రయాణం 

చల్లని నీడ 

తోడు దొరికితే 

ఎంత హాయి


కాలికి చెప్పులు కూడా 

లేకుండా  

ప్రయాణించే

నిర్భాగ్యులకు

దారిలో నీడ 

ఎంత హాయి 


ఎగిరే పిట్ట

తలదాచుకుంటుంది

చెట్టు  గుబురులో


దారిలో

నీడ కోసం

చెట్లు నాటాలి

ప్రభుత్వం 

స్వచ్ఛంద సంస్థల

కర్తవ్యం ఇదే

25.11.25

యవ్వనం మాయావనం

 యవ్వనం 

అందాల ఉద్యానవనం

అక్కడ చివురించే పూలెన్నో

పరిమళభరిత ఉద్యానవనం


వృధ్ధాప్యంలో  ఆ పూవులు

వాడిపోతాయి

రంగు రంగుల  ఇంద్రజాలం

కరిగిపోతుంది

సుందర స్వప్నాలు ఎన్నో 

కరిగిపోతాయి


జీవితమే

ఒక భ్రమ

యవ్వనం 

మాయా వనం


మధ్య  వయసుకి వచ్చాక 

వెనుతిరిగి చూస్తే 

జ్ఞాపకాలే తప్ప

యవ్వనపు ఛాయలు

మటుమాయం

24.11.25

హృదయానందం

 కిటికీ వెలుగులో 

బయటి ప్రపంచం


కిటికీ వెలుగులో 

అందమైన ప్రకృతి 


కిటికీ వెలుగులో 

పుస్తక ప్రపంచం 


కిటికీ వెలుగులో 

ఇరుగు పొరుగుతో

అచ్చట్లు ముచ్చట్లు 


కిటికీ  వెలుగులో 

పున్నమి చంద్రుడు 

నీలాకాశం

నక్షత్రాలు 


కిటికీ వెలుగు

హృదయానందం

23.11.25

ఊహల తుఫాను

 ఊహల తుఫాను 

ఇది రచయితలకి

కవులకి 

చిత్రకారులకి

శాస్త్రవేత్తలకు 

ప్రేమికులకి తప్పదు


యుక్తవయసు వారికీ

తప్పదు

చిన్నారులకి

బుజ్జాయిలకి సైతం 

ఏవేవో ఊహల తుఫాన్లు 


మానవులకి ఆలోచనలు 

నిరంతరాయంగా

కొనసాగిపోతుంటాయి

అదంతా ఊహల తుఫానే


ఏదైనా పనిలో నిమగ్నమైతే

ఏకాగ్రత దానిమీద నిలిచి 

ఊహల తుఫాను 

తాత్కాలికంగా మటుమాయమౌతుంది


మనసుకి ఆనందం

సంతృప్తి  కలిగినంతవరకూ

ఊహల తుఫాను ఆరోగ్యకరమే

22.11.25

Thursday, 20 November 2025

మలినం పట్టిన ‌మనసులు

 

అంశం : మలినం పట్టిన మనసులు
తేది: 5.11.25
శీర్షిక  : స్వచ్ఛమైన  మనసుల సమాజం కోసం......

సరైన  పెంపకం కాకుంటే
మనసులకు మలినం పట్టవచ్చు

ధనమున్నా మృగాలుగా మారి
సాటి మనిషులను దోపిడీకి
గురిచేస్తే నిస్సందేహంగా  అవి
మలినం పట్టిన మనసులే

మహిళల  పట్ల  అకృత్యాలు
బాలల పట్ల అమానుషత్వం
జరిపేవి  మలినం పట్టిన మనసులే 

మడులు పూజలు
నిత్యం  కొనసాగిస్తున్నా
కుల మత ద్వేషాల
ఊబిలోనే ఉన్నవారివి
మలినం పట్టిన  మనసులే

మలినం పట్టిన మనసులు లేని
సమాజం కోసం అహర్నిశలూ
కృషి చేద్దాం

ఇది నా స్వీయ కవిత
డాక్టర్ గుమ్మా భవాని


చెదిరిన మనసు

 

అద్దంలో
నా ప్రతిబింబం  విరిగింది

నీటిలో
నా ప్రతిబింబం  చెదిరింది

ఒళ్ళు తెలియని కోపంతో
అద్దాన్ని  నేను పగలగొట్టినా
విరిగేది నా ప్రతిబింబమే

ప్రశాంతమైన నీటిలోకి
నేను రాయి విసిరినా
చెదిరేది నా ప్రతిబింబమే

చెదిరిన  ప్రతిబింబం
ముక్కలయిన
నా మనసుని సూచిస్తుంది

అద్దాన్ని  పదిలంగా  ఉంచితే
కలతలెరుగని మనసు కూడా
ప్రతిఫలిస్తుంది

21.11.25

మానవ శక్తి

 

వంటింట్లో  నీళ్ళు
కళపెళ ఉడికితే
ఆవిరి తెరలు

సంద్రంలో  నీరు
ఆవిరవుతున్నప్పుడు
ఆవిరి తెరలు

కర్మాగారాలలో
ఆవిరి తెరలు
ఆవిరి ఇంజన్లో
ఆవిరి తెరలు

మస్తిష్కం వేడెక్కితే
ఆవిరి తెరలు
ఆరోగ్యం కోసం
ఆవిరి తెర

వర్షాన్ని  ఇచ్చేది
ఆవిరి తెర

ఆవిరిని
ఒడిసి పట్టుకుంటే
అదే మానవ శక్తి

20.11.25

మలుపు

 జీవితంలో 

మలుపు తిరిగే మార్గం 

అన్వేషించాలి మనం


నైతికంగా 

మానసికంగా 

శారీరకంగా 

గొప్ప మలుపులు 

ఎన్నో  కావాలి


విద్యకోసం

ఆరోగ్యం కోసం 

సంతోషం కోసం 

ఎదుగుదల కోసం 

జీవితంలో మలుపులు 

అత్యవసరం


మలుపులు

జాతి ప్రగతిలో

భాగమౌతాయి

పురోగమనం సాధ్యమౌతుంది

19.11.25

కలల ఊపిరి

 కలల ఊపిరి

ఎందరికో


తనకిష్టమైన  బొమ్మ 

అమ్మ కొంటుందని

పాపాయి కలలు కంటుంది


తనకిష్టమైన పుస్తకం 

నాన్న  కొంటాడని

చిట్టితండ్రి కలలు కంటాడు


కాలేజీలో అడుగుపెట్టిన 

నాటినుండి 

అమెరికా వెళ్ళేదెప్పుడని

అక్కడ స్థిరపడేదెప్పుడని

యువత కలలు కంటోంది


సిరులు కురిపించే పంట 

చేతికెప్పుడొస్తుందన్నది

రైతన్న కలల ఊపిరి 


సుపరిపాలన ప్రజల 

కలల ఊపిరి


వృధ్ధాప్యంలో

పిల్లల అండదండ

తల్లితండ్రుల కలల ఊపిరి


కలలే‌ మన ఊపిరి 

కలల ఊపిరి లేని

మనుగడ లేదు


18.11.25

వెలుగు వేడుక

 చీకటిని చీల్చుకుంటూ 

వెలుగు  వస్తే 

మనకానందం


అలాగని

వెలుగులో చేయాల్సిన  పనులు 

చేయకుండా కూర్చుంటే

శరీరానికి  తిమ్మిరి

మనసుకి తిమ్మిరి 


వెలుగును వాడుకుంటూ 

నడక

చదువు

వ్యాయామం 

ఉద్యోగం 

చేయాల్సిన  మంచిపనులు 


వెలుగు  కొద్దిసేపే

చక్కపెట్టాల్సిన పనులు 

ఎన్నెన్నో 


వెలుగు తిమ్మిరి కాకూడదు

వేడుక కావాలి మనకి

17.11.25

ఎదురుచూపు

 వర్షం  వర్షం 

ఒడ్డున  కూర్చుని మేము

కాగితప్పడవలు

వదులుతున్నాం


వర్షం వర్షం 

ఒడ్డున  నిలిచి

నేను ప్రకృతి  అందాలు

తిలకిస్తున్నా


వర్షం వర్షం 

నాలాగే అతనెవరో

ఆ ఒడ్డున 


వర్షం వర్షం 

ఒడ్డున నిలిచి 

ఓ రైతు కుండపోత

వర్షం ఎప్పటికి

ఆగుతుందా అని

ఎదురు చపు

16.11.25

సాగరుని చేరేవరకు

 

నది
పరిగెడుతూనే ఉంటుంది
పారుతూనే ఉంటుంది

ముందు
ఉరకలేసే గంగమ్మలా

ఆపై గలగలపారే
గోదావరిలా
కృష్ణమ్మలా

సాగరుని చేరేవరకు
నది ప్రవహిస్తూనే ఉంటుంది

15.11.25

అంచనాలకు అందని లోతు

 మౌనం

పైకి కనిపిస్తుంది 


కానీ మౌనలోతులను

కొలిచేదెవరు


అమ్మానాన్న

ఏమన్నా

మౌనమే సమాధానం 


అత్తగారు

శ్రీవారు

చికాకుపడినా

ఆఫీసులో బాస్

ఎన్ని  మాటలన్నా


వృద్ధాప్యంలో

పిల్లలు ఏమన్నా

మౌనమే సమాధానం 


అంతటి మౌనానికి

భూదేవంత సహనం

కావాలి


మళ్ళీ పెదవిపైకి

చిరునవ్వు 

వచ్చే వరకూ 

మౌనలోతుని అంచనా

వేయలేం

14.11.25

మదికి పులకింత

 చీకట్లో  నీరు

నది నీరు

ప్రశాంతంగా


సెలయేటి నీరు

వయ్యారంగా 


సముద్రం నీరు

అలలతో

ఉవ్వెత్తున ఎగసే

కెరటాలతో


అర్ధరాత్రి 

రైలు వంతెన

మీదుగా నదిని దాటే

దృశ్యం అద్భుతం


చల్లగాలుల

నదీ తీరం

చీకట్లోనైనా

నిశ్శబ్దంగా తన ప్రేమను 

అందిస్తుంది మనకు

13.11.25


దూరతీరాలకు నడక

 నడక మొదలెట్టిందామె

ప్రారంభ కాంతిలో


ఆ ఉదయకాంతి

ఆమె ఆశలకి

ఆశయాలకి

పట్టిన  దివిటీ


సామాన్యురాలే

అసమాన్యురాలవడానికి

దారి చూపుతోంది

సూర్యోదయ కాంతి 


ఒంటరి ప్రయాణమైనా

కోటి సూర్యప్రభలు

ఆమె మదిలో


ఇలాటి కధలు

కోకొల్లలు 

నిజమైన కధానాయికలు

12.11.25

రైలు ప్రయాణం

 రైలు ప్రయాణం 

ప్రకృతి అందాలు

ఆనందంగా చూస్తూ 


నాకిష్టమైన పల్లీలు

తింటూ

తోటి ప్రయాణీకుల

ఇంటింటి రామాయణం

కంటూ

వింటూ


సెల్స్  దొంగని

ప్రయాణికులు 

పోలీసులు పట్టుకున్న

వైనాన్ని  చూస్తూ 


నా ఫోను రైలులో

వదిలేసి

ఎంచక్కా ఇంటికెళ్ళిపోయిన

సంఘటన గుర్తు చేసుకుంటూ


చేసిన రైలు ప్రయాణాలు ఎన్నెన్నో 

యాదికొస్తవి 

పల్లీలు ఇష్టంగా చిన్నప్పుడు తల

11.11.25

మరచిన దారులు

 బాల్యం నుండి 

వృద్ధాప్యం  వరకూ

మనం నడిచిన దారులెన్నో


కలిసిన వ్యక్తులు

ఎందరెందరో 


కొందరే మనసుకి 

దగ్గరౌతారు

కొందరితోనే రాకపోకలు


ఎందరో 

మన మనసుకి

చేస్తారు గాయాలు


అటువైపుగా

వెళ్ళడానికి కూడా 

ఇష్టపడం మనం 


అవన్నీ  విస్మ్మత దారులే

మనకి ఇష్టమైన వారిని

కలిసే దారులని కూడా 

మరిచిపోతాం మనం

కాలగమనంలో


విస్మరించిన దారులని

గుర్తుచేసుకో

ఏ సమున్నత వ్యక్తిత్వాలని

కల వస్తాన

11.11.25

హృదయం చిలికితే అమృతం

 హృదయం చిలికితే

ఎన్నో గాయాలు

గేయాలు


ఎన్నో స్వప్నాలు 

వ్యధలు

వేదనలు


ఆశయాలు

నిరాశ 

నిస్సహాయత 


ప్రేమ 

అభిమానాలు

అనురాగం 


క్రోధం

దయాగుణం 


హృదయాన్ని 

చిలికేది ఎవరు

నాకు నేనేనా

10.11.25

నాలోకి తొంగిచూసే తానా

మనసుకి‌ హాయి

 నిశ్శబ్ద రాత్రి 

నేను మేలుకునే ఉన్నా


ఆరుబయట 

ఆకాశంలో చుక్కలు చూస్తూ 


పున్నమి నాడు 

వెన్నెల  సోయగాలు చూస్తూ 


పూల పరిమళాలు 

ఆఘ్రాణిస్తూ 


చిత్రకారుని కుంచె 

సృష్టించిన అద్భుతాలకు

అచ్చెరువొందుతూ


అమ్మానాన్నల ప్రేమ

గుర్తుచేసుకుంటూ

చెక్కిలిపై జారే

కంట నీటితో


జీవిత భాగస్వామి 

పిల్లల ప్రేమానురాగాలకి

పులకిస్తూ


చిరకాల మిత్రులతో ఉన్న

అనుబంధం తలుచుకుంటూ


ఒక నిశ్శబ్ద రాత్రి 

శబ్ద ప్రపంచాన్ని ఆహ్వానించి

అదృశ్యమైపోతుంది

నిశ్శబ్దంగానే


రొదల శబ్ద ప్రపంచం కంటే

నిశ్శబ్ద రాత్రులు

మనసుకి హాయి

అప్పుడప్పుడూ

9.11.25

కాలం ఆగిపోతుంది

 ప్రకృతి అందాలను

ఆస్వాదిస్తుంటే

కాలం ఆగిపోతుంది


కళాకారుల కళ

కనులకు విందయినపుడు

కాలం ఆగిపోతుంది 


అద్భుతమైన సంగీతం

వీనుల విందయితే

గడియారం మనకి

ఆగిపోతుంది 


పసిపాపల ఆటలు

కేరింతలు 

మిత్రులతో గడిపే కాలం 

అక్కడే ఆగిపోతుంది 


మనవారు మనకి

దూరమైతే 

కాలం ధ్యాసేలేక

కాలం ముందుకి 

నడవక ఆగిపోతుంది

8.11.25

మేఘమే‌ ఉక్కు కవచం

 మేఘం  

మన కవచం

సూర్య ప్రతాపం

తట్టుకోవాలంటే మేఘం 

మన కవచంగా మారాల్సిందే


పంట  రైతన్న చేతకి

అందాలంటే

వర్షమేఘమే

కవచం


పిల్లల 

కాగిత పడవల ఆటలకి

వర్ష మేఘమే ఆలంబన


ఉన్నత పర్వత శ్రేణులలో

మేఘాలు కవచంలా

మన దేహాన్ని తాకి

మనని పులకింప చేస్తాయి


మైళ్ళ కొద్దీ

నడిచే  పాదచారులకు

మేఘమే 

ఉక్కు కవచం

7.11.25

Wednesday, 5 November 2025

ఎప్పటికీ సజీవం

 చిత్రకారులం కాకుంటే

అవి పిచ్చి గీతలే


కానీ కొందరు పసివయసులోనే

చకచకా గీతలు కలిపేసి

మనం అచ్చెరువొందే

చిత్రాన్ని మన ముందు

నిలుపుతారు



గీతలు సజీవ చిత్రాలవుతాయి

రవివర్మ  అందాలవుతాయి

బాపు బొమ్మలవుతాయి

వడ్డాది అలవోక

చిత్రాలవుతాయి



కుంచె గీసిన గీతలు

అపురూప చిత్రాలవుతాయి 


చిత్రం గీతల సమాహారం

అది గీతలను సజీవంగా 

నిలుపుతుంది ఎప్పటికీ

6.11.25

సురక్షితం

 

పడవ నడి సంద్రంలో
తుఫాను  భీభత్సం
ఆటుపోట్లు
అల్లకల్లోలం

తుఫానులో చిక్కుకున్న
జాలరులెందరో

తీరం దగ్గర
వారి కోసం
వేచివుండి
వారి క్షేమం కోసం
ప్రార్థనలు చేస్తున్న
కుటుంబ సభ్యులు

చిట్టచివరికి
సంద్రంలో  ప్రశాంతత

ముసలి తల్లితండ్రులు
ఎదురు చూస్తున్న నావ
ముందుగా తీరం చేరింది

5.11.25

పూవు నేర్పే పాఠాలు

 

పువ్వు వికసించినట్టు
నవ్వు మన మోముపై
వికసించాలి ఎల్లపుడూ

హృదయం వికసించాలి
మేధస్సు  వికసించాలి
విజ్ఞానం వికసించాలి

మానవత్వం అందరిలో
వికసించాలి
మనసు ప్రేమానురాగాలతో
వికాసించాలి

సంస్కృతి
నాగరికత
నలుదిశలా వికసించాలి

పూవు వికసించడం
అనునిత్యం  గమనిస్తే
మనలో కూడా
ఆనందం
మనసులో మార్దవం
అన్నీ వికసిస్తాయి

ఒక చిన్ని పూవు
మనకి నేర్పే
పాఠాలు ఎన్నెన్నో

4.11.25

బంగరు భవితకి బాట

 

పసిడి తాళం చెవితో
ఆనందాల తలుపు
తెరుచుకోవచ్చు

విద్యాలక్ష్మి వరించొచ్చు
ఎన్నెన్నో  సదవకాశాలు
లభించవచ్చు
తరువాత  రోజుల్లో
నీకు జీవిత భాగస్వామిగా
అయ్యే వ్యక్తి ఖైదీగా
ఆ గదిలో
ఉండి ఉండవచ్చు
పసిడి తాళం చెవితో
పసిడి లభించకపోవచ్చు
కాని అది బంగరు భవితకి
బాట కావొచ్చు

3.11.25

మనకోసమే

 

తెరవబడిన
తలుపు వెనక
గుప్తనిధి ఉండొచ్చు

ప్రేమించిన అమ్మాయి
గాజుల సవ్వడి
నీకు  స్వాగతం  పలకొచ్చు

నువ్వు తలుపు తెరిస్తే
అదృష్టం నీ జీవితంలో
ప్రవేశించొచ్చు

ఊహించని విధంగా
ప్రియమితృడే
తలుపు తీయొచ్చు

తీయబడ్డ తలుపు
వెనక
నిందా వాక్యాలు
పరుషవాక్యాలు కూడా
వినిపించవచ్చు

2.11.25

దినకరుని సుస్వాగతం

 

సూర్యోదయ కాంతిలో
సూర్య నమస్కారాలు

ఇల్లాలికి  వంట పనులు
చిన్నారుల బడిబాట
ఇంటాయన ఆఫీసు పరుగులు

ఉద్యానవనాలు తాజాగా
రైతన్నని నేల తల్లి  పిలుస్తుంది

ఆసుపత్రులు కిటకిటా
రాత్రి దుర్మార్గాలు చేసి
లాకప్పులకు చేరే నిందితులు

సూర్యకాంతిలో చకచక
నడిచే పాదాలు
మొక్కల మీద
సూర్యకాంతి
అందరి  మొహాలను
వెలిగించే సూర్యకాంతి

సూర్యోదయ కాంతి
నలుదిశలా పరుచుకుంటుంది
దినకరుడు నూతన దినానికి
స్వాగతం పలుకుతాడు
ప్రజల కోసం

1.11.25