ఈ కధ నా స్వీయ సృజన.
శీర్షిక: అనుబంధాలు
""చూడు రాధా... వాసు నీకొక్కదానికే కాదు... నాకూ కొడుకే. వాడి జీవితం ఎలా ఉండాలి అనే దానిమీద నాకు స్పష్టమైన ఆలోచన, అవగాహన ఉన్నాయి. రమ్య..నీ అన్న కూతురు అనే ఒక్క అంశం తప్ప ఎందులో వాసు గాడికి సరిపోతుంది చెప్పు? నీ మాట కాదన్నానని నన్ను తప్పుగా అనుకోకు. నాకు వాసు భవిష్యత్తు ఎంత ముఖ్యమో, నువ్వు.. నీ మనోభావాలు అంటే అంత గౌరవం. ప్రశాంతంగా కూర్చుని, ఆలోచించి నీ మాట ఏమిటో చెప్పు నీ నిర్ణయం ప్రకారమే అంతా జరుగుతుంది." అన్నాడు భార్గవ.
భర్త మాటలకు చిరాగ్గా తలతిప్పుకోబోయి గుమ్మం దగ్గర ఏదో అలికిడి అవడం తో అటు తిరిగి చూసింది ప్రొఫెసర్ రాధాదేవి. అక్కడ కనిపించిన దృశ్యానికి చేష్టలుడిగి పోయి సర్పద్రష్టలా నిలబడిపోయిందామె.
అది గమనించిన భార్గవ, అవాక్కయి, ఆపై గుండెలో సన్నగా మెలి తిరుగుతూ నొప్పి రాగా "రాధా..." అంటూ నేలకొరిగిపోయాడు.
గుమ్మం దగ్గర రాధ చూసినది తన అన్న కల్యాణ్ ని. కల్యాణ్ భార్గవకి ఆప్తమిత్రుడు కూడా.తమ మాటలు కల్యాణ్ విన్నాడేమో అన్న ఊహ అతని గుండె నొప్పికి దారి తీసింది.
రాధాదేవి వెంటనే తన స్నేహితురాలు డాక్టర్ శశిప్రభకి ఫోన్ చేసింది. ఆమె గుండె చికిత్స నిపుణురాలు.
రాధాదేవి తనకి తన భర్తకి జరిగిన సంభాషణ తన స్నేహితురాలికి తెలిపింది. డాక్టర్ శశిప్రభ వెంటనే “రాధా నువ్వు ప్రొఫెసర్ వి అయిఉండి కూడా నీ మేనకోడలు మీద అభిమానంతో కోడలుని చేసుకుందామనుకుoటున్నావు. నిజానికి వాసుకి కూడా దగ్గర సంబంధం చేసుకోవడం ఇష్టం లేదట. మరో విషయం – నా కొడుకు శశాంక్ మీ రమ్య వెనక పడుతున్నాడన్న విషయం కూడా వాసుకి తెలుసట. మీ అన్నయ్య కళ్యాణ్ నీకే కాదు నాకు కూడా అన్నయ్యే. మా అబ్బాయిని అల్లుడిగా చేసుకోవడానికి అభ్యంతరం చెప్పడులే."
రమ్య శశాంక్ ల పెళ్లి అయ్యాకే వాసు తన పెళ్లి చేసుకుందామనుకున్నాడు. వాసు, రాధాదేవి, కళ్యాణ్ పెళ్లి పనులలో మునిగిపోయారు. రమ్య పెళ్లి నిరాడంబరoగానే జరగాలనుకుంది.
ఈలోగా, భార్గవ వాసుకోసం చదువుకున్న అమ్మాయి, ఉద్యోగస్తురాలు, అందగత్తె అయిన వైదేహి ని చూసాడు. వాసు కూడా ఏం అభ్యంతరం చెప్పలేదు. వాళ్ళ పెళ్లి ఘనంగానే జరగాలని వైదేహి కోరింది.
వైదేహికి తన అందాన్ని కాపాడుకోవాలనే తాపత్రయం, తనకి కావలసినవి తెప్పించుకొని తినడం, తన ఆఫీసు పని చూసుకోవడంలాంటివి మాత్రమే ఆమె దినచర్య. ఎవరి మాట వినకపోవడం, తనకి తోచింది మాత్రమే చెయ్యడం ఆమె అలవాటు.
కొద్ది రోజుల్లోనే రమ్య పండంటి పాపాయిని కంది. ఆ పాపకి మనోజ్ఞ అని పేరు పెట్టారు. డెలివరీ సమయంలో రమ్య ఆసుపత్రిలో ఉన్నప్పుడు వాసు, రాధాదేవిగారు ఆసుపత్రికి వెళ్లి వచ్చేవారు. తరువాత రమ్య అత్తవారింటికి వెళ్ళిపోయింది. అప్పుడు కూడా రాధాదేవిగారు, వాసు, రమ్య వాళ్ళ ఇంటికి వెళ్లి మనోజ్ఞని చూసేవారు .
వాసుకి పిల్లలంటే చాల ఇష్టం. పాపని పుట్టినప్పటినుండి చూడడం, రోజూ వెళ్లి పాపతో ఆడుకోవడం వల్ల మనోజ్ఞ అంటే వాసుకి ఎంతో మమకారం. వైదేహికి ఇది నచ్చేది కాదు.
వైదేహి కి అసలు పిల్లలని కనాలనే ఉద్దేశ్యమే లేదు. తన అక్క కూతుర్ని చిన్నప్పటినుండి చూసి చికాకు పడేది . ఆ పాప ఒక్క నిముషం కూడా వాళ్ళ అమ్మని వదిలేది కాదు. అలాగే తన స్నేహితుల పిల్లలని చూసి విసుక్కొనేది. పిల్లల్ని కనడం, పెంచడం అంటే తలనొప్పి, టైం వేస్ట్ తప్ప ఇంకేం లేదు అనుకొనేది. పైపెచ్చు పిల్లల్ని కనడం, పెంచడం వల్ల శారీరిక అందం తగ్గుతుందనే భావన దృడంగా ఉండడం వల్ల పిల్లల్ని కనకూడదు అనుకుంది.
వైదేహికి ఇష్టం లేకుండా పిల్లల్ని కనాలని వాసు కానీ ,రాధాదేవి కానీ ఆమెకు చెప్పే సాహసం చెయ్యలేదు. ఈ విషయంలో, వైదేహి కన్నతల్లి మాట కూడా వినట్లేదనే సంగతి వాళ్ళిద్దరికీ తెలుసు. అందుకే పిల్లలంటే ఎంత ఇష్టం ఉన్నా వాసు బాధ పడడం తప్ప ఇంకేం చెయ్యలేకపోయేడు.
ఈ నేపధ్యంలోనే వాసు మనోజ్ఞకి దగ్గర అయ్యేడు. మనోజ్ఞకి కూడా వాసు దగ్గర బాగా అలవాటైపోయింది. రమ్య వాళ్ళ అత్తగారి హాస్పిటల్ వ్యవహారాలు, అడ్మినిస్ట్రేషన్ చూసుకొనేది . దానికి సంబంధించి కొన్ని కోర్సులు కూడా చేసింది. శశాంక్ కూడా డాక్టర్ అవ్వడంతో, మనోజ్ఞకి నాయనమ్మ , అమ్మ, నాన్నలు బిజీగా ఉండేవారు .
వాసు మనోజ్ఞని పార్కులకి తీసుకొని వెళ్ళడం, వ్యాయామం చేయించడం, ఆటలు ఆడించడం అన్నీ చేసేవాడు . వాసుతో బయటికి వెళ్తే మనోజ్ఞ పుస్తకాలూ, ఆటబొమ్మలు కొనుక్కొనేది.
మనోజ్ఞ ప్లే స్కూల్ ,తరువాత ఆమె చదువుకున్న బడి అన్ని వాసు ఎంపిక చేసి శశాంక్ ,రమ్యలకి చెప్పేవాడు. ఈ రకంగా మనోజ్ఞ స్కూలింగ్ అంతా వాసు కనుసన్నలలోనే జరింగింది.
వాసు దగ్గర చాల పుస్తకాలుండేవి. ఆ పుస్తకాలు చదవడం మనోజ్ఞకి అలవాటైంది. కాలేజీలో చేరేముందే సివిల్ సర్వీస్ ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అవుతానని వాసుకి మనోజ్ఞ చెప్పింది. వాసు ఆ విషయం మనోజ్ఞ తల్లి తండ్రులకి తెలియజేసి దానికి కావలిసిన ఏర్పాట్లన్నీ చేసేడు. మంచి శిక్షణ ఇప్పించడంతో,మనోజ్ఞ సివిల్స్‌లో మొదటిసారే విజయం సాధించింది.
మొదటిసారి పోస్టింగ్ కి వెళ్తున్నప్పుడు మనోజ్ఞ వాసుతో "చిన్నాన్నా,మీరు వచ్చి కొద్ది రోజులు అక్కడ ఉండాలి, నాకు అలవాటయ్యేవరకు" అని చెప్పింది.
మనోజ్ఞ వెళ్ళిపోయాక వాసుకి ఏం తోచేది కాదు. మనోజ్ఞ ఫోన్ కోసం, వీడియో కాల్ కోసం ఎదురు చూస్తుండేవాడు .
వాసు కొత్తగా ఒక స్టార్ట్ అప్ మొదలెట్టి తనకి బాగా తెలిసిన స్నేహితులనే అందులో చేర్చుకున్నాడు.
కొన్నాళ్ళకి మనోజ్ఞకి అక్కడే పోస్టింగ్ వచ్చింది.అందరూ చాలా సంతోషించారు. మనోజ్ఞ తను ఇష్టపడిన పోలీస్ ఆఫీసర్ అభిరామ్ ని పెళ్ళి చేసుకుంటానని చెప్పింది.
మనోజ్ఞ చిన్నప్పుడు ,రమ్య మనోజ్ఞ పుట్టినరోజున అనాధ శరణాలయానికి తీసుకెళ్ళి అక్కడ పళ్ళు, పుస్తకాలు, బొమ్మలు మనోజ్ఞతో ఇప్పించేది. అమ్మకి నిరాడంబరమే నచ్చుతుందనిమనోజ్ఞ తన పెళ్ళి కూడా నిరాడంబరంగా చేసుకుంది.
పెళ్ళయిన తర్వాత ఒకరోజు "మనోజ్ఞా,నువ్వు, అభిరామ్ చర్చించుకొని నాకు మూడేళ్ళలో ఒక అబ్బాయిని ఇవ్వాలి. అబ్బాయిని పెంచడం కూడా నేను నేర్చుకోవాలి కదా" అన్నాడు వాసు".
మనోజ్ఞ గురుదక్షిణలానే మూడేళ్ళలో పండంటి బాబుని కంది. ఇక అప్పటినుంచి వాసుకి వాడితోనే ఆటలు.బాబు పేరు సాగర్. మహా పెంకివాడు. వాసుని బాగా పరుగులు తీయించేవాడు.
సాగర్ కి తల్లి కలెక్టర్, తండ్రి పోలీస్ ఆఫీసర్ అయి బిజీ అయిపోవడంతో ఆడుకోవడానికి
వాసు తాత దొరికాడు. వాడికి వాళ్ళ నాన్న పోలీస్ డ్రస్, క్యాప్ అన్నీ నచ్చేవి.
సాగర్ వాసు దగ్గర గణితం, ఇంగ్లీషు, కంప్యూటర్ కోర్సులు నేర్చుకునేవాడు. "తాతా నీ కంపెనీని ఇంకా పెద్ద కంపెనీగా చేస్తాను" అనేవాడు సాగర్.
వాసు" ఈ కంపెనీలు చాలా ఉంటాయి కానీ మంచి పోలీస్ ఆఫీసర్ లు మనకి కావాలి" అనేవాడు సాగర్ తో.
డాక్టర్ శశిప్రభ సేవలు,డాక్టర్ శశాంక్ పేరు ప్రఖ్యాతులు, రమ్య ఆసుపత్రిలో సేవల మెరుగుదలకి తీసుకునే జాగ్రత్తలు వాళ్ల ఆసుపత్రికి మంచిపేరు తెచ్చింది.
రమ్య తండ్రి కల్యాణ్ అనారోగ్యంతో రమ్య కొన్నాళ్ళు పూర్తిగా అతనినే చూసుకోవలసి వచ్చింది. ఆసుపత్రిలో చేర్చిన కొద్ది రోజులకే ఆయన కాలం చేసారు.
వైదేహి ఆఫీసులో పని చేస్తున్న ఆమె సీనియర్ సుజాత వాసు దగ్గరికి వచ్చి "నేను మీకంపెనీలోచేరదామనుకుంటున్నా. మావారు నేను ఇద్దరం ఒకే చోట పని చేస్తే మా పిల్లల చదువు మీద శ్రద్ద పెట్టగలం”అన్నారు .
అక్కడే ఉన్న వైదేహి ఆశ్చర్యపోయింది అంత సీనియర్ పొజిషన్ వదిలి తన భర్త దగ్గర పనిచేయడానికి వచ్చేస్తున్నాదా అని.
సుజాత వెళ్తూ వైదేహితో “మీరు చాలా అదృష్టవంతులు. మావారు ఎప్పుడూ మీవారిగురించి చెప్తుంటారు ”అంది.
ఒక రోజు సాగర్ వాసుతో “తాతా,కొత్త కారు కొను. ఈ పాత కారు నువ్వు ఇంక నడపకూడదు “అన్నాడు. వాసుకి అది సమంజసమే అనిపించి కొత్త కారు తీసుకున్నాడు . అందుకు వైదేహి “ నాకో కొత్త కారు కొనిద్దామని మీకెప్పుడూ అనిపించలేదు. ఇవాళ సాగర్ అన్నాడని కొత్త కారు కొనేసారు”అంది , కయ్యానికి కాలు దువ్వుతూ. వాసుకి ఇలాటివన్నీ అలవాటైపోయి నిశ్శబ్దంగా అక్కడినుండి వెళ్ళిపోయాడు .
కొన్నాళ్ళకే వైదేహికి కారు ప్రమాదంలో గాయాలయ్యాయి. శశిప్రభ ఆసుపత్రిలో చేర్పిస్తే వాసు,రమ్య అందరూ అక్కడే ఉండేవారు.ఆసుపత్రి సిబ్బంది కూడా చాలా జాగ్రత్తగా, మర్యాదగా వైదేహిని చూసుకునే వారు. వాళ్ళందరికీ వాసు తెలుసు.తను వాసు భార్య కాబట్టే ఈ మర్యాద అని వైదేహి అంతరంగానికి తెలుసు.
వైదేహికి ఎంత వైద్యం చేసినా తన ఆరోగ్యం పూర్తిగా నయం కాలేదు. మునుపటి అందం లేదు.వాసు దగ్గరుండి ఆమె అవసరాలు చూసుకునేవాడు. "నువ్విప్ఫుడు నా పాపాయివే " అనేవాడు వాసు వైదేహితో.
వైదేహిని చూసుకోడానికి ఒక అటెండెంట్ ని ,ఆమెకి కావలసినవన్నీ చేసిపెట్టడానికి ఒక కుక్ ని కూడా వాసు ఏర్పాటు చేశాడు.
వైదేహి ఆఫీసు పని ఇప్పుడు చేయలేక పోతోంది.తన స్నేహితురాళ్ళు కూడా కనీసం ఫోను చేయడం లేదు.రమ్య, అభిరామ్ అప్పుడప్పుడు వచ్చి వైదేహిని చూసి వెళ్ళేవారు. వాళ్లిద్దరికీ ప్రతిసారీ వాసుకి పాదాభివందనం చేయడమే అలవాటు.
వైదేహిని చూడడానికి ఆమె అక్కలు , అమ్మ, నాన్న అందరూ వచ్చేవారు . కానీ వైదేహికి ఏది సంతోషంగా అనిపించేది కాదు. రాధాదేవిగారు, వాసు వాళ్ళకి సకల మర్యాదలు చేసేవారు.
వైదేహి గదిలో మంచి పుస్తకాలు, ఆడియో కధలు , మంచి సంగీతం అన్ని తెచ్చి పెట్టేవాడు వాసు.
భార్య అందంగా ఉన్నప్పుడు ప్రేమించడం సర్వ సాధారణం . భార్య మంచం పట్టి అనారోగ్యంతో ఇబ్బంది పడుతుంటే ఆమెని ప్రేమించేవాడే అసలైన ప్రేమికుడు.
సాగర్ అభిరాం ప్రభావంలోకే వెళ్ళాడు. వాసు తాత కూడా పోలీస్ ఆఫీసర్ కమ్మని ప్రోత్సహించేడు . తను తప్పనిసరిగా పోలీస్ ఆఫీసరై అందరి మన్ననలు పొందాలన్నదే సాగర్ లక్ష్యం .
ఒక రోజు వైదేహి వాసుతో “ నన్ను మీ కంపెనీలో చేర్చుకోండి. నేను ఇలా ఒక్కదాన్ని ఏ పని లేకుండా ఉండలేకపోతున్నా. టైం గడవడం చాల కష్టంగా ఉంది. నేను మీ అందరిలాగా ఎక్కువ నైపుణ్యంతో పని చేయలేకపోవచ్చు. కానీ మీ అందరిని చూసి నేర్చుకోగలను. కొన్నాళకి మీ అందరిలాగే పని చేయగలననే నమ్మకం నాకు ఉంది. ఐనా , మా సీనియర్ సుజాతకి మీరు అవకాశం ఇచ్చి నాకు ఇవ్వలేరా” అంది.
ఆమెలో వస్తున్న మార్పులు చూస్తూంటే వాసుకి చాల ఆనందం, ఆశ్చర్యం కలిగాయి. "తప్పకుండా వైదేహీ, నువ్వు కంపెనీ పనులేంటో చూస్తుండు,నీకే అర్ధమైపోతుంది. అసలు,ఈ కంపెనీ నీదే" అన్నాడు వాసు.
సాగర్ పోలీస్ ఆఫీసర్ అయ్యాడు. వాసు తాతని తానున్న చోటుకి రమ్మని సతాయిస్తుంటాడు. వాసుకి కూడా సాగర్ ని పోలీస్ ఆఫీసర్ హోదాలో చూడాలని సరదా.మనోజ్ఞ , సాగర్ తను నాటిన విద్యా విత్తులు.తనకెంత ఆనందంగా..,ఆత్మసంతృప్తి గానో ఉంటుంది.
వాసు ఆ కుటుంబాలకి కేంద్ర బిందువు లాంటి వాడు రమ్యకి, శశాంక్ కి ,డా. శశిప్రభకి ఎప్పుడూ చేదోడు వాదోడుగా ఉన్నాడు. మనోజ్ఞ నైతే తనే పెంచాడు .
భార్గవ, రాధాదేవి ఎంత అన్యోన్య దంపతులో వాసుకి తెలుసు. తన తండ్రి తన తల్లి మనోభావాలకి విలువిస్తాడని తెలిసే తనకే రమ్య తో వివాహం ఇష్టం లేదని చెప్పేసాడు. మేనమామ బిడ్డ దగ్గరి సంబంధం ఎందుకు చేసుకోవడం అని తాను వద్దన్నాడు తప్ప రమ్యని కాదనడానికి మరో కారణం లేదు. అందుకే శశాంక్ ఇష్టపడితే వాళ్లిదరి వివాహాన్ని ప్రోత్సహించేడు.
వైదేహిని చూడటానికి మనిషిని పెట్టినా ఆమె కట్టుకోవాల్సిన బట్టలు వాసు తీసి ఉంచేవాడు. వేసవిలో మనసుకి హాయి నిచ్చే మల్లె పూచెండులు, సన్నజాజులు,విరజాజులు అన్నీ ఉంచడం వాసుకి సరదా. వైదేహిని పెళ్ళయిన కొత్తలో ఎలా చూడాలనుకునేవాడో వాసు ఇప్పుడు అలా చూస్తున్నాడు.
వాసు ఒకరోజు వైదేహితో "మన ఇంటికి దగ్గరగా ఒక ఇల్లు అమ్ముతున్నారు. మనం ఆ ఇల్లు కొని మీ అమ్మ, నాన్నగారిని అక్కడ ఉండమందాం.వాళ్లు పెద్దయిపోయారు కదా. .మనమే వాళ్లని చూసుకోవాలి" అన్నాడు.
తన తల్లితండ్రులకి,అత్తమామలకి తేడా చూపించని అల్లుళ్ళు చాలా తక్కువగా కనిపిస్తారేమో ఈ దేశంలో అనుకుంది వైదేహి. ఆ ఇల్లు కొనడానికి అంగీకరించింది వైదేహి.
రాధాదేవి,భార్గవ ఇప్పుడు కొడుకు, కోడలుతోనే ఉంటున్నారు. కారు ప్రమాదం తరవాత కోడలిలో వచ్చిన మార్పులు గమనిస్తున్నారు.
ఇప్పటికీ రమ్య అప్పుడప్పుడు తన మేనత్త ఇంటికి వస్తుంటుంది. త్వరలో మరో స్పెషలిస్ట్ తమ ఆసుపత్రికి వస్తారని ,అతనికి వైదేహిని చూపిద్దామని అంది.
వైదేహికి తాను జీవితం లో తీసుకున్న తప్పుడు నిర్ణయం అర్ధమైంది.వాసుకి పిల్లలంటే ఎంత ఇష్టమో తెలిసి కూడా తను పిల్లలు అసలు అక్కరలేదనుకుంది. వాసు మనోజ్ఞ ని,మనోజ్ఞ కొడుకు సాగర్ ని పెంచాడు. ముత్యాల్లా తీర్చి దిద్దాడు. వజ్రాల్లా తయారు చేసేడు.వాసుకి తన సొంత పిల్లలుంటే ఇంకా ఎంత అపురూపంగా చూసుకొనే వాడో.
వాసు మాత్రం ఎప్పుడూ అలా అనుకోలేదు.
మాతృత్వం స్త్రీకి ఒక ఎంపికగా ఉండాలి. తనకి పిల్లలంటే చాలా ఇష్టమని తన భార్య మీద ఆ బరువు మోపకూడదు.
రమ్య తీరిక లేకుండా ఉంటే మనోజ్ఞ ఓ తోడు కోసం తపించిపోయేది. సాగర్ తల్లితండ్రులు బిజీగా ఉంటే వెతుక్కుంటూ తన దగ్గరకే వచ్చేవాడు.
ఈ దేశంలో అలాటి పిల్లలు కోకొల్లలు. తన స్వంత పిల్లలే కానక్కరలేదు.
వైదేహికి అతని భావాలు అర్థమయ్యాయి. వాసు కంపెనీ బాగా పెద్ద కంపెనీ అయింది. వైదేహి ఆరోగ్యం
ఇప్పుడు బాగా కుదుటపడింది.
వైదేహి తల్లి తండ్రులు కొద్ది నెలల తేడాలో స్వర్గస్తులయ్యారు
రమ్య తన భర్త శశాంక్ తో,అత్తగారు శశిప్రభ గారితో మాటాడి మురికి వాడలలో, చుట్టు పక్కల ఉన్న గ్రామీణ ప్రాంతాలలో ఉచిత వైద్య తనిఖీలు చేయిద్దామంది. వారిద్దరూ దానికి అంగీకరించారు.
వాసు కంపెనీ కూడా సాయంత్రం పూట కాలేజీలలో ఉచితంగా కంప్యూటర్ కోర్సులు నేర్పించడం మొదలెట్టారు. ఉత్తమ ప్రతిభ చూపిన వారిని వారి డిగ్రీ చదువు అయిపోయాక తమ కంపెనీలోనే కావాలంటే చేరవచ్చని చెప్పేరు.
ప్రొఫెసర్ రాధాదేవి ఎందరో విద్యార్థులను తీర్చి దిద్దేక ఇప్పుడు ఆవిడ గొంతుక మొరాయించింది. అందరి కంటే బెంగపెట్టుకున్నది ఆవిడ భర్త భార్గవ. ఇద్దరూ ఆదర్శ దంపతులు . డాక్టర్ శశిప్రభ తన ఆసుపత్రిలో అన్నిపరీక్షలూ చేయించారు. కానీ ఆమె ఇంతకు మునుపులా మాట్లాడలేకపోతున్నారు. సరిగ్గా భోజనం చేయలేకపోతున్నారు.
రమ్యకి మేనత్తంటే ప్రాణం. తల్లిలా తనని పెంచింది. కూతురి లాగే జీవితమంతా చూసుకుంది. ఆవిడ ఒక ప్రొఫెసర్ అని తనకి ఆనందం, గర్వం. తనకి ఎన్నో నేర్పించేది. అలాటి మేనత్త నోరు తెరవకుండా, మాట్లాడకుండా, సరిగా భోజనం కూడా చేయలేకుండా పడుక్కుంటే రమ్యకి దుఃఖం వచ్చేసేది.
వాసు రమ్యకి ధైర్యం చెప్పేవాడు. "పెద్దవాళ్ళకి ఏవో సమస్యలు తప్పవు. మీ అత్తగారు మంచి డాక్టర్, ఆవిడ స్నేహితురాలు. అంత సులువుగా ఏమీ చేయలేమని వదిలేయరు. ఆవిడ మీద నమ్మకముంచు. నేను నమ్ముతున్నాను" అనేవాడు.
భార్గవ రాధాదేవికి చాలా సేవలు చేసేవారు. ఆవిడకి ఆడియో కథలు,పాటలు వినిపించడం,ఆవిడ గది శుభ్రంగా ఉంచడం,ఆవిడ తినగలిగినవి తినిపించడం. "జీవితమంతా నువ్వే నాకు చేసావు. ఇప్పుడైనా నేను చేయనీ. సరస్వతి నడయాడిన నాలుకకి ఇప్పుడు ఇన్ని బాధలా" అని ఎంతో బాధపడేవాడు.
సాగర్ కి ఇక పెళ్లి సంబంధం చూసి పెళ్లి చేయాలనుకున్నారు మనోజ్ఞ , అభిరామ్.
అకస్మాత్తుగా సాగర్ వీర మరణ వార్త. దుండగులు మాటు వేసి పోలీసులని చంపేసారట.."ఇది యుద్ధం .యుద్ధంలో ఇరు పక్షాలు నష్టపోతారు" అని అక్కడ కరపత్రాలు.
సాగర్ తన కంపెనీలో పని చేస్తానంటే నిజాయితీ పరుడైన పోలీస్ ఆఫీసర్ అవమని తను సలహా యిచ్చి తనే తప్పు చేసానేమో అని వాసుకి అనిపించింది.
మనోజ్ఞ, అభిరామ్ మొహం లో నెత్తుటి చుక్క లేకుండా చేయాల్సిన కార్యక్రమాలు చేస్తున్నారు. ప్రభుత్వ లాంఛనాలతో సాగర్ అంతిమ యాత్ర సాగింది. సాగర్ వీరత్వానికి బిరుదు ప్రదానం కూడా కేంద్ర ప్రభుత్వం త్వరలో చేస్తుంది.
సాగర్ మరణం వాసుకి తట్టుకోలేని ఆవేదన. వాడితో గడిపిన క్షణాలు గుర్తొస్తునే ఉన్నాయి. మనోజ్ఞ మొహం ఇక తను చూడలేడు. కన్న బిడ్డని కోల్పోయిన వీరమాత. రెండు కుటుంబాలకీ తీరని గాయం.
రమ్యకి అటు కూతుర్ని ఓదార్చాలో, ఇటు మనవడి అకాల మృత్యువుకి బాధపడాలో తెలియని విషాద క్షణాలు. మనోజ్ఞ వాళ్ళ అమ్మని కొన్నాళ్ళు వచ్చి తనతో ఉండమంది."ఎంత పనిలో ఉన్నా ఈ దుఃఖం నేను తట్టుకోలేక పోతున్నానమ్మా" అంటుంది. వాసుకి ఫోన్ చేసి కూడా చాలా బాధపడుతుంది.
రాధాదేవికి కూడా మనోజ్ఞ చిన్నప్పుడు మనోజ్ఞ తో, తర్వాత సాగర్ తో అనుబంధం. రమ్య కి, మనోజ్ఞకి వచ్చిన తీవ్ర కష్టానికి ఆవిడ కూడా ఎంతో బాధ పడింది.
ఆవిడ అనారోగ్యం గురించి అందరూ బాధ పడుతుంటే ఉరమని పిడుగులా సాగర్ అకాల మరణం.
వాసు ఈ విషాదాన్ని తట్టుకోలేక చాలా కృంగిపోయాడు. వైదేహి ఇన్నేళ్ళ జీవితంలో వాసుని ఇంత ఉదాసీనంగా ఎప్పుడూ చూడలేదు. ఆమెలో వాసు మళ్ళీ మాములు మనిషి అవుతాడా అనే దిగులు మొదలైంది. వాసుని చాల ఓదార్చింది.
అనుబంధాలు వివాహ బంధాలతోనే కలియక్కరలేదు.అది రక్త బంధం కావొచ్చు, స్నేహ బంధం కావొచ్చు.