ఇది నా స్వీయ రచన
సాయం
అనంత్ బాధలో ,నిరాశలో మునిగి తేలుతున్నాడు. ఏంటీ బ్రతుకు అనేసుకుంటున్నాడు పాతికేళ్ళ వయసుకే.
అనంత్ ఇంజనీరింగ్ పూర్తి చేసాడు. సరైన ఉద్యోగం లేదు. తన స్నేహితులు సగం మంది అమెరికా, ఆస్ట్రేలియా, బెంగళూరు, ముంబాయి, పూనే,చెన్నైలలో మంచి ఉద్యోగాలు చేసుకుంటున్నారు. తానేమో ఇలా. ఏ కారు కిందో, బస్సు కిందో, రైలు కిందో పడిపోవాలని ఉంది. అంత పెద్ద పెద్ద భవంతులున్నాయి. దేనిమీంచైనా దూకేస్తే సరి. అనంత్ కి ఇలాటి ఆలోచనలే వస్తున్నాయి.
ఈలోగా ఓ అమ్మాయి రోడ్డు దాటుతూ కారు కింద పడబోయింది . కారు డ్రైవర్ ఆమె మీద అరుస్తూ హడావుడిగా వెళ్ళిపోయాడు. అనంత్ ఆమెతో "రోడ్డు దాటేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి కదండీ" అన్నాడు.
"ఇవాళ నాతో మా తమ్ముడు లేడండీ. కొంచెం వేగంగా వెళ్ళే హడావుడిలో ఉన్నా" అంది
అప్పడు అనంత్ కి అర్థమైంది ఆమె అంధురాలని. అనంత్ కి చాలా జాలి వేసింది.
"ఎక్కడకి వెళ్ళాలండీ" అడిగేడు అనంత్ .
"ఇవాళ నా పాట రికార్డింగ్ ఉందండీ" అందామె.
"నేను మిమ్మల్ని అక్కడకి తీసుకెళ్తా. ఎక్కడకి వెళ్ళాలో చెప్పండి. " అడిగాడు అనంత్.
ఆమె చిరునామా చెప్పింది.
"మీ పేరు" అడిగేడు అనంత్.
"నా పేరు మధుమతి. నా పాట గురువు గారు విని నాకీ అవకాశ మిచ్చేరు." అంది మధుమతి.
అనంత్ మధుమతిని అక్కడకి తీసుకుని వెళ్ళాడు. అక్కడ మధుమతిని అందరూ చాలా ఆదరణతో చూసేరు.
అనంత్ రికార్డింగ్ అయినంత వరకూ అక్కడే ఉన్నాడు. వాళ్ళు తినడానికి ఏదో ఒకటి ఇస్తూనే ఉన్నారు. మధుమతిని మర్నాడు కూడా రమ్మన్నారు.
అనంత్ కి చాలా సంతోషంగా అనిపించింది. పొద్దుటి ఆలోచనలన్నీ మటుమాయం అయిపోయాయి.
అనంత్ మధుమతి తో "నేను రేపు కూడా మీ ఇంటికి వచ్చి మిమ్మల్ని తీసుకుని వెళ్తాను. ఇది మీకు చాలా ముఖ్యమైంది. మీకు సాయం చేస్తే నాకూ ఆనందంగా ఉంటుంది. " అన్నాడు.
మధుమతి అనంత్ ని వాళ్ల ఇంటికి తీసుకొని వెళ్ళి వాళ్ల అమ్మకి పరిచయం చేసింది.
అనంత్ ఆ రాత్రి ప్రశాంతంగా నిద్రపోయాడు.
No comments:
Post a Comment