కొత్త సంవత్సరం
మోసుకొచ్చింది తనతో
కోటికోటి ఆశలు
ఊహల ఊసులు
ఆశయాల శ్వాసలు
Happy new year
శీర్షిక: తరం తరం నిరంతరం
తరాలు నిరంతరాయంగా
కొనసాగి పోతూ ఉంటాయి ...
అమ్మమ్మ తరం అమ్మ తరం
నా తరం.....
నా పిల్లల తరం
వారి పిల్లల తరం...
ఒకప్పుడు మూఢ నమ్మకాలు
సాంఘిక దురాచారాలు....
ఇప్పుడు విజ్ఞాన ప్రగతి
విశృంఖలత్వం కూడా. ..
కట్టుబాట్ల కఠినత్వం ఎక్కువై
నలిగిపోయిన మహిళలు ఒకప్పుడు. ...
బయటకి వెళ్లిన స్త్రీ కి
భద్రత లేని సమాజమిప్పుడు....
ముందు తరాల అనుభవం
నేటి తరాల యువరక్తం. ...
పెద్దలని గౌరవించాలి
పిల్లలకి తగు స్వేచ్ఛనీయాలి..
తరాల నడుమ అంతరాలని
మనసుల కలయికతో. ...
ప్రేమానురాగాల వారధితో
అనుబంధం ఆత్మీయతతో తగ్గించవచ్చు. ..
ముందు తరాలు కనుమరుగవుతాయి
మనం చూస్తూ ఉండగనే...
తరవాత తరాలు తల్లి
ఒడిచేరుతాయి ఆనందం పెంచుతూ...
పెద్దవారికి సర్ది చెప్పలేక
పిన్నలని ఒప్పించలేక....
సతమతమయ్యే మధ్య తరం
మమతల వంతెన కావాలి. ..
మానవజాతి మనుగడ
తరాల కొనసాగింపుతోనే సాధ్యం....
ఆదరణ కరువైన వృద్ధులు
తల్లితండ్రులు లేని అనాధలు...
రోగాలు పాలయ్యే ముసలివారు
మాదకద్రవ్యాలకి బలయ్యే యువత...
అందరికీ ఆరోగ్యం
కావాలి అందరి నినాదం.....
ముందు తరాలు జాతిసంపద
భావి తరాలు బంగరుభవిత...
* * * *
శీర్షిక: అమ్మే ఓ అద్భుతం
అమ్మని మించిన అద్భుత
పదం ఏముంది ......
అమ్మను మించిన గొప్ప
బంధం ఏముంది. ...
పుట్టిన బిడ్డకి తొలి
బంధం అమ్మతో....
అమ్మే తన లోకం
అమ్మ తన సొంతం....
అమ్మ నేర్పుతుంది మాటలు
వేయిస్తుంది అడుగులు......
అమ్మే తొలి దైవం
అత్యంత ఆప్తురాలు. ....
అమ్మ ప్రపంచాన్ని
బంధాలని పరిచయం చేస్తుంది...
అమ్మే ఓ అద్భుతం
అమ్మ తలపొక అద్భుతం.....
లేగదూడ పిలుస్తుంది
అంబా అంబా అని....
బాధతో మనం తలుస్తాము
అమ్మా అమ్మా అని....
తల్లి మనసు సతతం
తలిచేను బిడ్డనే....
అమ్మని సృష్టించెను ఆ దేవుడు
తనకి మారుగా.....
ముగురమ్మలను కొలుస్తాము మనం
అమ్మా అమ్మా అనే.....
అమ్మని ప్రేమించే మనసు
అందరినీ ప్రేమిస్తుంది. ....
తాను శిశువుకి జన్మనిచ్చి
పునర్జన్మ పొందుతుంది అమ్మ. ...
బిడ్డను వీపున మోస్తూ
రణరంగంలో చెలరేగిన లక్ష్మీబాయి ...
బిడ్డలను వీపున మోస్తూ
కట్టెలమ్మిన ఆదిమజాతి మహిళలెందరో....
తన పిల్లలను వీరులను
మహాత్ములను చేసే వనితలెందరో....
మానవజాతి మనుగడ
అమ్మ త్యాగాల పునాదులపైనే.....
మనకో సంపూర్ణ కుటుంబాన్ని
అందించే అమ్మ. ...
ప్రియాతి ప్రియమైన అమ్మే
మనకి తెలిసిన అద్భుతపదం ...
ఆకాంక్ష
ప్రతి ఉదయం
శుభోదయం కావాలని
ప్రతి సుమధుర స్వప్నం
సాకారమవ్వాలని
ప్రతి యత్నం
సఫలీకృతమవ్వాలని
ఆరోగ్యవంతమైన
ఆనందం నిండిన
ఆహ్లాదభరిత జీవితం
మన సొంతం కావాలని
విజయాల మణిహారం
నీ ప్రగతి పథాన్ని
మిరుమిట్లు గొలపాలని
నా ఆకాంక్ష
17.12.2015
పేరు: డాక్టర్ గుమ్మా భవాని
శీర్షిక: ప్రజల హృదయాల్లో అపరాజిత
చరిత్ర పుటల్లో
ఆమె పరాజిత
కానీ ఆమె ధైర్యసాహసాలు
మహిళలందరికీ గర్వకారణం
ప్రథమ స్వాతంత్ర్య సంగ్రామంలో
పరాజిత తానైనా
వీరనారిగా ప్రజల హృదయాల్లో
చెక్కుచెదరని స్థానం
ఝాన్సీ లక్ష్మీబాయిది
ఎందరో వనితలు
తల్లులు
జీవన పోరాటంలో
పరాజితులు
కానీ వారి
స్వప్నం
ఆశయం ఫలిస్తుంది
వారి త్యాగాల పునాదుల మీద
పెరిగిన
వారి బిడ్డల
బంగరు భవితలో
అలుపెరుగని పోరాటం చేసే
ప్రతి నారీ
ప్రజల హృదయాల్లో
అపరాజిత
శీర్షిక: రాజకీయ ప్రక్షాళన కోసం. ..
నేను రాజకీయ పార్టీ
జండా మోస్తున్న మహిళని ....
నమ్ముకున్న రాజకీయపక్షం
మా ఆశలు వమ్ము చేయదని .....
లక్షలాది పార్టీ అభిమానుల్లో
నమ్మకం కలిగిస్తుంటా. ..
పార్టీజండా మోసి నాయన
భుజాలు కాయలు కాసేయి
అయినా అలుపెరుగని
నడక ఆయనది పార్టీ చరిత్రలో. ...
ఆయన నుండి నేర్చుకున్నా
ఆశయ సాధనలో...
వెనుకడుగు లేదని
మునుముందుకు సాగాలని...
ప్రజాస్వామ్యం గణతంత్రం
సామ్యవాదం పునాదులుగా
కులమత వర్గ వివక్షత లేని
రాజ్యం దిశగా
అంబేద్కర్ చేతిలోని రాజ్యాంగం
మన దేశ భగవత్గీత
చట్టసభలలో మహిళల
గొంతు మార్మోగేలా .....
దళితులు తమ తమ
హక్కులు అనుభవించేలా .......
మా నాయకుల మీద
తప్పక ఒత్తిడి తెస్తాం ......
విద్యాధికులు చట్ట సభలకు
ఎన్నిక అయ్యేలా ......
ఎన్నికల ముందు వాగ్దానాలు
అధికారం చేపట్టేకా అమలుజరిపేలా .....
పార్టీ కార్యకర్తలం మేము
ముమ్మర ప్రయత్నాలు కొనసాగిస్తాం .......
మహిళల భద్రత కోసం
చట్టాలు చేయమని .....
గ్రామీణ భారత వికాసం
నేతల లక్ష్యం కావాలని ......
ఎన్నికలు ప్రజల విజయంగా
మార్పు ప్రగతికి ముందడుగుగా .....
స్వచ్ఛ రాజకీయాల కోసం
నిరంతరం పోరాడుతున్న పార్టీకార్యకర్తని
* * * * * *
ఇది నా స్వీయ రచన.
వ్యతిరేకాల నడుమ
నిశ్శబ్దం నుండి శబ్దం
నిద్ర నుండి మెలకువ
చీకటి నుండి వెలుతురు
వ్యతిరేకాల నడుమ
అద్భుతమైన అవగాహన
అందుకే మన ప్రయాణం సాఫీగా