Sunday, 4 November 2012

gnapakaala tadi

మీ కవితల సంపుటిలో
భీమవరం ప్రస్తావన లేదేమని
అడిగాడు డిప్యూటీ తాశీల్దారు

నాలుగిళ్లలోగిలి
చెరుకు చేనై  ఆ అపురూప దృశ్యం
మటుమాయమయిందని
నేను వలవలా ఏడిస్తే
ఆ విషాద దృశ్యానికి
సాక్షీభూతం తాను

బొబ్బిలి దగ్గర కుగ్రామం భీమవరం
మా నలుగురితాతల స్వగ్రామం మా భీమవరం
ఆ నాలుగిళ్ళ లోగిలిలో
తాతలు  బామ్మలు
అన్నలు చిన్నాన్నలు
అక్కలు అత్తలు

బాల్యంలో వేసవి సెలవుల్లో
ఆ నాలుగిళ్ళ లోగిలిలో
మేమాడిన ఆటలు
తాతగారి కాశీ ప్రయాణ ముచ్చటలు

వూళ్ళో పెట్టగానే
బుచ్చి బుగత పిల్లలా
గ్రామస్తుల పలకరింపుల ఆప్యాయతలు

ఆ పంటచేల గట్లమీద నడవడం సరదా
ప్రతి వేసవికీ  మంచి వేసవి విడిది  అది
ప్రతి వేసవి సెలవులూ గొప్ప అనుభూతి
అనిర్వచనీయ  ఆనందం
అంతా మన వాళ్ళన్న రక్త బంధం

ఎన్నో ఏళ్ళ తర్వాత
ఆపక్కగా ఎం ఫిల్ ఫీల్డ్ వర్క్ కి వెళ్తూ
మావూరు మావూరంటూ సంబర పడుతూ
కార్లోంచి తొంగి తొంగి చూస్తే ఏముంది

పొలంగా మారిన నాలుగిళ్ళ లోగిలి
తాతగారి నుయ్యని మేం చెప్పుకునే బావి
చేనుకి నీరందిస్తూ
మిగిలిన చిట్ట చివరి అనుబంధం

పిన్నలనీ పెద్దలనీ
ఎంతగానో అలరించి
బంధుత్వాలు ఆప్యాయతలు
పెనవేసిన నాలుగిళ్ళ లోగిలి
తలుచుకుంటే చెమ్మగిల్లుతాయి
ఇప్పటికీ నాకళ్ళు

కవిత రాయడానికి
ప్రేరణ నిచ్చిన శంకర్ కి
కృతజ్ఞతలతో
భవాని
11.10.2007  

No comments:

Post a Comment